పిల్ల నక్క తెలివి

0
3

[box type=’note’ fontsize=’16’] నాటితరానికి నేటితరానికి ఆలోచనా విధానంలో వచ్చిన మార్పును దృష్టిలో పెట్టుకొని ఓ పాత కథను ఆధునికీకరించి “పిల్ల నక్క తెలివి” పేరిట బాలలకి అందిస్తున్నారు కైపు ఆదిశేషా రెడ్డి. [/box]

[dropcap]పి[/dropcap]నాకిని నదీ తీర ప్రాంతంలోని ఓ చిట్టడవిలో ఒక ముసలి నక్క ఉండేది. అది ఆహారం కోసం తిరుగుతున్న సమయంలో, అడవిని ఆనుకొని ఉన్న ఒక తోటలో దోరగా పండిన మామిడి పళ్లు  కనిపించాయి.  వాటిని చూసిన నక్కకి నోరూరింది. ఎవరైనా కాపలా ఉన్నారేమోనని  కొంచెం సేపు పరిశీలించి అక్కడ ఎవరూ లేకపోవడంతో మెల్లగా తోటలోకి వెళ్ళింది. మామిడిపళ్లు  అందేంత తక్కువ ఎత్తులో లేవు. వాటిని  అందుకోవడం కోసం పైకి ఎగిరింది. కానీ అవి అందలేదు. మళ్ళీ మళ్ళీ ఎగిరింది కానీ మామిడి పళ్ళు అందలేదు. నిరుత్సాహంగా వాటి వైపు చూసి,” ఛీ..ఛీ ఈ అందని మామిడిపళ్ళు చేదు..” అనుకొని,  నీరసంగా అడుగులు వేసుకుంటూ అడవిలోకి నడిచింది.

అలా నీరసంగా అడుగులు వేసుకుంటూ వస్తున్నా తాత నక్కను  చూసి “ఏంటి తాతయ్యా అలా నీరసంగా వస్తున్నావ్?” అని అడిగింది మనవడు నక్క.

 “మరేం లేదురా మనవడా… ఆ అడవి చివరన పెద్ద మామిడి చెట్టుకు పళ్ళు నోరూరించేలా వున్నాయి. కోసుకుందామంటే అవి అందలేదు. ఎంతగానో ప్రయత్నించాను. ఎగిరెగిరి నడుము పట్టుకుందేగానీ ఒక్క పండు కూడా అందలేదు..” చెప్పింది తాత నక్క.

“ముసలాడివి కదా ఎగరలేక పోయిఉంటావు. పద నేను వస్తాను” అంది.

మళ్ళీ తాతనక్క, మనవడు నక్క  కలసి మామిడి చెట్టు వద్దకి వెళ్లాయి. చెట్టుమీది మామిడి పళ్ళు చూడగానే మనవడు నక్కకు కూడా నోరూరింది. “ఈ రోజు ఎలాగైనా ఆ మామిడి పళ్ళు తినాలసిందే..! తాతయ్యా…  నువ్వా పక్కన ఉండి ఎవరైనా వస్తారేమో గమనించు..” అని పళ్ళు కోసే  ప్రయత్నం ప్రారంభించింది. ఎగిరి వాటిని అందుకొనేందుకు ప్రయత్నించింది. ఎంత ఎగిరినా పళ్ళు అందలేదు.

“నేను చెప్పానుగా మనవడా.. అవి అందడం లేదని. ఎగిరెగిరి నా  నడుం  పట్టేసింది. నువ్వూరుకోరా.. పళ్ళు లేకపోతే పోనీ.. నీ నడుము కూడా విరుగుద్దేమో.. పద వెళదాం…  అందని మామిడి పళ్ళు చేదనుకుందాం…”  అంటూ పైకి లేచింది తాత  నక్క.

“ఆగు తాతయ్యా.. మామిడిపళ్ళు తినకుండా ఇక్కడనుండి ఒక్క అడుగు కూడా వేయను. ఎలాగైనా వాటిని కోసి తినాలసిందే..! అందలేదని నిరాశగా వెనక్కి పోవడం మీ తరానికి  చెల్లుతుందేమో గానీ మా తరం అంగీకరించదు. భుజబలం కాకుంటే బుద్ధిబలం. మాకు భుజబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉంది…” అని  కొద్దిసేపు ఆలోచించుకొని..

“తాతయ్యా.. యిలా రా …”  అని దగ్గరకు పిలిచింది.

తాత నక్క  రాగానే “ అదిగో అక్కడ పెద్ద కర్ర ఉందికదా దాన్ని తీసుకురా..”  అంది.

తాతనక్క తెచ్చింది. ఆ కర్ర చివర కొంచెం విరిచింది. ఆ చిన్న కర్రపుల్లను పెద్ద కర్రకు చివరన  పంగ వచ్చేలా చెట్టు తీగలతో దోటిలా కట్టింది.

ఆ దోటి కర్ర సాయంతో  పైన వేలాడుతున్న మామిడి పళ్ళను సునాయాసంగా కోసింది. కావలసినన్ని పళ్ళు కోసుకొని కొన్ని తిని, మరికొన్ని తమ మిత్రులకు పట్టుకెళ్ళాయి.  మనవడి తెలివితేటలకు ఆశ్చర్య పోయింది తాతనక్క. ఎంతైనా నేటి  తరానికి తమ తరానికంటే తెలివెక్కువని మురిసిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here