మీ టూ

0
3

[box type=’note’ fontsize=’16’] “ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళు కూడా మీ టూ అంటూ ట్విట్టర్లలోనో ఫేస్ బుక్కుల్లోనో రెచ్చిపోతే తన గతేమిటి అని.. తల్చుకుంటేనే అతనికి చలిజ్వరం వచ్చినట్టు వణుకొస్తోంది” అంటూ తోటి మహిళా సిబ్బందిని వేధించిన ఓ అధికారి గురించి చెబుతున్నారు సలీం ‘మీ టూ’ కల్పికలో. [/box]

[dropcap]ప[/dropcap]దిహేను రోజుల్నుంచి మన్మధరావుకి మనసేం బావుండటం లేదు. అలజడి.. ఆందోళన.. చిరాకు.. చిన్న శబ్దానికే ఉలిక్కి పడ్తున్నాడు. గుండె వేగంగా కొట్టుకోవడం తెలుస్తోంది. భయమేస్తోంది. పెద్ద హోదాలో ఉన్నాడిప్పుడు. రిటైర్మెంట్‌కి ఇంకా రెండేళ్ళ సమయం ఉంది. బాధ్యతలంటూ ఏమీ లేవు. నాలుగేళ్ళ క్రితం కూతురు జ్యోతికి పెళ్ళి చేశాడు. అల్లుడూ కూతురు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళకో బాబు. కొడుకు శ్రీరాంకి పెళ్ళయి రెండేళ్ళు. ప్రభుత్వ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్.. కొడుకూ కోడలు మేడమీదున్న పోర్షన్లో కాపురం.. తనూ తన భార్య పద్మజ కింది పోర్షన్లో ఉంటారు. అంతా సవ్యంగా, ప్రశాంతంగా ఉందనుకుని సంతోషపడ్తుంటే రెండు వారాల క్రితం వచ్చిన వార్త, తదుపరి పరిణామాలు గుండెల్లో బాంబుల్లా పేల్తున్నాయి.

మొదట దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమోననుకున్నాడు. అది తాటాకు మంట.. తొందర్లోనే చల్లారిపోతుందనుకున్నాడు. కానీ అది కార్చిచ్చులా మారి రోజు రోజుకూ ఉధృతమౌతోంది. అసలు ఆడవాళ్ళకు ఇంత తెగింపు ఎక్కడినుంచి వచ్చిందో అర్థం కావటం లేదు. రోజుకో కొత్త గొంతుక తారాజువ్వలా లేస్తోంది. మృదు మధురంగా పలికే గొంతులనుంచి ఇప్పుడు ప్రళయ భీకర గర్జనలేవో విన్పిస్తున్నాయి. మాటలు తూటాల్లా దూసుకొస్తున్నాయి. కళ్ళల్లోంచి విస్ఫులింగాలు కురుస్తున్నాయి. ఏ రోజు ఎవరి ఖర్మ కాలుతుందో .. ఎవరి పాపం బద్దలవుతుందో.. ఏ క్షణం ఎవరి చితికి నిప్పంటుకుంటుందో తెలియటం లేదు. అది ప్రస్తుతం సినిమా, టీవీ వాళ్ళకు, ప్రింట్ మీడియాకు పరిమితమైంది. కానీ ఈ దావానలం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కూడా పాకితే తన గతేమిటి అనే చింత అతన్ని చితిమంటలా కాల్చేస్తోంది.

ఇదంతా తనుశ్రీ దత్త అనే నటి నానాపటేకర్ అనే ఓ సీనియర్ నటుడి అశ్లీల ప్రవర్తన మీద అభియోగం మోపటంతో మొదలైంది. ఎప్పుడో పదేళ్ళ క్రితం అతని దుష్ప్రవర్తన వల్ల ఆమె శారీరకంగా, మాన సికంగా హింసపడిన విషయం ఇప్పుడు బైట పెట్టడం ఆలస్యం సామాజిక మాధ్యమాల్లో పెను తుఫాన్లు చే లరేగాయి. ఇరవై యేళ్ళ క్రితం టీవీ సీరియల్స్లో సూపర్ స్టార్లా వెలిగిన అలోక్‌నాధ్.. సంస్కారి పాత్రల్లో రాణించి తన్నుతాను నీతిమంతుడిలా ప్రొజెక్ట్ చేసుకున్న అలోక్‌నాధ్.. పరమ నీచుడనీ, తనకు మత్తు పానీయం తాగించి రేప్ చేశాడని ఓ రైటర్ కమ్ నిర్మాత సంచలన ప్రకటన చేసింది. యం. జె. అక్బర్ అనే పత్రికా సంపాదకుడు కూడా ఇలాంటివాడే అంటూ ఓ జర్నలిస్ట్ బాంబు పేల్చింది.

మన్మధరావుకి ఇప్పుడు పట్టుకున్న దిగులేమిటంటే ఇది ఇలానే పెరిగిపెరిగి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళు కూడా మీ టూ అంటూ ట్విట్టర్లలోనో ఫేస్ బుక్కుల్లోనో రెచ్చిపోతే తన గతేమిటి అని.. తల్చుకుంటేనే అతనికి చలిజ్వరం వచ్చినట్టు వణుకొస్తోంది. ఐనా ఈ ఆడవాళ్ళకిదేం పాడు బుద్ధి? ఎప్పుడో పదేళ్ళ క్రితమో ఇరవై యేళ్ళ క్రితమో జరిగిన వాటిని ఇన్నాళ్ళూ కొంగుల్లో దాచి పెట్టుకుని ఇప్పుడు దులుపుకోవడమేమిటో.. పాపం వాళ్ళయినా ఏం చేస్తారు? అప్పుడే నోరెత్తి ఉంటే ఉన్నత స్థానాల్లో ఉన్న ఆ మగవాళ్ళు వాళ్ళని తమ కెరీర్లో పైకి రాకుండా అధఃపాతాళానికి తొక్కేసి ఉండేవాళ్ళు కదా.

తనైనా వూర్కునేవాడా? పదేళ్ళ క్రితం తనకు పియ్యేగా పని చేసిన స్వాతిని ఎలా బెదిరించాడో ఇప్పుడు స్పష్టంగా గుర్తుకు వస్తోంది. స్వాతికి పెళ్ళి కాలేదు. పాతికేళ్ళ వయసులో చలాకీగా చాలా అందంగా ఉండేది. పియ్యేకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఆ రెండేగా. ఆమె తన ఛాంబర్లోకి వస్తే చాలు శరీరంలో కెమికల్స్ ఏవో సంయోగం చెంది వికారాలు మొదలయ్యేవి. ద్వంద్వార్థాల మాటలు.. కుళ్ళు జోకులు.. చొంగకార్చుకుంటూ ఎక్కడెక్కడో తడిమే చూపులు… అసహాయంగా నిలబడి ఉన్న మేకపిల్లని చూసి తోడేల్లా నవ్వే వెకిలి నవ్వులు.. స్వాతి ఇబ్బంది పడేకొద్దీ తనకు సంబరంగా ఉండేది.

ఓ రోజు నడుం మీద చేయి వేసి బలంగా తన వైపుకు లాక్కున్నాడు. స్వాతి విసురుగా అతన్ని నెట్టేసి ‘సార్.. ఏంటిది? మీరిలా అసభ్యంగా ప్రవర్తించారని మీ పై అధికారికి కంప్లయింట్ చేస్తాను’ అంది.

‘సరే చేయి. వాళ్ళని ఎలా మేనేజ్ చేసుకోవాలో నాకు తెల్సు. కానీ నీ ఫ్యూచర్ గురించే ఆలోచించు. నీకు ప్రమోషన్ రాకుండా చేయగలను. ఏవో కారణాలు చూపి నిన్ను సస్పెండ్ చేయించగలను. నీ ఉద్యోగాన్ని పీకించగలను. నీ ఇష్టం. ఒకటి మాత్రం గుర్తుంచుకో. నువ్వు కొండను ఢీకొంటున్నావు. కొమ్ములు విరగడం తప్ప ఫలితం ఉండదు’ అంటూ విలన్‌గా నవ్వాడు. స్వాతి అందమైన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వరదలా పొంగుకొచ్చాయి. ఆమె అసహాయత తనకు బాగా తెల్సు. పేద కుటుంబం. తండ్రి లేడు. తల్లే నలుగురు పిల్లల్ని కష్టపడి సాకింది. ఇప్పుడు స్వాతి సంపాదనే వాళ్ళ కుటుంబానికి ఏకైక ఆధారం. పక్షి ఎగరలేదు. రెక్కలు బలహీనంగా ఉన్నాయి. పంజరంలో బంధించడం సులువైపోయింది.

తన సర్వీస్‌లో ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడో.. తను కోరుకున్న ఆడది తన దుర్మార్గాలకు తలవొంచినపుడల్లా గర్వంగా మీసం మెలేశాడు. పదవిని అడ్డు పెట్టుకుని బెదిరించి, భయపెట్టి లొంగ దీసుకున్నాడు. ఇరవై యేళ్ళ క్రితం ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‍గా చేరిన పల్లవి గుర్తొచ్చింది. ఇరవై రెండేళ్ళ వయసు. డిగ్రీ పూర్తయిన ఏడాదిలోపలే ఉద్యోగం వచ్చింది. సర్వీస్‌లో ఉన్న వాళ్ళ నాన్న గుండెనొప్పితో చనిపోవడంతో కంప్యాషనేట్ గ్రౌండ్ మీద ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు. మొదటి పోస్టింగ్ తన దగ్గరే.

‘నువ్వు చాలా అదృష్టవంతురాలివి తెలుసా? నా కింద పని చేసిన అమ్మాయిలందరూ ఇప్పుడు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు తెచ్చుకుని పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నారు’ అన్నాడు.

వింటున్న పల్లవి కళ్ళు ఆశగా మెరవడం గమనించాడు. ‘జీతం సరిపోకపోతే చెప్పు. అవసరాలేమై నా ఉంటే మొహమాటపడకు. నేను తీరుస్తాను’ అంటూ భరోసా ఇచ్చాడు.

‘మా తండ్రి చనిపోయినా తండ్రిలా ఆదరించే మీలాంటి బాస్ దొరకడం నిజంగా నా అదృష్టం సార్’ అంది పల్లవి.

‘తండ్రిలా కాదు.. ఓ ఫ్రెండ్‌లా..’ అంటూ నవ్వాడు.

అతని ఆంతర్యం ఏమిటో మొదట్లో పల్లవికి అర్థం కాలేదు. బాస్ మంచివాడే కానీ వాచాలత్వం ఎక్కువ అనుకుంది. కొన్ని రోజుల తర్వాత వేపకాయంత వెర్రి ఉందేమో అనుకుంది. చివరికి అర్థమైంది అది వెర్రి కాదు మద పిచ్చి అని. ఆ అమ్మాయి ఎదురు తిరుగుతుందేమోనని ముందునుంచే ఆమెకు వ్యతిరేకంగా ఓ ఫైల్ తయారుచేసి పెట్టాడు. చేయి పట్టి లాగినపుడు కళ్ళనిండా అపనమ్మకంతో తన వైపు అసహ్యంగా చూసిన పల్లవితో ‘నేను ఏనుగుని. నువ్వో చీమవి. నోరెత్తావా కాళ్ళకిందేసి నలిపేస్తాను జాగ్రత్త’ అంటూ బెదిరించాడు. ఆమె గుడ్ల నీరు కుక్కుకుంటుంటే శాడిస్టిక్ ఆనందాన్ని పొందాడు.

ఇప్పుడు స్వాతి, పల్లవి ఉద్యోగాల్లో నిలదొక్కుకున్నారు. మంచి పొజిషన్లలో ఉన్నారు. మీ టూ అంటూ స్వాతిగాని పల్లవిగాని అప్పుడెప్పుడో జరిగిన దారుణాల్ని బైటికి చెబితే తన పరువేం అవుతుంది? తన నిజస్వరూపం ఏమిటో తెలిస్తే తన కూతురేమనుకుంటుంది? అల్లుడు మొహం మీద వూయడా? కొడుక్కి తనంటే ఎంత గౌరవమో.. ఆఫీస్‌లో తన రాసలీలలు తెలిస్తే చులకనగా చూడడా.. అసహ్యించుకోడా… కోడలి ముందు తను తలెత్తుకోగలడా? ఈ ఆడవాళ్ళు ఏనాడో సమాధుల్లో పాతేసిన శవాల్ని ఇప్పుడు ఎందుకు బైటికి లాగుతున్నారో? బహుశా ఆ గాయాల్ని వాళ్ళు సమాధి చేసి ఉండరు. ఇప్పటికీ గుండెల్లో పచ్చిగా మోస్తూ ఉండి ఉంటారు. అవకాశం దొరకటం ఆలస్యం దాన్ని నిప్పు కణికలా మార్చి ఇప్పుడు బైటికి వూసేస్తున్నారు. తనలాంటివాళ్ళు అందులో మాడి మసైపోతున్నారు.

దేవుడా.. ఇప్పుడు తనకేమిటి దారి? స్వాతీ పల్లవే కాదు.. తన వల్ల భంగపడిన ఏ ఆడదో నోరెత్తితే చాలు.. తన జీవితం నరక ప్రాయం కావడం ఖాయం.. తన బతుకు బురద గుంటలో దొర్లే పందికన్నా అధ్వాన్నం కావటం ఖాయం.. ఐనా పదీ ఇరవై యేళ్ళ క్రితం జరిగిన దానికి సాక్ష్యాలేముంటాయి? ఏ ఆధారాలతో నిరూపిస్తారు? అనుకోగానే అతనికి ధైర్యం వచ్చింది. ఎవరైనా తన మీద మీ టూ అంటూ నిప్పులు కక్కితే తను వాళ్ళ పైన పరువునష్టం దావా వేస్తాడు. అవసరమైతే హై కోర్టు, సుప్రీం కోర్టుక్కూడా వెళ్తాడు.

ఇలా అనుకుని తన మనసుకి ఎంత సాంత్వన చెప్పుకుందామన్నా అలజడి మాత్రం తగ్గడం లేదు. గుండె దడ పెరిగిపోతూనే ఉంది. వళ్ళంతా చెమటలు పట్టడం ఆగటం లేదు.

లాయర్ సలహా తీసుకోవడం ఎందుకైనా మంచిదని ఆలోచించి తనకు బాగా తెల్సిన లాయర్ కామేశానికి ఫోన్ చేశాడు. తను చేసిన అకృత్యాల గురించి చెప్పకుండా ‘మా ఆఫీస్‌లో నాకు శత్రువులు చాలా మంది ఉన్నారు. మా ఆఫీస్‌లో పని చేసిన లేదా చేస్తున్న స్త్రీలని ఎవరైనా ప్రలోభపెట్టి నా మీద కూడా మీ టూ అంటూ బురద జల్లే ప్రయత్నం చేస్తారేమోనని ఆందోళనగా ఉంది’ అన్నాడు.

‘ప్రలోభపెడితే ఆడవాళ్ళు మీ టూ అంటూ పబ్లిక్‌లోకి వస్తారని ఎందుకనుకుంటున్నారు?’

‘బీజేపీ నాయకుడొకడు నానాపటేకర్ని సమర్థిస్తూ మూడ్నాలుగు లక్షలిస్తే చాలు ఆడవాళ్ళు అమాయక సెలబ్రిటీలను ఇరికించడానికి రెడీ అని చెప్పాడుగా’

‘చాలా తప్పుడు అభిప్రాయం. ఎన్ని లక్షలు కుమ్మరించినా ఏ ఆడదీ తన శరీరం మీద సెక్సువల్ దాడి జరిగిందని అబద్ధాలు చెప్పదు. ఎందుకంటే అలా బైటపడటానికి చాలా ధైర్యం కావాలి. తెగింపు కావాలి. ఎందుకంటే అటువంటి దాడి జరిగేది కేవలం ఆమె శరీరం మీద మాత్రమే కాదు. ఆమె మనసు మీద.. ఆమె ఆత్మ మీద కూడా.. అంతులేని వేదనని గుండెల్లో దాచుకున్న స్త్రీకి మాత్రమే ఆ తెగువ ఉంటుంది. అది డబ్బుతో రాదు’

‘ఎప్పుడో ఇరవై యేళ్ళ క్రితం ఎవరో ఏదో చేశారని అతని మీద నేరం మోపితే దానికి రుజువేముంటుంది? అతను కోర్టులో ఆమె మీద పరువు నష్టం దావా వేయవచ్చుగా’

లాయర్ పెద్దగా నవ్వాడు. ‘కోర్టులో కేస్ వేస్తే అతను గెలుస్తాడో లేదో తర్వాత విషయం. మొదట అతని పరువు పోవటం ఖాయం కదా. తప్పు చేసిన వాళ్ళకి కోర్టులే శిక్ష వేయనవసరం లేదు. మీ టూ ఆ యుధం చేతబట్టిన ఆడవాళ్ళు కూడా శిక్ష వేస్తున్నారు. సామాజికంగా సదరు మగవాళ్ళ పేరు ప్రతిష్ఠల్ని కత్తితో నరికే శిక్ష.. అతని కుటుంబ సభ్యుల మధ్య అతన్ని నగ్నంగా నిల్చోబెట్టే శిక్ష..?’

మన్మధరావుకి గుండెలో నొప్పి మొదలైంది. కళ్ళ ముందు స్వాతి, పల్లవి చేతిలో పొడవాటి కత్తిని పట్టుకుని నిలబడి కన్పిస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళ చేతుల్లో పదునైన కత్తెరలు కూడా ఉన్నాయి. అందరూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ముందుకు వస్తున్నారు. తనిప్పుడు నగ్నంగా ఉన్నాడు. కత్తులూ కత్తెరలూ తన శరీరం మీద కరాళ నృత్యం చేయబోతున్నాయి.. శరీరం మీదేనా? తన పరువు మీద.. మర్యాద మీద.. సమాజంలో తనకున్న గౌరవం మీద.. మన్మధరావు పెద్దగా అరిచి కుప్పకూలిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here