తత్ దినం!!

1
4

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి విజయాదిత్య పంపిన హాస్య కథ “తత్ దినం!!” నేడు ఈ ‘డే’, రేపు ఆ ‘డే’ అని వేలంవెర్రిగా ప్రవర్తించే ఓ వ్యక్తిలో మార్పు ఎలా వచ్చిందీ ఈ కథ చెబుతుంది. [/box]

[dropcap]”జి[/dropcap]ల్ జిల్ జిల్ జిల్ జిగెలు రాణీ” మొబైల్ రింగ్ అవుతుంటే ఎత్తాడు శ్రీనివాస రావు.

“హలో ఎవరు?”

“నేనురా రాఘవయ్యని…”

“ఓ! ఏంటి విశేషం ఇలా ఫోన్ చేశావు?”

“ఏమిటీ అని అలా అడుగుతావేంటి? నీకు తెలియదా? ఈ రోజు ఆగష్టు 7”

“అయితే?”

“ఇంకా తెలియలేదా?”

“నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది?”

“పేపర్ చూడలేదా? టీ.వీ పెట్టలేదా?”

“అబ్బా! టేన్షన్ పెట్టక అదేమిటో చెప్పుదూ?”

“ఒరేయ్ బడుద్ధాయ్! ఈ రోజు ఫ్రెండ్‌షిప్ డే రా! హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే టు యు!”

“ఓ! అవునా?! తెలియలేదే!”

“నువ్వు నిజంగా ముసలాడివైపోతున్నావు. బొత్తిగా లోకజ్ఞానం లేకపోతే ఎలా?”

స్నేహితుని మాటలకు రోషం వచ్చింది శ్రీనివాసరావుకు. ఏవో మాటలు మాట్లాడి ఫోను పెట్టేశాడు. బుర్రలో మాత్రం ఇదే తిరుగుతోంది. ‘నాకు లోకజ్ఞానం లేదంటాడా? ఏదో ఈ రోజు వాడికి ఏదో తెలిసిందని మిగతా వాళ్ళందరూ వెర్రివాళ్ళకింద జమకడతాడా! పైగా ముసలాడంటాడా. ఏం వాడికీ అరవయ్ దాటాయికదా. నాకన్న ఓ అయిదేళ్ళు చిన్నైతే మాత్రం వాడేం 20 ఏళ్ళ బాలాకుమారుడేం కదుగా.  చెప్తాను వాడి సంగతి.’ ఆరోజు భార్య సుజాతమ్మ మీద రెండుమూడుసార్లు అలిగి, రుసరుసలాడి తన అక్కసు కొంత తగ్గించుకున్నాడు.

ఆ మర్నాడు ప్రొద్దున్నే లేచి పేపర్ ఆసాంతం పరీక్షగా చూశాడు. ఆ రోజు ప్రత్యేకత ఎక్కడా కనపడలేదు. ఇలా కాదని టి.వీ పెట్టాడు. ఛానల్స్ తిప్పుతున్నాడు. గంటన్నరసేపు అటు తిప్పి ఇటు తిప్పి చూశాడు. రెండు మూడు చానల్స్‌లో దిన ఫలలాలు. ఒక దాంట్లో రిలీజ్ కాని అనామక సినిమా, కొన్నిట్లో సంగీత సాహిత్యాల బంధాలను త్రెంచుకున్న పాటలు. ఒకదాన్లో వారంరోజులలో అయిదు కిలోల బరువు తగ్గడం ఎలా కార్యక్రమం, శని దృష్టి యంత్రం. ఇక వార్తా చానెళ్ళల్లో తాగి కక్కుకుంటున్న ఒక యువతి దృశ్యమాలిక, బల్లుల్ని, తేళ్ళను తింటున్న ఒక బాలుని కథ, ఇమ్రాన్ ఖాన్ శాంతి సందేశం, ట్విట్టర్లో హాట్ హాట్ కామెంట్లు వగైరా వగైరా లన్నీ చూసి ఎంతో లోకజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అతడికి కావలసింది దొరక లేదు. ఎలా? మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. తన కొడుకు క్రొత్తగా కంప్యూటర్ ఒకటి ఇచ్చాడు. తనతో వీడియోలో ఎలా మాట్లాడొచ్చో నేర్పి మరీ వెళ్ళాడు. ఇంటర్నెట్ యొక్క అనంతమైన ఉపయోగాలలో కొన్నిటిని చెప్పి వెళ్ళాడు. ఆ జ్ఞానం ఒక్కసారి ఫెటిల్లున తెరుచుకుంది. హుటాహుటిని స్నానం చేసి రోజూ తను చేసే పూజకు ఎగనామం పెట్టి ఒక నామం మాత్రం పెట్టుకు వచ్చి కంప్యూటర్ ముందు కూలబడ్డాడు.

గూగుల్‌లో వెతుకుతున్నాడు.  ముందు సులువుగానే దొరికేస్తుందని అనుకున్నాడు. ప్రతీ రోజుకీ ఏదో ఒకటి పెట్టే ఉంటారు కదా … ఇంటర్నెట్‌లో దాని గురించి ఉండక ఏం చేస్తుంది. అది అతని నమ్మకం. అయితే సమయం గడుస్తున్న కొద్దీ అతని నమ్మకం సడలసాగింది. ఇంటర్నేషనల్ డేస్‌లో చూశాడు. అసలు ఫ్రెండ్‌షిప్ డే కూడా అందులో కనపడలేదు. వరల్డ్ డేస్ వెతికాడు. కొన్ని ప్రత్యేకమైన రోజులు అదేం చిత్రమో ఏడాది ఏడాదికీ తేదీలు మారిపోతున్నాయి. ఇవి అసలు ఎలా నిర్ణయిస్తారు? ఏమీ అర్థం కాలేదు శ్రీనివాసరావుకి. అన్ని రకాలుగా వెతికి వెతికి చివరకు ఒక సైట్లో దొరకబట్టుకున్నాడు.

ఆగస్టు 8.. డాలర్స్ డే! అమెరికా డాలర్ పుట్టిన దినం అని వ్రాసి ఉంది. అంతే! అతనిలో ఉత్సాహం ఉరకలెత్తింది. వెంఠనే మొబైల్ తీసి రాఘవయ్యకు కాల్ చేశాడు. “మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది” కాలర్ సాంగ్ అసహనంగా వింటున్నాడు శ్రీనివాసరావు. ఇంకా ఫోన్ ఎత్తడేం. అంతలో  “హలో శ్రీనివాసరావ్ “ఏంటి సంగతి?” అన్నాడు.

“పాప ఏడ్చింది”

“అయితే కుడితినీళ్ళు పట్టు.. చిన్నప్పుడు నువ్వు అదే తాగేవాడివిట” బిగ్గరగా నవ్వుతూ అన్నాడు రాఘవయ్య.

“నీ జోకులు కాస్త ఆపు. ఈరోజు ఏమిటో తెలుసా?”

“ఈరోజా? ఏం లేదే?”

“అదే మరి. ఇంకా పాతకాలం పప్పుసుద్దలా పేపర్లూ టీ.వీ అని మూలన కూర్చుంటే ఇలాగే తగలడుతుంది. ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే ఇవి సరిపోవోయ్.”

“అసలు విషయం ఏంటి?”

“ఏమిటని మెల్లగా అడుగుతావేంటి? ఈ రోజు డాలర్స్ డే! అంటే డాలర్ పుట్టిన రోజన్నమాట!”

“అవునా? ఎప్పుడూ వినలేదే!”

“అదేమరి. కూపస్త మాండూకం అని నీలాంటి వాళ్ళనే అంటారు.”

“అది సర్లే గానీ.. నీకీ విషయం ఎలా తెలిసింది”

“బాబూ మేము మీలా ఇంకా ముసలివాళ్ళం కాలేదు. ఇంటర్నెట్, కంప్యూటర్ మాటలెప్పుడైనా విన్నావా” కాస్త గర్వంగా అన్నాడు శ్రీనివాసరావు. అతనికి తెలుసు రాఘవయ్య ఇంట్లో ఇంకా కంప్యూటర్ లేదు. వాటిగురించి అతనికి పెద్దగా తెలియదు. విజయగర్వంతో ఫోను పెట్టాడు శ్రీనివాసరావు.

ఆ విజయం ఇచ్చిన ఉత్తేజం అతనిలో క్రొత్త ఆలోచనలను రేకెత్తించింది. అప్పుడే ఒక నిశ్చయానికొచ్చాడు. ప్రతీ రోజూ, ఆ రోజు ఏ ‘డే’ నో తెలుసుకోవాలి. తనకు తెలుసున్న వాళ్ళందరకూ ఆ విషయాన్ని ఎస్.ఎం.ఎస్ చెయ్యాలి. వెంటనే తన మొబైల్‌లో ఉన్న అందరికీ ‘హ్యాపీ డాలర్స్ డే’ అని కొట్టి పంపాడు. ఆ సాయింత్రంలోగా కొన్ని రిప్లైలు వచ్చాయి. థాంక్స్ అని. దానితో అతని మదిలో మరిన్ని ఆలోచనలు ఊపిరిపోసుకున్నాయి. సరిగ్గా అలాంటి కాలంలో అతనికి దెయ్యం పట్టుకున్నట్టు పట్టుకుంది ‘స్మార్ట్ ఫోన్’. ఆ రోజు మొదలు అప్రతిహతంగా సాగిపోతున్నాడు శ్రీనివారరావు.

నా మొహంపుస్తకాలు, నీ గొట్టాలు, పిట్టకూతలు, ఎంలేపులు, ట్రంపు టేపులు, విక్కీ లీకులు ఒకటేమిటి శ్రీనివాసరావుకు 24 గంటలు చాలటం లేదు.

ఆరోజు ఆగష్టు 11. ఏదో సైట్ లో ఆ రోజు ‘ఇసుకలో ఆడుకునే దినం’ చదివాడు. దినచర్య ప్రకారం అందరికీ అది ఎస్.ఎం.ఎస్ చేశాడు. వాట్సప్ గ్రూపులలో పెట్టాడు. వాట్సప్‌లో వచ్చే వీడియోలు చూసి  ఆరోజు అతనికి ఇంకొక ఆలోచన ఉబికివచ్చింది. అది “కేవలం తెలుసుకుంటే సరిపోదు దానిని ఆచరించాలి” అని. అంతే! వెంటనే పెరట్లో ఎప్పుడో ఇంటి రిపేర్లకి మిగిలిన ఇసుక బస్తా తెచ్చి, హాలులో ఒంపి దానితో బొమ్మలు కట్టడం మొదలెట్టాడు. అది వీడియో తీసుకుని వాట్సప్‌లో పెట్టాడు. ఇది చూసి ఈయనకు ఏమైందోనని సుజాతమ్మ హడలిపోయింది. ఆ తరువాత ఆ ఇసకంతా ఎత్తి మళ్ళా పెరట్లో పోసే సరికి సుజాతమ్మ నడుం పట్టేసింది. ఆగష్టు 13. బ్యాంకులో డబ్బులు తీసుకుందుకు వెళ్ళిన శ్రీనివాసరావు ఉత్త చేతులతో వచ్చాడు.

“ఏమైందండీ” అని అడిగింది సుజాతమ్మ. “సంతకం తేడా వచ్చిందని ఇవ్వలేదు.”

“అయ్యో! అదెలా మారిపోయింది? ఇప్పుడెలా?”

“మరేం ఫరవాలేదు. రేపటికి మామూలైపోతుంది. అప్పుడు తెస్తా?”

“అదెలా మారిపోతుందండీ?”

“ఈరోజు ఎడంచేతివాటం వాళ్ళ దినం. అందుకు సంతకం ఎడంచేత్తో పెట్టాను. రేపు మామూలుగానే పెడతాను” అని చెప్పిన శ్రీనివాసరావును చూసి నెత్తి కొట్టుకున్నది సుజాతమ్మ.

ఆగస్టు 15  న స్వాతంత్ర దినోత్సవం అన్న సంగతి మరచి, అదేదో సైట్లో “జాతీయ అలసత్వ దినం” గా చూసి ఆ రోజు పనులన్నిటినీ గాలికొదిలేసి కూర్చున్నాడు.

మరో రోజు “ఏమండీ.. ఈ రోజు..” చెప్పబోయింది సుజాతమ్మ. “ఆగస్టు 20 దోమల దినం తెలుసు” పరధ్యానంగా అన్నాడు శ్రీనివాసరావు. విసవిసా వెళ్ళిపోయింది సుజాతమ్మ. కూరలో కారం, మాటల్లో మౌనం, కళ్ళల్లో భారం ఇవేవీ శ్రీనివాసరావుకు ఆరోజు సుజాతమ్మ పుట్టినరోజన్న విషయాన్ని గుర్తు చెయ్యలేకపోయాయి.

అతని ఈ పరిస్థితికి అనుగుణంగానే ఇంటర్నెట్లో రకరకాల దినాలు అతనికి అందించసాగింది గూగుల్.

“అంతర్జాతీయ పెంపుడు జంతువుల దినం” నాడు కుక్కని తేవాలా నక్కని తేవాలా అని ఆలోచించి, వెరైటీగా ఉంటుందని తన తోటలోని తొండలను పట్టి వాటికి బట్టలు తొడగడం చూసి సుజాతమ్మ స్పృహ తప్పి పడిపోయింది.

ఆ వీడియోలకి వచ్చిన లైకులు చూసి ప్రపంచంలో తనను మించినవాడులేడు అనే అనుభూతి ఒక క్షణం అనుభవించాడు శ్రీనివాసరావు. మరు క్షణం మరిన్ని లైకులు ఎలా సంపాదించాలా అని అతని మెదడు ఓవర్ టైం లో పనిచేయసాగింది.

“చెత్త కవిత్వ దినం (ఆగస్టు 18)”, “నా బక్కెట్టుకి కన్నం ఉంది రోజు (మే 30)”, “అబద్ధం చెప్పు రోజు (ఎప్రిల్ 4)” మొదలైనవి చూసి ఆచరించి ఇంట్లోవాళ్ళనీ ఇరుగుపొరుగువాళ్ళనీ గ్రూపులో వాళ్ళని ఎవరు దొరికితే వాళ్ళని భయంకరంగా హింసించసాగాడు శ్రీనివాసరావు. గ్రూప్ ఆడ్మిన్‌ల చేత చివాట్లు హెచ్చరికలు తిన్నా తగ్గలేదు.

ఇంకా అభివృద్ధిని, పురోగమనాన్ని అందుకోలేని, అసలు బ్రతకడమే చేతకాని, స్మార్ట్ ఫోన్ లేని రాఘవయ్యలాంటి వాళ్ళపై జాలితో ఫ్రీ ఎస్.ఎం.ఎస్ ఉన్న కార్డు వేసుకుని నిరాటంకంగా పంపసాగాడు. రోజులో సింహభాగమంతా ఈ తతంగంతో గడిచిపోతోంది. వాట్సప్‌లో  “ఏతద్ దినం:” అని తన అర కొర సంస్కృత పరిజ్ఞానాన్ని చూపిస్తూ పంపే ఇతని వ్యవహారాన్ని చూసి ఇతనికి తద్దినం మాష్టారు అని పేరు ఖాయం చేసారు. అయినా అతను తగ్గలేదు.  తెలుసున్నవాళ్ళు రిప్లై ఇవ్వడం ఆపేశారని, తనకు నోటికి వచ్చిన నంబర్లకు ఎస్.ఎం.ఎస్ పంపించసాగాడు. ఇది అతనికి మరింత సరదాగా అనిపించింది.

అంతే కాదు. క్రొత్త క్రొత్త దినాలను తనే సృష్టించి ప్రచారం మొదలెట్టాడు. “ఎర్ర బట్టల దినం” “చీమలు కుట్టే దినం”, “పక్కింట్లో భోంచేయ్ దినం” “అత్తిపత్తి దినం” లాంటివి అతని కపోలకల్పనలే. ఓ రోజు “అంతర్జాతీయ క్షురక దినం” ప్రకటించి తనకు తానే గుండు గీసుకున్నాడు. సుజాతమ్మ వంటింట్లో తలుపు గడియ పెట్టుకుని తన కేశాలను రక్షించుకుంది. పండగలు మరిచిపోయాడు. ఆది, సోమ వారాలు మరిచిపోయాడు. పుట్టినరోజులు మరిచిపోయాడు. అతని బుర్ర ఆ రోజు ఏ ‘దినం’ అన్న విషయం మీదే కేంద్రీకృతమైపోతోంది. వేలంటైన్స్‌డే కి అతను తెలిసీ తెలీక పంపిన ఎస్.ఎం.ఎస్ పోలీస్ ఎస్సై దుర్గాభవానికి అంది కొన్ని గంటలలో పోలీసులు ఇంటికి వచ్చి జీపు ఎక్కించబోయారు. సుజాతమ్మ ఎలాగో సర్ది చెప్పి పంపింది. అప్పటి నుండీ తెలీని నంబర్లకు పంపడం మానుకున్నాడు.

ఒకరోజు సుజాతమ్మ ” ఏమండీ రేపు మీకు ఏం స్పెషల్ చెయ్యమంటారు అని అడిగింది?”

“రేపేంటి విశేషం? ఈరోజు ఫిబ్రవరీ 28 జాతీయ సైన్సు దినం. రేపటిది రేపు చూసి చెబుతా.”

“అబ్బా ఆగోల నాకెందుకు. రేపు మీ పుట్టిన రోజు. అది కూడా మర్చిపోతే ఎలా?” అని అన్నది సుజాతమ్మ.

“నేనేం మరచిపోలేదు. నీకు గుర్తుందో లేదో అని అన్నా. బంగాళ దుంప వేపుడు, నీ స్పెషల్ స్వీట్ అమృతగుటకలు చేయ్యి” తెలివిగా చెప్పాడు శ్రీనివాసరావు.

రేపు ఏ దినమో? నా పుట్టినరోజట కదా. కనుక ఏదో మంచిదై ఉంటుంది. అనుకుంటూ నిద్రకుపక్రమించాడు. అయితే మనసు రేపేం రోజో తెలుసుకోవాలని ఉబలాట పడుతూనే ఉన్నది. ఇక ఉండలేక, భార్య పడుకున్నది అని నిర్థారించుకుని కంప్యూటర్ ఆన్ చేశాడు. మార్చ్ 1. ఇప్పటికే కొన్ని సైట్లు బుక్ మార్క్ చేశాడు. వరుసగా వాటిని చూడసాగాడు. అందులో ఒక దాంట్లో మాత్రం ఉంది.. మార్చ్ 1 — పందుల దినం!!. ఒక్కసారి బుర్ర తిరిగింది శ్రీనివాసరావుకి. చుట్టూ చూసుకున్నాడు. ఎవరూలేరు. భార్య పడుకునే ఉంది. నిశ్శబ్దంగా తిరిగి వచ్చి పడుకున్నాడు.

ఆ మర్నాడు, ప్రొద్దున్న లేచిన శ్రీనివాసరావు, చాలా రోజుల తరువాత పూజ గదిలోకి అడుగుపెట్టాడు. పెద్దగా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. రోజూలా కంప్యూటర్ వెయ్యలేదు. మొబైల్ తియ్యలేదు. భయం భయంగా కూర్చున్నాడు. ఎవరైన ఈ రోజేంటని అడుగుతారేమో? తన పుట్టినరోజు పందుల దినంగా ప్రకటించారని తెలిస్తే నవ్వుతారేమో అని బిక్కు బిక్కు మంటూ ఉన్నాడు. ముక్కూ మొహం తెలియని స్నేహితుల పుట్టినరోజులు ఫేసుబుక్కు చెప్తుంటే ఆ ‘దినం’ చెప్పి వాళ్ళని ఎలా ఆడుకున్నాడో గుర్తుకు వచ్చి హడలిపోయాడు. ముఖ్యంగా రాఘవయ్య దగ్గరనుండి ఫోను వస్తుందేమో అని ఉత్కంఠతో ఆతనికి ముచ్చెమట్లు పోస్తున్నాయి.

యథాలాపంగా సుజాతమ్మ “ఏంటండీ ఈ రోజు అదోలా ఉన్నారు. ఈ రోజు ఏ దినమో చూడలేదేంటి?” అని అడిగింది.

“ఏ దినమైతే ఏంటి? అదేమైనా అంత ముఖ్యమా. ఈ రోజు నా పుట్టినరోజు అంతే. ఇలాంటివి గుర్తుంచుకోవాలి. అనవసరమైన చెత్త కాదు.” అనేశాడు. అతనిలో ఈ మార్పుకు అలానే చూస్తూ ఉండిపోయింది సుజాతమ్మ. అతని అదృష్టమో, దురదృష్టమో కానీ ఆరోజు అతని పుట్టినరోజన్న విషయం తెలియక ఎవరూ ఫోన్ చెయ్యలేదు. రోజు గడిచింది హమ్మయ్య అనుకున్నాడు శ్రీనివాసరావు. ఆ దెబ్బకి తరువాత మళ్ళా ఏ రోజు ఏ దినం అన్న ఆలోచన రానివ్వలేదు. మెల్లగా మామూలు మనిషిగా మారుతున్నాడు శ్రీనివాసరావు. పండగలు, ముఖ్యమైన రోజులు గుర్తుకు రాసాగాయి. మాసాలు రోజులు మరల తెలుస్తున్నాయి.

అంతలో ఓ రోజు అతనికి ఎప్పుడో మరచిన విషయం ఒకటి గుర్తొచ్చింది. భార్య సుజాతమ్మను పిలచి. “నా పుట్టినరోజు … జూను 6 కదా… మార్చి ఒకటని అన్నావేంటి?” అని అడిగాడు. “హమ్మయ్య! ఇప్పటికి మీకు మీ పుట్టినరోజు గుర్తొచ్చింది. మీరు మామూలు మనిషి అయ్యారు. అవును మీ పుట్టినరోజు జూను ఆరునే” ముసి ముసి నవ్వులతో చెప్పింది సుజాతమ్మ.

“అంటే ఆ రోజు.. అంటే .. ఆ దినం .. నీకెలా తెలుసు?”

“నా పుట్టినరోజు మరచిపోయి దోమల దినం అని అంటే ఊరుకుంటానా. ఇంటర్నెట్టు మీకేకాదు అబ్బాయి నాకూ నేర్పాడు. అందుకే పందుల దినం” శ్రీనివాసరావు హాయిగా నవ్వేశాడు. తన పుట్టినరోజు పందులదినం కాదని తెలిసిన ఆ క్షణంలో భార్య తనతో ఆడిన ఆ అబద్ధాన్ని క్షమించేశాడు. పైగా అది తన మంచికని అర్థం చేసుకున్నాడు. ఆమె పుట్టినరోజు తను మరచినందుకు సిగ్గుపడ్డాడు. మొత్తానికి బాగుపడ్డాడు. ఇంతకీ అతని అసలు పుట్టినరోజు జూను 6 ఏ దినమో తెలుసుకోవాలని ఉందా… ఇంకేం గూగుల్ లో వెతకండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here