[box type=’note’ fontsize=’16’] “విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య సృష్టిని గూర్చిన పరిశీలన ప్రారంభమై దాదాపు అర్ధశతాబ్దం దాటుతూ వున్నా ఇంకా స్పష్టమైన సమన్వితమైన దృష్టి విమర్శకులకు ఏర్పడలేదనే చెప్పాలి” అంటున్నారు కోవెల సుప్రసన్నాచార్య “విశ్వనాథ వాఙ్మయాధ్యయనం – సమన్విత దృక్పథం” అనే ఈ వ్యాసంలో. [/box]
[dropcap]ఒ[/dropcap]క మహారచయితను అధ్యయనం చేయడం విమర్శకుడికి విలక్షణమైన అనుభవం. ఆ రచయిత అసామాన్యుడై – ఇతిహాస నిర్మాతయై – యుగాన్నంతా తన చైతన్యంతో ఆవరించగల వాడైతే విమర్శకుడు తనకు అలవాటైన పద్దతులను పరిమాణాలను మార్చుకోవలసి ఉంటుంది.
ఇలాంటి రచయిత సామాన్య స్థాయిలో కాక జాతి సామాజిక సాంస్కృతిక చైతన్యాన్ని తనలోకి ఆకర్షించి తన బహుముఖ ప్రజ్ఞ ద్వారా దాన్ని వ్యక్తంచేస్తూ ఒక మహా వటవృక్షంలాగా ఎదిగి పోతాడు, ఆ వృక్షం అన్ని దిశలను ఆక్రమిస్తూ అనంత కాలం నిలచి ఉంటుంది. ఇలాంటి సన్నివేశం ఎక్కడైనా అరుదుగా సంభవిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ భారతీయ సాహిత్యంలో ఇట్టి అరుదైన ఆవిష్కారం.
విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య సృష్టిని గూర్చిన పరిశీలన ప్రారంభమై దాదాపు అర్ధశతాబ్దం దాటుతూ వున్నా ఇంకా స్పష్టమైన సమన్వితమైన దృష్టి విమర్శకులకు ఏర్పడలేదనే చెప్పాలి. విమర్శకులలో అనుకూల ప్రతికూల వైఖరులు ప్రధానంగా వ్యక్తమయ్యాయే తప్ప రచయిత యొక్క ప్రాణమూలాన్ని అందుకునే ప్రయత్నం అంతగా జరుగలేదు. ముప్పైలలో జొన్నలగడ్డ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులు, అడవి బాపిరాజు, ఆచంట జానకీరాం, సంపత్ రాఘవాచార్య, జి.యన్. చౌదరి, కొంపెల్లి జనార్ధనరావులు; నలభైలలో దేవులపల్లి రామానుజరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి, వంగల శ్రీ రామఅవధాని, నండూరి బంగారయ్య, వి.వి. రామనాథంలు, మధునా పంతుల; యాభై లలో దివాకర్ల వేంకటావధావి, పొట్లపల్లి సీతారామారావు, ధూళిపాళ శ్రీరామమూర్తి, కేతవరపు రామకోటిశాస్త్రి, శ్రీ దేవి వంతరాం రామకృష్ణారావు. సంపత్‌కుమారాచార్య, జువ్వాడి గౌతమ రావు, సాళ్వ కృష్ణమూర్తి, నాగభూషణశర్మ, కొత్త సత్యనారాయణ చౌదరి, నార్ల వెంకటేశ్వర రావు, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, ఉషశ్రీ, కోటగిరి విశ్వనాథరావు, ప్రతివాది భయంకరం వేదాంతాచార్యులు; అరవై లలో ఆరుద్ర, పి.వి.నరసింహారావు, అద్దేపల్లి రామమోహనరావు, పేరాల భరతశర్మ, నాయని కృష్ణకుమారి, తుమ్మపూడి కోటేశ్వర రావు, జి.వి. సుబ్రహ్మణ్యం, శేషేంద్ర, ఆర్.ఎస్. సుదర్శనం; తరువాతి కాలంలో పాములపర్తి సదాశివ రావు, ఏటుకూరి బలరామమూర్తి, మందేశ్వరరావు, వీరభద్రయ్య, ముదివీడు ప్రభాకరరావు, భూమయ్య రాఘవన్, శరావతి శివరావు, రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు, శ్యామలా దేవి, సువర్చల, ప్రభృతులు విశ్వనాథ వాఙ్మయాన్ని గూర్చి ఎన్నో అంచుల నుంచి పరిశోధన పరిశీలన చేస్తూ వున్నారు. (ఈ వరుసలో పేర్కొనని రచయితలు ఇంకా చాలామందే ఉన్నారు.)
ఈ సమీక్షలలో ఎక్కువభాగం రచయితకు లేదా అయన ఒకానొక రచనకు సంబంధించిన పరిచయాన్ని లేదా పరిశీలనను చేసేవి. సంవిధాన శిల్పాన్ని ప్రశంసించేవి. నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి మొదలైన గ్రంథాలలో విశ్వనాథ చెప్పిన విధంగా ఆయన రచనలలోని కథా కథన వైఖరిని పరిశీలించేవి.
అనుకూల ప్రతికూల విమర్శలలో చాలా భాగం, ఆదిలో ఏర్పడ్డ కొన్ని నిర్దేశక భావాలు ప్రాధాన్యం వహించాయి. అవి యివి –
- విశ్వనాథ భాష చాలా క్లిష్టమైంది. ప్రౌఢమైంది. సంస్కృత సమాస బంధురమైంది.
- విశ్వనాథ దృక్పథం వైదిక ధర్మోద్దరణ లక్ష్యంగా కలది. బ్రాహ్మణ వ్యవస్థా సమర్థన కలది.
- విశ్వనాథ సమాజ దృక్పథం అభివృద్ధి నిరోధకమైంది. జమీందారీ వ్యవస్థను సమర్థించేది.
- విశ్వనాథ సాహిత్యంలో శిల్పం, సంవిధానం, సమయోచిత రచనా ప్రాగల్భ్యం అపూర్వం, బహుశాస్త్ర వైదుష్యం ఆయన రచనలో వ్యకమవుతున్నది.
- విశ్వనాథ ప్రతిపాదించిన ‘జీవుని వేదన’ భావం జీవ చైతన్యమూలాన్ని స్పృశించేది. అద్వైత దర్శనం ఆయన రచనలకు లక్ష్యం.
- ఆయన రచనలలోని వైవిధ్యం అనితరసాధ్యం, పాత్ర పోషణ వర్ణనలు ఆయనను సమకాలీనులందరికంటే ఉన్నతుడిగా నిలబెడుతూ ఉన్నవి.
- విశ్వనాథ రచనా దృక్పథం ఆధునికతా నిరోధకమైంది.
- విశ్వనాథ రచనాలక్ష్యం విశ్వజనీనమైంది. సార్వకాలికమైంది.
ఇప్పటిదాకా వెలువడ్డ విశ్వనాథ సాహిత్యమంతా సుమారు ఈ ధోరణులు ఆధారంగా వెలువడిందే. ఇంకా వెలువడుతూనే ఉంది. అయితే ఈ యుగాన్ని అంతా ఆవరించిన విశ్వనాథను ఈ అంచనాలలోకి ఇముడ్చటం సాధ్యంకాదు. ఆయనను అధ్యయనం చేసేందుకు సరికొత్త ప్రమాణాలను అంచనాలను సిద్ధం చేసుకోవాలి. అయితేనే ఈ విమర్శలు ఒక కొలిక్కి వస్తవి. ప్రయోజనాన్ని సాధిస్తవి.
విశ్వనాథ ఈ శతాబ్దపు రచయిత. తత్పూర్వయుగాలలోని మహాకవులను దాటిన ఆధునిక కాలచైతన్యం ఈయనను ముంచెత్తింది. విశ్వసాహిత్యంలోని ఆద్యంతం ఆధునికమైన ధోరణులు ఆయనను ప్రభావితం చేశాయి. ఆధునిక భావోద్యమాలు ఆయన చైతన్యంలో భాగం పంచుకున్నాయి. మన దేశంలోని జాతీయోద్యమంలో తిలక్, శ్రీ అరవిందులు, గాంధీ ప్రవర్తించిన కాలంలో ఆయన యౌవనం రూపొందింది. శ్రీ రామకృష్ణులనుండి వివేకానందులదాకా సాగిన పునరుజ్జీవనోద్యమ లక్షణం ఆయనను ప్రభావితం చేసింది.
విశ్వనాథ పుట్టి పెరిగింది పల్లెల్లో. భూమితో వ్యవసాయంతో సంబంధం ఉన్న కుటుంబం. వాళ్ళ పూర్వులు గ్రామాన్ని పొందించి నిలబెట్టినవాళ్ళు, గ్రామంలోని అన్ని కుటుంబాలతోనూ ఆత్మీయమైన అనుబంధం ఉండి వాళ్ళ కష్టసుఖాల్లో భాగస్వామ్యం పంచుకున్న వ్యక్తిత్వం ఆయనది. అక్కడి చెట్లు, మొక్కలు, పూలు, గాలి, మబ్బులు, పిట్టలు, పాములూ అన్నీ ఆయన స్వాయత్తీకరించుకొన్నవే. ఈ చేతనాచేతన జగత్తులోని ప్రతిస్పందమూ ఆయనను కదలించింది. సాంద్రత ఆయనలో నిలిచిపోయింది. చెలియలికట్టలో సముద్రమూ, ఏకవీరలోని వేగై నదీ, స్వర్గానికి నిచ్చెనలలో పర్వతము, వేయిపడగలలో వెన్నెల రాత్రులూ పాత్రలే అయినవి.
పల్లెల్లోని వినోదాలు, జానపద గీతాలూ, రూపకాలు, హరికథలూ ఈ వాతావరణమంతా ఆయన మనస్సును పట్టుకొన్నది. మెట్టపొలాలు – కాలువలు వచ్చి మాగాణి పొలాలుగా మారడం, పల్లెల్లో వాతావరణంలో వచ్చిన మార్పుల – మూల్యాల పరివర్తన వల్ల కలిగిన అసంతులనం ఆయననూ అంతస్సుల్లో విహ్వలుణ్ణి చేసింది.
ఆయన ఉపమానాలు, కల్పనలు, ప్రతీకలు, ప్రాగ్రూపాలు – అన్నీ ఈ వాతావరణంలో నుంచి వచ్చినవే. ఆయన రచనల్లో సర్ప ప్రతీకలు ఎక్కువ. అందుకే పసరికను ఆయన సృష్టించగలిగాడు. కిన్నెరసాని ఆయన కథా పాత్ర అయింది. అనార్కలిలో చిలుకలు, కోకిలలు మాట్లాడాయి. ‘వేయిపడగలు’లోని పృషన్నిధీ, ఆది వటమూ, గణాచారీ, ‘ఏక వీర’ లోని గుఱ్ఱపువాళ్ళ పిల్ల అమృతమూ, త్రిశూలంలో నీల…. ఇలాంటి పాత్రలన్నీ ఈ ప్రకృతిలో నుంచి పుట్టినవే.
ఆయన భాష పల్లెల్లో ఇంకా ఇంగ్లీషు వాసన సోకనినాటి భాష. అందువల్లనే ఆయన వాడినన్ని తెలుగు మాటలు, పలుకుబడులు, వాక్యభేదాలు మరే కవి, రచయితా వాడలేదేమో! ఆ వ్యవహారంలో నుండి సజీవమైన శైలిని ఆయన నిర్మించుకున్నాడు.
ఆ జీవన విధానంలోని సహజమైన మానవీయ మూల్యమైన కరుణ ఆయన రచనకంతటికీ మూలద్రవ్యం. ఈ కారుణ్యం ఆయన రచనలంతటికీ మూలాధారంగా అట్టడుగున ప్రవహిస్తూ ఉంటుంది. అన్ని రచనల్లోనూ ఎంతటి పాత్ర పైన కూడా ఎక్కడో అట్టడుగున కారుణ్యం చూపిస్తాడు. అందువల్లనే ఆయన రచనల్లో ఎక్కువ దుఃఖంతోనే పూర్తవుతవి. శ్రీ మద్రామాయణ కల్పవృక్షంలోనూ అందరి రాక్షసుల యందు శ్రీరామచంద్రుడు అపారమైన దయను ప్రసరింపజేస్తాడు. రాక్షస వధానంతరం ప్రతిసారి ఆయన పొందే దుఃఖము ఇందుకు ఒక సూచన. అత్యంత దుష్టపాత్రలోనూ ఎక్కడో ఒక ఉదాత్త లక్షణం మెరపులాగా మెరుస్తూ గోచరిస్తుంది.
ఇంక ఆయన వ్యుత్పన్నత, సకలాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి ఆయన నిత్య జాగ్రద్దశలో ఉండేది. హృదయంలో సకల శాస్త్ర రహస్య వివేకమూ చప్పున స్పురించేది. సంస్కృతాంధ్రాల్లోనే కాక ఇంగ్లీషు ద్వారాను ఆయన అందినంత మేరకు, చదవగలిగినంతగా అన్ని శాస్త్రాలు చదివాడు. ఈ బహుముఖ వ్యుత్పన్నత ఆయన గాఢ ప్రతిభవల్ల యథాస్థానంలో రచనావేళ సాక్షాత్కరించేది.
ఆయన రచనా జగత్తులోని సమకాలీనులకంటే ఆలస్యంగా ఇరవై రెండోయేట 1917లో ‘ఆంధ్ర పౌరుషం’తో సాహిత్య రంగం మీదికి ప్రవేశించాడు. దాదాపు పాతిక సంవత్సరాలు అప్రకటితంగా ఆయన రచనా భ్యాసం సాగింది. తెలుగు పద్య విద్యను ఆపోశన పట్టి స్వతంత్రమైన రీతిని ఆంధ్ర ప్రశస్త్రి (1925) నాటికి ఏర్పరచుకున్నాడు. నాటి రచనల్లోనే తెలుగు సత్కవిరాజు (కిన్నెరసాని పాటలు), మహాకవి (నర్తనశాల, అనార్కలి) అని తనకు తాను ప్రకటించుకోగలిగిన ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడు. గిరికుమారుని ప్రేమ గీతాల్లో భావికవులకు మార్గోపదేశకమైందిగా రూపొందబోతున్నట్లు తన రచనను వర్ణించుకున్నాడు.
దేశిలో కిన్నెరసాని పాటలూ, మార్గపద్దతిలో మిగిలిన రచనలూ సాగాయి. శైలిలో వైవిధ్యం పెంపొందింది. కవిత్వాన్ని ఏదో ఒక నియత లక్షణానికి కట్లుబడేట్లుగా కాక, వస్తు వైవిధ్యంవలె శైలీవైవిధ్యాన్ని కూడా విశ్వనాథ రూపొందించాడు.
తేనెల్ వాఱును మేఘగర్జనలు వీతెంచున్, పికీకన్యకా
నూన వ్యాహృతి మాధు పంచమము చిందున్, ద్యోనదాంభః కణ
శ్రీనృత్యంబులు చూపు మత్కవిత –
ఆందువలన దాని వైవిధ్యం ఏదో ఒక మార్గానికి, అభిరుచికి పట్టుబడ్డ వైఖరికి దూరమైంది. అవ్యక్తమైన ఒక అన్వేషణ దాని వస్తువైంది.
ఈ యనిలాధ్వమెల్ల నినదించిన మువ్వల మ్రోతదూరమై
పోయిన గోతతిన్ పిలుచుపోలిక ఏదో వినిస్వనించెడున్.
ఈ కారణంగా విశ్వనాథ కవిత ఇరవైల చివరనే వివాదాస్పదంగా మారింది. సాహితీ సమితి పరిధిలో ఆయన ఇముడలేకపోయాడు. తన కవిత ఒక జలపాతం. మనోద్వారాలు తెరిస్తే అవ్యక్తం నుంచి ప్రవహిస్తూ పోతుంది. వ్యక్త చైతన్యం పని దాన్ని రూపుకట్టించడమే. వ్యక్త దశలో దాన్ని వర్ణించడం కష్టం.
నా కవితన్ విశాల జఘనా, ఒక ఔచితిలేదు, భాషలే,
దాకృతిలేద – ఊరక రసాకృతి నే ప్రవహించిపోదు – (శృంగార వీథి; స్నానసుందరి)
అంటే అవ్యక్త చైతన్య ప్రవాహం అంతగా త్రోసుకు వస్తున్నదని తాత్పర్యం. ‘నా చేతము శబ్ద మేరుటకు చిన్నము నిల్వదు భావతీ వ్రతన్’ – (రా.క. బాల. అవ, 24) అని చెప్పినచోట ఈ ప్రవాహ తీవ్రత వ్యక్తమవుతుంది.
రచనా వేళలో అంతగా తన వ్యక్తిత్వాన్ని పరిత్యజించుకోగలుగటం వల్లనే విశ్వనాథ అవ్యక్తంలోంచి సామూహిక అవచేతనలోనుంచి ఎక్కువ ప్రతీకలను, ప్రాగ్రూపాలను రూపుకట్టించి విశ్వజనీనతాస్థితిగల రచయిత అయినాడు. అందువలనే ఇలాంటి రచయితలు తమను గూర్చి చెప్పుకోగలిగినది కూడా పరిమితంగానే ఉంటుంది. అప్పుడప్పుడు వీరు తమను గురించిన తాము చేసిన అంచనాలు తప్పిపోవడం కద్దు. ఏ రచయిత వ్యష్టిచైతన్యం ద్వారా అవచేతనలోనుంచి, సమష్టి అవచేతనలో నుంచి ఎక్కువ భాగాన్ని గ్రహిస్తాడో అతని రచనా క్రమంలో వివశ దశ ఉంటుంది. అతని వ్యుత్పన్నత ఆ ప్రవాహానికి ఒక స్వరూపాన్ని ఇవ్వడంలో తోడ్పడుతుంది. అతడు తన కాలాన్ని దేశాన్ని దాటి విశ్వజీవనంలోని అనంత రహస్యాలను తన రచనల్లో వ్యాఖ్యానిస్తాడు. ఇవన్నీ కాలాంతరాన ఆయా పరిస్థితుల ప్రభావంవల్ల సమాన ధర్ములకు స్ఫురిస్తూ వుంటాయి. అలా ఈతని రచనా ప్రపంచం క్రమక్రమంగా వివృతమౌతూ వుంటుంది.
ఇలాంటి స్థితిలో రచయిత రచన వ్యక్త స్థితిలో సుష్టునిర్మితమైన అంశంవలె కాకుండా ఒక అనూహ్యమైన విచిత్రమైన రూపాన్ని పొంది ఉంటుంది. ఒక ‘అసంప్రదాయ’ లక్షణం, అపూర్వత ఉంటుంది. ‘చికిలి మెఱుంగు సన్న నగిషీపని బంగారు సేత’ కాకుండా ‘అకలుషమౌ వనాంతర మహాఝరిణీ పరివేగ’ముంటుంది.
ఈ కారణంగానే విశ్వనాథ సత్యనారాయణ రచనలు ఏవీ సంప్రదాయ ప్రమాణాలకు, సామాన్యమైన అంచనాలకు విరుద్ధంగా పరిమితులకు లొంగలేదు.
కల్పవృక్షంలో సమకాలీన సంవేదనలు ప్రకటితమయ్యాయి. దానితోపాటు సార్వకాలీనమైన దైవాసుర సంఘర్షణ వస్తువయింది. ఇది పారదర్శకమైన వస్తువు కావడం వల్ల భౌతిక మానసిక ఆధ్యాత్మికములైన మూడు స్థాయిల్లోనూ ఏక కాలంలో రచన అనుభూతి దిశగా ప్రయాణించింది.
నర్తనశాల నుంచి సాగిన విశ్వనాథ నాటక రచన అనార్కలి, వేనరాజు, త్రిశూలమూ ఈ మూడింటిలో మూడురకాలుగా మారిపోయింది. నాటక లక్షణాలను అతిక్రమించి ఎన్నో ప్రయోగాలను పొందింది.
‘అంతరాత్మ’ నుంచి ‘నందిగ్రామ రాజం’ దాకా సాగిన నవలా ప్రపంచంలో నవలరూపం ఎన్ని రకాలుగా మారిందో చెప్పడం సులభసాధ్యం కాదు. విశ్వనాథ చేతిలో నవల-కావ్యలక్షణాలను ఏకవీర మొదలైన వాటిల్లో, ఇతిహాస లక్షణాలను వేయి పడగల్లో, పురాణ లక్షణాలను పురాణవైర గ్రంథమాల, కాశ్మీర దేశ, నేపాల దేశ నవలామాలికలలోనూ, ప్రతీకాత్మతను పులుల సత్యాగ్రహంలో, కథన వైలక్షణ్యాన్ని దమయంతీ స్వయంవరంలో, హర్ష చరితాదులలో కనిపించే ఆత్మకథ లక్షణాన్ని మ్రోయుతుమ్మెదలో, మరొక వైలక్షణ్యాన్ని ఆరునదుల్లో, అధిక్షేపకతను నందిగ్రామ రాజ్యంలో… ఇలా అంతవరకూ సాగిన నవలారూపాన్ని చెదరగొట్టి విశ్వనాథ అనేక రూపసాధన చేశాడు.
ఝాన్సీరాణి, శివార్పణము రెండు చారిత్రక కావ్యాలైనా దేనిరూప వైలక్షణం దానిదే. శ్రీకృష్ణ సంగీతము ధోరణి అది ఒకటి రురు చరిత్రములో కల్పించిన వాతావరణము, శైలీ వాటి ప్రత్యేకత వాటిది.
మహాప్రతిభాశాలికి సంప్రదాయం తెచ్చియిచ్చే రూపాలు సరిపోవు. తన అవసరానికి అనుగుణంగా వాటిరూపాన్ని కొత్తగా నిర్మిస్తాడు. అనంతరకాలంలో ఇవి ఇతరులకు మాదిరులుగా మారిపోతవి.
ఈ సంప్రదాయ భిన్న ధోరణి విశ్వనాథ భాషలోనూ కనిపిస్తుంది. ఆయన సమాసకల్పన, పదాల కూర్పు విలక్షణమైనది. అందువల్ల అలవాటైతే తప్ప ఆ ధోరణి సులభంగా సాగిపోదు. లోకంలో సంభాషణ ధోరణిని, వాక్యంలోని విరుపులను, కాకువును, తెలుగుపద్యంలోనికి తెచ్చినాడు. అందువల్ల పద్యం ఎక్కడ విరవాలో తెలియాలి. సంప్రదాయ మార్గంలో పద్యం చదివినట్లు చదివితే చప్పున స్పురించదు. ఈకారణంగా విశ్వనాథ కవితను పాషాణపాకం అనీ, అన్వయ క్లేశం ఉందనీ, కోమలేతర కథనమనీ దెప్పిపొడవటం అవివేకం. వ్యవహార భాషాస్వభావాన్ని, ఆ పద్య రచనలో దర్శించగలిగితే మనస్సుకు అంత దగ్గరైన పద్యం మరొకటి ఉండదు. విశ్వనాథ విమర్శలో నన్నయలోని కథా కథనశిల్పము, కాళిదాసు పంచమాంక విమర్శలో మానసిక విశ్లేషణ సంప్రదాయ విమర్శ ధోరణికి చెందినవి కానేకావు.
నిజ జీవితంలో విశ్వనాథ గ్రామ జీవితం నుండి పెకిలింపబడి బస్తీలో చదువులకై చేరాడు. అప్పటికే ఆయన ఆస్తి కరిగిపోయింది. దారిద్ర్యం పాతిక సంవత్సరాలు ఆయనకు నిత్యసహచరిగా ఉన్నది. ప్రపంచ సంగ్రామం జరిగింది. తాను చూచిన వ్యవస్థ, మూల్య విధానం. (వాల్యూ సిస్టం) తనముందే కుప్పకూలినవి. ఒక వైపు జాతీయోద్యమం. మరోవైపు కాల్పనికోద్యమం ఆయనను పునరుజ్జీవనం వైపు కదలించినా అట్టడుగున జాతిదుఃఖమంతా గూడు కట్టుకొని వున్నదనే స్ఫురణ ఆయనను ఎప్పుడూ వీడిపోలేదు.
ఒకవైపు జగత్తులోని అనుభవం మీద, సౌందర్యంమీద వాక్కు మీద అత్యంత మోహమూ, రెండోవైపు జగదనిత్య భావమూ, సృజన వేళ సహస్రముఖంగా ప్రక్రియల్లోనూ, వస్తువులోనూ, సంవిధానంలోనూ విస్తరించుకుంటూపోవడమూ, ఇతర వేళల్లో వైరాగ్యంతో తనలోకి కుంచించుకుపోవడమూ – సర్వజీవులయందు ఆత్యంతికమైన కరుణా.. దేశాన్ని దోచిన దోస్తూవున్న పాశ్చాత్య నాగరికతయందు, ప్రభుతయందూ ధర్మకోపము. ‘చిలకతల్లి మహాన్వయంబున నిలచినవి సాంస్కృతిక వాక్కులు. కోకిలమ్మా తెలుగు పలుకూ కూడబెట్టిందీ’ అన్నట్లు తనలో సంస్కృతాంధ్ర బహుళ మార్గదేశి ప్రవాహాలూ. ఇలా ఎన్నో ద్వంద్వాలు విరుద్ధాంశాలు కలసిపోయాయి.
ఈ వైరుధ్యాలన్నింటినీ సమన్వయం చేసుకుంటే తప్ప మనకు విశ్వనాథ వ్యక్తిత్వం అర్థంకాదు. ఇంతటి వ్యక్తిత్వాన్ని ఏదో ఒక సమకాలీన భావానికో, లక్షణానికో పరిమితం చేయలేము. అయితే అక్కడక్కడా ఆ కాలపు లక్షణాలు వ్యక్తం కావచ్చు. కానీ సార్వకాలీనంగా ఎదిగే ఈ మహావ్యక్తిత్వాన్ని ఆయన రచనా ప్రపంచాన్నీ సమగ్రంగా దర్శించాలంటే జీవన చారిత్రకావగాహనయేకాక, ఆయన్ను ప్రభావితం చేసిన తాత్విక ధోరణుల పరిచయమే కాక, ఈ యుగచైతన్యం యొక్క సమగ్ర స్వరూపం వివేచించగలగాలి. ఈ చైతన్యంలోని సార్వకాలీన లక్షణాలను అన్వయించుకోవాలి. ఈ వ్యక్తిత్వం మొలచి ఎదిగిన భారతీయ ఔపనిషిక దృష్టి, కళాత్మక రసాత్మక చైతన్యమూ ఆధారం కావాలి.
సృష్టిలో అత్యంత విలక్షణమైన నూతన వ్యక్తిత్వం పరస్పరం విరుద్ధాలైన అనేకాంశాలు సంగమించడం, సమన్వితి పొందటంవల్ల సంభవిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ వ్యక్తిత్వం అట్టి అరుదైన సమన్వయం.
విశ్వనాథ సాహిత్యాధ్యయనం చేసేవారికి ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోవడం తప్పనిసరి. అప్పుడే ‘సత్య’ దర్శనం సాధ్యం.