20. చాపలు

0
3

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]చా[/dropcap]పలు… చాపలు…
రక రకాల చాపలు
రంగు రంగుల చాపలు
తుంగ, తాటి, ఈత, వట్టి, ప్లాస్టిక్
ఎన్నో రకాల ఆకారాలు
ఎందరెందరికో ఉపయోగాలు.

విందులకైతే విరిచాప
పేరంటాలకు పెద చాప
బాలిక కన్యగ మారిన రోజున
పచ్చనైన తాటాకుల చాప.

శుభకార్యాలకు శోభను కూర్చి
సొగసులతో స్వాగతి పలికి
అతిధులను అలరించేటి
అందమైనవీ తుంగ చాపలు.

రోడ్డు ప్రక్కన చెట్టు కింద నివసించే పేదలకు
ఈత చాపలే ఇలలో స్వర్గం
అందులోనే ఇంద్రుడి భోగం.

మాడులు పగిలే మండు వేసవిలో
వట్టి చాపలు వంటికి హాయి.
కలిగినవారికి కార్పెట్ సోఫా,
పేద వారికి పెన్నిది చాప.

సీతాపతి కి చింకి చాపే గతి,
చాప చిరిగిన… చదరంతైనా మిగలక పోదు
తెలియక కొంపలు ముంచే జబ్బుకు
చాప కింద నీరు చందం.
రకరకాల నానుడులు
నాలుకపై నానే చాప.

అతివలకు అవసరమై
ఆదరణకు ప్రతీకవై
ప్రతి ఇంటను నిలిచే చాప.

నడిసంద్రపు నడిచే నావకు
తెరచాపే ఉపయోగం.
సంసారపు నావలకు
సతులే తెరచాపలు.
విలువలెరిగి పతులంతా
నడపాలిక నావలను
ఎదురు అలలు లేకుండా
వడిదుడుకులు రాకుండా.

మానవుల మనుగడలో
మార్పు లొచ్చే ఎన్నెన్నో…
ఫ్యాషన్ కాదంటు నిన్ను
చిన్న చూపు చూసేరు
చుట్ట చుట్టి మూలలకు
నెట్టి వేసి రామ్మా నిన్ను.

దుమ్ము ధూళి అంటినను
మాసి పోదు నీ విలువ
లక్షల ఆస్తులు గడియించినను
పట్టు పరుపుపై నిదురించినను
మృత్యుదేవత వచ్చి పిలిచిన
గతి నీవే అందరికీ
ఇది తెలిసేది ఎందరికి?.