ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది

0
3

[box type=’note’ fontsize=’16’] “ఎక్కడో ఏదో విని, ఎక్కడో ఏదో చదివి ఓ అభిప్రాయాన్ని ఏర్పర్చుకుని దాన్ని యూనివర్సల్ ట్రూత్ అనుకోవటం చాలా తప్పు” అంటున్నారు సలీం ‘ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది’లో పిల్లల ప్రేమను అమోదించ పెద్దల గురించి. [/box]

[dropcap]నే[/dropcap]ను కూడా ప్రణయ్‌లానే హత్య చేయబడ్తానా? నాలుగు రోజుల్నుంచీ నన్ను వేధిస్తోన్న ప్రశ్న ఇది. ప్రణయ్‌ని అమృత తండ్రి హత్య చేయించిన విషయం న్యూస్ ఛానెల్లో చూసినప్పటినుంచి సన్నటి భయమేదో ఎలిక పాములా మొదలై ఇప్పుడు అనకొండలా నోరు తెర్చుకుని గుండెల్లో తిష్ట వేసుకుని కూచుంది. నాకూ ప్రత్యూషకు మధ్య ప్రేమ చిగురించి ఇప్పటికి ఐదేళ్ళు. ఇద్దరం ఇంజనీరింగ్ పూర్తి చేసి రెండేళ్ళుగా ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం.

దాదాపు రెణెల్ల క్రితం ఓ రోజు సాయంత్రం మేము ఎప్పుడూ కల్సుకునే కాఫీడేలో కల్సుకున్నప్పుడు ఎప్పుడు చూసినా వెల్తురు పూలు చిమ్మే కాకరపువ్వొత్తిలా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ తన చుట్టూ వేనవేల నవ్వులు రాల్చే ప్రత్యూష విషాదానికి ప్రతిరూపంలా కూచుని ఉండటం గమనించి “ఏమైంది? ఎందుకలా ఉన్నావు?” అని ఆతురతగా అడిగాను.

‘నాకు సంబంధాలు చూస్తున్నారు. మనం తొందరగా పెళ్ళి చేసుకోవటం మంచిది ఫ్రాన్సిస్’ అంది.

‘సరే. ఎప్పుడు రమ్మంటావో చెప్పు… మీ ఇంటికొచ్చి కాబోయే మామగారితో “అంకుల్, నాకు మీ అమ్మాయంటే ప్రాణం. నాకిచ్చి పెళ్ళి చేస్తే గుండెల్లో పెట్టుకుని ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పేస్తాను” అన్నాను.

“జోక్ కాదు… సీరియస్. నిన్న ఓ సంబంధం వచ్చింది. కుర్రాడు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్లో ఇంజనీరట. ఫోటోతో పాటు బయోడేటా పంపారు.”

“ఎలా ఉన్నాడు?

“బావున్నాడు’

‘ఇంకేం… చేసేస్కో… మంచి గవర్నమెంట్ ఉద్యోగం. జీవితం సాఫీగా దాల్ లేక్లో పూలపడవలో చేసే షికారులా సాగిపోతుంది.”

‘చాల్లే నోర్ముయ్.. నేనేమీ గవర్నమెంట్ ఉద్యోగస్థుడు కావాలని కోరుకోవటం లేదు. నాతో పాటు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన ఫ్రాన్సిస్ నా భర్త కావాలనుకుంటున్నాను”

“సరే. ఇప్పుడు సీరియస్‌గా చెప్తున్నా, ఓ ఆదివారం వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను”

“నాకెందుకో భయమేస్తోంది ఫ్రాన్సిస్. మా నాన్న ఒప్పుకోడు. పెద్ద గొడవౌతుంది. నన్ను ఏ గదిలోనో బంధించి మా కులం కుర్రాడితో బలవంతంగా పెళ్ళి చేస్తారనిపిస్తోంది”

“ఐతే ఏం చేద్దామంటావు? నీ ప్లానేమిటో చెప్పు” అన్నాను.

“ఎవరికీ చెప్పకుండా పెళ్ళి చేసుకుందాం. ఆ తర్వాత వాళ్ళే కాంప్రొమైజ్ అవుతారు. ఏమంటావు?”

“నాకలా ఇష్టం ఉండదు పత్తూ. మనమేమీ తప్పు చేయలేదుగా. ప్రేమించడం నేరం కాదుగా. ఐదేళ్ళనుంచి ప్రేమించుకుంటున్నా మన హద్దుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం. ఇందులో ఎవరైనా అభ్యంతరం చెప్పడానికి ఏముంది? పెద్దల్ని ఒప్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే పెళ్ళి చేసుకుందాం”

‘మనది మతాంతర వివాహమౌతుంది ఫ్రాన్సిస్. మన పెళ్ళికి ఇంతకన్నా పెద్ద అభ్యంతరం ఇంకేం కావాలి చెప్పు?”

“మా యింట్లోవాళ్ళకు ఈ రోజే చెప్పేస్తాను. వాళ్ళని ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది.”

“మతం మారితేనే ఒప్పుకుంటామంటారేమో? పేరు మార్చుకోవాలంటారేమో? బొట్టు పెట్టుకోకూడదంటారేమో?

ఆమె వెలిబుచ్చుతున్న భయాల్ని విని పెద్దగా నవ్వాను. “అలా ఎందుకనుకుంటున్నావు? ఎక్కడో ఏదో విని, ఎక్కడో ఏదో చదివి ఓ అభిప్రాయాన్ని ఏర్పర్చుకుని దాన్ని యూనివర్సల్ ట్రూత్ అనుకోవటం చాలా తప్పు. అలాంటి భయాలేవీ పెట్టుకోకు. మా వాళ్ళు నీ మతం విషయంలో గానీ, నీ ఆచారాల విషయంలోగాని జోక్యం చేసుకోరు. ప్రత్యూష అనేది నాకు చాలా ఇష్టమైన పేరు. దాన్ని నువ్వు మార్చుకుంటానన్నా నేనొప్పుకోను”

‘మీ ఇంట్లో ఒప్పుకుంటారేమో… కానీ మా యింట్లో ఒప్పుకుంటారని నేననుకోను. మా నాన్నకు కులం పట్టింపులు ఎక్కువ. నువ్వొచ్చి అడిగినా అవమానం చేసి పంపుతారు ఫ్రాన్సిస్. నా మాటిను. మనం ఎవ్వరికీ చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం!”

‘వద్దు. ఈ విషయం నాకొదిలేయ్. పెద్దవాళ్ళకు చెప్పటం మన ధర్మం. చెప్పి చూద్దాం. ఒప్పుకోక పోతే ప్రత్యామ్యాయాలు ఆలోచిద్దాం’ అన్నాను.

ఈ ఆదివారమో వచ్చే ఆదివారమో ప్రత్యూష వాళ్ళ నాన్నని కల్సుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో ప్రణయ్ హత్య జరగడం పెద్ద షాక్ నాకు. కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నంత మాత్రాన చంపటాలేమిటి? ఎవరిచ్చారు వాళ్ళకా అధికారం? మనుషులెందుకిలా రాక్షసుల్లా మారిపోతున్నారు? పరువనేది కులంలో ఉంటుందా? మనుషుల మంచితనం, మానవత్వం మీద కదా పరువనేది ఆధారపడి ఉంటుంది? దుర్మార్గుడు, దుష్టుడు ఏ కులంలో ఉన్నా వాడికి పరువేం ఉంటుంది?

మరునాడు కల్సిన ప్రత్యూషతో “మీ నాన్న కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు కదూ” అని అడిగాను.

“నువ్వే చెప్పావుగా దేన్నీ యూనివర్సల్ ట్రూత్ అనుకోకూడదని. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నంత మాత్రాన అందరూ అమృతరావులా హంతకులకు సుపారీ ఇచ్చి అల్లుళ్ళను మర్డర్ చేయించరు. మా నాన్న చాలా మంచోడు. అలా ఎన్నటికీ చేయడు” అంది కోపంగా.

“అంత మంచివాడైతే మన పెళ్ళికి తప్పకుండా ఒప్పుకుంటాడు” అన్నాను.

“అది వేరు ఇది వేరు. మన పెళ్ళికి మాత్రం ఒప్పుకోడు. నేను మా కులం అబ్బాయిని ఎవర్ని ప్రేమించినా సరే హ్యాపీగా ఒప్పుకుంటాడు”

“మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ప్రణయ్ హత్య జరిగాక నాకు భయమేస్తున్న మాట మాత్రం నిజం. మనలాంటి చాలామంది ప్రేమికులు ఈ సంఘటన తర్వాత భయపడి పోలీస్ స్టేషన్లకెళ్ళి తమకు రక్షణ కావాలని అడుగుతున్నట్టు న్యూస్ వస్తోంది చూశావా?” అన్నాను.

“పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చినంత మాత్రాన వీవీఐపీలకిచ్చినట్టు ఇరవై నాలుగ్గంటలూ ప్రొటెక్షన్ ఇవ్వలేరుగా. మహా అయితే వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అంతే. నా మాటిను. మనం రహస్యంగా పెళ్ళి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి కొన్ని రోజులు ఉండి వద్దాం. అప్పటికి వీళ్ళ కోపాలేమైనా ఉంటే చల్లబడ్డాయి.”

ఏదో నేరం చేసినట్టు పారిపోయి పెళ్ళి చేసుకోవడం నాకిష్టం లేదు. ప్రశాంతంగా కూచుని ఆలోచించాను. నాలో రాజుకున్న భయం సహేతుకం కాదు. అమృతరావులాంటి వ్యక్తుల్ని ఒకరిద్దర్ని ఉదాహరణగా చూపి సమాజం మొత్తం కుళ్ళిపోయిందని బాధపడటమో భయపడటమో సరైంది కాదు. రోడ్డు మీద వాడెవడో రక్తం చిందించినంత మాత్రాన మనుషుల్లో మంచితనం చచ్చిపోదని నా నమ్మకం. ఒకవేళ ప్రత్యూష తండ్రి దుర్మార్గుడే అయితే రహస్యంగా పెళ్ళి చేసుకున్నా మేము ఎక్కడున్నామో వెతికించి తను చేయాలనుకున్నది చేయవచ్చు. ముందే అలాంటిదేదో జరుగుతుందని వూహించి భయపడటం కన్నా ధైర్యంగా ఎదుర్కోవటమే మంచిదనిపించింది.

“రేపు మీ ఇంటికొస్తున్నాను. మీ నాన్నగారితో మాట్లాడతాను” అన్నాను.

వద్దని ప్రత్యూష ఎంత చెప్పినా నేను విశ్లేదు. “ఒక వేళ మీ నాన్నగారు ఒప్పుకోకపోతే అప్పుడాలోచిద్దాం… ఏం చేయాలనే విషయం” అన్నాను.

మరునాడు సాయంత్రం ప్రత్యూషవాళ్ళింటికెళ్ళి వాళ్ళ నాన్నగార్ని కల్సుకున్నాను. నేను చెప్పిందంతా విన్నాక ప్రత్యూషని పిలిచి “నీకీ అబ్బాయంటే ఇష్టమా? ప్రేమించావా? పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా?” అని అడిగాడు.

ప్రత్యూష నేల చూపులు చూస్తూ ఔననేలా తల వూపింది.

“మా అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుకున్నాం. మాకు కులం ముఖ్యమే. కానీ కులం కన్నా మా కూతురి సంతోషం ముఖ్యం. దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీ పెళ్ళికి మాకేమీ అభ్యంతరం లేదు. ఎటొచ్చీ పెళ్ళి ఏ పద్ధతి ప్రకారం చేసుకుంటారు?” అన్నాడాయన. నాకు మొదట సంతోషంతో మాటలు రాలేదు. ప్రత్యూష ఒకంగలో వాళ్ళ నాన్నను చేరుకుని “మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం డ్యాడీ” అంటూ అతన్ని అల్లుకుపోయింది.

“ఇరువైపులా సమస్య లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అంకుల్” అన్నాను.

“మంచి నిర్ణయం. మీ అమ్మానాన్నతో మాట్లాడటానికి ఎప్పుడు రావాలో చెప్పు” అన్నాడాయన.

“మీవంటి సహృదయులు, విశాల భావాలు కలవాళ్ళు సమాజం నిండా ఉంటే ఎంత బావుండేదో అంకుల్… అప్పుడు ప్రణయ్ హత్యల్లాంటివి జరిగేవి కావు” అన్నాను వారి పాదాలను తాకుతూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here