[box type=’note’ fontsize=’16’] అమ్మ గుండెలో సుడిలా చుట్టుకున్న ఆ అసలు రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన కొడుకు కన్నీరుమున్నీరవుతాడు ఆర్. దమయంతి “అంతర్వేగం” కథలో. [/box]
[dropcap]’ఈ[/dropcap] సృష్టిలో – మన జ్ఞానాన్ని కొలిచే కొలమానాలు ఎన్నైనా వుండొచ్చు. కానీ, అమ్మ హృదయాన్ని కొలవగల పరికరం మాత్రం లేదేమో!’
***
తల్లికి ఎంతమంది పిల్లలున్నా, అందర్నీ ఒకేలా ప్రేమిస్తుంది. ఒకేలా లాలిస్తుంది. కానీ, చిత్రం. పిల్లలు మాత్రం ఎందురున్నా- తల్లిని ఒకేలా ఆదరించరు. ఒకొక్కరు ఒకోలా ప్రవర్తిస్తూ వుంటారు.
కారణం ఎవరికీ తెలిసినా తెలియకున్నా, కన్న తల్లి గుండెకి మాత్రం బాగా తెలుస్తుంది.
పిల్లల వల్ల తమకు కలిగే కష్టాల్ని తల్లి – కొన్ని మాత్రమే పైకి చెప్పగలుగుతుంది. మరి కొన్ని కడుపులోనే దాచుకుంటుంది. పైకి చెప్పదు. ఎందుకంటే, అమ్మ అంటే పిల్లల తప్పుల్ని ఎంచేది కాదు. మనసుని దహించే తప్పుల్ని సైతం కడుపున దాచుకునే సహనం పేరే అమ్మ కాబట్టి.
వృధ్ధాప్యం లోకి తొంగి చూసే – ఏ తల్లి కయినా ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే. తన శేష జీవితాన్ని ఎక్కడ గడపాలి? ఎవరి దగ్గరుండాలి? అని. ఇద్దరు కొడుకులుంటే – యేడాదికి ఆర్నెల్ల చొప్పునో, మూణెల్ల చొప్పునో పంచక తప్పని కాలమిది.
కానీ, రాజేశ్వరమ్మ మాత్రం తన మొత్తం కాలాన్ని కేవలం చిన్న కొడుకు దగ్గరే గడుపుతోంది.
‘ఎందుకనీ?’ – కామేశానికి, ఇదెప్పుడూ అర్ధం కాని ప్రశ్న గానే మిగిలిపోయింది. అయితే కొంతమంది దుర్బుద్ధుల బుర్రలో పుట్టే ప్రశ్న కాదు. ‘తల్లిని సుఖపెట్టలేకపోతున్నానేమో’ అని వ్యథ వల్ల అతనిలో జనించిన సందేహం అది.
తలచుకుంటే అతనికి ఒక్కోసారి జాలేస్తుంది. మరోసారి కోపమేస్తుంది. అప్పుడప్పుడు చెప్పలేనంత అసహనమూ కలుగుతుంది. సరిగ్గా – అలాంటప్పుడు ఎంత ఆవేశం పొంగుకొస్తుందంటే – వెంఠనే తల్లిని అడిగేయాలని. ‘అమ్మా! అన్నయ్య దగ్గరికెందుకెళ్ళి ఎందుకుండవు?’ అని!
కానీ, సంస్కారం – గొంతునొక్కేసి, మాట పెగల్నీదు.
అడిగాక, ఆవిడ అపార్థం చేసుకుని, “ఏరా? కన్నతల్లి నీకంత భారమై పోయిందిట్రా?’ అని అడిగితే ప్రాణం పోయినంత పనవదూ?’ అని మనసు హెచ్చరిస్తుంది.
పోనీ, ఆవిడ తన ప్రశ్న విని ఏం మౌనంగా వున్నా, ‘అయ్యో! అమ్మ మనసుని అనవసరంగా బాధపెట్టానే! ‘భర్త తోడు లేనిదాన్ని కాబట్టి కదూ, వాడు నన్నిలా నిలదీశాడు?’ అని లోలోన దుఃఖించడం లేదు కదా? ఆ కారణంగా ఆవిడ అన్నం నీళ్ళు మానేయదు కదా?’ – అనే తలంపే భయపెడుతుంది. అమ్మో. అంత పాపం తను చేయలేడు.
కన్న తల్లి పట్ల నిండైన గౌరవం వున్న ఏ కొడుకైనా – ఒక మాట అనే ముందు ఇంతగా ఆలోచిస్తాడు కాబట్టి ఇన్ని సందేహాలు కలుగుతాయి.
అసలు అమ్మే లేదనుకుని, వొద్దనుకునే పశువులకైతే పరుష పదాల దండకాలే వస్తాయి నోటెంట.
అయితే – ఏ ప్రశ్న అయితే తను తల్లిని అడగలేననుకున్నాడో సరిగ్గా అదే విషయాన్ని తల్లిని సూటిగా అడుగుతాడని – కానీ, అడిగి అమ్మ గుండెలో సుడిలా చుట్టుకున్న ఆ అసలు రహస్యాన్ని ఛేదించే ఘడియ వస్తుందని కానీ అతడు అనుకోలేదు.
తల్లి చెప్పే జవాబు విని తాను కన్నీరౌతానన్న నిజం – అప్పుడతనికి తెలీదు.
అది – తెలుసుకోడానికి సరిగ్గా రెండు గంటల ముందు – కామేశానికి – భార్య నించి ఫోన్ వచ్చింది.
***
“ఏమండీ, అత్తయ్యగారు కింద పడిపోయారు.” – కంగారుగా చెప్పింది. వింటూనే – “ఆ?ఎట్లా పడింది?” –
“చేతి కర్రతో పూల కొమ్మ వచుతుంటే… వొళ్ళుతూలి, నేలమీద పడిపోయారు. పైకి లేవలేక, ఏడ్చేసారు కూడా. వెంటనే అబులెన్స్‌కి కాల్ చేసి, పక్కింటి వాళ్ళ సాయంతో ఆస్పత్రికి తీసుకొచ్చా. డాక్టర్లు చూసి తుంటి ఎముక విరిగింది, ఆపరేషన్ చేయాలంటున్నారు. మీరు వెంఠనే రావాలి…” అంటూ ఆందోళనగా చెప్పింది భార్య.
వింటున్న కామేశానికి – నెత్తి న పిడుగు పడ్డట్ట యింది.
అతని ఆవేదనంతా ముందు కోపంగా, ఆ తర్వాత ఆవేశంగా మారిపోయింది.
మునపటొకసారి హెచ్చరించాడు. తులసి కోట ప్రదక్షిణాలు చేస్తూ వొళ్ళు తూలినప్పుడే పరుగున వెళ్ళి పడిపోకుండా పట్టుకుని చెప్పాడు. జాగ్రత్త గా వుండాలి పడిపోతే బొంకెలు విరుగుతాయి అని.
‘ఇంట్లో ఏ పనీ ముట్టుకోవద్దు, నీ పని నువ్వు చేసుకో చాలు, మా నెత్తిన పాలు పోసిన దానవౌతావ్’ అంటూ ఎన్ని సార్లు నెత్తీ నోరు కొట్టుకుని చెప్పలేదు తను?
నడుం నొప్పి అంటూనే, బెల్ట్ వేసుకుని మరీ ఇంటి పనంతా చేస్తుంది. పెరట్లో మొక్కల కుదుళ్ళ కాడ్నుంచి, వీధి గడపలో ముగ్గులేయడం దాకా – అన్ని పన్లూ తనే చేస్తానంటుంది.
గదుల్లో అలమర్లు సర్దుతుంది. వెచ్చాలు పోసుకునే డబ్బాల్ని, కడిగి బోర్లిస్తుంది. వంట గట్టు అద్దంలా తుడుస్తుంది. ఇత్తడి సామాను ముందేసుకుని వాటి భరతం పడతానంటుంది. మసి బట్టల్ని సోడాలో నానేసి, తెల్లగా వుతికి ఆరేస్తుంది. ఆరిన బట్టల్ని చేత్తోటి ఇస్త్రీ చేసేసి మడతలు పెట్టేస్తుంది.
నిల్వ పప్పులు పాడౌతాయనో, మర పిండి మెత్తబడుతోందనో, ఉప్మారవ్వలు పురుగు పట్టి పాడయి పోతున్నాయనో, జీల కర్ర కరకర లాడటం లేదనో… ఇలా ఏదో ఒక వంకన పని పురమాయించుకుని చేస్తుంది. వాట్ని ఎండకి ఆరబోస్తూ… డబ్బాల్లోకి తిరగబోస్తూ, ప్రతి ఏకాదశి ఇత్తడి విగ్రహాల్ని బంగారు వన్నెలోకి మార్చేస్తూ ఏ క్షణమూ విశ్రాంతి లేకుండా పని చేస్తుంది.
స్టవ్ దగ్గర వంట చేయదన్న మాటే కానీ, మిగిలిన పనులన్నీ ఆవిడ చేయాల్సిందే. రోటి పచ్చళ్ళు నూరడం, వూరగాయలు వేయడం, కందిపొడి కొట్టడం, కొబ్బరి పచ్చడి రుబ్బడం… గుంటూరు గోంగోర వేయించి జాడీ కెక్కించడం… నాలుగు రకాల పళ్ళ మిరప పచ్చళ్ళు నూరి సీసాలకెత్తడం ఒకటేమిటీ, అన్నితనే స్వయంగా చేసి తీరాల్సిందే.
చేయనీక పోతే అలుగుతుంది. అందుకనే భార్య కూడా ఏమీ అన (లే)దు.
కానీ, తనే చూస్తూ వూరుకోలేక – ‘వొంగీ, లేచే పన్లెందుకు చేస్తావే అమ్మా? ఆనక నడుం విరిగితే లబో దిబో మంటావ్.’ – అని తను విసుక్కుంటే చాలు, ఆవిడకి వెంఠనే కోపమొచ్చి – “కాస్తంత నడుం వొంగిందన్న మాటే కానీ, కాముడూ! నాకేం రోగం రా? మాటి మాటికి ‘నువ్వు కూర్చో… నువ్ కూర్చో… అంటావూ?!” అంటూ కస్సుమనేది.
“అది కాదే అమ్మా! చేసినన్నాళ్ళు చేసావ్. ఇక ఈ వయసులో ఐనా హాయిగా విశ్రాంతి తీసుకోరాదూ! నేనెందుకంటున్నానో అర్థం చేసుకో” అంటూ అనునయంగా చెప్పేవాడు.
నిజానికి, ఆవిడ ఆరోగ్యం మీద కంటే కూడా, ఈ వయసులో ఆవిడ కేదైనా అయితే ఆసుపత్రుల ఖర్చులు భరించలేడు. తలకి మించిన భారమౌతాయి.
కానీ, ఆ విషయాన్ని పైకి చెప్పలేడు. కొన్ని నిజాలు అంతే! బహిర్గతం చేస్తే బాగుండవు. మాటలు బరువుగా వస్తాయి. బాంధవ్యాలని తేలిక చేస్తాయి.
అనుకుంటాం కానీ, అన్ని హార్ధిక సంబంధాలూ ఆర్థికంతో ముడిపడి లేవనీ, – నిజానికి హృదయాన్ని తూచగల శక్తి ధనానికి మాత్రమే వుంది.
ఆర్థికానికీ, హార్దికానికీ ఎంత దగ్గర సంబంధముందో ఏ మనిషికైనా అర్ధమయ్యేది సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే అని. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే.. ఇది నిజవే అనిపించక పోదు.
అవును మరి. కామేశం లాంటి మధ్యతరగతి వాని దృక్పధం తో ఆలోచిస్తే – అస్సలు తప్పులేదు అని కూడా అనిపిస్తుంది.
***
రాజేశ్వరమ్మకి ఇద్దరు కొడుకులు. పెద్ద వాడు వీరేశ్వర్. రెండో వాడు కామేశ్వర్. వాళ్ళకి ఊహ రాకముందే ఆవిడకి భర్త పోయాడు.
కష్టపడి కాలాన్ని నెట్టుకొస్తోంది. పెద్ద వాడికి – చదువు మీద కంటే, సంపాదన మీదే కన్నుండేది. పుస్తకాలు పక్కన పడేసి, ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లో పనికి చేరాడు.
సేఠ్‌కి నమ్మిన బంటు అయ్యాడు. ఆయనతో కలసి అన్ని వూళ్ళు తిరుగుతుండేవాడు. అలా అలా క్రమ క్రమంగా కుడి భుజమయ్యాడు. ఆ తర్వాత వాళ్ళు ఏకంగా అతన్ని ఇంటి అల్లుణ్ణి చేసుకుని వేరు కాపురం పెట్టించారు.
అధికులకి – తెలివైన వాళ్ళని లొంగదీసుకోవడమేంత కష్టం కాదు. కాకపోతే వాళ్ళ బలహీనత కనిపెట్టడమే కష్టం. ‘వీరేష్ వీక్నెస్ – పరువు పెంచుకోవడం. ఖరీదైన జీవితం గడపడం.’ అని గ్రహించాడు యజమాని. అవకాశాన్నివినియోగించుకున్నాడు.
అయితే కారు ఇచ్చాడు కానీ కీ మాత్రం తన దగ్గరే వుంచుకున్నాడు. అమ్మాయినిచ్చినా, బిజినెస్ పేరుతో తన వెంటే తిరిగేలా చూసుకుంటాడు ఆ యజమాని.
వీరేశం నిలువెత్తునా వ్యాపార ధోరణులే వుంటాయి. ఏ మనిషితో, ఏం మాట్లాడినా అక్కడ – ‘వ్యవహారం ‘ వుండాలి. ఏ క్షణాన్ని ఎక్కడ గడిపినా ఆ కాలం ధనం కావాలి. క్షణంక్షణం బిజినెస్ నడవాలి. చివరకది లాభమై తేలాలి. – ఇదీ. అతని వృత్తి, ప్రవృత్తులు.
మనిషితో గల అన్ని రకాల సంబంధాలలోను మనీ సంబంధాలే అతనికి అద్భుతంగా వుంటాయి.
ప్రాణం లేని నోటుని గాఢాలింగనం గావించుకునే – వ్యామోహం ఏ మనిషిలోనూ పుట్టకూడదు. ఒకసారి పుట్టాక, ఇక ఆ మనిషికి – తన చుట్టూ వున్న అన్ని జీవులూ అల్పంగా తోస్తాయి. ఉపయోగం వుంటే తప్ప, కన్నెత్తైనా చూడ బుధ్ధి కాదు.
పెళ్లయ్యాక ఆ ఇంటికి చుట్టం చూపయ్యాడు. ఎప్పుడైనా తమ్ముడు ఫోన్ చేస్తే – మాట్లాడతాడు.
***
కామేశ్వర్ – డిగ్రీతో బాటు ఉద్యోగానికవసరమైన కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసుకుని, ఓ కంపెనీలో అకౌంటెంట్ గా చేరాడు. భార్య ఓ స్కూల్ లో టీచర్ వుద్యోగం చేస్తోంది.
తను తెచ్చే నాలుగు రాళ్ళకీ, ఆ రెండు రాళ్ళూ కలవడంతో ఏదో… గుట్టుగా నడిపించుకొస్తున్నాడు కాపురాన్ని.
అలా అలా నడుస్తున్న బ్రతుకు బండి ఏ మాత్రం బాలెన్స్ తప్పినా చక్రాలు విరిగి తిరగబడతానంటోంది.
కారణం – అతని ఇద్దరి పిల్లలు కాలేజ్ చదువులకొచ్చారు వాళ్ళ కాలేజ్ ఫీజులతో బాటు, హాస్టల్ ఖర్చులు, ఇతర ఎంట్రెన్స్ ఎగ్జాం ఫీజులు… అంతా కలసి, తడిసి మోపెడౌతున్నాయి. అతని స్థాయికి మించిన పనే అయినా, తప్పటం లేదు.
పిల్లలు బ్రతకడానికి ఒక తెరువు చూపాలి. అందుకు చదువుని ‘ కొనివ్వడం’ తప్ప మరో దారి లేదు.
ఇప్పటికే, ఎన్నో త్యాగాలు చేస్తున్నారు ఆ దంపతులు. స్కూటర్‌ని మూలకు తోసాడు. పెట్రోల్ ఖర్చు కలిసొస్తుందని. రోజూ – బస్సులో నిలబడి… రానూ పోనూ రెండు గంటల బస్ ప్రయాణం చేస్తున్నాడు.
భార్య కూడా అలాగే ఆలోచిస్తుంది. ఆరోగ్యానికి మంచిదని, కాఫీ, టీ లు మానేసి, రోజుకో పాల పాకెట్‌ని ఆదా చేస్తోంది.
అప్పుడప్పుడు, మెళ్ళో నాంతాడు, నల్లపూసల గొలుసుని బాంక్‌లో కుదవ పెట్టి ఎమెర్జెన్సీ అవసరాలను గట్టెకిస్తుంది.
‘వీళ్ళ చదువులై పోతే… మనకంతా సుఖమే లెద్దురూ’ అంటూ భర్తకి ధైర్యం చెబుతుంది. అలా అలా జాగ్రత్తగా నడిపించుకొస్తున్న ఈ గడ్డు పరిస్థితుల్లో… అమ్మకి ఆపరేషన్ తప్ప మరో మార్గం లేదన్న వార్త… అతన్ని పాతాళం లోకి తోసినట్టైంది.
ఎంత లేదన్నా, ఆపరేషన్ ఫీజు, రూం చార్జీలు, ఆ పైన మందులు… అంతా కలిపి ఓ ‘ల’ కారం పై మాటే కానీ, తక్కువ కాదు.
అంత డబ్బు క్షణాల్లో ఎక్కణ్ణుంచీ తేవడం!?..
అసలీ సమస్యంతా ఎందుకొచ్చిందంటే.. ‘ఈవిడ పడటంతో వచ్చింది! ఉఫ్. ఎంతపని చేసావ్ అమ్మా’ – వుసూరుమంటూ ఆసుపత్రికి కదిలాడు.
అసమర్ధుని అసహాయత కోపంగా ఆ తర్వాత అది ఆవేశమై ముంచేత్తేటప్పుడు దానికి లొంగిపోవడం మాత్రమే తెలిసిన సామన్యులలో – మరి కామేశ్వర్ కూడా ఒకడే. ఎందుకంటే అతనూ సామాన్యుడు అతి సామాన్యుడు కాబట్టి.
***
కామేశం ఆసుపత్రికెళ్ళే సరికి, ఎదురుగా మంచం మీద తల్లి పడుకుని కనిపించింది భరించలేని బాధతో, కళ్ళ మీద చేతులుంచుకుని, పెదాలు బిగించి, నిస్సత్తువగా పడుకునుంది.
ఎముక విరిగిన బాధకి అప్పటి దాకా విల విలా తన్నుకు పోయి, అలసిపోవడంతో… – ఆ ముసలి ప్రాణం వ్రేలాడి పోయింది. ఆ స్థితిలో తల్లిని చూసేసరికి – అతనికి కళ్ళంట నీళ్ళు తిరిగాయి.
‘అమ్మా! నన్ను క్షమించమ్మా! నువ్వనుభవిస్తున్న నరక బాధని అర్థం చేసుకుని, పంచుకోవాల్సింది పోయి, నీకోసం అయ్యే ఖర్చు గురించి ఆలోచిస్తున్నా! ఎంత పాపాత్ముణ్నమ్మా నేను! నన్ను క్షమించమ్మా!’ అంటూ… మనసులోనే పశ్చాత్తాపంగా అనుకున్నాడు.
ఇదే అన్న గారైతే… ఈ పాటికి ఏ ఫైవ్ స్టార్ ఆసుపత్రులోనో చేర్పించేసే వాడు కాదూ? సకల ఆధునిక శాస్త్ర నైపుణ్య పరికరాలతో ఈ పాటికి ఆపరేషన్ కూడా జరిగిపోయుండేది. ఆవిడకింత బాధా తప్పేది.
హు! తన ఆర్థిక స్థితికి చిన్నతనమేసింది అతనికి.
అయినా, అంత శ్రీమంతుడైన అన్న దగ్గరికి వెళ్ళ కుండా… ఈవిడ తన దగ్గరే పడుండటమెందుకో?
రైల్ పెట్టె లాంటి నాలుగ్గదుల ఇరుకింట్లో… చాలీ చాలని జాగాలో… అదే గొప్ప అనుకుంటూ… తల్లి తన తోనే కలసి బ్రతకడం ఎందుకో… అతనికిప్పటికీ ఆశ్చర్యమే. జవాబు లేని, ప్రశ్నగానే మిగిలిపోయింది.
ముందు గది లోనే అమ్మ మంచమూ, మంచం కింద ఆవిడ మందుల సామానూ వుంటుంది. మందుల డబ్బా, మంచి నీళ్ళ గుండు చెంబూ దాని మీద బోర్లించి పెట్టిన స్టీల్ గ్లాసూ, పక్కనే కేన్‌తో అల్లిన దూది పెట్టె, అందులో వత్తులూ… విభూతి పండు… దాని పక్కనే విష్ణు సహస్ర నామాల పుస్తకంతో బాటు మరికొన్ని స్తోత్ర రత్నావళి పుస్తకాలూ వుంటాయి.
పిల్లలు- పగలూ రాత్రిళ్ళు చదువుకునేది గది కూడా అదే!
వాళ్ళు రాత్రిళ్ళు – చదువుకుని, పడుకునే సరికి ఏ అర్ధరాత్రో అయ్యేది. అమ్మకి నిద్ర వుండేది కాదు. మంచం మీద అటూ ఇటూ వొత్తిగిల్లుతూ… మధ్యలో బాత్ రూంకెళ్ళొస్తూ జాగారం చేసేది.
పాపం! ఆవిడకి తన దగ్గర కనీసం నిద్ర సుఖం కూడా వుండటం లేదని గ్రహించి, బాధ పడ్డాడు.
అటు చూస్తే, అన్న గారిది లంకంత కొంప. వాళ్ళు వాడుకుంటున్న గదుల కంటే కూడా వాడకంలో లేని గదుల సంఖ్యే ఎక్కువ.
ఇంటి నిండా ఇలా పిలిస్తే, – అలా పలికే పనివాళ్ళు.
అమ్మకి అనుకోకుండా ఏదైనా అయితే, ఆస్పత్రికి మోసుకెళ్ళేందుకు కార్లున్నాయి. డ్రైవర్లున్నారు. అమ్మకి – ఖరీదైన వైద్యం చేయించే తాహతు అన్నగారికుంది. మరి తనకో?
ఈ భావనే కామేశాన్ని నిద్రపోనీకుండా చేసింది. ఆలోచించాడు. బాగా ఆలోచించే, ఒకనాడు – అన్న గారికి ఫోన్ చేశాడు.
“ఏమిట్రా?” అడిగాడు అన్న.
“అమ్మని కొన్నాళ్ళు నీ దగ్గరికి పంపుదామనుకుంటున్నా అన్నయ్యా!” అంటూ నసిగాడు.
“దాందేముంది! పంపు” అన్నాడు అన్న.
తను చాలా సంతోషించాడు, అన్నగారు వెంటనే సరే అన్నందుకు.
అమ్మకి వేరే కథ అల్లి చెప్పాడు. “అన్నయ్య – నిన్ను కొన్నాళ్ళు తన దగ్గరుంచుకుని పంపిస్తా నంటున్నాడమ్మా! వెళ్ళక పోతే బాగుండదు. వెళ్ళు… ” అన్నాడు.
ఆమె మౌనంగా విని వూరుకుందే కానీ, తను ఆశించినట్టు సంబర పడలేదు. అలా అని వెళ్ళననీ అన్లేదు.
ఇంతలో కారొచ్చి ఇంటి ముందు ఆగింది. ఆవిడ వెళ్ళింది.
‘హమ్మయ్య ‘ అనుకున్నాడు. తను చేసిన పనికి చాలా సంతోషించాడు.
ఆవిడ వెళ్లాక, ఇల్లంతా చినబోయినట్టైంది. ఆవిడ రోజూ సాయంకాలాలు కూర్చునే అరుగు ఖాళీగా కనిపిస్తే మనసు కలుక్కు మనేది. అమ్మలేని లోటు కొట్టుస్తూ కనిపిస్తున్నా, ఆవిడ- తనింట్లో కంటే కూడా,.అన్న గారింట్లోనే సుఖ పడుతుందనే భావం అతని బాధని ఉపశమింపచేసింది.
కానేం లాభం? వెళ్ళి వారం తిరగలేదు కానీ, ఆవిడ మాత్రం తిరిగొచ్చేసింది.
వాయిట్లో కారొచ్చి ఆగడం, అందులోంచి అమ్మ తన చేతి సంచీతో దిగడం జరిగిపోయింది.
అతను చూస్తూ వుండి పోయాడు. ‘అదేమిటీ? వచ్చేసావ్?’ అని, తను కానీ, తన భార్య కానీ కారణం అడగలేదు.
ఆవిడ చెప్పనూ లేదు. కానీ, అన్న గారు మాత్రం ఫోన్ చేసి చెప్పాడు. ‘ఆవిడ వుండనంటోందిరా… అందుకే పంపించేసాను…’ అని చెప్పి వూరుకున్నాడు. కామేశం నిట్టూర్చి ఊరుకున్నాడు.
ఆ సంఘటన తర్వాత ఇదిగో మళ్ళీ ఇప్పుడే అన్న గారికి ఫోన్ చేసి. ‘అమ్మకి ఆపరేషన్ అంటున్నారు, ఏం చేద్దాం అని’ అడగాలని రూం లోంచి బయటకొచ్చాడు.
‘నీ అన్న గారు గొప్ప స్థితిలో వున్నాడు కదా, నీకే సాయం చేయడా ‘ – అని ఎవరైనా అడిగినప్పుడు నవ్వి వూరుకుంటాడు.
నిజానికి సాయాన్ని తిరస్కరించేది తనే అని కూడా చెప్పడు. తెలీని వయసులో తనేమైనా డబ్బు అడగబోతే అన్న గారెప్పుడూ తుంచేసేవాడు. ‘నాకెవరు సాయం చేసి చెప్పించారు చదువులు? నాకెవరు చూపించారు దారి, ఎవరికి వారు ఎదగాలి రా తమ్ముడూ’ అంటూ పర్సు లోంచి డబ్బు తీసి ఇవ్వబోయాడు. కానీ అతను తీసుకోలేదు. అన్న మాటలు అతన్ని గాయపరిచాయి. అప్పట్నించి అతనితో ఆర్థికపరమైన సంభాషణలు చేయడు.
కానీ ఇప్పుడు అమ్మ గురించిన ఖర్చు కాబట్టి అడగాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
ఫోన్ చేసాడు. ఆయన అందలేదు. వదిన గారికి చేసాడు. “ఏంటయ్యా?” అంది. జరిగిందంతా చెప్పాడు.
“ఆయన వూళ్ళో లేరు. ఎప్పుడొస్తారో తెలీదు. ఐనా, ఆవిడ నడుం విరగ్గొట్టుకుంది మీ ఇంట్లో అయితే, ఆయనేం చేస్తాడు? అని… అడగనే అడిగింది మహా తల్లి. ఆవిడ లాగిన లా పాయింట్‌కి సిగ్గేసి, ఫోన్ పెట్టేశాడు – ఏం మాట్లాడలేక!
అవును మరి! గడ్డి తినే మనుషులతో ఐనా మాట్లాడగలం కానీ, డబ్బు తినే మనుషులతో ఏం మాట్లాడ్తాం, ఎవరం కానీ! !
నీరసంగా లోపలకొచ్చాడు.
ఎదురుగా నిస్త్రాణంగా పడున్న అమ్మని అలా చూస్తుంటే… గుండే నీరౌతుంటే, మంచానికి దగ్గరగా స్టూల్ జరుపుకుని కుర్చున్నాడు. ఆ అలికిడికి ఆవిడ – కళ్ళు తెరిచి, చూసింది. అంత బాధలోనూ- కొడుకుని చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు -‘”వచ్చావా నానా!” అంటూ అతని చేయి పట్టుకుని, కళ్ళు తుడుచుకుంది.” నువ్ చెబుతూనే వున్నావ్ రా కన్నా, ‘ అమ్మా జాగ్రత్తే, జాగ్రత్తే’ అని.
నా ఖర్మ లో రాసి పెట్టు వుందేమో, ఇలా జరగాలని. లేకపోతే ఏమిటి చెప్పు? పూలుకోయడం నాకు కొత్తా? పోనీ నేల మీద తడుంది జారాననుకుంటే అదీ లేదు… ఖర్మ. నా ఖర్మ… మిమ్మల్నందర్నీ బాధపెట్టమని భగవంతుడు…!”
ఆగకుండా మాట్లాడ్తోం టే దగ్గొచ్చి, విరిగిన తుంటి ఎముక కదలి, కెవ్వుమంది.
కామేశం గుండె గొల్లుమంది. ‘”అమ్మా” – అంటూ దగ్గరకి జరిగాడు.
అతని ఆదుర్దా చూసి, తనకేం ఫర్వాలేదన్నట్టు చేత్తో సైగ చేసింది.
అంతలో ఏదో, గుర్తుకొచ్చిన దాన్లా… తలగడ కింద నుంచి, ఒక బరువైన మూటని అందిస్తూ చెప్పింది. “ఇన్నాళ్ళూ దాచిన నా పెన్షన్ డబ్బులు రా ఇది! ఖర్చు కొస్తుంది. నీ దగ్గరుంచు నానా!” అంటూ కొడుకు చేతిలో పెట్టింది – ఆ చిన్న సంచీని.
దాని బరువుని బట్టి అందులో ఆపరేషన్ కి సరిపోయెంత డబ్బున్నట్టు గ్రహించాడు కామేశం. ప్రతి నెలా అమ్మ పెన్షన్ డబ్బు ఇస్తుంటే కేకలేసాడు. దబ్బు తీసుకుని నీకు అన్నం పెడతానా అంటూ. ఈ రోజు ఆ డబ్బే ఆపదలో అండగా నిలిచింది.
‘ఉఫ్..’ గొప్ప రిలీఫ్! ఊపిరందక తన్నుకుపోతున్న ప్రాణికి శ్వాస అందినట్టుగా వుంది.
ఇంత నరకపుబాధలో కూడా – అమ్మ తన గురిం చీ, తన పరిస్థితి గురించీ ఎంత ఆలోచిస్తోందీ? సిగ్గేసింది. ఆ వెనకే బాధా కలిగింది.
అమ్మ మీద ప్రేమో, ఉద్వేగమో అదేమో తెలీని భావనతో గబుక్కున – తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ… “అమ్మా! నా దగ్గర వుంటం మూలాన… నువ్వెన్ని కష్టాలు పడుతున్నావో చూడు!” అంటూ కదిలిపోయాడు.
కొడుకు మనసులో ఉద్దేశ్యమేమిటో… మథన ఏమిటో… ఆమెకి తెలియని విషయమేమీ కాదు.
కానీ, ఎప్పుడూ చెప్పే ప్రయత్నమే ఆమె చేయలేదు. అంతే.
“అమ్మా నేనో మాట అడగనా?”
“అడగరా, కాముడూ… అడుగు”
“అన్నయ్య దగ్గర కెందుకెళ్ళవమ్మా? వెళ్ళినా ఎందుకు వుండనంటావ్? ” సూటిగా అడిగాడు.
కొడుకు ఇలా అడుగుతాడని ఆమె ఊహించలేదు. అడిగాక జవాబు దాటేయ కూడదు. చెప్పాలి. అసలు కారణం ఇదీ అని ఇప్పటికైనా… వాడికి చెప్పాలి… అని నిర్ణయించుకున్న దానిలా… కొడుకు మొహంలోకి చూస్తూ”కాముడూ! నువ్వైతే… ‘అమ్మా’ అని నోరారా పిలుస్తావ్ రా! ప్రేమగా పిలిచే నీ పిలుపు ముందు వాడి సిరిసంపదలన్నీ దిగదుడుపేరా నానా. ‘అమ్మా కాఫీ, అమ్మా అన్నం పెట్టు, అమ్మా ఆఫీస్ కెళ్లొస్తాను, అమ్మా ఏమైనా కావాలా, అమ్మా నీకిషటమని మామిడిపళ్ళు తెచ్చా తిను. అమ్మా గుడ్ నైట్ అంటావ్ చూడు ఆ మాటలే… నాకు మణులూ మాణిక్యాలురా కాముడూ. నాకేమైనా అవుతుందేమో అని కాకముందే కంట నీరు పెట్టుకుంటావ్ చూడూ అదే రా నా సౌభాగ్యం. ఇన్ని సిరి సంపదలున్న కొడుకుని విడిచీ ఏ తల్లీ ఎక్కడికీ వెళ్లలేదురా నానా. అందుకే రా బంగారు కొండా! నీ దగ్గరే… ఎప్పుడూ నీ దగ్గరే వుండిపోవాలనిపిస్తుంది! ” గద్గద స్వరంతో అంటున్న – తల్లి మాటలకి అతని హృదయం ఉప్పొంగి ఉప్పెనై పోయింది. ఆ వెంటే కళ్ళల్లో తుఫాను రేగింది.
తల్లి ఎంత అల్ప సంతోషి అనుకుంటున్నాడే తప్ప అప్పటికీ తన గొప్పతనమేమిటో అతనికి అర్థం కాలేదు.
‘ఎంత పిచ్చి అమ్మకదూ! కాదు. ఎంత మంచి అమ్మకదూ!’ అని పొంగిపోతున్నాడు.
అమ్మ అంతరంగం అర్ధమైంది. అంతే కాదు, ఇన్నాళ్లూ తనకు అర్థం కాని ప్రశ్నకి జవాబూ దొరికింది. మూసుకున్న ఆమె కళ్ళల్లోంచి రాలిని ఆ రెండు కన్నీటి బొట్ల వెనక విషాదమూ… పూర్తిగా అర్ధమైంది. – అన్న వీరేషూ అర్థమయ్యాడు. “ఆవిడ ఎలా వుంది?” అని అప్పుడప్పుడు అడిగే అన్న మాటలు ఈ సారి స్పష్టంగా వినిపించాయి.
‘అమ్మా అని పిలవని కొడుకూ ఒక కొడుకే?!’ ఆవేదనా తరంగం అమ్మ కళ్ళల్లో ఉప్పొంగడమూ కనిపించింది.
నిలువునా కంపించి పోతూ… తల్లి చేతుల్లో ముఖం దాచుకున్నాడు.
అమ్మ అంతరంగం అవగతమైనందుకో, అమ్మ దుఖమైనందుకో… ఎందుకో తెలీని అంతర్వేగం!