జీవన రమణీయం-28

0
4

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]నా [/dropcap]పిల్లలు తమ బాల్యంలో ఏవీ మిస్ అవలేదు… అటు బామ్మా తాతయ్యలూ, ఇటు అమ్మమ్మా తాతయ్యలూ, మా గారాబాలూ, నా డిసిప్లిన్… వాళ్ళ ఆటలూ ఏవీ!

మా కాకతీయనగర్ కొత్త కాలనీ అవడం వల్ల అన్ని ఖాళీ ప్లాట్లే. పిల్లలు క్రికెట్ ఎక్కువగా ఆడేవారు.  చాలామంది పిల్లలు సాయంత్రాలు గ్రౌండ్స్‌లో ఆడుతూ కనపడేవారు. ఇప్పటిలా, టీ.వీ.లకో కంప్యూటర్ గేమ్స్‌కో ఐపాడ్స్‌కో అతుక్కుపోవడం కాదు!

వాళ్ళు కాకరకాయ తినం, చేదు అంటే నేను ‘అత్తగారూ కాకరపాదూ’ కథ చెప్తూ, కాకరకాయ రుచి చూశాకా కోడలు ఎలా కొట్టుకుపోయిందో ఆ కూర కోసం నోట్లో నీళ్ళు వచ్చేట్లు చెప్పేదాన్ని! పొట్లకాయ వద్దు అంటే ఆ కూర గురించి కల్పించి చెప్పేదాన్ని. పిల్లలిద్దరూ కథ అనగానే పేచీలు మర్చిపోయి బుద్ధిగా అన్నం తినేసేవారు. మా అత్తగారు కూడా వాళ్ళకి బోలెడు కథలు చెప్పేవారు, రాత్రిపూట పక్కలో పడుకోబెట్టుకుని. ఒక కథలో “చలిగాడు కాదు, గిలిగాడు కాదు… వీడు తోకపీకుడు గాడు రోయ్” అనగానే అశ్విన్, కృష్ణ ఆ జోక్‌కి కిలాకిలా నవ్వేవారు. ఆ కథేంటో నాకిప్పటికీ పూర్తిగా తెలీదు!

నా బాల్యంలో మా నాన్న ఎలాగైతే అన్నయ్య కన్నా ఒక్క రవ్వ ఎక్కువగా ప్రేమించేవారో, అలాగే నా పిల్లల్ని కూడా. ఆదివారాలొస్తే కోటీకో, ఆబిడ్స్‌కో తీసుకెళ్ళి ఫుట్‌పాత్ మీదున్న కామిక్స్ కొనడం మొదలుపెట్టారు. అప్పటినుండి ఇప్పటిదాకా ఆ కామిక్స్ అలవాటు అలా మా పెద్దవాడికి కొనసాగుతూనే వుంది.  కొన్ని వందల కామిక్స్ సేకరించాడు.

నాకు ఫ్యాన్ మెయిల్ కట్టల్ని తెచ్చే గౌస్ పిల్లల కోసం రీడర్స్ డైజస్ట్ తెచ్చేవాడు. వాళ్ళల్లో రాయాలన్న అభిలాష ఎక్కువగా వుండేది. దక్కన్ క్రానికల్‌లో ‘ఇల్ ఓమెన్’ అనే కథ రాశాడు మా అశ్విన్. అలాగే కృష్ణ నైన్త్ క్లాసులో ఓ షార్ట్ ఫిల్మ్ డైరక్ట్ చేశాడు! క్రియేటివిటీ వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ‘పరీక్ష’ అని ఇంజనీరింగ్‌లో వుండగా రాఘవేంద్రరావు గారు పెట్టిన ఓ కాంటెస్ట్‌కి కూడా పంపించాడో షార్ట్‌ఫిల్మ్ చిన్నవాడు! కానీ నేను ఏనాడు ఈ సినిమా ఫీల్డ్ వైపు వారిని ఎంకరేజ్ చెయ్యలేదు.

చిన్నప్పుడే ‘అశ్విన్‌ని చూస్తే వాడూ వీడూ అనాలనిపించదు, చాలా డిగ్నిఫైడ్’ అనేవారు నా ఫ్రెండ్స్! మా కృష్ణ ఎంత అల్లరో చెప్పలేను. మా కాలనీలో ఓ ఇంట్లో బాల్ పడితే తీసుకోడానికి వెళ్తే ఒకాయన “ఎవరురా నువ్వు?” అంటే, “ఫేమస్ రైటర్ బలభద్రపాత్రుని రమణీ వాళ్ళ కొడుకుని” అన్నాడుట. ఆయన ఎప్పుడూ చెప్పి చెప్పి నవ్వేవాడు. అప్పుడు వాడికి ఎనిమిదేళ్ళే!

నేనెప్పుడూ పిల్లలని ర్యాంక్‌లు తెచ్చుకోమని రుద్దిందీ, పోరిందీ లేదు, వాళ్ళంతట వాళ్ళే చదువుకునేవారు. మా పెద్దబ్బాయికి ఒకటి రెండు ట్యూషన్స్ పెట్టాను కానీ, వాడు ఎప్పుడూ సరిగా వెళ్ళింది లేదు. ‘ఎంతొస్తే అంత చదవనీ! నేనేం పెద్ద చదివాననీ… బి.ఎ. నేగా?’ అనుకునేదాన్ని.

క్లింటన్, మోనికా కేస్ రచ్చ రచ్చ న్యూస్‌లో వస్తున్నప్పుడు, హిల్లరీ భర్తని వెనకేసుకురావడం చూసి, నేను ‘అనూహ్య’ నవల ఇంట్రో ఆ విషయంతో మొదలుపెట్టాను.

మా సాయికృష్ణ (బాబాయి హోటల్ హీరో) చదివించుకుని విని సూచనలు చెప్పేవాడు. మొదటి యాభై పేజీలూ పంపగానే, స్వాతి బలరాం గారు కాల్ చేసి, “నాకు మరో యద్దనపూడి సులోచనా రాణి దొరికినట్లుందమ్మా… ఎంత బాగా రాశారో!” అన్నారు. నేనా మాటలు ఈనాటికి పెద్ద అవార్డుగా భావిస్తాను.  తరువాత మిగతా భాగం రెట్టించిన వుత్సాహంతో ముగించాను.

నేను ఆ నవల రాసినప్పుడు పక్కా పురుషవాది నన్నారు కొంతమంది. అనూహ్యకి భర్త తనని ఇలా చూడాలీ, అలా చూడాలీ, తన గురించి అందరూ గొప్పగా అనుకోవాలీ అనే కోరికలెక్కువ! కానీ అలా భర్త అనుకోడానికి తన వంతు ఏమీ కష్టపడదు… వివేక్ ఆమెని ఎలా తీర్చిదిద్దాడో, ఎంత హార్ష్‌గా ఆమెతో ప్రవర్తించి మార్చుతాడో వుంటుందా నవలలో. “సీతాకోక చిలుకలా మారడానికి పడే కష్టం గొంగళి పురుగుకే తెలుస్తుంది” అంటుంది ఫ్రెండ్ విజయ అనూహ్యతో. దానికి చాలా మంచి ప్రశంసలొచ్చాయి పాఠకుల నుండి.

ఒక రచయిత్రి నేను రాసిన అనూహ్య నవలని మక్కీకి మక్కీ కాపీ కొట్టి ‘మయూరి’లో రాసేసింది. నాకు తెలిసి ఇదేంటని నేను అడిగితే, ఆమె చెప్పిన ఫూలిష్ జవాబు “నీ హీరో డాక్టరు… నేను ప్రొఫెషన్ మార్చాగా” అని! ఆ తరువాత ఆ ఫూలిష్ రైటర్ ఈటీవీలో నా సీరియల్ వచ్చేడప్పుడు కూడా సేమ్ నవల తీసుకెళ్ళి సబ్‌మిట్ చెయ్యడంతో వాళ్ళూ చాలా నవ్వారు. ఆమె రచయిత్రిగా పేరు తెచ్చుకోకపోడానికి నా అనూహ్య సీరియలే కారణం అని ఫేస్‌బుక్ లోనూ, తెలిసినవాళ్ళకీ చెప్తూ వుంటుంది, కానీ తన కాపీ కొట్టే బుద్ధీ, రచనా శైలి లేకపోవడం, హార్డ్ వర్క్ అస్సలు చెయ్యకపోడం కారణాలు అనుకోదు పాపం!

అప్పట్లో వీరేంద్రనాథ్ గారి ఆఫీసులో, వర్క్‌షాప్‌లో చాలామంది రైటర్స్‌ని, ముఖ్యంగా రచయిత్రుల్ని చూసేదాన్ని. కానీ, ఇప్పుడు ఎవరూ పైకొచ్చినా దాఖలాలు లేవు. వాళ్ళకి రాశాం అంటే రాశాం అనేగానీ, ఒక శైలి డెవలప్ చేసుకుని, ‘ఇది నా స్టైల్’ అని జనానికి అలవాటు చెయ్యడం రాదు.

నేను రచనలు మొదలుపెట్టిన కొత్తల్లోనే వీరేంద్రనాథ్ గారు “కాళీపట్నం రామారావుగారిలా పేరు తెచ్చుకోవాలనుందా? యద్దనపూడి గారిలా శైలితో మంత్రముగ్ధుల్ని చెయ్యాలనుందా?” అని అడిగారు. ఇద్దరూ గొప్పవాళ్ళే! కానీ రెండో దారి కమర్షియల్ సక్సెస్‌కి దారి తీస్తుందని రెండోదే ఎన్నుకున్నాను.

అదే విధంగా “ఆత్మ సంతృప్తీ, పేరూ, డబ్బూ, ఇవి ఏ క్రమంలో కావాలి?” అని అడిగినప్పుడు, “డబ్బూ, పేరు, ఆత్మ సంతృప్తీ కావాలి. మొదటిదొస్తే రెండూ తర్వాత వాటంతటే అవే వస్తాయి” అని చెప్పాను. ఆ దిశగానే కష్టపడ్డాను.

డా. నాయక్, డా. ఉదయార్కలతో రచయిత్రి

నా రచనలకి మొదటి రోజుల్లోనే విలువైన అభిమానులుండేవారు. అందులో ఒకరు న్యూరో సర్జన్ డాక్టర్. ఆర్.టి.ఎస్. నాయక్ గారు. అప్పట్లో ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చేస్తుండేవారు. నా ‘మొగుడే రెండో ప్రియుడు’ నవల చదివి నాకో అభిమానిగా ఉత్తరం రాశారు. ఎంతో సంస్కారం, అభిమానం వుట్టిపడ్తూ రాసిన ఆ ఉత్తరం నేను ఇప్పటికీ దాచుకున్నాను. ఆయన నిమ్స్‌లో పని చేస్తున్నారని తెలిసి, మా డాక్టరన్నయ్య రామూని “డా. నాయక్ తెలుసా?” అంటే, “ఇప్పుడు కామినేని కొచ్చేశాడు, నాకు చాలా మంచి ఫ్రెండ్. అంత బిజీ న్యూరో సర్జన్ నీ నవల చదివి ఉత్తరం కూడా రాశాడా?” అని ఆశ్చర్యపోయాడు. ఆయనని నేనెప్పుడూ కలవాలనుకోలేదు… కానీ చెప్పానుగా దేవుడు నా ఖజానాని విలువైన రాళ్ళతో నింపడం ఆరంభించాడు… అందులో వజ్రాలే ఎక్కువ! గులకరాళ్ళు వాటంతట అవే వైదొలగాయి… ఆ డాక్టర్ గారిని కలుసుకోవడానికి ఓ దురదృష్టకరమైన పరిణామం నా జీవితంలో కలిగింది!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here