[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]
[dropcap]నీ[/dropcap]కోసం నేనెదురుచూస్తున్నా..
నువ్వు వస్తావని..
నా చుట్టూ ఉన్న
కట్లు విప్పుతావనీ..
ఎంతకీ ఈ కట్లు వీడవే..
చిన్నతనం నుంచీ ఉన్నవే
ఎంత అలవాటు పడదామన్నా
నా వల్లకాదే..
రెక్కలు విప్పుకున్నపక్షిలా
పురివిప్పిన నెమలిలా
ఎగరాలనీ ఆడాలనేది
ఉట్టి ఉబలాటం..
ప్రతి రోజూ వేచి చూస్తున్నా
ఒక చిన్న ఆశతో..
రంగులన్నీ చెదిరిపోయి
దిక్కుతోచని దేహం
మనసు మరణించిన యంత్రం
పనులకే పునరంకితమవుతూ
తెల్లవారినది మొదలు
తనువు సొమ్మసిల్లేవరకు
అలుపన కూడని పరుగు
తనని తాను తొంగి చూడక
సాగిపోయే పరిచర్యలు
చిన్నప్పుడు తోడలవాటు
పెళ్ళయ్యాక తోడుగానే
పిల్లలకు తాను తోడు
వృద్ధాప్యంలోను వీడని తోడు
అన్నీ కట్లే…
గుచ్చుకుంటున్నాయ్
నా గొంతుమీదా కట్లే
ఒక్క రాగం పాడాలని ఉంది..
ఒక్కసారి రెక్కలు
విదుల్చుకోవాలని ఉంది
ఒక్కసారి నాట్యం చేయాలని ఉంది
ఒక్కసారి.. ఒకేఒక్కసారి
నన్ను నేను చూసుకోవాలని ఉంది
నువ్వెప్పుడొస్తావ్…
అసలొస్తావా…?
ప్రతి సంవత్సరం నువ్వువస్తావని
సంకెళ్లు విప్పుతావనీ
చెప్తూనే ఉన్నారు..
నేను మొండిదాన్ని
మనసు మరణించిన
బండరాయిని…
నువ్వొస్తావేమోనని
నా దేహాన్ని ఇక్కడే
బంధాలతో బంధనాల మధ్య
వదిలాను..
నీ ముద్రలు వేస్తావుగా..