[box type=’note’ fontsize=’16’] సమయంతో మనం పోటీ పడకూడదని, దాని కనుకూలంగా తిరగాలని ‘తెలిసొచ్చింది’ అంటున్నారు జయంతి వాసరచెట్ల. [/box]
[dropcap]అం[/dropcap]కెలు పన్నెండు
వందంకెల జీవితానికి దిగ్సూచికలు!!
జనన మరణాలు,జీవన గమనాలను
నిరంతరం కళ్ళముందు నిలబెట్టే
కారకాలు!!
అవి రెండే
వాటి పని అవి చేసుకు పోతాయ్
నియమ నిబద్దతలు పాటిస్తూ
సాగిపోతాయ్….మనకు
నడతనేర్పిస్తాయ్ .!!
అమ్మ పొత్తిళ్ళలో మొదలైన
మధుర క్షణాలను
ఆప్యాయత అనురాగాలు
అందుకున్న
పరిమళాలను
అనుక్షణం గుర్తు చేస్తుంటాయి
సూచికలు!!
ఎదిగే కొద్దీ…..
ఎదురైన అన్ని క్షణాలను
నా డైరీలో
ప్రతీరోజూ వాసనలు వెదజల్లుతూ
ఉంటాయి!!
పేరుకు మాత్రం సమయం
అంటే….
అందరిలో ఒక గౌరవం…!!
శాసనాలు చేయదు…..
సందర్భాలను గుర్తుచేస్తుంది అంతే!!
తీపి జ్ఞాపకాలు ఉన్నప్పుడు
మనసు ఊహల జలపాతాలనడుమ
విహరిస్తున్న అనుభూతిని
పంచుతుంది….!!
మొన్న ఆమధ్య
జరిగిన ఘోరం
సమయం అంటే అసహనం
ఏర్పడింది…!!
తప్పులన్నీ మనవే
అది అక్షర సత్యం!!
జరిగిన ఘోరం అలాంటిది
మరి
వారు
ఇద్దరు మల్లెపొదరింటిని
అల్లుకున్నారు !!
మల్లె మొగ్గలు పూయించారు
అవీ రెండే
పరిమళాలు వెదజల్లే
పారిజాతాలు!!
అతను చక్కటి తీగను
వదిలి తనను అల్లుకున్న తీగను
అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోయాడు!!
ఎంత విచిత్రం
నిన్న నందనవనం
తలపించిన అదేసమయం
నేడు విలపిత కుసుమాన్ని
పరిచయం చేసింది!!
దానిదేమీ తప్పులేదు
దాని పని అది చేసుకుపోతుంది!!
మోడువారిన తీగ మీటితే
శోక సంద్రంలో ని హోరు
గానం వినిపిస్తుంది!!
అది వినడానికి కర్ణకఠోరంగా తోస్తుంది!!
ఇప్పుడు తెలిసొచ్చింది
ఆ రెండు ముల్లుల ప్రాధాన్యత
దేనికదే అని
సెకను కాలాన్ని చూపినా
నిముష వేగాన్ని చూపినా
దేని విలువ దానిదేనని
ఒక ముల్లు లేకపోయినా ఆ గడియారం
విలువ లేనిదని!!
సమయంతో మనం
పోటీ పడకూడదని
దాని కనుకూలంగా
తిరగాలని
తెలిసొచ్చింది.