మనసులోని మనసా… 9

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]“సా[/dropcap]విత్రికి పిచ్చెక్కింది తెలుసా?” అని చాలా ఆత్రంగా చెప్పింది మా చెల్లెలు రైలు దిగి ఇంటికి వెళ్ళానో లేదో!

“ఏ సావిత్రి?” అనడిగాను నేను తెల్లబోతూ…

“అదిప్పుడేగా రైలు దిగింది – అంత అర్జెంటేవిటే? నువ్వు రావే… ప్రయాణం బాగా జరిగిందా?” అనడిగింది దొడ్డమ్మ.

నేను తలవూపి మా చెల్లెలు వైపు చూస్తూన్నా – సావిత్రి ఎవరా అని ఆలోచిస్తూ. కొంచెం అర్థమవుతోంది కాని అలా కాకూడదని మనసులోని దేవుణ్ణి ప్రార్థిస్తూ…

నేను వచ్చానని అందరూ వచ్చారు – పలకరిస్తున్నారు.

‘అయ్యో సన్నబడిపోయావే – చిన్నప్పుడు ఎంతల్లరి చేసేదానివి, ఎంత నెమ్మదిగా అయిపోయావు’ అంటూ రకరకాల ప్రశ్నలు!

అందరిలో సావిత్రి మాత్రం కనపడలేదు.

కాని అందరూ ఏదో చెప్పాలని చెప్పలేక మా దొడ్డమ్మ వైపు దొంగచూపులు చూస్తున్నారు.

కాసేపటికి క్షేమ సమాచారాలు అన్నీ అయ్యాక “స్నానం చెయ్యవే టిఫిను పెడతాను” అంటూ లోపలికెళ్ళింది దొడ్డమ్మ.

ఇంతలో మా చెల్లి, ఇంకా మా మేనమామ కూతుళ్ళు గబగబా నా దగ్గరికి వచ్చి గుసుగుసగా “మన సావిత్రే పిచ్చదయిపోయింది” అన్నారు విచారంగా.

నా గుండె ఝల్లుమంది.

అది మా మేనమామ కూతురు. చాలా ఓర్పుగలది. అందరికీ సహయకారి. ఎవరన్నా రాగానే కబుర్లకన్నా వాళ్ళకి సేవ చేయడంలో నిమగ్నమయ్యేది. చాలా కష్టాల్ని భరించింది. ఓపికగా సంసారం లాక్కొస్తుంది. నేనే అప్పుడప్పుడూ ఆర్థిక సహాయం చేస్తుండేదాన్ని. ఈ విషయాన్ని నాకెవరూ తెలియజేయనందుకు నొచ్చుకుంటూ ఆ మాటే అన్నాను.

దొడ్డమ్మ వద్దంది. “ఇదేమంత మంచి విషయమని అక్కడి దాకా చెప్పడం, అది వచ్చినప్పుడే తెలుస్తుంది వూరుకోండి అంది” అని చెప్పారు.

నా మనసు సావిత్రిని చూడకుండా ఆగలేకపోతోంది.

“ఎక్కడుందిప్పుడు?” అనడిగాను.

“ఇక్కడే ఇంట్లోనే”.

“డాక్టరికి చూపించలేదా?”

“చూపించారు. తగ్గలేదు.”

నేను అనేక సందేహాలతో చూస్తుంటే “పిచ్చంటే మనుషుల్ని పీకి, కొట్టే పిచ్చి కాదు. మనల్ని గుర్తుపట్టదు. ఏదేదో తనలో తాను మాట్లాడుకుంటుంది. ఈ లోకంలో వుండదు” అని చెప్పింది కృష్ణక్క. తనూ అప్పుడే వచ్చిందిట.

“స్నానం కాగానే టిఫిన్ తిని సావిత్రిని చూసొస్తా దొడ్డమ్మా, వెళ్ళనా?” అనడిగాను భయంగా.

“ఊ అప్పుడే మోసేసారన్న మాట. వెళ్ళు. చూసాక చాలా బాధ కల్గుతుంది.” అంది దొడ్డమ్మ.

మా చెల్లెలూ నేనూ కలిసి వెళ్ళాం.

సావిత్రి పెద్ద కూతురు “వచ్చావా వదినా, అమ్మ చూడు ఎలా అయిపోయిందో!” అని ఏడ్చింది.

నేను దాన్ని ఓదారుస్తూ చాలా బెరుకుగా సావిత్రి వున్న గదిలోకి ప్రవేశించాను.

సావిత్రి గోడవైపుకు తలపెట్టి పడుకుని ఏదో సన్నగా మాట్లాడుకుంటుంది తనలో తాను.

“అమ్మా, శారదొదిన వచ్చిందమ్మా హైద్రాబాదు నుండి, ఇటు చూడు” అంది మా సావిత్రి కూతురు నిర్మల.

సావిత్రి చాలా సేపు వినిపించుకోలేదు.

ఆ తర్వాత ఇటు తిరిగి “మీ నాన్నకి అన్నం పెట్టేవా?” అనడిగింది.

“ఇదీ వరస. నాన్న చచ్చిపోయినా ఇలానే అడుగుతుంది” అంది నిర్మల నిట్టూరుస్తూ.

“సావిత్రీ, నేను శారదని. గుర్తుపట్టలేదా?” అనడిగాను సావిత్రిని కదుపుతూ.

సావత్రి మౌనంగా వుండి, “నువ్వొచ్చేవా… ఆయన స్టేషన్ కొచ్చి తీసుకొచ్చేరా?” అంది.

“అవును” అన్నాను.

“ఏంటో – నిర్మలా, సుబ్బారావు మావయ్యకి వడ్డీ యివ్వాలి. ఇచ్చిరా బాగుండదు. అవసరానికి డబ్బిచాడు” అంది.

నేను కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేసి మౌనంగా కూర్చున్నాను. చాలా బాధగా వుంది సావిత్రిని చూసి.

ఆ మాటే దొడ్డమ్మతో అంటే “అవును. అందుకే చూడలేక వద్దన్నాను. ఏం చేస్తాం. అంతా ఆ మొగుడు చేసాడు” అంది దొడ్డమ్మ.

చుట్టాలంతా ఆ మాటే అన్నారు.

‘చెప్పలేని కష్టాలు మోసింది. సంసార భారమంతా నెత్తిన వేసుకుంది. అతను చేసిన అప్పులు తీర్చింది. ఘోషా కుంటుంబం నుండి కోడలుగా వచ్చింది. అయినా చీకటి పడ్డాక కొంగు కప్పుకుని కాని వాళ్ళళ్ళికి వడ్డీల అప్పుల కోసం తిరిగింది. పది మంది పాలేర్లతో బతికిన మనిషి, గేదెల్ని పెట్టుకుని పాలమ్మింది. ఎంత చేసినా అతను చేసిన అప్పుల్లో పడి దారి లేక పిచ్చిదయిపోయింది’ అని.

నాకు అతను గుర్తొచ్చేడు. అన్నదమ్ముల్లో అతనొక్కడే ఎస్సెల్సీ వరకూ చదివాడు. తండ్రి చాలా ఆస్తి యిచ్చాడు. అతనేదో వ్యాపారం చేసేవాడు. అన్నీ నష్టాలే. ఏదీ భార్యకి తెలియనిచ్చేవాడు కాదు. అస్తంతా తెగనమ్మి అప్పులు తెచ్చి నష్టపోయే కొలదీ ముందుకే వెళ్ళాడు. ఆ తర్వాత చేతులెత్తి యింట్లో కూర్చున్నాడు. సావిత్రి యింటి భారం మోసి చివరికి పిచ్చదయి పోయింది.

ఇలాంటి కథలు ఎన్నో వున్నాయి.

దురలవాట్లతో, భార్యల్ని, సంసారాల్ని అసలు పట్టించుకోకుండా వాళ్ళ కన్నీళ్ళతో దాహం తీర్చుకుంటూ చివరికి రోగాల పాలయి కుటుంబాల్ని కూల్చేసిన పెద్దముషులెంతో మంది.

బయటికి వచ్చి చెప్పుకుంటే లోకువయి పోతామని కొందరు, ఆగలేక చెప్పుకుని చులకనయిపోయిన అభాగినులు కొందరూ.

నా స్నేహితురాలు ఒకామె అందమైంది. తెలివైంది, ఉద్యోగస్తురాలు అయివుండి కూడ భర్త నిరాదరణ, ఆగడాలకి కష్టలు పడీ పడీ అదోలా అయిపోయింది. కారణం ఆమె అతని సంగతి తెలిసి వదిలించుకోవాలని ప్రయత్నం చేసినప్పడల్లా ఆమె పుట్టింటివాళ్ళు ఆమె మాట వినకుండా తిరిగి కాపురానికి పంపేవారు. ఇష్టం లేని వాతావరణంలో ఆమె అనేక సంవత్సరాలుండీ వుండీ చివరికి అతని జబ్బులకి సేవలు చేసి పుస్తెలమ్మి నిర్వేదంగా మారిపోయింది. నవ్వే మరచిపోయింది.

ఇసుకలో నీళ్ళు పోస్తే కొంతవరకే పీల్చుకుంటుంది. ఒక మిక్సీ జార్‌లో కొంత దాటి పప్పువేసి తిప్పితే మోటారు పాడయి కూర్చుంటుంది. దేనికైనా ఒక ఎలాస్టిక్ లిమిట్ వుంటుంది. దాన్ని దాటేతే ఆ వస్తువు పని చెయ్యదు.

కాని స్త్రీకి మాత్రం లేదా?

ఎందుకని ‘రోగం రట్టు సంసారం గుట్టు’ అంటూ ఆడదానికి మాత్రమే శ్రీరంగ నీతులు చెబుతారు! ఎందుకని ఆ ఊబి నుండి స్త్రీని బయటకి రానివ్వరు?

ఎన్నో శ్రామిక కుటుంబాల్లో కూడ ఈ సిద్దాంతమే జరుగుతుంటుంది. ఇద్దరూ కూలి పనికి వెళ్తారు. అతను మాత్రం ఆ డబ్బులతో తాగి యింటి కొచ్చి పెళ్ళాన్ని చిదకతంతాడు. ఆమె అతనికి వుపయోగపడాలి. తన కూలి డబ్బులతో ఇంటిని పోషించాలి, పిల్లల్ని పెంచాలి.

తరాలు మారినా స్త్రీలు అనేక రకాల యిబ్బందులతో బాధపడుతునే వున్నారు. కన్నీరు కారుస్తునే వున్నారు. బయటికి వచ్చి నోరు విప్పతే నిందల పాలవుతూనే వున్నారు.

నిజానికి అన్ని రకాలుగా కంఫర్ట్‌గా వున్న స్త్రీలు చెప్పే ధర్మాలు ధర్మాలు కావు. బయట ప్రపంచం చాలా వుంది. ఆడవారు దుఃఖ భాజనంగావే జీవితాలు అనునిత్యం పోరాడుతూ కన్నీటిని దాచుకునే బ్రతుకుతున్నారు.

వారందరికీ విముక్తి కావాలంటే ఎంతో ఔదార్యం కావాలి! అన్ని చేతులూ ముందుకి చాచాలి!

చివరగా సందర్భం అవునో కాదో గాని ఒక సంగతి చెబుతాను. అందాల నటి కాంచనమాల కూడ ఒక దుష్ట నిర్మాత చేతికి బలయి పిచ్చిదయింది.

భానుమతి లాంటి నటి ఆమె కారులో వెళ్తింటే పరిగెత్తుకుని వచ్చి ఆమెని చూసిందంటే ఆమె అందం ఎటువంటిది! శ్రీశ్రీలాంటి కవి ఆమె గురించి రాశారంటే ఆమె ఎంత గొప్ప సౌందర్యవతి! అలాంటి నటిని తప్పుడు ఎగ్రిమెంటులో ఇరికించి ఆమెకు మరో అవకాశం లేకుండా చేసి ఆ నిరుపమాన సౌందర్య దేవతని పిచ్చి దాన్ని చేసాడొక దుర్మార్గుడు!

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్త్రీల కన్నీటి కథలు నాటికీ నేటికీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here