[box type=’note’ fontsize=’16’] “ఒక సామాన్యుడి భార్యగా జీవించడంలో ఉన్న ఆనందం, రాజుగారి అంతపురంలో వందమంది రాణులమధ్య లభిస్తుందని నేను అనుకోను” అని ధైర్యంగా చెప్పిన ఓ యువతి కథ ఎలా ముగిసిందో అత్తలూరి విజయలక్ష్మి “పార్ధల”లో చెబుతారు. [/box]
[dropcap]అ[/dropcap]ది 1406 సంవత్సరం. విజయనగర సామ్రాజ్యానికి మొదటి దేవరాయలు చక్రవర్తియై పరిపాలిస్తున్న రోజులు.
విజయనగరం గురించి వ్యాప్తిలో ఉన్న కథనం ప్రకారం విద్యారణ్య స్వామి విరూపాక్షుడి కటాక్షం కోసం అనేక సంవత్సరాలు తపస్సు చేయగా, స్వామి కనికరించి ప్రత్యక్షమై కనక వర్షం కురిపించాడని, ఆ కనకంతో విద్యారణ్యస్వామి సైన్యాన్ని సమీకరించుకుని సామ్రాజ్యాన్ని స్థాపించాడని అదే విద్యారణ్యం అయింది. కాలక్రమేణా అనేక విజయాలు సాధించినందుకు చిహ్నంగా దానినే విజయనగరంగా మార్చారని ప్రతీతి… కాకపోతే దీనికి ఎక్కడా చారిత్రక సాక్ష్యం లేదు..
కానీ, అసలు గాథ వేరుగా ఉంది… అశోకుడు అర్థశాస్త్రం రచించిన చాణక్యుడి మీది గౌరవంతో ఒక రెజిమెంట్ స్థాపించాడని, కాలక్రమేణా అది చాణుక్య రెజిమెంట్‌గా మారిందని, అశోకుడు బౌద్దమతం స్వీకరించినప్పుడు ఆయన మనవడైన చంద్రగుప్త మౌర్యుడు వృథాగా ఉన్న అపారమైన సైన్యాన్ని దక్షిణాపథానికి తరలించాడు. అలా తరలించగా కొందరు తూర్పుకు, మరికొందరు పడమటికి రెండుగా చీలి, తూర్పు చాళుక్యులు, పడమటి చాళుక్యులుగా ఏర్పడ్డారు.
నంద వంశజుడైన విజయధ్వజుడు రాజ్యకాంక్షతో తుంగభద్రను ఆనుకుని ఉన్న అణగొంది అనే చిన్న గ్రామాన్ని ముందుగా కైవసం చేసుకుని, నెమ్మదిగా తుంగభద్రను దాటి దక్షిణాపథంను ఆక్రమించాడు… విజయధ్వజుడు స్థాపించిన ఆ ప్రాంతం విజయనగరంగా ప్రసిద్ది చెందింది… దీనినే హంపీ విజయనగరం అంటారు.
విజయనగర రాజులు దక్షిణాపథాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఉత్తరాపథాన్ని తుర్కులు పాలిస్తున్నారు… వారిలో ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ ఒకడు… ఆయనకి రాజ్యకాంక్ష విపరీతం… యుద్ధోన్మాదికూడా… తనకి అత్యంత ప్రీతిపాత్రుడు, విశ్వాసపాత్రుడు అయిన సేనాధిపతి మాలిక్ కాఫర్ నాయకత్వంలో సెన్యాన్ని దక్షిణదేశం మీదికి దండయాత్రకు పంపించాడు. వారు ముందుగా దేవగిరిపైకి దండెత్తారు. దేవగిరిరాజైన రామచంద్రరాజు వారికి లొంగక తిరుగుబాటు చేశాడు. కానీ, ఖిల్జీ సైన్యం ముందు ఆగలేక పరాజయం పాలైనాడు… అతనిని బంధించి చర్మం ఒలిచి అతి కిరాతకంగా చంపి, ఖండఖండాలుగా నరికి ఆ భాగాలను అతని బంధువులను తినమని ఒత్తిడి చేసాడు మాలిక్ కాపర్…
ఆ తరవాత ఓరుగల్లు పైకి దండెత్తాడు. వీరుడైన ప్రతాపరుద్రుడు ముందుగా ప్రతిఘటించి ఎదురుదాడి చేసినా మాలిక్ కాపర్ ధాటికి ఆగలేక కొంత కప్పం చెల్లించి సంధి చేసుకున్నాడు..
ఆ తరవాత మాలిక్ కాఫర్ సెన్యంతో సహా హోయసల, పాండ్య, చోళరాజులను జయించి, శ్రీరంగ పట్టణం, కంపిలి, ద్వారసముద్రం మీద దాడిచేసి దేవాలయాలను కొల్లగొట్టి ధనం రాశులు అనేక వేల ఏనుగులపెన వేసుకుని ఢిల్లీకి తరలివెళ్లి ఖిల్జీకి సమర్పించాడు. అది చూసిన అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ పైన మరింతగా అభిమానం పెంచుకున్నాడు… కానీ, కొంతకాలం తరవాత మాలిక్ కాఫర్ అల్లావుద్దీన్ ఖిల్జీని అంతమొందించి తాను సుల్తానయాడు… కానీ, త్వరలోనే అతనిని అంతమొందించి తుగ్లక్ వంశజుడైన ఘయాజుద్దీన్ తుగ్లక్ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు.. అతని తరవాత ఉలుగ్ ఖాన్ సుల్తాను అయ్యాడు… అతనే మహమ్మద్ బిన్ తుగ్లక్.
ఉలుగ్ ఖాన్ సైన్యాన్ని తీసుకుని ఓరుగల్లు మీదికి దండయాత్ర చేయగా, అప్పటికే అప్రమత్తంగా ఉన్న ప్రతాపరుద్రుడు వేలమంది సెన్యాన్ని సమీకరించుకుని ఉలుగ్ ఖాన్‌ని ఎదుర్కున్నాడు. ఇరుపక్షాల మధ్యా హోరాహోరీగా యుద్ధం జరిగింది… ప్రతాపరుద్రుడి కాలంలో ఆయన సైన్యం బ్రాహ్మణులు, రెడ్డిలు, వెలమలు అనే మూడు భాగాలుగా ఉండేది… ప్రతాపరుద్రుడు బ్రాహ్మణులకు, రెడ్డిలకు ఇచ్చిన ప్రాధాన్యత వెలమలకు ఇవ్వలేదని ఒక అభియోగం. తత్ఫలితంగా వెలమలు యుద్ధ సమయంలో అవసరమైనప్పుడు తాము వెళ్లచ్చు అనే ఆలోచనతో కొంచెం విడిగా ఉండి యుద్ధం కళ్లారా చూడసాగారు… అప్పుడు ఉలుగ్ ఖాన్ ఒకానొక సందర్భంలో మంచెనొకదానిని ఏర్పాటు చేసుకుని యుద్ధం జరుగుతున్న ప్రాంతాన్ని గమనించసాగాడు… ప్రతాపరుద్రుడి సైన్యం పలచబడడం గమనించిన ఉలుగ్ ఖాన్ అదను చూసి అతనిపైన విరుచుకుపడి ప్రతాపరుద్రుడిని బంధించాడు. బందీగా ఉన్న ప్రతాపరుద్రుడిని, అతని మంత్రివర్గాన్ని ఢిల్లీకి తరలిస్తుండగా ఎప్పటికప్పుడు తనకి సమాచారం అందిస్తున్న విశ్వాసపాత్రుడైన మంత్రితో సహా అనేక మంది తన అనుచరులు సుల్తాను వైపు మొగ్గడం చూసిన ప్రతాపరుద్రుడు అవమాన భారంతో నర్మదానదిలో దూకి ప్రాణత్యాగం చేసుకున్నాడు..
ప్రతాపరుద్రుడి వద్ద కోశాధికారులుగా ఉన్న హరిహరరాయలు, బుక్కరాయలు ఓరుగల్లు సుల్తానుల వశమవడంతో కోశాగారం శత్రువులచేత పడకుండా మొత్తం ధనాన్ని దాచి, ఎవరూ చూడకుండా దక్షిణాపథానికి చేరతారు.
అది 1320 సంవత్సరం… నందవంశంలో ఆఖరివాడైన జంబుకేశ్వరరాయలు విజయనగరాన్ని పాలిస్తున్న రోజులు… ఆ సమయంలో అక్కడికి చేరిన హరిహర రాయలు, బుక్కరాయల్ని చూసిన సైన్యం జంబుకేశ్వరరాయలుని తప్పించి సింహాసనాన్ని అధిష్టించవలసిందిగా కోరతారు… తాము తరలించిన ధనంతో సెన్యాన్ని సమీకరించుకున్న హరిహర, బుక్కరాయలు త్వరలోనే వారి కోరిక ప్రకారం జంబుకేశ్వరరాయలుని అంతమొందించి హరిహరరాయలు సింహాసనం అధిష్టిస్తాడు… కానీ, హరిహరరాయలు అకాలమరణంతో బుక్కరాయలు సింహాసనం అధిష్టించి బుక్క మహీపతిగా సుమారు 40 సంవత్సరాలపాటు పరిపాలన సాగించాడు… అతని పాలనలో విజయనగర రాజ్యాం మరింత విశాలమై సుస్థిరమైంది.
తుంగభద్రానదికి ఉత్తరాన బహమనీలు, దక్షిణాన విజయనగరరాజులు ఆక్రమించుకుని పాలిస్తున్న రోజులు… అప్పటికే బహమనీ సుల్తాను ఫిరోజ్ షా ముద్గల్ కోటను ముట్టడించి తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు… ముద్గల్, రాయచూరు కోటలు రెండూ కూడా అటు కృష్ణా, ఇటు తుంగభద్ర నదుల మధ్య ఉన్నాయి.. వీటిని రాయచూర్‌దోబ్ అంటారు.
బుక్కరాయలనంతరం 1406లో సువిశాలమైన విజయనగర సామ్రాజ్యానికి హరిహర రాయలి కుమారుడు దేవరాయలు చక్రవర్తి అవుతాడు… అతనినే మొదటి దేవరాయలు అంటారు… అతను యువకుడు, అందగాడు… సాహసవంతుడు… తుంగభద్రా నదిని ఆనుకుని ఉంది విజయనగరం… అక్కడి నుంచి విజయనగర సామ్రాజ్యకోటకి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో తుంగభద్రానదికి ఆవలి ఒడ్డున ఉంది ముద్గల్… ముద్గల్ కోట చుట్టూ అగర్త అనే జలాశయం ఉంది… 30 అడుగుల లోతున ఉండే దాన్లో ఇప్పటికీ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అందులో మొసళ్లు ఉండేవని, యుద్ధ సమయంలో వాటిని వదిలేవాళ్లని అంటారు. అక్కడి శిలాస్తంభాలు, కోట తలుపులు హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. అది అణగొంది రాజ్యంలో ఒక భాగం… కోట లోపలే సుల్తానుకి విశ్వాసపాత్రులైన అధికారులు, సేనా నాయకులు నివాసం ఏర్పరచుకుని ఉండేవారు… ముద్దల్, రాయచూర్ కోటలు నిర్మించింది హిందువులే అని ఖచ్చితమైన చారిత్రక సాక్ష్యం ఉన్నా, బహమనీ సుల్తానులు అక్రమంగా ముద్గల్‌ను ముట్టడించి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు…
ఇక రాయచూర్ .. ఈ రాయచూర్ మీద అటు విజయనగర రాజులు, ఇటు బహమనీలు నిత్యం దాడులు చేస్తుంటారు… రాయచూరు కోట ఎవరివశమైతే వారు ఉపరిభాగాన్ని కూడా పాలించవచ్చు. అంచేత ఇరువురి దృష్టి రాయచూర్ కోట మీద కేంద్రీకృతమై ఉండేది… అంతేకాక తుంగభద్రానదిని దాటి విజయనగర సామ్రాజ్యాన్ని కూడా ముట్టడించి తమ మతాన్ని వ్యాపింపచేస్తూ, సువిశాలమైన్ల విజయనగర రాజ్యాన్ని విస్తరించుకోడానికి బహమనీలు చేసే ప్రయత్నాలను విజయనగర రాజులు అడ్డుకుంటూ ఉండడంతో వారిద్దరి మధ్యా పగలు రగులుతుండేవి. విస్తరించి ఉన్న విజయనగరం పైన ఫిరోజ్ షా దృష్టి ఉంది… ఏనాటికైనా ఆ రాజ్యాన్ని తన అధీనంలోకి తెచ్చుకోడానికి కుట్రలు పన్నుతూ ప్రయత్నాలు చేస్తుండేవాడు.
రాయచూర్‌ని జయిస్తే బహమనీ సుల్తానులు శాశ్వతంగా తనకి సామంతరాజులుగా మారతారు అనేది మొదటి దేవరాయలవారి కోరిక. అందుకోసం నిత్య ప్రణాళికలతో నిండి ఉంటుంది ఆయన మనసు…
అయితే రాజుకి ఎంత రాజ్యకాంక్ష ఉన్నా వ్యక్తిగత విషయంలోకి వచ్చేసరికి రాజు రసికుడు… అతని అంతపురంలోని రాణీవాసంలో ఆ రాజ్యంలోనే కాక ఇరుగు పొరుగు రాజ్యాలలోని సౌందర్యవతులు కూడా ఆయన శృంగార సామ్రాజ్యానికి రాణులుగా ఉన్నారు… ఆస్థాన పండితులైన కొందరు ఆచార్యుల ద్వారా ఎక్కడ సౌందర్యవతి ఉందో రాజుకి ఆనమాలు అందుతుంది… సరిగ్గా అలాంటి స్థితిలోనే ముద్గల్ కోటలో స్వర్ణకారుడి కుమార్తె పార్ధల గురించిన సమాచారం రాజుకి అందింది ..
అది చలికాలం పూర్తయి, వేసవికి స్వాగతం పలికే తొలిరోజులు… నేలంతా తివాచీ పరిచినట్టు పండుటాకులతో నిండి ఉంది. అప్పుడే మావిచిగుర్లు తిని మత్తెకిన కోయిలలు తీయగా స్వరం సర్దుకుంటున్నాయి… ఆ సర్దుకోడంలో ఓ మధురమైన రాగం నిశ్శబ్దంగా గాలిలో తేలుతూ పరిసరాలను ఆహ్లాదపరుస్తోంది… విరిసీ విరియని రంగు, రంగుల పూలు చిత్రమైన పరిమళాలను వెదజల్లుతూ రమణీయంగా ఉన్నాయి. అటు మరీ చలిగా కాక, ఇటు వేడి కాక ఆహ్లాదకరంగా గాలివీస్తోంది…
రాజకీయపరమైన ఆలోచనలనుంచి కొంచెం సేదతీరడానికి ఆరోజు మొదటి దేవరాయలు విశ్రాంతి తీసుకోడానికి ఉద్యానవనానికి బయలుదేరాడు… ఆయన్ని అనుసరిస్తూ కొందరు సైనికులు ఆయన వెంటనడిచారు… దారినిండా పరిచిన ఆకు తివాచీల మీద అడుగులేస్తూ, చల్లగాలి మోసుకువస్తున్న పరిమళాలను ఆస్వాదిస్తూ మనోల్లాసంతో వనంలో అడుగుపెట్టాడు… ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన సైనికులు కొంచెం దూరంలో చేతిలో కరవాలాలతో ఆయన్ని కాపుకాస్తున్నారు…
మొదటి దేవరాయలు సరస్సుతీరాన మెల్లిగా నడుస్తూ సరస్సులో చంద్రుడి రాకకై వేచి చూస్తున్న తామరలను వీక్షిస్తూ తనలో తాను నవ్వుకున్నాడు… ఎంత రమణీయంగా ఉంది ప్రకృతి… ఈ ప్రకృతి సర్వం ప్రేమ మైకంలో తేలుతున్నట్టు ఉంది… గాలి తెరలు తెరలుగా పూలతో సయ్యాటలాడుతోంది… తామరలు విశాలమైన కనుదోయితో తమ ప్రియుడి రాకకోసం నిరీక్షిస్తున్నాయి… మేఘాలు కెంజాయరంగులో దోబూచులాడుతున్నాయి… ఆయన మనసంతా పులకితమైంది… ఈ సమయంలో ఒంటరిగా ఈ ప్రదేశంలో విహరించడం తనలాంటి రసికుడికి ఎంత మాత్రం తగదనిపించింది… మగువ సాహచర్యంకోసం అణువణువూ తహతహలాడింది.
సరిగ్గా ఆ సమయంలో వార్తాహరుడు వచ్చాడు. “ప్రణామాలు మహారాజా.. తమరి కోసం శ్రీశ్రీ తిరుమలాచార్యులవారు వేచి ఉన్నారు…” అన్నాడు.
‘తిరుమలాచార్యులవారా?’ ఒకసారి రాజు సన్నగా నొసలు ముడిచాడు… తిరుమలాచార్యులు ఆస్థాన పురోహితులు… ఈ సమయంలో ఆయన రాకకు కారణమేమై ఉంటుంది? వెంటనే ఏదో స్పురణకి వచ్చి పెదవులపైన చిన్న చిరునవ్వు కదిలింది…
“ప్రవేశపెట్టండి” అంటూ ఆ వనంలో తాను విశ్రాంతి తీసుకోడానికి ఏర్పాటు చేసిన అందమైన నగిషీలు చెక్కిన ఉయ్యాల బల్ల వద్దకు నడిచాడు… వార్తాహరుడు నిష్క్రమించాడు… మెల్లిగా ఉయ్యాల ఊగుతూ ఏవో ఊహలతో ఆనందించసాగాడు దేవరాయలు…
ఆ కాలంలో ఆస్థాన పురోహితులకు రాజుగారి ప్రాకారంలోకి ఏ సమయంలోనైనా ప్రవేశించేందుకు అనుమతి ఉంది. అందులోనూ తిరుమలాచార్యుల వారికి దేవరాయల దగ్గర అంతులేని చనువు, స్వతంత్రత ఉన్నాయి… హిందూ దేవాలయాలలో పూజలు చేసే పూజారులు ఆలయానికి వచ్చే దేశదేశాల సౌందర్యవతుల వివరాలు తెలుసుకుని ఆ వివరాలు ముందుగా రాజుగారికి చేరవేయడం, రాజుగారి అనుమతితో ఆ అమ్మాయికి రాణీవాసయోగం కలగడం పరిపాటి… ఈ సారి ఏ సుందరి అనుపానులు తెలుసుకుని వచ్చారో ఆచార్యులవారు! నవ్వుకున్నాడు దేవరాయలు.
చిరునవ్వుతో ప్రసన్నంగా కనిపిస్తున్న దేవరాయలను సమీపించి తల వంచి అభివాదం చేస్తూ “మహారాజుగారికి ప్రణామాలు” అన్నాడు ఆచార్యులవారు.
“రండి ఆచార్యా కుశలమా” ఆహ్వానించాడు దేవరాయలు.
“తమరి దయవల్ల అంతా క్షేమమే మహారాజా…”
“రాజ్యంలో విశేషాలేమి?”
“రాజ్యంలో విశేషాలు మామూలే మహారాజా… కానీ, పొరుగు రాజ్యమైన ముద్గల్‌లో ఒక విశేషం ఉంది… అది తమకు విన్నవించడానికి వచ్చాను…”
“అలాగా ఏమిటా విశేషం?”
ఆచార్యులవారు కొంచెం స్వరం తగ్గించి “మహారాజా ముద్గల్ కోటలో విశ్వబ్రాహ్మణుడైన శంకరుడికి ఒక కుమార్తె ఉంది… ఆమె పేరు పార్ధల… ఆమె సౌందర్యం వర్ణనాతీతం… పైగా ఆమె విద్యావతి… ఆమె సౌందర్య మెరుపులే ఆ రాజ్యంలో వెలుగురేకలై విస్తరిస్తున్నాయి…”
వింటోన్న దేవరాయలవారి వదనంలో రంగులు మారాయి.. ఆయన కళ్లముందు అపురూపమైన సౌందర్యవతి చిత్రం మెదిలింది..
“ఏమీ. అంతటి సౌందర్యవతా ఆమె?” అడిగారు ఉయ్యాల బల్ల మీద నుంచి లేచి మెల్లగా పచార్లు చేస్తూ.
“ఏమని చెప్పమంటారు మహారాజా… ఆమె వంటి సౌందర్యవతిని తమ ఆస్థానంలో ఇంతకు మునుపెన్నడూ కనీ, వినీ ఎరుగము. అయితే తమకి తెలుసు ఆ ముద్గల్ బహమనీ సుల్తానుల అధీనంలో ఉంది…”
“అయితే!” కళ్లల్లో ఎర్రజీరలు కదలగా ఉరిమిచూశాడు దేవరాయలు..
“ఎక్కడ ఉన్నా, ఎవరి అధీనంలో ఉన్నా ఏ సౌందర్యవతి కూడా మా ఆస్థానంలో తప్ప మరెక్కడా ఉండడానికి వీల్లేదు.. వెంటనే ఆమె వివరాలు తెలియచేయండి…”
“చిత్తం… ఆమె తండ్రి కడుపేద… ఆయన భార్య, కుమార్తె ప్రార్ధల, ఆమె అన్నగారు, తమ్ముడు ఇందరు ఆ ఇంట్లో ఆ పేద తండ్రిపైన ఆధారపడి ఉన్నారు… ఆ పార్ధల పెళ్లీడుకు వచ్చింది… ఆమెకి పెళ్లి కుమారుడిని అన్వేషించమని శంకరుడు నన్ను వేడుకున్నాడు… అంతటి సౌందర్యవతి, విద్యావతి మీ ఆస్థానంలో కాక మరెక్కడో ఉండడం ఎంతమాత్రం తగదని ఆమె గురించి తమరికి విన్నవించడానికి వచ్చాను…”
“ఊ….” దేవరాయలు తలపంకిస్తూ పచార్లు చేస్తూ పార్టీల రూపం కళ్లముందు నిలుపుకోడానికి ప్రయత్నించసాగారు… బంగారు వర్ణంతో, నీలాల వంటి కురులతో, కమలముల వంటి కన్నులతో, సమ్మోహనపరిచే చిరునవ్వుతో పార్ధల అలా మేఘాల్లో విహరిస్తూ కొంటెగా నవ్వి వెళ్లినట్టు తోచింది. ఆయన మనసులో శృంగారభావనలు వెల్లువెత్తాయి…
“ఆచార్యా వెంటనే ఆమెకి పల్లకి ఏర్పాటు చేయండి… రత్నాభరణాలు, పట్టుపీతాంబరాలతో సగౌరవంగా ఆమెని తోడ్కొని రండి… ఆమెని నా రాణిగా చేసుకుంటానని ఆమె తండ్రికి తెలియచేయండి… వెంటనే వెళ్లండి…”
గంభీరంగా ప్రకటించిన ఆ ఆజ్ఞ శిరసావహిస్తూ తల వంచి అభివాదం చేసి “చిత్తం మహారాజా” అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు తిరుమలాచార్యులవారు ..
అప్పటిదాకా ఆహ్లాదపరచిన ఆ వాతావరణం తిరుమలాచార్యులవారు వర్ణించిన పార్ధల సౌందర్యాస్వాదనలో విరహవేదన కలిగిస్తూ వేడి, ఆవిర్లు ముప్పిరిగొన్నట్టు ఉక్కిరి బిక్కిరి చేసింది… అప్పటికప్పుడే ఆమె పట్ల మోహం అంకురించింది.. “అంతటి సౌందర్యవతా!” మందహాసం మెరిసింది ఆయన పెదవులపైన. “అంతటి సౌందర్యవతి పేదవాడి ఇంట ఉండడమా… ఊహు… ఎంత మాత్రం తగదు… ఈ దేవరాయల సామ్రాజ్యంలో పరిచారికల సేవలందుకుంటూ ఈ మహారాజు మరుల మత్తులో ఇహపరాలు మర్చి తరించిపోవాలి… అయినా ఆచార్యులవారు అంతగా వర్ణించిన ఆ యువతి నిజంగా అపురూప సౌందర్యవతేనా? లేక ఆచార్యులవారు తమ మెప్పుకోసం, తాము అందించే కానుకలకోసం అతిశయోక్తులు పలికారా? లేదు… అలా జరిగి ఉండదు… ఇంతకు పూర్వం ఎందరో కన్యల సౌందర్యం తమకు తెలియచేసి వారందరికీ రాణీవాసం కల్పించిన ఆచార్యులవారు అతిశయోక్తులు పలికి ఉండరు.
‘అయినా తనే ఒక్కసారి ఆమెని కనులారా స్వయంగా చూడవచ్చుకదా… అవును దానికింత ఆలోచన దేనికి?’ ఆలోచన వచ్చిందే తడవుగా దేవరాయలు తమ అంతపురానికి వడివడిగా సాగిపోయాడు.
ఆ రాజ్యంలో ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోడానికి గూఢచారులను నియమించడమే కాక, కొన్ని సందర్భాల్లో రాజులు మారువేషంలో సంచరిస్తూ తామే స్వయంగా కొన్ని విషయాలు గమనించడం మామూలు… అలాగే రాయలవారు ఇప్పుడు కూడా మారువేషం ధరించి అశ్వారూఢుడై ముద్గల్ వైపుగా ప్రయాణం సాగించాడు… ఆ రాత్రి విజయనగర సామ్రాజ్యానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముద్గల్‌లోకి దేవరాయలు ఎంతో ఉత్సాహంతో, కుతూహలంతో బయలుదేరి తెల తెలవారుతుండగా ముద్గల్ చేరాడు.
మారువేషంలో ఉన్న రాజు అశ్వాన్ని ఎవరూ చూడని ఒక ప్రదేశంలో నిలిపి కాలినడకన ఒక బాటసారిలా బయలుదేరాడు… ఆ స్వర్ణకారుడి ఇల్లెక్కడ ఉందో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు… కానీ, ఏ వంకతో ఆ ఇంటికి వెళ్లి పార్ధలను చూడాలో ఆలోచించాడు… ఆలోచనలతో నెమ్మదిగా నడుస్తున్న ఆయనని చూసిన కొందరు ‘ఎవరో కొత్తవ్యక్తి ముద్గల్ చేరాడు’ అనుకుంటూ ఎవరింటికి వెళ్లాలో వాకబు చేయసాగారు.
తాను స్వర్ణకారుడైన శంకరుడి బంధువునని, చాలా కాలం క్రితం దేశాలు పట్టి పోయానని, ఆ కుటుంబాన్ని చూసి, పలకరించిపోడానికి వచ్చానని చెప్పాడు రాజు…
ఆ పలుకులు నమ్మిన కొందరు గ్రామవాసులు రాజుగారికి స్వర్ణకారుడి ఇంటికి దారి చూపించారు…
అయితే, బహమనీ సుల్తాను నియమించిన గూఢచారులకు మాత్రం ఆ అపరిచిత వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది… ఆయన ఎవరో, ఎక్కడ చూశారో అర్థంకాక తమలో తామే మధనపడుతూ, ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్టుంది అనుకుని తీవ్రంగా ఆలోచించసాగారు…
దేవరాయలు మారువేషంలో స్వర్ణకారుడి ఇంటికి వెళ్లాడు… ఎత్తైన అరుగుమీద కొలిమి ఉంది… దానిముందు ఒక వ్యక్తి కూర్చుని కొలిమిలో బంగారం చక్కటి ఆకారంలో వంచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన పక్కనే ఓ నడివయసు స్త్రీ కూర్చుని కొలిమి ఊదుతోంది. రాజు మెల్లిగా అతనిని సమీపించాడు… తలెత్తి పరపురుషుడిని చూసిన ఆమె లేచి చీర తల మీదుగా ముఖం మీదికి జరుపుకుని లోపలకు వెళ్లింది… రాజు అరుగుమీద ఆసీనుడై ‘శంకరుడంటే’ అంటూ సందేహంగా ఆగిపోయాడు..
అతనివైపు చిత్రంగా చూస్తూ ‘నేనే శంకరుడిని’ అన్నాడు స్వర్ణకారుడు.
రాజుకి ఆనందంగా అనిపించింది తన శ్రమ వృధాపోలేదు… ‘చేరాల్సిన చోటుకి చేరాను’ అనుకున్నాడు.
“ఇంతకీ తమరెవరు?” అడిగాడు శంకరుడు అనుమానంగా.
“నేనొక బాటసారిని… దాహంగా ఉంది కొంచెం మంచినీరు కావాలి” అన్నాడు రాజు. శంకరుడు లోపలికి తొంగిచూస్తూ ‘పార్ధలా’ అని పిలిచాడు…
రాజు కుతూహలంగా లోపలికి దృష్టి సారించాడు.. కాలి మువ్వలు మృదు మధురంగా సవ్వడి చేశాయి… ఓ పరిమళం గాలిలో తేలి రాజుగారి నాసికాపుటాలను తాకింది. పులకితాంతరంగుడైన రాజు పరవశంగా కళ్లు అరమూశాడు… బంగారు తీగలాంటి యువతి గుమ్మం అవతలే నిలబడి “చెప్పండి నాన్నగారూ” అంది వీణ మీటినట్టు.
“బాటసారికి చల్లని మజ్జిగ తేట ఇవ్వమ్మా…” చెప్పాడు శంకరుడు…
“అలాగే నాన్నగారూ…” ఆమె వెళ్లిపోయింది… ఓ మెరుపు మెరిసి అంతర్ధానమైనట్టు అనిపించింది రాజుకి.
“తమరి నామధేయం” అడిగాడు స్వర్ణకారుడు.
రాజు చెప్పేలోపలే తిరిగి మువ్వల సవ్వడితో పార్ధల ప్రవేశించి నాజూకైన అందమైన చేయి చాచి, మజ్జిగతో నిండిన రాగిచెంబు రాజుగారి ముందు పెట్టి తలవంచుకుని లోపలకు వెళ్లిపోయింది…
ఆ కొన్ని క్షణాల్లోనే అపురూపమైన ఆమె లావణ్యం రాజు మనసు దోచింది… తిరుమలాచార్యులవారు కొంతే వర్ణించారని… ఎంత వర్ణించినా తరగని సౌందర్యం అనీ అనిపించింది ఆయనకు… ఆమె చేతి స్పర్శతో నిండిన ఆ రాగి చెంబు అపురూపంగా అందుకుని, మజ్జిగ తాగాడు… చల్లని మజ్జిగ అమృతంలా అనిపించింది… అప్పటికప్పుడే ఆమెని అపహరించుకుపోవాలనిపించింది రాజుకి… ఇంతలో బయట కలకలం వినిపించింది… బహమనీ సైనికులు కొందరు స్వర్ణకారుడి ఇంటివెపు రాసాగారు… రాజుకి అర్థమైంది… గూఢచారులు తనని ఆనవాలు పట్టారు… తానిక్కడ నుండి వెంటనే వెళ్లిపోవాలి… చటుక్కున లేచిన రాజు స్వర్ణకారుడితో అన్నాడు..
“శంకరా… నీ కుమార్తె పార్ధలకు విజయనగరరాజు నుండి పల్లకీ వస్తుంది… ఆమెని రాణీవాసానికి తోడ్కొని రావడానికి పరివారమంతా వస్తుంది… ఆమెని సిద్ధంగా ఉంచు…” అంటూనే ఆగకుండా వేగంగా అక్కడినుండి కదిలి గోడదూకి అదృశ్యమైనాడు…
అప్పటికే స్వర్ణకారుడి ఇంటి ముందుకు వచ్చిన గూఢచారులు “ఎక్కడ మహారాజు?” అని అతడిని ప్రశ్నిస్తూ ఆ ప్రదేశమంతా కలయతిరగసాగారు…