44. సిగ్గేస్తోంది

0
7

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]పు[/dropcap]న్నామ నరకం నుంచి
తప్పిస్తాడనే ఆశతో
ఆరాట పోరాటాల నడుమ
అమ్మ జన్మ నిస్తే
మగవాడినై పుట్టినందుకు గర్వపడ్డాను.

బాధ్యతలు తలకెత్తుకుంటాడని
ఆశపడి, కష్టపడి, ఇష్టపడి
నాన్న చెమట రూపాయలుగా మార్చి
పెద్ద చదువులు చదివిస్తే
మగవాడినై పుట్టినందుకు గర్వపడ్డాను.

తన బరువు బాధ్యతలు మోసే
మనిషి దొరికాడని అలి ఆనందిస్తే,
మామ మురిసిపోయి, బావమరిది
కాకాలతో బాకా ఊదితే, మీసం మెలేసి
మగవాడినై పుట్టినందుకు గర్వపడ్డాను.

సమాన స్వేచ్చ నిచ్చి, సమాన హక్కులు
సంపద లొసగినందుకు
ఆదర్శ తండ్రినని
కూతురు పొగుడుతుంటే
మగవాడినై పుట్టినందుకు గర్వపడ్డాను

కాని సాటి మనిషిని (స్త్రీని)మనిషిగా గుర్తించక
తనకూ అక్క, చెల్లి, తల్లి ఉన్నారని, ఉంటారని మరచి
లేని రాక్షసులని, కిరాతకులని
తలపిస్తూ, మరపిస్తూ
కీచకులకి,
బందువుగా, రాబందువుగా
సంచరించే ఆ మృగాడిని చూసి మాత్రం
మగవాడినై పుట్టినందుకు సిగ్గు పడుతున్నాను.