[box type=’note’ fontsize=’16’] కన్నడంలో డాక్టర్ జయప్రకాష్ మవినాకులి “అంతర” పేరిట వ్రాసిన నవలను “అంతరం” అనే శీర్షికతో తెలుగులో అందిస్తున్నారు స్వాతీ శ్రీపాద. ఈ ధారావాహికలో ఇది రెండవ భాగం. [/box]
[dropcap]ఆ [/dropcap]రోజున మన సంస్థ తొలి కార్యక్రమ౦. నువ్వు నా సాయం కోసం వచ్చావు. నేను పొ౦గి పోయాను.
గంభీరమైన విధానాన్ని పక్కనపెట్టి, చేతులు కట్టుకుని మన సైకాలజీ సమావేశం గురించీ ఇతర విషయాలూ ఎన్నో మాట్లాడావు ఎలాటి శషభిషలూ లేకుండా. ఏ గొప్పలకూ పోకుండా. నీ ఆరంభ చాతుర్యం తొలగిపోయింది.
విడిపోయే ముందు, “నువ్వు బాగా పాడతావు. ఈ రోజున ప్రార్ధన నీదే” అన్నావు.
నీ నమ్రతలోనూ ఒక విధమైన అధికారం ధ్వనించింది.
సిగ్గుపడుతూ, “ కాదు కాదు, నన్ను వదిలెయ్యి” అన్నాను.
కాని నువ్వు ఎంత బలంగానో నీ నిర్ణయం మార్చుకోకుండా ఉ౦డిపోయావు.
“నువ్వు కాదనడం ఎవరూ ఒప్పుకోరు. ఇప్పటికే నీ పేరు ప్రోగ్రాం లిస్ట్‌లో రాసేసాము.” ఇలా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయావు.
నాక్కాస్త కోపం వచ్చింది. ఆలోచించాను. “నువ్వెంత అసోసియేషన్‌కు సెక్రెటరీవి అంతే. నన్ను ఆజ్ఞాపి౦చడానికి నువ్వెవడివి?” అనుకున్నాను.
కాని ఆ కార్యక్రమం నీతో కాస్త సమయం గడిపే అవకాశాన్ని ఇచ్చింది. కాని ఈ ప్రతిపాదన చివరి నిమిషం లో రాడం కొంచం ఇబ్బందిగా అనిపించింది.
బాత్ రూమ్‌కి వెళ్లి మొహం మీద నీళ్ళు చల్లుకున్నాను. ఏం చేస్తున్నా సన్నివేశానికి తగిన ప్రత్యేకమైన పాట కోసం ఆలోచిస్తూనే ఉన్నాను.
కార్యక్రమం ఆరంభమయింది. ప్రార్థన పాడాలి. నాక్కొంచం కంగారుగా ఉంది. అప్పటికప్పుడు గుర్తుకు వచ్చిన పాటేదో పాడేసాను. తరువాత నువ్వు స్వాగత వచానాలు పలికావు. ప్రియమైన ప్రభాకర్ ఆ రోజు నుండీ నువ్వు నా హృదయానికి దగ్గరగా రాలేదూ ?
ఉద్వేగాలు అక్కడికక్కడ ఎగసిపడతాయి కదూ ఒకరి కోసం మరొకరిలో.
కార్యక్రమం ముగిసింది. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నా హృదయం నీ కృతజ్ఞతల కోసం ఎగసిపడుతో౦ది. అతిధులకు వీడ్కోలు పలకడం వారిని పంపించడంలో బిజీగా ఉన్నావు. నావైపు చూసి, “బాగా పాడావు. నీ స్వరం చాలా మధురం” అన్నావు. నేను తలవంచి ఎం మాట్లాడకుండా ని౦చున్నాను. నేను నేనుగా లేను. నేను కలల ప్రపంచంలో తేలుతున్నాను. వెళ్ళడానికి కదిలాను. నువ్వు అరిచావు, “ఆగు ప్లీజ్ మీ హాస్టల్ దగ్గర దింపేస్తాను” అన్నావు.
నువ్వు ప్రొఫెసర్ గదిలోకి వెళ్లావు. కారిడార్‌లో ఎదురుచూస్తూ ఒంటరిగా నిల్చున్నాను. అమ్మాయిలందరూ అప్పటికే వెళ్ళిపోయారు. నేను నీ కోసం ఎందుకు ఎదురు చూడాలి?
నన్ను నువ్వెందుకు హాస్టల్ దగ్గర ది౦పాలి?
మనం ఇద్దరం కలసి బండి మీద వెళ్ళడం ఎవరైనా చూస్తే… ఈ ఆలోచనలు నన్ను కలవరపరుస్తూ ఉన్నాయి. కాని కామాతురత అతిక్రమించలేము. అది అన్నింటినీ అణచి వేస్తుంది . నువ్వు నాతో మాట్లాడాక మనం ఒకరికొకరం ఎన్నాళ్ళు గానో తెలిసిన వారంలా అనిపించింది.
నువ్వు వచ్చావు, నల్లసూట్, తెల్ల షర్ట్, నీలం టై , నీ చేతిలో ఒక మందమైన ఫైల్ “సారీ ఆలస్యమయి౦దా?” అన్నావు.
మెట్లు దిగాను. పిలిచావు, “సువ్వీ”
“నిన్ను ఇలా పిలవనా ?” నా వైపు చూసావు.
ఆ కళ్ళకు ఎంత శక్తి ఉంది.
“అల్లాగే పిలు”
నా హృదయం ఉద్వేగంతో కదిలింది.
“నిజంగా నువ్వు చాలా బాగా పాడావు” అన్నాడు.
నీ పొగడ్తకు పొ౦గిపోయాను. ఆనందంగా నర్తించాను. కాళ్ళు లయకు స్పందించాయి. మనసు నీతో మాట్లాడాలని తహతహలాడింది. కాని మూగవోయాను. హృదయం ని౦డిపోయాక మాటలు మౌనంలో మాయమవుతాయి. నీకు విసుగేస్తు౦దేమోనని భయపడ్డాను. మాట్లాడటం మధ్యలో ఆపి
“నేనేమయినా ఒక విగ్రహంతో మాట్లాడుతున్నానా?” అన్నావు.
నవ్వుతూ జవాబిచ్చాను, “ కాదు ఒక కర్పూరపు బొమ్మతో” అన్నాను అల్లరిగా.
“అవును కర్పూరపు బొమ్మ” అన్నావు. ఒక నాటకీయ విధానంలో ఒక విజయోత్సాహపు నవ్వునీ వదనంపై మెరిసింది.
ఎంత దర్జాగా ఉందా నవ్వు. అమాయకంగా, నిర్మలంగా, సమ్మోహనంగా.
మనం లేడీస్ హాస్టల్ చేరుకున్నాము.
బండి ఆపి, “ఇహ వెళ్ళనా మరి?” అన్నావు.
నేను నా ఊహాలోకపు భ్రమల్లో విహరిస్తున్నాను. నాకు వెంటనే పాడాలన్న ఒక ఉత్సుకత. సింధూరపు దిగంతం చీకట్లో వేగంగా కలసిపోతోంది.
డైనింగ్ హాల్లో నా ప్లేట్ కడుక్కుంటూ సన్నగా పాడుతున్నాను. శాస్త్రి అన్నం వడ్డించాడు. ఆ అద్భుతమైన ప్రేమ మైకంలో ఆహారం మూగగా మిగిలింది.
నేను పాడుతూ అన్నం కలుపుతున్నాను.
శబీన నన్ను ఆపుతూ “ ఈ సమ్మోహిత వేణువు ఎవరిని ఆహ్వానిస్తోంది?” నా వీప్మీద సరదాగా మోత వచ్చేలా చరిచి అడిగింది.
పది నిమిషాలు గడిచాయి. నేను శిలలా ఉండిపోయాను శబీన అర్థం లేని మాటలకు. ఆమె సరదా మనిషి. అంత అందమైన స్వభావం అదృష్టమే.
పెళ్లి కూతురిలా తింటున్నాను.
మనిషికీ మనిషికీ మధ్యన ఏం అనుబంధాలు ఉంటాయి? యౌవనంలో ఉన్న ఒక అందమైన అమ్మాయి ధైర్యం చేసి తెగిస్తు౦ది కదా. సందేహం లేదు నాకు నా కామవాంఛ తీర్చుకోవాలన్న సహజ కాంక్ష ఉంది. కాని నాకు ధైర్యం లేదు. ఆ భయం పొరబాటుగా దర్పంగా, సాంప్రదాయంగా పిలుస్తారు. సెక్స్ కోసం కోరిక కోసం వెళ్తే కడుపు వస్తు౦దేమోనన్న భయమూ ఉంది, సిఫిలిస్, గనేరియా జబ్బుల భయం.
మొత్తానికి జీవితం అంటే భయం, భయం అనే ఒక సంక్లిష్టతే గదా.
ఆ రాత్రి చాలా దీర్ఘమైనది. అప్పుడే నాకు తెలిసింది హాస్టల్ బెల్ రాత్రికూడ మోగుతుందని. నేను కళ్ళు ముయ్యలేకపోయాను. నిద్ర నాదరికి చేరలేదు. నా నిద్రలో నువ్వే వస్తూ ఉన్నావు. అదే నల్లని సూట్, తెల్ల షర్ట్, నీలం టై , కళ్ళు తెరుచుకునే ఉన్నాను.
గతంలో ఒకసారి ఇలా నిద్రలేని రాత్రే గడిపాను. అది నాకు విపరీతమైన చెవినొప్పి వచ్చినప్పుడు.
ఇది రెండో సారి.
ఎప్పుడు తెల్లారుతు౦దా ఎప్పుడు క్లాస్‌కి వెళ్తానా అని ఎదురు చూసాను. కారణం కనిపిస్తూనే ఉంది. మన్మధుడి వశీకరణ.
తొలి ప్రేమ భావన.మధురమైన తీయని జ్ఞాపకం నిద్రను ఎక్కడో దాచేసింది. ఒక రకమైన న్యూనతా భావం నన్ను బాధిస్తోంది. కారణం నా నలుపు రంగు, మరీ అంత నలుపు కాదు, కాని నీదెంత ఆకర్షణీయమైన తెల్లని తెలుపు. అది భగవదనుగ్రహమే.
ప్రేమ భాగస్వాములను వెతుక్కునే సమ్మోహితలయే అమ్మాయిలకు ఇంత కట్టిపడేసే రంగు ఒక ఆహ్వానమే కదా. కాళ్ళు, చేతులు, మొహం, హృదయం ఏది చూసినా తెలుపే తెలుపు. అదే కదా ప్రతి అమ్మాయి స్వంతం చేసుకోవాలని కోరుకునేది.
నాకు కాస్మెటిక్స్ నచ్చవు, పౌడర్, లిప్ స్టిక్, ఇతర కృత్రిమ అందాలు, అలంకార సాధనాలు నాకు నచ్చవు.
ప్రకృతే నీకు అంత చక్కని బహిర్గత రూపం ఇచ్చాక నువ్వు మొహానికి పొడర్ ఎందుకు రాసుకుంటావు? నాకు నువ్వు పొడర్ అద్దుకుంటావన్న సంగతి ఎలా తెలుసా అని ఆశ్చర్య పోతున్నావు కదూ
ఆ కార్యక్రమం రోజున నీ కళ్ళ దగ్గర ఆ పౌడర్ పొడలు కనిపించాయి. అప్పుడే నీకు చెప్పాలనుకున్నాను. కాని నేనంత ధైర్యవంతురాలను కాను.
డియర్ ప్రభాకర్, ఎందుకు కృత్రిమంగా అల౦కరి౦చుకుంటావు? బ్రహ్మ ఇచ్చిన అందం సహజమైన సంపదే కదా? అందం అనేది బాహ్యమా, ఆ౦తర౦గికమా? నీ ఎంపిక ఎదో చెప్పు.
“అందమైన మగవాడిని అంత తొందరగా శోభన సమయాన అలరి౦ఛటం అంత సులభం కాదు కదా”
నిన్ను మా ఇంటికి తీసుకు వెళ్లాలని ఎంతో ఆత్రుత పడేదాన్ని. అది ఎప్పటికైనా సాధ్యమా?
కాదు, మా మిద్దె పైనెక్కి అరచినప్పుడు వినబడే ప్రతిధ్వనులు నీకు పరిచయం చేసి ఉండే దానను కదా? గ్రామంలో పంట కోతల దృశ్యాలు చూసి ఆనందించే వాళ్ళం కదా. ఎన్నో చిక్కు ముడుల పొడుపు కధలను విప్పేవాళ్ళం. ఇంటి కానుకుని ఉన్న వాకిట్లో తోటలో కూచుని పంటకోతల కు సంబంధించిన పనులు చూస్తూ చలి మ౦టవెచ్చగా వేసుకునే వారం కదా.
ఇలా ఊహల్లో నా కోరికలు కూడా మానాన్న కోపదారితనానికి వణికిపోయేవి.
మా నాన్న బయట వరండాలో కూచుంటే ప్రతి వాళ్ళూ ఆయన రమ్మంటే తప్ప లోపలి అడుగుపెట్టే౦దుకు కూడా వణికి పోయేవారు.
మా నాన్న చుట్టూ నిశ్శబ్దం రాజ్యమేలేది. లోపల ఉన్న వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడకూడదు . ఒకవేళ లోపలి నుండి ఏవైనా మాటలు గట్టిగా వినబడుతున్నాయ౦టే ఎవరో ముఖ్యురాలైన స్త్రీ ఇంటికి వచ్చినట్టే లెక్క.
మా నాన్న ఎవరినీ ఎప్పుడూ తిట్టినదీ, కొట్టినదీ లేదు. ఆయనతో ఎవరైనా కలుపుగోలుగా మాట్లాడ గలరంటే అది జయన్న ఒక్కడే. జయన్న చదువుకున్నవాడు.
మేము ఏం అడిగినా మా నాన్న జయన్నను సంప్రది౦చేవాడు. అంచేత మేం జయన్న అన్నా భయపడేవాళ్ళం. నీ ప్రేమ గెలుచుకు౦దుకు ఈ భూమ్మీద ఏ శక్తిని ప్రార్ధించాను?
నీకు వశీకరి౦చుకునే౦త అందం వరంగా లభించింది. అద్భుతమైన పురుష స్వరం ఉంది నీకు. ఏ అందమైన అమ్మయినైనా బ౦ధి౦చే౦దుకు సమ్మోహనకరమైన నవ్వు నీ మొహం మీద వెలుస్తు౦ది. నీ ప్రేమికురాలి గుండెలోతుల్లో శోధించే౦దుకు నీకు ఎక్స్ రే ల్లాటి కళ్ళున్నాయి.
కాని నా విషయంలో నిన్ను ఆకర్షి౦చే౦దుకు నా కున్నది నా తియ్యని స్వరమే కదా. మొదటి సారి నేను నిన్ను చూసినప్పుడు నువ్వు అల్లరి వాడవని అనుకున్నాను. అదిప్పుడూ నిజమే. నీకు అందమనే అన్నిరకాల కానుకలూ భగవంతుడు ఇచ్చాడు. ఎవరి భావాలనైనా కల్లోల పరచగలవు.
నీకోసం, నీ అనుగ్రహం కోసం నిన్ను ఆరాధించే అమ్మాయిలు దాహంతో క్యూలు కట్టి ఉన్నారు. నీ వదనంలో ఎవరిలోనూ కనిపించని ఒక అద్వితీయమైన సౌందర్యం ఉంది.
ఇతర ధైర్యస్తులైన అమ్మాయిల్లా నా కంత చొరవ లేనందుకు నన్ను నేను శపించుకున్నాను. నా పిరికితనానికి నన్ను నేను కొరడాతో కొట్టుకోవాలి లేదా మరిగే నీళ్ళు నాపైన పోసుకోవాలి.
నాకు మా నానమ్మ చేయించే స్నానం గుర్తుకు వచ్చింది. ముఖ్యంగా బయట చేరిన మూడు రోజుల అనంతరం చేయించే స్నానం. మా పెరట్లో పెరిగే ప్రత్యేకమైన ఆకులు ఏవో తెచ్చి వాటిని నూరి వేడి నీళ్ళతో జారుడుగా, నురగ వచ్చేలా తయారు చేసి వేన్నీళ్ళతో నా తలరుద్దేది. ఆ మూడు రోజుల తరువాత అది గంటపైగా సాగేది. ఆవిడను ఎందుకు అని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఆవిడ తక్కువ మాట్లాడి గట్టి చేతలు చేసే స్త్రీ.
కాని నీ శరీరం ఉక్కులా బలమైనది. తెల్లని శరీరం.జలకాలాటలలో సంబరంగా నీ శరీరం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా.
తుఫాను గాలి వీవన
ఈర్ష్య పడాలనే నా కోరిక అణుచుకోలేను. నా హృదయం నీ ముందు తెరిచాను. నువ్వు ఇప్పటికే నా హృదయంలో చొరబడి పోయావు. మనం కలిసి మాట్లాడుకోడం మొదలుపెట్టాము . మన కాలేజీ కాంపస్ లో మర్రి చెట్టుకింద కూచుని చాలా స్వేచ్చగా సూటిగా మాట్లాడుకునే వాళ్ళం.
అలాటి ఒక సందర్భంలో ఒక రోజున నిన్ను అడిగాను.
“నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా?”
నా తొలి ప్రయత్నం వలలో చిక్కదానికి నువ్వు చాలా తెలివైన వాడవు కదా..
“ఏమిటి? అందరూ నా గర్ల్ ఫ్రెండ్స్ యే కదా “ అన్నావు.
నేను కాస్త ధైర్యం చిక్కబట్టుకుని అడిగాను, “అది కాదు—వారిలో కనీసం ఒక్కరైనా వ్యక్తిగతంగా నీ హృదయానికి దగ్గరైన వారు ఉంటారు కదా..”
మాట్లాడుతుంటే నా లోలోపల దాగిన భయానికి నా స్వరం వణికింది. నాకు తెలుసు నాలో దాగిఉన్న, అణచుకున్న అభిలాష నువ్వు పట్టుకున్నావు.
నీ చూపు నాపైనే నిలిపావు. కావాలనే మౌనంగా ఉడిపోయావు, నీ నాలుక బయట ఎక్కడో జారిపోయినట్టు. కాని నీ మొహం నీ అసౌకర్యం చెప్తూనే ఉంది. నల్లని కళ్ళల్లో మెరుపు మాయమై పోయింది.
నీ మోహంలో లోలోపలి సంఘర్షణ కనబడుతూనే ఉంది. బహుశా నేను నీలో దాగిన భావాలు బహిర్గతం చెయ్యాలని ప్రయత్నించానేమో. నువ్వు దిగంతాలవైపు చూస్తూ కాళ్ళ దగ్గరున్న రాళ్ళను ఏరి ఒకదానితరువాత ఒకటి దూరాన ఉన్న నీళ్ళలోకి అసంకల్పితంగానే విసురుతున్నావు. ఆగకుండా మునిగిన చప్పుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి.
చాలా సేపు నువ్వు మాట్లాడతావని ఎదురు చూసాను. నువ్వు మూగవైపోయావు. నీ మనసులో చిక్కులు చిక్కులుగా అయోమయంగా ఉన్న ఆలోచనలు నీ మోహంలో లేవు. నువ్వు నిజంగా గాయపడ్డావా? వెంటనే నీ మోహంలో ఒక కలహాపూరితమైన చూపు. చివరికి గంభీరమైన పెద్దరికం మొహంపై నిలచిపోయింది. ప్రశాంతమైన మానసిక వాతావరణం క్రమంగా ఉరుములు మెరుపుల తుఫానుగా మారింది.
సమయం ఎగిరిపోయింది. నిద్రలేచినట్టుగా లేచి నువ్వు జుట్టు సరిచేసుకుని, నిల్చుని పాంట్ దులుపుకున్నావు.
“ఇహ వెళ్దామా? బై, గుడ్ నైట్” వెనక్కు తిరిగి నడక మొదలు పెట్టావు. నేను నిల్చునే ఉన్నాను. వెనక్కు తిరిగి ఒక వీడ్కోలు చూపు నావైపు చూస్తావనుకున్నాను.
ఇంతకు మునుపు ఎప్పుడూ ‘ఎప్పుడు ఎక్కడ’ తో ముగిసేది మన సమాగమ౦. కాని నువ్వు వెనక్కు తిరగనే లేదు. నువ్వు అయ్యర్ షాప్‌లో ఆగి అక్కడి నుండి గుప్పు గుప్పున సిగరెట్ పొగ వదులుతూ నీ హాస్టల్ వైపు వెళ్ళిపోయావు.
నిజంగా నిజాయతీగా చెప్తున్నాను ప్రభాకర్ కన్నీళ్లు ఆపలేకపోయాను.
నీ తొందర వేడిలో నీ తాళాల గుత్తి అక్కడే మర్చిపోయావు. దాన్ని అందుకున్నాను. దానికి మూడు నాలుగు తాళం చెవులు తగిలించి ఉన్నాయి, ఒక ప్లాస్టిక్ ఫ్రేం కి. దానిమీద ‘కిస్ మి నాట్’ చెక్కినట్టుగా ఉంది.
నేను నిన్ను పిలవాలని ఉబలాటపడ్డాను. అరవడం బాగుంటుందా? నీ వెనకాలే నీ హాస్టల్ వరకూ పరుగెత్తుకు రావలసి౦దా? తొందరలో ఎదో ఒకటి చెయ్యడం మంచిది కాదేమో.
దయచేసి నన్ను క్షమించు.
ప్రేమికుడిని ఆకర్షి౦చట౦లో గాని వాళ్ళ కోపం , ఆత్రుత తొలగించడంలో గాని నాకంత ప్రావీణ్యత లేదు.
ప్రభాకర్ నన్ను క్షమించు, మాటలు నోట్లోనే కరగిపోయాయి. నాలుక పూడుకుపోయింది.
డైనింగ్ హాల్‌కి వెళ్లాను. అన్నం మింగాలని చూసినా ఒక్క మెతుకు కూడా నోట్లోకి వెళ్ళలేదు. నా గదికి వెళ్లి మొహం ది౦డులో దూర్చి విపరీతంగా ఏడ్చాను. అయినా ఉపశమన౦ కలగలేదు. లేచి కిటికీ దగ్గర నిల్చున్నాను. హాస్టల్ వైపు తిరిగి నా నోరు విప్పాను. నాపెదవులపై నుండి పాట అనాలోచితంగానే దూసుకు వచ్చింది.
పూర్తి స్వరం విప్పాను. హృదయపూర్వకంగా పాడే పాట బహుశా నీకు అనివార్యంగా వచ్చేలా ఆహ్వానం పలుకుతు౦దేమో.
కిటికీ దగ్గర చాతక పక్షిలా దాహంతో ఎదురుచూస్తున్నాను.
ఎంత చిరచిర. నేను ఊహించగలను. నాక్కూడా మెదడు ఉంది.
మెదడులో మూడు భాగాలు -ముందు, మధ్య, వెనక మెదళ్ళు …
మెదడులో తొమ్మిది వందల కోట్లు మించి నాడీ కణాలు. బరువులో ఒకటిన్నర సేర్లు. తాళాలు కనబడలేదని బహుశా తాళం విరగ్గొట్టి ఉంటావు.
నేను తాళాల గుత్తి తీసుకుని నాట్ అనేది కొట్టేశాను. అ గీతలు మందమై, మరింత మ౦దమై చివరికి నాట్ అనేది మొత్తం చెరిగిపోయింది. మిగిలినది ‘కిస్ మి’ ప్రభాకర్ ప్లీజ్ నన్ను ముద్దుపెట్టుకో…
నిజంగా చెప్తున్నా నీ మనసు గాయపరచే ఉద్దేశ్యం లేదు నాకు. ఎందుకు అంతలా గాయపడ్డావు?
నువ్వు అంత సెంటిమె౦టల్ అయితే జీవితంలో ఎంత ఇబ్బంది నీకు? నన్ను తప్పుగా భావించకు. ఇలాటి చిన్న విషయానికి గాయపడటం మంచిది కాదు.
నేను ఏం అడిగాను గనక? అది క్షమి౦చలేనంత నేరమా?
ఆ సంఘటన తరువాత నువ్వు రెండు రోజులు కాలేజికి రాలేదు. మర్నాడు ఆ విషయం తెలుసుకు౦దామనుకున్నాను. నాకు నీ రాకపోడం ఎంతో అయోమయంగా తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగించింది.
(సశేషం)