సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 9

0
4

[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]

శునకో వృషభో న స్యాత్
మశకశ్చ మహాగజః ।
శశకస్తు న శార్దూలః
లుబ్ధో దాతా కథం భవేత్ ॥

తేటగీతి
శునక మెప్పుడు వృషభమై చనగ లేదు
మశక మెప్పుడు ఏనుగై మనగ లేదు
శశక మెప్పుడు వ్యాఘ్రమై మసల లేదు
లుబ్ధు డెట్టుల దాతయౌ లోక మందు ౪౧

***

సర్వ తీర్థమయీ మాతా
సర్వ దేవమయః పితా ।
మాతరం పితరం తస్మాత్
సర్వ యత్నేన పూజయేత్ ॥

ఆటవెలది
సర్వ తీర్థమయిర జన్మ ధాత్రి యనగ
సర్వ దేవమయుడె జన్మ దాత
గాన యత్న పూర్వకముగ అవని యందు
వారి సేవ చేయు వాంఛ తోడ ౪౨
అమ్మ నాన్న లనగ
ఆది దేవులే, అనఘ !

***

విద్యా వినయ సంపన్నే
విద్యా హీనే జడే నతి ।
స్వజనే పరకీయే చ
పండితాః సమదర్శినః ॥

ఆటవెలది
అరయ జ్ఞాను లందు అజ్ఞాను లందును
సాధు జనులు యందు జడుల యందు
బంధు జనుల యందు పరులందు పండితు
లొకటె దృష్టి గలిగి ఉందు రెపుడు ౪౩
సకల జీవు లందు
సమత కలిగి యుండు

***

స్వీయం తపో సతీరూపం
పాండిత్యం తనయస్య చ ।
మూలికా స్వగృహోత్పన్నా
న స్తుత్యా నీతి కోవిదైః ॥

ఆటవెలది
తాను చేయు తపము తన భార్య అందమ్ము
చూడ ముచ్చటైన సుతుల ప్రతిభ
పెరటి చెట్టు కున్న వరమైన గుణమును
వినుతి జేయ బోరు విజ్ఞు లెపుడు ౪౪

***

గ్రామస్తు సస్యహీనశ్చ
స్వామిహీనం చ మందిరమ్ ।
పంథాః సహాయ శూన్యశ్చ
రుద్రభూమి సమాః స్మృతాః ॥

ఆటవెలది
సాయ మసలె లేక సాగించు పయనాన
దీర్ఘ మైన యట్టి మార్గ మంత
భర్త లేని ఇల్లు పంట పండని యూరు
రుద్ర భూమి గానె రూఢి యగును ౪౫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here