తమసోమా జ్యోతిర్గమయ-3

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రమాదంలో గాయపడ్డ భర్తని ఆసుపత్రికి చేర్చి చికిత్స చేయించడానికి చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురువుతుంటే ఆ భార్య మనఃస్థితి ఎలా ఉంటుందో గంటి భానుమతితమసోమా జ్యోతిర్గమయ” ధారావాహిక మూడవ భాగం చెబుతుంది. [/box]

[dropcap]అ[/dropcap]ది ఓ నాలుగంతస్థుల ఆసుపత్రి, చాలా ఏసీలున్నట్టు బయటినుంచే కనిపిస్తోంది… చూడడానికి పెద్దగా అధునాతనంగా కనపడుతోంది. దాని ముందున్నఆవరణ కూడా పెద్దగా, కాంపౌండు గోడకి ఆనుకుని చెట్లతో, నీటుగా ఉంది.. అక్కడ ఓ అంబులెన్స్, ఓ రెండు కార్లు, అరడజను బైకులు ఉన్నాయి. అంతే. మొత్తానికి ఆవరణ ఖాళీ ఖాళీగా ఉంది. మెల్లిగా కారుని ఎంట్రెన్స్ ముందు ఆపాడు. ఎంట్రెన్స్‌కి ఓ వైపున పెద్ద తెల్ల బోర్డు మీద డాక్టర్ల లిస్ట్. ఆ హాస్పటల్‌లో పని చేసే స్పెషలిస్టులైన డాక్టర్లు ఏ టైములో ఉంటారో ఏ రోజుల్లో ఉంటారో, అన్నీ రాసి ఉన్నలిస్ట్ అది. ఆ హాస్పటల్ హోదాని పెంచుతుంది అని అనుకుంటారు. రాధ కూడా అలాగే అనుకుంది. స్పెషలిస్టులున్నారు. పరవాలేదు. మాధవ్ సేఫ్ హాండ్స్‌లో ఉన్నట్టే లెక్క. ఉదయం కాబట్టి పెద్ద రష్ లేదు. నిశ్శబ్ధంగా ఉంది.

గాజు తలుపుల ముఖ ద్వారం, ముందు మెట్లు, వాటి చివర చిన్న చిన్న పూలతో ఉన్న పెద్ద పెద్ద పూల కుండీలు. చాలా నీటుగా ఉంది.

మనుషులు ఎక్కువగా లేరు. పేషెంట్ల బంధువులు మాత్రం ఫ్లాస్కులతో, టిఫిన్ పొట్లాలతో ఆటూ ఇటూ వెళ్తూన్నారు.

కారు ఆగీ ఆగగానే, నారాయణ పరుగు పరుగున మెట్లెక్కి, గాజు తలుపులు తోసి,లోపలికి వెళ్ళి, అటూ ఇటూ చూసాడు, ఎవరైనా కనిపిస్తారేమోనని. ఎవరూ కనిపించలేదు. వరసగా ఉన్న విజిటర్ల కుర్చీల్లో ఎవరో ఒకరిద్దరు కూచునే నిద్రపోతున్నారు. గోడలకి రకరకాల మందుల కంపెనీల వాళ్ళ పోస్టర్లు, వరసగా ఉన్న డాక్టర్ల గదులు మూసి ఉన్నాయి. ఏ ఏ డిపార్టుమెంట్లు ఎక్కడున్నాయో ఓ నీలం బోర్డు మీద రాసి అవి ఏ వైపున ఉన్నాయో బాణాల గుర్తులతో సహా ఉన్నాయి.

సన్నటి సందుల్లాంటి వరండాలు మలుపులు, నడవలు, మాయాలోకంలా ఉంది. ఆఖరికి కావలిసిన బాణం గుర్తు పట్టుకున్నారు.

రిసెప్షన్ అని రాసి ఉన్న వైపుకి వెళ్లి, ఆ టేబుల్ దగ్గరికి వచ్చాడు. రిసెప్షన్ దగ్గర, ఫోను చేస్తున్న మనిషి, యూనిఫారంలో ఉన్నమనిషి ఏదో వని చేసుకుంటూ కనిపించారు.

నారాయణ గబగబా అతని దగ్గరికి వెళ్ళి, సంగతి అంతా చెప్పి, స్ట్రెచరు కావాలని అడిగాడు. అతను వెంటనే డ్రెసింగ్ రూంలో ఉంది అని అనుకుటూ వెళ్ళాడు. లేచి,ఓ మనిషిని తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి కారు దగ్గరికి వచ్చిమాధవ్‌ని చూసారు.

వాళ్ళని చూస్తూ రాధ మెల్లిగా మాధవ్ కాళ్ళని జరిపి, కారు దిగింది. ఆ మనిషి అవతలి వైపునుంచి, కారులోకి వెళ్ళి, మాధవ్‌ని ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. తిరిగి మరోవైపుకి వచ్చి, కాళ్ళు పట్టుకుని మెల్లిగా, లాగాల్సి వచ్చింది. కానీ,లాభం లేకపోయింది. ఏమాత్రం చలనం లేని మాధవ్‌ని చూస్తూంటే రాధకి భయం వేసింది. ఛాతీ వైపు చూసింది. పైకి కిందకీ కదులుతోంది. పరవాలేదు. వెంటనే కళ్ళు మూసుకుని దేవుడిని తలుచుకుంది.

అంతలో ఆయా, వార్డ్ బాయ్ వెంటనే స్ట్రెచర్ తీసుకొచ్చారు. నలుగురూ కలిసి, అతి కష్టంమీద మాధవ్‌ని తీసారు కాదు, లాగారు అన్నది కరెక్ట్. మాధవ్‌ని దాని మీద పడుకోపెట్టారు. గబ గబా తోసుకుంటూ లోపలికి తీసుకెళ్ళారు.

అంతలోనే ప్రశాంత్ కారు కూడా వచ్చింది. అతను కూడా కారుని పార్క్ చేసి, వాళ్ళని గబ గబా పరుగు లాంటి నడకతో చేరుకున్నాడు.

అందరూ డ్యూటి డాక్టరు గదిలోకి వెళ్ళారు. అక్కడ ఎవరూ లేరు. ఆ గది ముందు స్టెచరు పైన మాధవ్‌ని ఉంచి, డాక్టర్ల కోసం, రాధ, ప్రశాంత్, నారాయణ హడావిడిగా, అటూ ఇటూ నడుస్తూ, పరిగెడుతూ, వెతుకుతున్నారు.

అప్పుడే ఓ సిస్టరు ఎదురొచ్చింది. చూడడానికి చాలా చిన్నగా ఉంది. చూడగానే మళయాళం అమ్మాయిలా అనిపించింది. ఆమెకి విషయం వివరించారు.ఆమె వెంటనే డ్యూటీ రూంలోకి వెళ్ళి సంగతి చెప్పినట్లుంది. వెంటనే ఓ నర్సు బయటికి వచ్చి ఓసారి మాధవ్‌ని చూసి, ఓ అని, డాక్టరు ఇప్పుడే కాఫీ తాగడానికి వెళ్ళారు, వచ్చారేమో చూసి చెప్తాను. అని అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆమె ఎప్పటికీ రాలేదు. ఆమె కోసం చూసారు.

అక్కడా ఇక్కడా చూస్తూంటే మళ్ళీ ఆ నర్సే కనిపించింది.”డాక్టరు వచ్చారో లేదో చూసి చెప్తాను అని అన్నావు, చెప్పలేదు……”

ఆమె ఓ క్షణం ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టి,”ఆఁ… అవును… చెప్తాను అని అన్నాను. కానీ డాక్టరుగారు లేరు… ఇంక చెప్పేదేం ఉంది అని చెప్పలేదు. అయినా నా డ్యూటి అయిపోతోంది. నేను వెళ్ళిపోవాలి… మరో సిస్టరు వస్తుంది, ఆమెకు చెప్పండి….”

రాధకి కోపం వచ్చేసింది. ఎంత కాజ్యుయల్ గా ఉంటారో వీళ్ళు… పేషెంట్ల సంగతి అక్కర్లేదా.

“ఆ మాట మాకు చెప్పాలి కదా…. అక్కడ ఆ మనిషి యాక్సిడెంటయ్యి సీరియస్‌గా ఉన్నాడు. ఒక్క డాక్టరు లేరు. నువ్వు పిలుస్తానని వెళ్ళావు, నువ్వు రాలేదు. మేము ఇక్కడ నీకోసం చూస్తున్నాం.. నీకు మేము ఎలా కనిపిస్తున్నాం.”

“ఒక్కదాన్ని ఉన్నాను. ఈ లోపల ఎవరో పిలిస్తే వెళ్ళాను. అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, మేమూ మనుషులమే నండి…….” చాలా విసురుగా అంది.

“కాదు, ముందు నువ్వు నర్సువి. అసలు నర్సంటే అర్థం తెలుసా… అహంకారం, చిరాకు, కోపం పక్కన పెట్టి, నిస్వార్థంగా సేవ చేయడం. నువ్వు ఓ సారి ఆ స్ట్రెచరు మీద పడుకున్న మనిషిని చూడు, చూస్తే ఇలా మాట్లాడవు. ముందు డాక్టరుని పిలు…..”

“నా డ్యూటీ టైమయిపోయింది, లాస్ట్ మినిట్‌లో ఏఁవిటో” అని ఆమె తనలో తను ఏదో అనుకుంటూ ఎదురు సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

ఏంటో వెంటనే ఎవరూ రారు. ఈ ప్రవేటు ఆసుపత్రుల్లో ఇక్కడే ఇలా ఉందంటే ఇంక గవర్నమెంటు ఆస్పత్రుల సంగతి ఊహించుకోవచ్చు అని అనుకున్నారు.

మరో అయిదు నిమిషాల్లో, డ్యూటీ డాక్టర్, ఓ నర్సు గబ గబా స్టెచర్ దగ్గరికి వచ్చారు. ఈమె వేరు. ఆ నర్సు కాదు. ఆమె వెళ్ళిపోయినట్లయింది.

“యాక్సిడెంటా…” అన్నాడు డాక్టరు, మాధవ్‌ని చూస్తూ…. రక్తంతో తడిసిన బట్టలతో ఉన్న రాధని చూసాడు.

“అవును. ఉదయం ఆరు గంటలకి జరిగింది”

“అలాగా…. ఎవరైనా చేసారా!” అంటూ వాచి చూసుకున్నాడు

“ఓ కారు యాక్సిడెంటు చేసింది.”

మొహం చిట్లించాడు. తలని అడ్డంగా ఊపాడు. పెదవి విరిచాడు.

“ప్చ్… సారీ…. రోడ్ యాక్సిడెంటు. కష్టం… ఇలాంటి కేసులు తీసుకోము… ఇవన్నీ తలనొప్పి కేసులు. అది మీకు అర్థం కాదు… పైగా స్పృహలో లేడు. అది మగత అయితే పరవాలేదు. కానీ కాన్షస్ లోనే లేడు. అది డీప్ అయితే చాలా కష్టం. పూర్తిగా స్పృహలో లేకపోతే కష్టం… మేము తీసుకోము… సారీ మీరు వేరే పెద్దాసుపత్రికి తీసుకెళ్ళండి.”

అంతా డీలా పడిపోయారు.రాధ కి కోపం వచ్చేసింది.

“ఇప్పుడు వేరే దగ్గరికి అని అంటే ఎలా…. ప్రమాదం జరిగిన దగ్గర నుంచి మీ ఆసుపత్రికి తీసుకు రావడానికే ఇంత సమయం పట్టింది. ఇప్పుడు వేరే హాస్పటల్ అని అంటే ఎలా… అంతవరకూ….. ఏదైనా జరిగితే……” కోపంగా అని ఆగిపోయింది.

డాక్టరు మాధవ్ ని ఓ సారి చూసారు. ప్చ్ అని అంటూ అందరిని చూసి తలని అడ్డంగా ఊపారు.

“సారీ. నేను డ్యూటీ డాక్టరునండి.”

వాళ్ళకి అర్థం అయింది. ఈ డ్యూటీ డాక్టరు జూనియరు అయి ఉండాలి. లేకపోతే పీజీ స్టూడెంటు అయి ఉండాలి. వీళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం, తీసుకునే ప్రావీణ్యం ఉండదు. ఇప్పుడేం చేయాలి….. చేతులు కట్టుకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందేమో…

“ఎమర్జెన్సీ డాక్టరు లేరా….” అని అటూ ఇటూ చూసి, ఎమర్జన్సీ అని రాసి ఉన్న బోర్డుని చూసి అటు వైపు వెళ్ళింది. గబ గబా తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళింది. ఆమె వెనకాలే కుర్ర డాక్టరు కూడా వచ్చాడు.

అంతలోనే ఓ పెద్ద మనిషి ఎదురొచ్చాడు. ఆ కుర్ర డాక్టరు సంగతి అంతా చెప్పాడు, అతను డాక్టరని అర్థం అయింది.

ఆ పెద్ద డాక్టరు రాధని చూసి, పదండి అన్నట్టు చేయి కదిలించి ముందుకి నడిచాడు. అతని వెనకాలే మిగిలిన ఇద్దరూ నడిచి మాధవ్ ఉన్న వైపు వెళ్ళారు.

“ఇలాంటి కేసులు చేయం. మా లిమిట్స్ మాకున్నాయి.” అంటూ మాధవ్‌ని చూసాడు.

రాధ కళ్ళ నుంచి జల జల నీళ్ళు రాలాయి.అది ఆ డాక్టరు చూసాడు.

“సరే… డాక్టరుగా మానవతా దృష్టితో, ప్రస్తుతం ముందు చెయ్యాల్సినది అంటే ఫస్ట్ ఎయిడ్ మాత్రం చేస్తాము. ప్రస్తుతానికి అది మేం చేయగలం…” అని పక్కనున్న నర్సు వైపు చూసాడు. “థియేటరుకి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయమని చెప్పు”.

“మీరు రారా… మీరే రండి …..” ఏడుస్తూ అంది.

“లేదండి… అక్కడ మరో డాక్టరున్నారు. అతను చూస్తారు.”

ముందు మాధవ్, వెనక మిగిలిన వాళ్ళు, లిఫ్ట్‌లో పైకెళ్ళారు. ఆ ఫ్లోరు కొంచెం కలకలంగా ఉంది, చంటి పిల్లల ఏడుపులు,మనుషుల మాటలు,అన్నీ కలిసి వినిపిస్తున్నాయి.

అందరూ కలిసీ థియేటరున్న ఫ్లోరు కెళ్ళారు. అక్కడ రెండు థియేటర్లున్నాయి, ఒకటీ రెండు అని నంబర్లు వేసి ఉన్నాయి.

అక్కడున్న డ్యూటీ డాక్టర్ మాధవ్‌ని చూస్తూ, నారాయణతో మాట్లాడుతూ, వివరాలు అన్నీ కనుకుంటున్నాడు. అంతా విన్నాక పెదవి విరిచాడు. తలని అడ్డంగా తిప్పేసాడు. ఆ వెంటనే నారాయణని,రాధని చూసాడు.

“సారీ… ఇది పోలీసు కేసండి, మేము ఇలాంటి వాటిని తీసుకోము… ఫస్ట్ ఎయిడ్ చేసి పంపమన్నారు కానీ అది కూడా కష్టమే… చాలా రక్తం పోయింది… కాన్షస్‌లో లేడు… ఏదైనా అయితే మమ్మల్ని బతకనీయరు…”

రాధ, నారాయణ కంగారుగా చూసారు డాక్టర్ని. ఆ చూపుని అర్థం చేసుకున్నడాక్టరు తల ఊపుతూ రెండు అడుగులు వెనక్కి వేసాడు.

“సారీ, ఇది లీగల్ కేసండి, మీరు వెంటనే ఈ మనిషిని గవర్నమెంటు ఆసుపత్రికి తీసుకెళ్ళండి.”

“మీరు అలా అంటే ఎలా డాక్టర్….! పరిస్థితి చూసారు కదా….! చూసి కూడా ఇంత కఠినంగా మాట్లాడితే ఎలా డాక్టర్… మీరే అలా అంటే ఎలా…! ఇప్పుడు గవర్నమెంటు హాస్పిటల్ అంటున్నారు. పైగా అదేం దగ్గరలో లేదు. అంత వరకు ఈ మనిషి… ప్రాణం… ప్లీజ్… ఏదో చెయ్యండి.”

“సారీ… మా కష్టాలు మావి.. అవి మీకు తెలీదు… చెప్పినా అర్థం కాదు… మేము చిక్కుల్లో పడిపోతాం….”

చూడ్డానికి పెద్దగా ఉంది ఆసుపత్రి. అంత కన్నా పెద్ద పెద్ద స్పెషలిస్టులున్నఆసుపత్రి, చుట్టూరా అంతా ఆసుపత్రికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు… అయినా ఒంటరి వాళ్ళం అని అనిపించింది. రాధకి డాక్టర్ మాటలతో చాలా కోపం వచ్చింది. ఆమె డాక్టరుతో మాట్లాడుతూ మాధవ్ వైపు చూసింది.

మనిషి స్పృహలో లేడు. రాధకి భయంగా ఉంది. మళ్ళీ మాధవ్‌ని చూసింది…

శ్వాస ఉందన్నట్లుగా ఛాతీ భాగం పైకి కిందకీ కదులుతోంది… కాబట్టి, బతికి ఉన్నాడు. ఒకవేళ,.అదే కనక కనిపించకపోతే, పోయాడేమో అన్న అనుమానం వస్తుంది. ఆ మనిషి పోలేదు, అదే ఆమెకి తెలిసినది. ఎందుకంటే, ఛాతి కదలికలు మాత్రమే పైకి కనిపిస్తోంది. కాని… లోపల…. లోపల ఎలా ఉందో…! ఏం అయిందో…. ఏం జరిగిందో… చూసి చెప్తేనే కదా తెలుస్తుంది….! ఎవరో, చెప్తేనే కదా తెలుస్తుంది. ఆ ఎవరో ఈ డాక్టరే కదా…. ఇతను పరీక్ష చేయాలి .చేసి చెప్పాలి.

 కాని, ఇతను పరీక్ష చేయడానికే నిరాకరిస్తున్నాడు. మరి, అసలు పేషెంటు కండిషన్ ఏఁవిటీ….! బతుకుతాడా… లేదా….! ఇంత క్రిటికల్ సమయంలో ఈ మెలికలు ఏఁవిటీ..! ఆలస్యం అయిపోతే….! ఏదైనా జరగకూడనిది జరిగితే…! ఆ పాపం ఎవరిది…! ఈ సమయంలో తను ఏంచెయ్యాలి…! కింద మొదట్లో మాట్లాడిన డాక్టరుని కలుసుకుంటే… అతనినే, కలుసుకుని మాట్లాడాలంటే రెండంతస్థులు దిగాలి. కిందకి వెళ్ళి వాళ్ళని అడగడం లోపే ఏదయినా జరిగితే…!

నోరు మూసుకుంటే లాభం లేదు. మర్యాదలకి పోతూంటే కళ్ళముందే మాధవ్‌ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ గుండెలు బద్దలవుతూంటే, అగ్ని పర్వతాలు పొంగి జీవితాన్నిమాడ్చి మసి చేసెయ్యడానికి సిద్దంగా ఉంటే ఊరుకుంటే లాభంలేదు. గట్టిగా అడగాలి అని అనుకుంటూ, కోపంగా చూసింది.

“మనిషి అలా ఉంటే తొందరగా ఏం చేయాలో చేయండి. పేషెంటు కేదైనా అయతే మీరు బాధ్యత తీసుకుంటారా…. ఈ సమయంలో ఇలా మాట్లాడి ఇంకా ఆలస్యం చేసే కన్నా, ఏం చేయాలో అది చేస్తే బతుకుతాడు కదా….”

వెంటనే పక్కనే ఉన్న నారాయణ కూడా అందుకున్నాడు. గొంతు పెద్దది చేసి అరిచినట్లుగా మాట్లాడాడు. అతని మనసులో ఉన్న సందేహాలనే అరుస్తూ చెప్పాడు. అటూ ఇటూ వెళ్తున్న వాళ్ళు ఒకరిద్దరు, ఆగి వింటున్నారు. పొద్దునే కాబట్టి మనుషుల హడావుడి కూడా ఏమీ లేదు. నిశ్శబ్ధంగా ఉంది కాబట్టి నారాయణ మాట అన్ని చోట్లకి వెళ్ళి పోతోంది.

అంతలో ఎమర్జెన్సీ హెడ్ వచ్చాడు. అతనికి ఎవరో కబురు చేసినట్లున్నారు. మామూలుగా అయితే ఉదయం ఆరు గంటలకి ఓసారి వచ్చి అందర్నీ చూసి వెళ్ళి పోతాడుట, ఆ తరవాత మళ్ళి ఎనిమిది గంటలకి వచ్చి ఉండిపోతాడుట… కాని, ఇప్పుడు పిలిచారు. అందుకని ముందరే వచ్చాడు.

అతను వస్తూనే ఓ నర్సుని పిలిచి మాధవ్‌ని థియేటర్‌లోకి తీసుకెళ్ళమన్నాడు. అక్కడే ఉన్న కుర్ర డాక్టరుని ఓ పక్కకి తీసుకెళ్ళి విషయం కనుక్కున్నాడు. అంతా విన్న తరవాత ఆ డాక్టరు నారాయణ రాధ దగ్గరికి వచ్చాడు.

“చూడండి మేము ఇక్కడ ఉన్నది రోగుల ప్రాణాలు కాపాడడానికే… రోగులు ప్రాణాపాయస్థితిలో ఉంటే అలా చూస్తు వదిలేయము. బతికించడానికే ప్రయత్నిస్తాము.

ఇప్పుడు మీ కేసు వేరు. ఇది హిట్ అండ్ రన్ కేసు. పైగా హెడ్ ఇంజ్యూరి. స్పృహలో లేడు. దీని లెవెల్ ఎంతుందో తెలవాలి. మీరు చదువుకున్నవారు కాబట్టి చెప్తున్నాను. లెవెల్ ఆఫ్ కాన్షస్‌నెస్ చూడాలి. ఇది డీప్ అన్‌కేన్షస్సా… డ్రౌసీనా అన్నది కూడా తెలవాలి. బ్రెయిన్ లోపల ఏం జరిగిందో చూడాలి. ఎముకలు విరిగాయా… అన్నది కూడా తెలియాలి. దీనికి ఎక్స్‌రే కుదరదు. అందులో అన్నీ కనపడదు. దానికి సిగ్నిఫికెన్స్ లేదు. ఎమ్మారై చేయించాలి. అది అయితే అన్ని కోణాల్లోంచి చూపిస్తుంది. సైట్ ఆఫ్ ఇంజ్యూరి ఈజీగా తెలిసిపోతుంది. ఇవన్నీ న్యూరో సర్జన్ చూడాలి.

 అంతే కాదు. బయటి బ్లీడింగ్ మనకి కనిపిస్తోంది. కానీ లోపల…. రక్త నాళాలకి దెబ్బ తగిలిందా.. రక్తం క్లాట్ అయిందా… బ్లీడింగ్ అవుతోందా…. ఒకవేళ బ్లీడింగ్ ఆగకపోతే…. ఏం చేయాలి… ఇవన్నీ తెలిపే మెషినరీ మా దగ్గర లేదు. అందుకే మా డ్యూటి డాక్టరు మీతో అలా మాట్లాడాడు. ఏ మాత్రం పొరపాటు జరిగినా కొన్ని వందల ప్రశ్నలకి జవాబులు ఇచ్చుకోవాలి… ఇలాంటి వాటి వల్ల చాలా ప్రాబ్లెంస్ వస్తాయి. అందుకే మా డ్యూటీ డాక్టర్ తీసుకోడానికి వెనకాడాడు…. నేను చెప్పాను, కాబట్టి రిస్కు తీసుకుని చేస్తున్నాము… మేము ఫస్ట్ ఎయిడ్‌కి ఏం చెయ్యాలో అదే చేస్తాం, అది కూడా పేషెంటు పరిస్థితి చూసి, మానవత్వంతో… అంతే.” అని అతను కూడా థియేటర్ లోకి వెళ్ళి పోయాడు

రాధ కూడా వెళ్ళింది. అక్కడ ఉన్న ఓ కుర్చీలో, ఆందోళనగా థియేటరు వైపు చూస్తూ కూచుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here