[box type=’note’ fontsize=’16’] క్రాప్ హాలిడే.. టాక్స్ హాలిడే.. స్కూల్ హాలిడేలు ప్రమాదమో ప్రమోదమో తెలియదు గాని టాక్ హాలిడే ఖచ్చితంగా ఉపయోగకరమంటున్నారు సోమేపల్లి వెంకట సుబ్బయ్య. ఎందుకో ఈ కవితలో తెలుస్తుంది. [/box]
[dropcap]లె[/dropcap]క్కలేసుకుని మురిసిపోవద్దు
ఇప్పుడు సంతోషించాల్సింది
ఫ్రీ టాక్ టైం గురించి కాదు
క్రాప్ హాలిడే.. టాక్స్ హాలిడే.. స్కూల్ హాలిడే
ప్రమాదమో ప్రమోదమో తెలియదు గాని
టాక్ హాలిడే మాత్రం
ముమ్మాటికీ
మనసు పొరలపై
సుస్వరాల జల్లు కురిపిస్తుంది
సమాచార విప్లవం
“అతి” వెల్లువై
సంసారాల్లో నిప్పుల వాన కురిపిస్తుంటే
అర్థరాత్రీ లేదు.. అపరాత్రీ లేదు
అరచేతిలో సెల్ ఫోన్ తో నిత్య జాగారమే
ఒక రోజు..
ఒక పూట..
కనీసం ఒక గంట నోటికి తాళం వేస్తే చాలు
ఆరోగ్యానికి ఆయుషు అవుతుంది
ప్రతిభ వెలుగులీనుతుంది
చట్టుబండలవుతుందనుకున్న
చదువు
శిఖరాలకు ఎగుస్తుంది
మందగమనంలో ఉన్న
విధి నిర్వహణ
గాడికెక్కుతుంది
ఇది చెడుకీ మంచికీ మధ్య
సంఘర్షణ
కాసేపు టాక్ హాలిడే పాటిస్తే
సమాచార విప్లవం
సమాజ ‘హరిత’ విప్లవమౌతుంది
ఇప్పుడు
ఆలోచించాల్సింది
టాక్ టైం గురించి కాదు
టాక్ హాలిడే గురించి