జీవన రమణీయం-27

1
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నా[/dropcap]కూ మా ఆయనకీ ఇవన్నీ చాలా థ్రిల్లింగ్‌గా వుండేవి! ఇంట్లో సుశీల పిల్లల్ని చాలా బాగా చూసుకునేది. ఉద్యోగము ఎటూ పోయింది. ఇంక రాసుకోవడం, పిలిచిన వాళ్ళ దగ్గరికి తిరగడమే వృత్తి నాకు! కానీ చాలా కష్టపడి మా నేరేడ్‌మెట్ క్రాస్ రోడ్స్ నుంచి రెండు లేదా మూడు బస్సులు మారి రోజూ తిరిగేదాన్ని!

వీరేంద్రనాథ్ గారి ‘విజయానికి ఐదు మెట్లు’ ప్రారంభం అయింది. అందులో మొదటి ఎడిషన్‍లో 128వ పేజీలో “ఓ స్కూల్ టీచర్ నా దగ్గరకొచ్చి 500/- రూపాయల జీతంలో పని చేసేది, రచనలు మొదలుపెట్టి మొదటి సంవత్సరంలోనే ఒక ప్రముఖ నిర్మాత (కె.ఎస్.రామారావు) దగ్గర 35,000/- రూపాయలు తీసుకోగలిగింది” అని రాశారు. నా పేరు రాయలేదు. నేను చాలా సంతోషించాను.

ఆ ‘విజయానికి ఐదు మెట్లు’ ఫంక్షన్ రవీంద్రభారతిలో జరిగింది. ఆ కవరేజ్ అంతా ఆంధ్రభూమికి నన్ను రాయమన్నారు కనకాంబరరాజుగారు.

ఆయన విజయానికి ‘ఐదు మెట్లు’గా వీరేంద్రనాథ్ గారు తన ఆంధ్రాబ్యాంక్ జి.ఎం.నీ, గురువు దేశిరాజు హనుమంతరావు గారినీ, కె.ఎస్. రామారావు గారినీ, అశోక్ అనే మిత్రుడ్నీ, కనకాంబరరాజు గారినీ అభివర్ణించి సన్మానం చేశారు.

చిరంజీవి గారు పుస్తకావిష్కర్త. ఆ సభలో ఒక తమాషా జరిగింది. ఒక చాప్టర్‌లో వీరేంద్రనాథ్ గారు, అప్పట్లో జరిగిన ఫ్లయిట్ ఏక్సిడెంట్‌ని ఉదహరిస్తూ, ‘మెగా స్టార్ కూడా చాలా భయపడిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఆ సమయంలో’ అందులో రాశారు. ఆ పుస్తకం చదివి సభకి వచ్చిన చిరంజీవి గారు “‘కమ్యూనికేషన్’ అనే చాప్టర్ గొప్పగా వ్రాసిన ఈ రచయిత, నాతో ఎంతో చనువుండీ కూడా ఈ విషయం, ఏ ఫోన్‌లోనో అడగను కూడా అడగకుండా, నేను భయపడ్డాననీ, కంటనీరు పెట్టాననీ ఎలా అంటారు? నేను చాలా ధైర్యంగా వున్నాను ఆ సమయంలో… మావయ్యగారూ, అత్తయ్యగారూ కూడా ఆ ఫ్లయిట్‍లోనే వున్నారు. వాళ్ళని దింపి నేను నా ‘కేమ్’తో షూట్ చేస్తూ పాపని (శ్రీజ ని) విజయశాంతికి అందించి, అందరికీ దిగడానికి సాయపడ్తూ ఆ సమయంలో హడావిడిగా వున్నాను. నేనెక్కడ ఏడ్చాను? ఈయన చూసాడా? ఎవరు చెప్తే నమ్మి రాశారు? కమ్యూనికేషన్ వుండాలిగా… నన్ను అడగాలిగా?” అని కాస్త హర్ట్ అయి ఉద్రేకంగా మాట్లాడారు! అంతలోనే ఆ సందర్భాన్ని తేలికపరుస్తూ “నా శ్రీమతితో కూడా ఇంట్లో గొడవలు వస్తూ వుంటాయి… రాత్రి అయ్యేసరికి నేను నెమ్మదిగా రాజీ పడ్తాను” అనగానే, అభిమానులు బాల్కనీ లోంచి తెగ అరిచారు. అలా నవ్వించారు.

ఆ సభకి వీరేంద్రనాథ్ సతీమణి అనుగీత గారూ, చిరంజీవి గారి శ్రీమతి సురేఖ గారూ రావడం విశేషం! అనుగీత చిరంజీవి గారికి బొట్టు పెట్టి, పుస్తకం అంకితం ఇచ్చారు. చాలా తక్కువ సందర్బాల్లో అనుగీత గారిని సభల్లో చూసేము.

వీరేంద్రనాథ్ గారు మాట్లాడుతూ ఈ ‘ఐదుగురూ’ లేకపోతే తాను రచయితని అయ్యేవాడిని కాననీ, వీళ్ళు తన విజయానికి ఐదు మెట్లనీ అన్నారు.

కింద రికార్డిస్ట్‌లు కూర్చుంటారు కదా స్టేజ్ దగ్గర, నేను వాళ్ళకి క్యాసెట్ ఇచ్చి మొత్తం రికార్డు చేయించి, ఆ రోజు రాత్రే ప్రోగ్రాం మొత్తం రాసి, మర్నాడు పొద్దుటే గురువుగారికి చూపించి, ఆయన కొన్ని మార్పులూ, చేర్పులూ చేసాకా, దాన్ని తీసుకెళ్ళి ఆంధ్రభూమి ఆఫీసులో కనకాంబరరాజు గారికిచ్చాను!

“మరునాడే రాసి తెచ్చేసావా? ఎంత దీక్షమ్మా నీకు? నువ్వు చాలా పైకొస్తావ్” అన్నారు కనకాంబరరాజు గారు.

ఆయనకి రచయితలో స్పార్క్ పట్టుకోవడం, దాన్ని పత్రికకి ఉపయోగించుకోవడం బాగా తెలుసు! ఒక్క తులసిదళం… వెన్నెల్లో ఆడపిల్లా చాలు… ఆయన రచయిత రాసిన దానికి ఎంత పబ్లిసిటీ ఇచ్చి రీడర్‌షిప్ పెంచారు అన్నదానికి! తెలంగాణా జిల్లాల్లో అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న చేతబడులు, బాణామతి (భానుమతి అని కూడా అనేవారు), చిల్లంగీ లాంటి వాటి గురించి రాసినప్పుడు, ఇంటీరియర్ తెలంగాణాలో పాఠకులు పెరిగారు! ఓ రకంగా, చదవడం బాగా పెరిగింది. ‘అడగండి చెప్తా’ దగ్గర నుండీ కామెడీ వరకు ఆయన పత్రిక సర్క్యులేషన్ పెరగడానికి నిత్యం శ్రద్ధ చూపేవారు!

కానీ కనకాంబరరాజు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక లేడీ చాలా అడ్డుకునేది! ఆవిడకి ఎంతో అభద్రతా భావం వుండేది! ఎండలో వెళ్ళిన నన్ను చాలా సేపు నిలబెట్టి కుర్చీ కూడా ఆఫర్ చెయ్యకుండా శాడిజం చూపేది. ఇప్పుడు వాళ్ళందరినీ చూస్తే… ఇంకా రచయిత్రులుగా ‘ప్యూపా’ దశలోనే వున్నారే అని నాకు నవ్వొస్తుంది.

వీరేంద్రనాథ్ గారి ఆఫీసులో నాకు దశరథ్ పరిచయం అయ్యాడు. అతనే తరువాత దర్శకుడయి ‘సంతోషం’ సినిమా తీసాడు. మా చిన్నవాడిని ఎత్తుకునేవాడు. ఇద్దరం కలిసి సిటీ కేబుల్‌లో ‘అంతర్ముఖం’ సీరియల్‌కి సంభాషణలు రాసాం.

తెర మీద ‘బలభద్రపాత్రుని రమణి’, ‘కొండపల్లి దశరథ్’ అన్న పేర్లు పడ్డాయి. ఇప్పటికీ నాకు మంచి మిత్రుడే! ఆసం శ్రీనివాస్ కూడా అక్కడే పరిచయం. ‘అక్కా’ అని పిలిచేవాడు.

ఒకసారి ఓల్గా గారిని కలవడానికి ఈటీవీ ఆఫీసుకి వెళ్తే ‘ఆసం’ అక్కడ కలిసి “ఏదో వేకెన్సీ వుందంటే వచ్చానక్కా! … రూమ్ రెంటూ, మెస్ బిల్లూ గడవాలిగా” అన్నాడు.

“అలాగా? నేను ఓల్గా గారితో చెప్తాలే” అని లోపలికి వెళ్ళాను. ఆవిడతో మాట్లాడాకా, “బయట ఆసం శ్రీనివాస్ అనే రైటర్ వున్నాడండీ. చాలా బాగా రాస్తాడు” అని చెప్పాను. “చూద్దాం అమ్మా. ఏదైనా అవకాశం వుంటే” అన్నారు. “కాదండీ… అతనికి రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి పాపం” అన్నాను. “అలాగే… మాట్లాడుతానమ్మా” అన్నారావిడ. నన్ను మళ్ళీ మర్నాడు రమ్మన్నారు.

నేను బయటకొచ్చి ‘ఆసం’ మొహం చూసి, “అన్నం తిన్నావా?” అంటే తల అడ్డంగా వూపాడు. “పద” అని అక్కడే దగ్గర్లో వున్న సన్మాన్ అనే హోటల్‌కి తీసుకెళ్ళి భోజనం పెట్టించి, జేబులో డబ్బులు పెట్టి ఇంటికొచ్చాను.

నేను మళ్ళీ మర్నాడు వెళ్ళేసరికి ‘ఆసం’ నాకు నవ్వుతూ ఎదురుపడ్డాడు, శాంతి శిఖరలో.

“మళ్ళీ వచ్చావా?” అన్నాను.

“నువ్వు వుద్యోగం ఇప్పించావుగా అక్కా! పదివేలు జీతం” అన్నాడు. నాకెంతో సంతోషం వేసింది. తరువాత ఇరవై వేలు కూడా చేసారు!

సుమన్ గారు ‘ఆసం’ని చాలా అభిమానించేవారు.

ఇప్పుడు టీ.వీ.కి తిరుగులేని రచయిత ‘ఆసం శ్రీనివాస్’. మొన్న ఏదో అవార్డుల ఫంక్షన్‌కి వెళ్ళొస్తూ, హోటల్‌కి వెళ్ళి బిల్ కట్టబోతే, మా డ్రైవర్‌తో “అక్క పెట్టిన అన్నం ఇరవై ఏళ్ళుగా రోజూ తింటున్నాను… ఈ రోజు అయినా నన్ను పెట్టనీ…” అన్నాడు.

ఆ కృతజ్ఞతకి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here