జీవన రమణీయం-26

1
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]జూ[/dropcap]బ్లీ హిల్స్ అనే ఏరియాకి నేను వెళ్ళడం అదే మొదటిసారి. మా అన్నయ్యని రిక్వెస్ట్ చేశాను. అంత ఎత్తుకి స్కూటర్ ఎక్కలేక పోవడం చూసి, మా అన్నయ్యతో, “అన్నయ్యా… ఇక్కడ ఉన్న చాలామంది నిర్మాతలు బీరువాలలో నా డబ్బుని కాపాడ్తున్నారు. సంపాదించుకుంటాను” అన్నాను. ఇద్దరం నవ్వుకున్నాము.

కె.ఎస్.రామారావు గారిది చాలా మంచి అభిరుచి. సినిమాల్లోనే కాదు, ఆయన ఇంటిని కట్టిన తీరు కూడా ఆ విషయం తెలియజేసేది. ఆయన కన్నా ముందు రెండు సింహాల్లాంటి కుక్కలు వచ్చాయి నా మీదకి. ఆయన వాటిని పిలుస్తూ వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి చాలా మర్యాదలు చేశారు. ఆయన నా ‘మధురమైన ఓటమి’ నవల చదివారు. చాలా మెచ్చుకున్నారు. ముఖ్యంగా నా శైలిని తెగ మెచ్చుకున్నారు. నేను మాత్రం అవి సీరియస్‌గా తీసుకోకుండా, ఆయన కూర్చున్న కుర్చీ వెనకాలున్న కొండరాయిని చూస్తున్నాను. ఇల్లు కట్టేడప్పుడు దాన్ని అందానికి అలాగే వదిలేశారు! ఆయన తను చెప్తున్నది నేను వినకుండా అటు చూస్తున్నానని గమనించి, “ఏంటలా చూస్తున్నారు?” అని అడిగారు.

“కొండలకి ప్రాణం వుంటుందట… అవి పెరుగుతాయట. మరి మీ వెనక వున్న కొండ పెరిగి ఇంట్లోకొస్తేనే?” అన్నాను. “అంత కాలం మనం ఉండాలిగా!” అని ఆయన చాలా నవ్వారు. ఆ పక్కింట్లో అప్పుడు చిరంజీవి గారు ఉండేవారు. తరువాత, ఆయన ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయాకా, అరవింద్ గారొచ్చారు ఆ ఇంట్లోకి. అప్పట్లో నాకెవరూ తెలియదు! రామారావు గారు “భార్యా గుణవతి శత్రు” సీరియల్ వీరేంద్రనాథ్ గారి దర్శకత్వంలోనూ, ‘డిఫర్ డెత్’ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి దర్శకత్వంలోనూ టీ.వీ.కి నిర్మిస్తున్నారు. నన్ను సరదాగా టీ.వీ.కి రాయమన్నారు. నేను కంగారు పడిపోయాను స్క్రీన్ ప్లే అంటే అదేంటో అప్పుడు తెలీక. కాంతి శిఖర అపార్ట్‌మెంట్స్‌లో రామారావుగారి ప్రొడక్షన్ ఆఫీసు వుండేది. సుమిత్రా పంపన ఆ రోజుల్లోనే నాకు పరిచయం అయ్యింది. మెదటి పరిచయంలోనే “మనం ఇద్దరం ఒకేలా వుంటామంటున్నారు జనం!… మీ ఫోటో చూసి ఆంధ్రజ్యోతిలో, ‘సుమిత్రా చాలా బాగా రాస్తున్నావ్’ అంటున్నారు” అని చాలా స్నేహంగా మాట్లాడేసింది. కె.ఎస్.రామారావు గారు కూడా సరదాగా ‘మీ ట్విన్ సిస్టర్ ఏదీ’ అని నన్ను అడిగేవారు.

వీరేంద్రనాథ్ దగ్గరికి వెళ్ళి, రామారావు గారిచ్చిన ఆఫర్ సంగతి చెప్పి, “స్క్రీన్‌ ప్లే ట… నాకేం తెలుసూ? ఎలా రాయాలి?” అన్నాను.

ఆయన ఎదురుగా వున్న తెల్ల కాగితం నిలువుగా రెండు భాగాలుగా మడిచి, తీసి, “ఓ పక్క వాళ్ళు ఏం యాక్ట్ చెయ్యాలో… ఇంకో పక్క వాళ్ళు ఏం మాట్లాడాలో అదీ రాయాలి. అంతే!” అన్నారు.

ఆ మాట వేదమంత్రంగా తీసుకుని నేను ఈ నాటి వరకూ స్క్రీన్ ప్లే రాయడమే కాకుండా, శిక్షణ కూడా ఇస్తున్నానంటే అతిశయోక్తి కాదు!

మల్లాది గారు పక్కనే రూంలో ఎడిటింగ్‌లో ఉన్నారని తెలిసినా నేనెప్పుడూ వెళ్ళి పలకరించలేదు! భయం అప్పట్లో. అదే ఇప్పుడు వారి కుటుంబంలో నేను కలిసిపోయాను. చాలా స్నేహం ఆయన సతీమణి పద్మజతో, ఆయనతో. పిల్లలతో కూడానూ!

కె.ఎస్. రామారావు గారు కామినేని ప్రసాద్ గారు ఇచ్చిన ఎడ్వాన్స్‌ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన సినిమా తియ్యడానికే ఉత్సాహం చూపించారు. కానీ నా దురదృష్టం వల్ల నేను భయపడ్డాను. కామినేని ప్రసాద్ గారి అల్లుడు, పేరు గుర్తు లేదు, నాకు ఫోన్ చేసి “ఏవండీ… మీకు సినిమా ఇండస్ట్రీలో నాలుగు రోజులు వుండాలని లేదా? రామారావు గారికి నవల అమ్ముదాం అనుకుంటున్నారట. ఏంటి సంగతి?” అని నన్ను ఫోన్‌లో బెదిరించాడు.

“పోనీ మీరే సినిమా తియ్యండి, అయితే” అని, నేను రామారావుగారికి ఆ విషయం చెప్పాను. ఆయన “ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడద్దమ్మా” అన్నా నేను భయపడ్డాను.

ఈలోగా ‘ఫెప్సీ’ సమ్మె అని హైదరాబాద్‌లో యూనియన్స్ షూటింగ్స్ జరగనివ్వడం లేదు! ఎవరో గుట్టు చప్పుడు కాకుండా మద్రాసులో (ఇంకా చెన్నై అనే వాళ్ళం కాదు) ‘ప్రేమ ప్రయాణం’ అన్న పేరుతో ముత్యాల సుబ్బయ్య గారిని దర్శకుడిగా పెట్టుకుని సీన్ టు సీన్ నా ‘మొగుడే రెండో ప్రియుడు’ నవలని సినిమాగా తీసేసారు. సేమ్ కాస్టింగ్. సౌందర్యా, శ్రీకాంత్, వినోద్ కుమార్. రామారావు గారు వినోద్ కుమార్ బదులు జగపతి బాబును పెడదామనుకున్నారు. అంతే తేడా!

నేను సినిమా చూసి షాక్ అయిపోయాను. కానీ నాకు సినిమా ఫీల్డు కొత్త! రైటర్స్ అసోసియేషన్‌లో మెంబర్‌ని కాదు! కేసులవీ పెట్టడం తెలీదు. దానికి స్క్రీన్ ప్లే, కథా ‘ఆకెళ్ళ’ అన్న పేరు చూశాను. చాలా బాధపడ్డాను.

వీరేంద్రనాథ్ గారు ‘వెన్నెల్లో ఆడపిల్ల’ సీరియల్ తీసేడప్పుడు, ఒకనాడు ఓ అందమైన అబ్బాయి ఆయన ఆఫీస్ కొచ్చాడు. నేను అందులో హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పడానికి మా వారితో వెళ్ళాను. ఆ అబ్బాయి ఆ సీరియల్‌లో హీరో అనీ, రామారావు గారు తీసిన ‘బోయ్ ఫ్రెండ్’, ‘బాబాయ్ హోటల్’లో కూడా హీరోగా వేసాడనీ ఆయన పరిచయం చేశారు. శ్రీ కృష్ణ అతని పేరు. అయితే రామారావు గారు ‘సాయికృష్ణ’గా మార్చారుట. అలా తొలిసారి వీరేంద్రనాథ్ గారి కపాడియా లేన్ లోని ఆఫీసులో పరిచయం అయిన సాయికృష్ణ ఇప్పటికీ నా స్వంత తమ్ముడిలా చలామణీ అవుతున్నాడంటే అతిశయోక్తి కాదు! ‘పాలో కోయిలో’ అన్న రచయిత అన్నట్టు, దేవుడు రకరకాల రాళ్ళతో నా ఖజానా నింపడం ప్రారంభించాడు! అందులో రత్నాలు కొన్నీ, రాళ్ళు కొన్నీ!

సాయికృష్ణ వాళ్ళ అమ్మానాన్నలు కూడా నాకు తరువాత పరిచయం అయ్యారు. అలిమేలు గారూ, శేషాచలం గారూ నన్ను ఇంటికి పెద్దకూతురులా చూసేవారు!  సాయికి బీనా అని ఓ చెల్లెలు. వాళ్ళు వీరేంద్రనాథ్ గారి ఆఫీసు పైనే ఉండేవారు సేమ్ కాంప్లెక్స్‌లో. తరువాత్తరువాత క్రింద పనుండి వస్తే, ఆంటీ దగ్గరికి వెళ్ళి ‘దోశలు’ వేయించుకుని తిని, కబుర్లు చెప్పేటంత క్లోజ్ అయిపోయాం. అంకుల్ ఐ.ఎ.ఆర్.ఐ.లో చెయ్యడం వల్ల వాళ్ళు చాలా కాలం ఊటీలో ఉండొచ్చారు. సాయికృష్ణ ఎడ్యుకేషన్ అంతా ఊటీలోనే జరిగింది. అప్పట్లో మన తెలుగూ, హిందీ, మిగతా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ సినిమాలు ఊటీలో ఎక్కువ షూటింగ్‌లు జరిగేవి! ఎవరొచ్చినా సాయి ఇంటికి తీసుకొచ్చేవాడట. బాలకృష్ణ లాంటి హీరోలను కూడా… అని ఆంటీ చెప్పేవారు! సాయి బెంగుళూరులో ఇంజనీరింగ్ చేస్తుండగా, రామారావు గారు అతన్ని చూడడం తటస్థించి, “సినిమాల్లో వేస్తావా?” అని హైదరాబాద్ తీసుకొచ్చేసారట.

నేను స్క్రీన్ ప్లే నేర్చుకుని వీరేంద్రనాథ్ గారి సీరియల్స్ చేసున్న తరుణంలోనే ఒక రోజు ఉషా కిరణ్ సంస్థ నుండి నాకు లెటర్ వచ్చింది – “రామోజీరావు గారు ఒక ప్రైవేటు ఛానెల్ పెడ్తున్నారు. మీ ‘తృప్తి’ నవల నచ్చింది. ఒకసారి ఆఫీసు కొచ్చి మాట్లాడండి” అని. కింద ‘ఓల్గా’ అని సంతకం ఉంది.

మేం ఇంటిల్లిపాదీ చాలా ఆశ్చర్యపోయాం! అప్పటిదాకా దూరదర్శన్ ఒక్కటే తెలుసు. ‘ఈటీవీ’ అని పెడ్తున్నారు. అదీ 24 గంటలూ వస్తుందిట అంటూ చాలా ఆశ్చర్యంగా మాట్లాడుకున్నాం. అప్పుడే రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం కూడా చేపట్టారు.

నేనూ, మావారూ బేగంపేటలోని ఉషా కిరణ్ సంస్థకి మొదటిసారి వెళ్ళాం. అప్పుడే చంద్రశేఖర్ అజాద్ గారిని అక్కడ చూసి, ‘రోడ్డు’ అన్న చతుర నవల ఎంత బాగా రాశారో అని నేను చాలా మెచ్చుకున్నాను. అసలు ఎవరైనా ‘రచయిత’ అంటే వాళ్ళని దివి నుంచి భువికి ఏతెంచిన దేవతలని చూసినట్టు చూసేవాళ్ళం!  అట్లూరి రామారావు గారిని కూడా ఆ రోజు కలిసాం. ఓల్గా గారు మా వారితో “మీరు ఆఫీసుకి వెళ్ళండి. ఆవిడని నేను రామోజీరావు గారి అబ్బాయి సుమన్ గారి దగ్గరకు తీసుకెళ్తాను” అన్నారు.

అక్కడే ‘అజయ్‍శాంతి’ గారినీ, వాళ్ళావిడ శాంతిగారినీ కూడా మొదటిసారిగా చూశాను. ఈ ఆఫీసు సోమాజిగూడా లోని ‘శాంతి శిఖర’లో ఉండేది! ఎదురు లైన్‌లో కెళ్తే రామారావు గారి ఆఫీసు ‘కాంతి శిఖర’లో.

సుమన్ గారికి నేను ‘తృప్తి’ లైన్ చెప్పాను. ఆయన కొంచెం విపులంగా రాసి తెమ్మన్నారు. అప్పుడస్సలు అనుకోలేదు… ఆయన స్వంత కథలు ‘పద్మవ్యూహం’ లాంటి వాటికి నేను స్క్రీన్ ప్లే చేస్తాను, వేయి ఎపిసోడ్లు అని!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here