23. ఆరాటం

0
5

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]అ[/dropcap]లుపెరగని పోరాటం చేస్తూనే ఉంటా
అనంత విశ్వంలోకి తొంగి చూడాలని కలలు కంటూనే ఉంటా

మదినిండా ఉత్సాహం
ఎదనిండా ఆరాటం

పండగంటేనే సంబరం
బాల్య మంటేనే సంతోషం

అమ్మా నాన్నల ముద్దుల పాపగా పెరిగా
ముద్దుముచ్చట్లకు చిరునామాగా సాగా

బంధువుల అందరి నోటెంట ఒకటే మాట
వరాల తల్లివే నీవు

అనురాగాల వల్లివే నీవు
ఆణిముత్యాల కల్పతరువే నీవు

అంతలోనే తోడుగా తమ్ముడొస్తున్నాడని మురిసా
ఆటపాటలతో అలరించాలని ఊహల్లో తడిసా

వదలక చెయిపట్టుకు నడిపించాలని ఊహించా
ఎప్పుడెప్పుడాయని ఆ రోజు కోసమే తపించా

అంతలోనే ఏమయిందో ఏ కారుమేఘం కమ్ముకుందో
అర్థంకాదే నా చిన్న బుర్రకి అమ్మ కన్పించదు కన్పించే నాన్న మాట్లాడడు ఎంతకి

నాన్నమ్మ ఎందుకు ఈసడిస్తుందో తెలీదు
అత్తమ్మ చీత్కరింపు దేనికో అసలే తెలీదు

అమ్మలా లాలించే వారు లేరు
ఆమెలా నన్ను మురిపించేవారే కానరాలేదు

వగచి వగచి వెతికా ఆమె కోసం
కంటికి రెప్పలా నన్ను కాపాడే ఆలంబన కోసం

నిద్రలేని రాత్రులెన్నో గడిపా అలసి
చీకట్లో భయానక స్వప్నాలెన్నో కన్నా సొలసి

బంధువులందరిదీ ఒకటే మాట
ఇంటికి పట్టిన గ్రహణాన్నే నేనట

తల్లిని మింగిన పిశాచినేనట
దురదృష్టానికి ప్రతీకని నేనేనట

అమ్మకోసమే ఆరాటం
ఈ జన్మకిదే పోరాటం