[box type=’note’ fontsize=’16’] అర్హతను బట్టే గౌరవం ఇవ్వడం సముచితమని చెప్పే బాలల కథని అందిస్తున్నారు ఆదూరి హైమవతి. [/box]
[dropcap]పూ[/dropcap]ర్వం ప్రశాంతపురం అనే రాజ్యాన్ని ప్రమోదవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన చాలా ఉత్తముడు. తన ప్రజలను ఎంతో ప్రేమించేవాడు. తన ఆస్థానంలోని పెద్ద చిన్న ఉద్యోగులందరినీ సమానంగా గౌరవించి, ఆదరించేవాడు. చిన్న ఉద్యోగులు సైతం సక్రమంగా పనిచేస్తేనే తాను రాజ్య పాలన సజావుగా చేయగలనని ఆయన నమ్మకం.
తన రథసారథి సాకేతును సైతం మర్యాదగా పలకరించి గౌరవించేవాడు. దాంతో అతడు చాలా గర్వంతో, తోటి ఉద్యోగులనే కాక ఆస్థానంలోని పెద్ద ఉద్యోగులనే కాక మహామంత్రిని సైతం లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాడు. ఇదంతా గమనించిన మహామంత్రి ఒకమారు వారిరువురు మాత్రమే రాజోద్యానంలో విహారం సలిపే సమయంలో “మహా ప్రభూ! మీ మనస్సు చాలా గొప్పది. కానీ అందరినీ ఒకే రీతిలో మన్నించి, గౌరవించడం వల్ల వారు మితిమీరి ప్రవర్తించే అవకాశం ఉండవచ్చు. ఎవరి కెంత గౌరవం ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వడం సముచితం. ఆలోచించండి ప్రభూ!” అన్నాడు.
దానికి మహారాజు “మీరు దీన్ని గురించీ మరీ ఎక్కువ భయపడుతున్నట్లున్నారు. మరేం చింతించకండి మహామంత్రీ! దీన్ని గురించీ పెద్దగా ఆలోచించకండి” అంటూ దాటవేశాడు.
మహామంత్రి సారథిపై ఒక వేగును నియమించి తగు జాగ్రత్త వహించాడు. సారథి మహారాజు రథం ఎక్కేప్పుడు పాదాలుంచే చోటును తన పై పంచతో తుడవడం, రాజుగారి అరికాళ్ళను, పాదుకలనూ పైపంచతో తుడవడం వంటివి చేస్తూ మహారాజు మనస్సులో మంచి స్థానం సంపాదించాడు. రాజుగారి వద్ద మంచి పలుకుబడి, ఆయన ప్రేమా దండిగా సంపాదించాడు. దాన్నిసొమ్ము చేసుకోడం కూడా సాగించాడు. చిన్నా పెద్ద ఉద్యోగుల వద్దే కాక, ప్రజలందరినీ కూడా భయపెడుతూ ‘మహారాజుకు చెప్తాను’ అని బెదిరిస్తూ బాగా సొమ్ము సంపాదించి, ఊరికి ఉత్తరాన స్మశానాలుండే చోట ఒక పెద్ద మూడంతస్తుల చిత్రమైన భవనం నిర్మించుకున్నాడు. మరో మహారాజ భవనం లాగా. మహారాజు ఎప్పుడూ ఆ ప్రేతభూమికి రాడని అతడి నమ్మకం. ఇదంతా బాగా తెలుసుకుంటున్న మహామంత్రి ఒక రోజున మహారాజును అశ్వాల మీద విహారంగా వెళుతున్నట్లు అక్కడికి తీసు కెళ్ళాడు. రథం మీద రానందున సారథికి ఇది తెలియదు.
మహారాజు ఆ చిత్రమైన భవతిని చూసి ఆశ్చర్యంగా”మహామంత్రీ! ఎవరిదీ చిత్రమైన భవనం! మేమే ఎన్నడూ బయటికే ఇంత చిత్రంగా, శోభాయమానంగా ఉండే భవనాన్ని చూడలేదు” అన్నాడు. ఏమీ తెలియనట్లు మహామంత్రి, దాపుననే ఉన్న ఒక సైనికుని ” ప్రియ సేవకుడా! ఈ భవంతి ఎవరిదో వెళ్ళి సత్వరం తెల్సుకురా!” అని పంపాడు.
అతడు కొద్ది సేపట్లోనే తిరిగి వచ్చి “మహాప్రభూ! ఇది సాకేత వర్మ మహా రాజుదిట” అనిచెప్పాడు. వెంటనే మహారాజు “ఎవరా సాకేతవర్మ! మాలాగా వర్మ అనే నామంతో, మాకు తెలీకుండా ఇక్కడ ఇంత పెద్ద భవనం ఎలా నిర్మించుకున్నాడు? భవన నిర్మాణానికి సమ్మతి పత్రాన్నెలా పొందాడు? ఆ విదేశీయుడెవరో తెల్సుకుని మా సమ్ముఖానికి తేవలసిందిగా ఆదేశించండి మహా మంత్రీ !” అని వెనుదిరిగాడు.
మహామంత్రి రెండు ఘడియల్లోనే, సాకేతవర్మ మహారాజును, మహారాజు ముందు హాజరుపరిచాడు. అతడ్ని చూసి మహారాజు ఆశ్చర్యంగా “సాకేతా! ఆ చిత్రమైన భవనం మీదా! ఎలా అంత ధనం సంపాదించావు?” అని అడిగాడు. దానికి సమాధానం చెప్పలేని సారథి మౌనంగా తలవంచుకున్నాడు. మహారాజు మహామంత్రి కేసి చూసి “మహామంత్రీ! ఇది ఎలా సంభవమైందో విషయ సేకరణ చేయండి” అన్నాడు. మహామంత్రి మరో మూడు ఘడియల్లోనే వేగులను పంపి విషయమంతా సేకరించి మహారాజుకు చెప్పాడు. “మహారాజా! మీరిచ్చిన మర్యాద, గౌరవం ఇతడు సొమ్ము చేసుకుని, ప్రజలందరినీ, రాజోద్యోగులనూ సైతం మీ పేరు చెప్పి భయపెట్టి సొమ్ము రాబట్టి ఆ భవనాన్నినిర్మించుకున్నట్లు సమాచారం” అన్నాడు.
“మహామంత్రీ! మీమాట వాస్తవం. ఎవరికెంత మర్యాద ఇవ్వాలో దానికి మించి ఇస్తే ‘కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్లు‘ ఇలాంటివి సంభవించవచ్చని మీరు హెచ్చరించినా నేను విన్నాను కాను. వెంటనే ఇతడ్ని రాజ బహిష్కరణ చేయించండి” అన్నాడు ఆగ్రహంతో.
మహామంత్రి “ప్రభూ! వద్దు. మనరాజ్య రహస్యాలన్నీ బహిర్గతం చేయవచ్చు. ఇతడి భవనాన్ని అతిథుల విశ్రాంతి భవనంగా మార్చి, ఇతడికి రెండెకరాల పొలం ఇచ్చి దానిలో పని చేసి సగ భాగం పన్ను క్రింద కట్టి, జీవించే లాగా ఏర్పాటు చేయండి. ఇదే ఇతడికి తగిన శిక్ష” అన్నాడు మంత్రి. రాజు దాన్నిఅమలు పరచి, అప్పటి నుంచీ ఏ ఉద్యోగికి ఎంత మర్యాద ఇవ్వాలో అంతే ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.
నీతి- అర్హతను బట్టే గౌరవం ఇవ్వడం సముచితం.