[box type=’note’ fontsize=’16’] ‘తొలకరియే లోకాలకు శుభకరి’ అంటూ తొలకరి రాకపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు మట్ట వాసుదేవమ్. [/box]
[dropcap]ఆ[/dropcap]కాశమ్మున మండే సూర్యుడు
అన్ని దిక్కులా వేడి గాలులు
నీటి చుక్కకై కోటి ఆశలు
కోటి ప్రాణుల దాహపు కేకలు
అంతలోనే వింత గాను
కారుమేఘమావరించే!
జిగేల్‌మన్న మెరుపులతో
ధనేల్ మన్న పిడుగులతో
భీతావహులై ప్రజలు
భీతి చెంది పరికించగ
చిటపట ధ్వనులతో చినుకులు పడగ
బుస్సుబుస్సుమని భూమి పొంగగా
చల్ల దనమే జగతి నిండగా
సకల జీవులు సంతోషముగ
కేరింతలతో గంతులేయగా
ప్రకృతియే పులకించి పోవగా
అంతలోనే రైతన్నలు
పదును చూడ – పొలముకెళ్లి
నడుముకట్టి – కాడెపట్టి
హలముతోను – పొలముదున్ని
పట్టి కొట్టి – చదును చేసి
కాడెవిప్పు సమయములో
ఆలితెచ్చు చద్ది కుడిచి పొలములోనే విత్తు విత్తి
విత్తనాలు మొలకెత్తగ
భూమాతయే లేచి వచ్చి
పచ్చచీర కట్టిందని ఆబాల గోపాలము
ఆనందపు చిందులెయ్య
వచ్చింది వచ్చింది తొలకరి!
ఈ తొలకరియే లోకాలకు శుభకరి!!