తెలంగాణ మలితరం కథకులు – కథనరీతులు-9: హాస్యబ్రహ్మ దూపాటి సంపత్కుమారాచార్య కథలు

0
8

[box type=’note’ fontsize=’16’] “తెలంగాణలో కేవలం హాస్య కథకుడిగా గుర్తింపు పొందిన మొదటి రచయితగా దూపాటి సంపత్కుమారాచార్య గురించి చెప్పుకోవాలి, సంఘటనల పరంగా, సన్నివేశాల పరంగా హాస్యాన్ని సృష్టించడం వారి ప్రత్యేకత” అని వివరిస్తున్నారు కె.పి. అశోక్‌కుమార్. [/box]

[dropcap]ఖ[/dropcap]మ్మం జిల్లాలో సత్తుపల్లి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో వుండి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. భౌగోళికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ, ఆంధ్ర ప్రాంత ప్రభావం ఇక్కడి వ్యక్తుల మీద ఎక్కువగా వుంటుంది. అలాంటి సత్తుపల్లి ప్రాంతానికి చెందిన హాస్య కథా రచయిత కీ.శే. దూపాటి సంపత్కుమారాచార్య. వీరి కథలలో హాస్యం, వ్యంగ్యం, అధిక్షేపం ప్రత్యేక లక్షణాలుగా కనిపిస్తాయి. వీరి కథలను ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, సైనిక సమాచార, గోలకొండ, ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా పత్రిక, చుక్కాని మొదలైన పత్రికలు ప్రచురించాయి. అందులోంచి ఎంపిక చేసిన 15 కథలతో “శ్రీమతి నిరసన దీక్ష” పేరిట పుస్తకంగా వెలువరించారు. మునిమాణిక్యం నరసింహారావు గారి ‘కాంతం’ మాదిరిగా, వీరు ‘శ్రీమతి’ అనే నాయికను సృష్టించారు.

వీరు రావులపాటి పీతాంబర్‌రావ్‌ సహరచయితగా కూడా కొన్ని కథలు రాశారు. వీరు వ్రాసిన అనేక నాటికలు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యాయి. కళాజ్యోతి పత్రిక వీరి నవలలను ధారావాహికంగా ప్రచురించింది. విజయభేరి ‘రస గుళికలు’ అనే హాస్య పద్యాలను ప్రచురించింది. వీరు అనేక చోట్ల అష్టావధానాలు చేసి పండిత ప్రకాండుల చేత సన్మానాలు పొందారు. వీరి అవధానాలలో హాస్య ప్రసంగ తరంగాలు శ్రోతలను ఉర్రూతలూగించేవి. నిగర్వి, నిరాడంబరుడు అయిన ఆచార్యుల వారు 1952 నుంచి కొంత కాలం కళాశాలాధ్యాపకులుగా కూడా పనిచేశారు.

దూపాటి సంపత్కుమారాచార్య వెలువరించిన “శ్రీమతి నిరసన దీక్ష” అనే కథా సంపుటంలో 15 కథలున్నాయి. ఇందులో మొదటిదైన టైటిల్ కథలో అఖిల భారత అర్ధాంగుల సంఘంవారు తమ కార్యక్రమాన్ని తొలుత ప్రారంభిస్తూ లాంఛనంగా నిరసన దీక్ష ఒకరోజు సాగించాలని నిర్ణయిస్తారు. నిరసనదీక్షలో పాల్గొనడానికి భార్య, వద్దని భర్త వాదించుకునే క్రమంలో “ఆడవాళ్ళను అణగద్రొక్కాలని మగవాళ్ళ తహతహ” అని భార్య అంటే, “అలా అనకు! ఆడవాళ్ళను అణగద్రొక్కడం ఎప్పుడూ ఏ మగవాడూ చెయ్యలేదే. ఆఖరుకు భగవంతుడు కూడా” అంటాడు భర్త. చివరకు భార్య నిరాహార దీక్షకు కూర్చుంటే, అది మాన్పించడానికి భర్త కూడా నిరాహారదీక్షకు కూచుంటాడు. తద్దినం రోజున కాఫీని కర్తా – భోక్తా పుచ్చుకోవలసిందే తప్పు లేదు అంటారు. అందుకని భార్యభర్తలిద్దరూ కాఫీ పుచ్చుకుని నిరహారదీక్ష చేస్తారు. “ఇవాళ మనం చేస్తున్న నిరాహార దీక్ష వల్ల ఎలాగైనా ‘భర్తలు’ అని పిలవబడే మగవాళ్ళకు కొంచెం మెలకువ వస్తుంది” అని తీర్మానించి, “ఈ నిరాహార దీక్షలు అనే హంగర్ స్ట్రయిక్ దీక్షలు పడతాం. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది వుండదు” అని నిర్ణయిస్తారు. నీరసించిపోయి మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన భార్య, భర్తతో కలిసి వంటకు ఉపక్రమించడంతో “శ్రీమతి నిరసన దీక్ష” పూర్తవుతుంది.

అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆర్థికమంత్రి పదవిని ఎవరైనా స్త్రీలకు ఇవ్వదలిస్తే, ఇప్పట్లో భారత జనాభాలోని స్త్రీలందరిలోనూ సులభంగా దొరకగలిగేది మా ఆవిడ ఒకతేనని మనవి చేస్తున్నాను. ప్రతి నెలా ఇంకో పదిహేను రోజుల్లో వేతనం (గ, స, డ, ద, వా దేశ సంధి ప్రకారం లాగా వేదనం కూడా అనవచ్చునని కొందరు రీసెర్చ్ చేశారు) వస్తుందంటే ముందుగానే ఓ చిన్న బడ్జెట్ సమావేశం గావిస్తుంది మా శ్రీమతి” అంటాడు భర్త. వచ్చే డబ్బుకు ఆదాయ వ్యయాలు లెక్కించి, లోటు ‘బడ్జెట్’ పూరించడానికి ఆమె చేసే సూచనలు, వాటిని నీరుకార్చడానికి భర్త చేసే ప్రయత్నాలను ఈ కథలలో చూడవచ్చు. ఈ కథలపై మునిమాణిక్యం నరసింహారావు ప్రభావం వుందని అంటారు. కాంతం కథల్లో కాంతం గడుసరి, తెలివైనది. అయితే కాంతం కథల్లో ఆమెదే పై చేయి అవుతుంది. కానీ దూపాటి వారి కథల్లో భార్య అమాయకత్వం, నిజాయితీ కనిపిస్తే – భర్త గడుసరితనం, ఆమెను ఆటపట్టించడం కనిపిస్తుంది.

రచయిత శ్రీమతినే కాకుండా మామ్మగారి చాదస్తాన్ని, చిట్టి పంతులు అమాయకత్వాన్ని కూడా కథలుగా మలచగలిగారు. “పెళ్ళికొడుకుతో చాదస్తం మామ్మగారి ఇంటర్వ్యూ” – మామ్మగారంటే ఎవరనుకున్నారు? అసలు ఇలాంటి మామ్మలుంటే చాలు ప్రపంచం జయించవచ్చు. చాదస్తం వల్ల, చత్వారం వల్ల ఆమె చేసే పనులన్నీ వికటించి, చూసేవాళ్ళకు బోలెడంత హాస్యాన్ని సృష్టిస్తాయి. పెళ్ళికొడుకుని పరామర్శించడానికి విడిదికెళ్ళిన బామ్మగారి అమాయకత్వం, చాదస్తం పెళ్ళికొడుకుకి కాలక్షేపంలా తయారై వినోదాన్ని పంచుతుంది.

“సిటీ బస్సు – చిట్టి పంతులూ” కథలో, చింతకాయపాలెంలో వుండే చిట్టిపంతులుకు హైదరాబాద్ నగరాన్ని చూడాలని చిరకాల వాంఛ. తన ముప్పది ఎనిమిదో యేట ఆ మారుమూల పల్లె నుండి హైదరాబాద్ చూడడానికి వెళుతుంటే, ఊళ్ళో వాళ్ళంతా తమకు కావల్సిన వస్తువుల చిట్టా, డబ్బూ ఇచ్చి పంపిస్తారు. హైదరాబాదులో ఉన్న చిట్టిపంతులు గారి చిన్న బామ్మర్ది అతడ్ని రిసీవ్ చేసుకుని ఓ బస్సులో ఎక్కి ఎక్కడ దిగచ్చో రాసి యిచ్చి చిట్టిపంతులును పంపించేస్తాడు, నగరాన్ని చూసి రమ్మని. చిట్టిపంతులు హైదరాబాద్ అంతా తిరిగి ఏమేమి చూశాడో రచయిత ఇందులో చెప్పలేదు. మొత్తానికి హైదరాబాద్ సిటీ బస్సులో ప్రయాణం చేసి అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకుంటాడు. అందుకని సిటీ బస్సుల గురించి చిట్టిపంతులు ఉద్దేశాలు, అతడు చేసిన ప్రయాణాలు, అవి చివరికి అతని పాలిట సాహసాలుగా ఎలా పరిణమించాయో ఈ కథలో వివరంగా తెలియజేశారు.

“కాకాల బాకా”. అసలు ఈ కాకా శబ్దం ఎలా పుట్టిందో గాని, ఇది చేసే హంగామా యింతా అంతా కాదు. కాకా పట్టడం అనేది క్రియా పదం. గ్యారంటీగా ఈ కాకా పట్టేవాళ్ళకెలాంటి పనులైనా సాధ్యమే. ఎవరి చెవుల్తో వాళు తమ ఘనత వింటే చాలు, వాయువు నిండిన బ్లాడరూ, సైకిలు ట్యూబు మోటారు ట్యూబులా ఉబ్బిపోతారు. కాకా పట్టడం కూడా ఒక కళ. అది అందరికీ రాదు. ఎదుటి వ్యక్తికి కాకా పడుతున్నాడన్న విషయమే తెలీకుండా, నేర్పుగా అతడ్ని ప్రశంసించడంలోనే కాకాసురుల ప్రతిభ దాగి వుంది. కాకా పట్టడంలోని ప్రయోజనాలను చిన్నప్పుడే గమనించిన కామేశ్వరరవు అటు స్కూల్లోనూ, త్వరగా ఉద్యోగం సంపాదించుకోడంలోనూ విజయం సాధిస్తాడు. కాకాల కామేశ్వరరావును కాకాలు పట్టడంలో అందె వేసిన చేయి అని అఖిలాంధ్ర ప్రదేశం (తెలంగాణతో సహా) ఒప్పేసుకుంటుంది. ఒకసారి బస్సు ప్రయాణంలో పరిచయమైన సుందరితో సినిమాకు వెళ్ళడానికి డబ్బులకోసం ఆఫీసువాళ్ళను, పర్మిషన్ కోసం జె.డి.ని కాకా పట్టి అతి కష్టం మీద పది రూపాయలు సంపాదించి బయలుదేరుతాడు. గడ్డం పెరిగినట్లుగా ఉందని భావించి షేవింగ్ కోసం సెలూన్‌లోకి అడుగుపెడతాడు. అక్కడ మంగలి “రండి బాబుగారూ! రండి. దయ సేయండి. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు! కూకోండి” అంటాడు ఎరిగున్నవాడిలాగా. కామేశ్వరరావు ఊరి గురించి, వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళ నాన్న దాతృత్వం గురించి పొగుడుతాడు. వాళ్ళ నాన్న గెడ్డం గీయడం అనే ఘనకార్యం వివరించి, మళ్ళీ అంత గొప్ప గెడ్డం కామేశ్వరరావుదేనని తేల్చి వేస్తాడు. చిన్నప్పుడు అతన్ని ఎత్తుకుని పెంచానంటాడు. గెడ్డం గీసిన తర్వాత పది రూపాయలు ఇచ్చి కామేశ్వరరావు చిల్లర కోసం ఎదురుచూస్తూంటే, మంగలి “అయ్యగారు గెడ్డానికి పదిరూపాయలు ఇచ్చారు, వాళ్ళ నాన్నలాగే గొప్ప బుద్ధి. ఈ డబ్బులతో మిఠాయి తీసుకుని ఇంటికెళ్ళి అమ్మని సినిమాహాలుకు తీసుకురా. బాబుగోరు పేరు చెబుతాం. ఆయనకు లెక్కట్రా ఇలాంటి రూపాయలు” అనడం, ఆ పిల్లవాడు పది రూపాయలు తీసుకుని పరుగెత్తడం జరుగుతుంది. ఏమనలేక నోరు మూసుకున్న కామేశ్వరరావు, అందర్నీ బోల్తా కొట్టించే తననే వాడు బోల్తా కొట్టించాడని తలచి ఇంటి ముఖం పడతాడు.

“ప్రేమారావు పెళ్ళి శుభలేఖ”లో ప్రేమారావు తమ్ముడి పెళ్ళికి పోవటానికి పది రూపాయల కోసం ఆఫీసులో వున్న వారందిరినీ అప్పు అడిగి లేదనిపించుకుని, చివరకు అతికష్టం మీద పది రూపాయలు అప్పు సంపాదించి పెళ్ళికి బయలుదేరుతాడు. ఈ రెండు కథల్లో నాయకుడు పది రూపాయల అప్పు కోసం ఆఫీసులో సహ ఉద్యోగులందర్నీ అడగడం, వాళ్ళ ప్రతిస్పందన – చివరకు పది రూపాయలు సంపాదించడం – సంభాషణలు అన్నీ కొద్ది మార్పులతో ఒకే విధంగా ఉండడం విశేషం.

జీతం వచ్చిందంటే బాకీలకు సరిపెట్టడంతోనే సరిపోతుంది. కవిగారు అదనపు సంపాదన కొరకు పిల్లలు తప్పిపోయిన ప్రకటనలు చూస్తుంటాడు. “ఐదు వెయ్యి నూట పదహార్లు” ప్రకటన చూసి తప్పిపోయిన ఒక ధనవంతుడి అబ్బాయి అనుకుని, ఒక పిచ్చివాడ్ని పట్టుకుపస్తారు. వాడు వీళ్ళందర్నీ ముప్పతిప్పలు పెడతాడు. చివరకు ఆ ధనవంతుడు తమ అబ్బాయి దొరికాడని ప్రకటిస్తే, వీడేవడు? వీడికి పెట్టిన ఖర్చు ఎలా పూడ్చుకోవాలా అని విచారంలో పడతాడు.

“లాటరీ టికెట్” కథలో ఊరంతా అప్పులు చేసి, అప్పుల వాళ్ళ బాధ పడలేక చస్తే బాగుండు, దేవుడా తీసుకు పో అని పదే పదే హనుమంతరావు అంటుంటే, నిజంగానే యమదూత వచ్చి పట్టుకెళ్తాడు. అప్పుడు బతకాలని కోరుకుంటాడు. తన భార్య ఎలా ఉందో, అప్పుల వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడాలని వేడుకుని అన్నీ చూసేస్తాడు. తానుకొన్న లాటరీ టికెట్‌కు లక్ష రావాలనీ, ఇంటికి పంపించేయాలని యమదూతను కోరుకుంటాడు. అంతలో పొరపాటున హనుమంతరావును తెచ్చారనీ, అతడ్ని పంపించేయమని ఆకాశవాణి చెప్పడంతో యమదూత విడిచిపెడతాడు. హనుమంతరావు ఇంటికి వస్తే భార్య దెయ్యాన్ని చూసినట్లు చూస్తుంది. లాటరీ డబ్బుతో ఇల్లు కొందామని హనుమంతరావు, లేదు నగలు కొందామని భార్య వాదులాడుకుంటారు. మీరు చచ్చిపోయారని అందరికీ తెలిసిపోయింది. లాటరీ డబ్బూ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బు నాకే వస్తాయి. అనవసరంగా అడ్డుపడకండి అని భార్య మొండికేస్తుంది. లేదు, నేను బ్రతికే వున్నానని అరుస్తూ వుండగానే హనుమంతరావుకి మెలకువ వస్తుంది. ఇదంతా కలయని తేలిపోయినా, కల నిజమైతే ఎంత  బాగుండు అనుకుంటాడు. ఈ కథలానే “ప్రిస్టేజీ కోసం” కథ కూడా సోషల్ ఫాంటసీయే.

కదిలే రైలులో జరిగే “వేలంపాట”. వేలంపాటలో గిట్టుబాటు ధర రాకపోతే వేలం పాడిన వారికి చిన్న చిన్న బహుమతులిచ్చి తృప్తి పరుస్తుంటాడు వేలం పాడేవాడు. రైళ్ళలో ప్రయాణం చేస్తున్న అవ్వా మనవరాళ్ళు దిగిన తర్వాత బస్‌లో పోవడానికి అయిదు రూపాయలే వారి దగ్గర వుంటాయి. దాంతో గమ్యస్థానం ఎలా చేరడమా అని అవ్వ ఆరాటం. అవ్వ బాత్‌రూంకి పోతే, వేలం పాడేవాడు ఇచ్చే చిన్న చిన్న బహుమతులకు ఆశపడి ఆ మనవరాలు వేలం పాటలో పాల్గొంటుంది. ఆ పాట మనవరాలికే కొట్టేసి డబ్బులు తీసుకుని వాడు వెళ్ళిపోతాడు. ఉన్న పైసలు వేలంలో పెడితే, ఊరికి వెళ్ళడం ఎలా అనే ఆందోళన, కోపంతో ఉగ్రరూపం దాల్చిన అవ్వ మనవరాలిని చితకబాదుతుంది. ఇలా “అనుకున్నదొకటి” అయినదొకటికి మరో ఉదాహరణగా ఈ కథ చూద్దాం. సెకండ్ క్లాసు పెట్టెలో మర్యాదస్తుడి వేషంలో ఎక్కిన దొంగకు, ఎదురుగా మార్వాడి జేబులో ఎత్తుగా ఉన్న పర్సు మీద కన్నుబడుతుంది. వాడు సేటుతో మాటలు కలిపి, ఆయనకు ఒక మత్తు చాక్లెట్ ఇస్తాడు. అది తిని మార్వాడి మత్తుగా నిద్రపోగా, దొంగ వాడి జేబులూ, సామాన్లంతా వెతికినా పర్సు దొరకదు. పొద్దున లేచిన మార్వాడి తన జేబులోంచి పర్సులోంచి డబ్బు తీసి టీ తాగడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు మార్వాడి – తన పర్సు ఎక్కడ దాచాలో తెలియక దొంగ హోల్డాల్‌లో, అతని తల కిందనే పెట్టాననీ, అది భద్రంగానే వుందని చెప్పి స్టేషన్‌లో దిగి వెళ్ళిపోవడంతో దొంగ నోరెళ్ళబెడతాడు. ఇవి రెండు రైలు కథలు. మొదటి కథలో రైళ్ళలో జరిగే వేలంపాటలలో వున్న మోసాలని తెలియజేస్తే, రెండవ కథ రైళ్ళలో జరిగే దొంగతనాల గురించి మనల్ని అప్రమత్తం చేస్తుంది.

“అ ఆ ఇ ఈ” అంటే ‘అ’త్తగారు ‘ఆ’తనికి ‘ఇ’చ్చిన ‘ఈ’స్ట్రన్ స్టార్ సైకిలు. ముకుందానికి అత్తగారు పెళ్ళప్పుడు సైకిలు ఇస్తామని చెప్పి ఎన్నాళ్ళకూ ఇవ్వలేదు. చివరకు అఖిల భారత అల్లుళ్ళ సంఘం ఆదేశం మేరకు ముకుందం కాపుర నిరాకరణోద్యమం ప్రారంభించి భార్యను పుట్టింటికి పంపించేస్తాడు. ఒకరోజు హఠాత్తుగా మామగారు తన కూతుర్నీ, ఈస్ట్రర్న్ స్టార్ పాత సైకిల్‌ని దిగబెట్టి వెళతాడు. ఆ సైకిల్‌కి రిపేర్‌కనీ, కొత్త ట్యూబు, టైర్లకని బయటి నుంచి అప్పు తెచ్చి బాగు చేయిస్తాడు. తీరా అది వాడుకునే లోపుల, దొంగిలించిన సైకిలు అని పోలీసులు పట్టుకుపోతారు. ఈ సంగతి మామగారికి రాస్తే “సైకిలు ఎలా వచ్చిందో అలాగే పోయింది. మొన్నా మధ్య మా ఆఫీసు క్యాంటీన్ ముందు రెండు రోజుల నుండి అక్కడే పడివున్న సైకిలును “ఇదిగో మీ సైకిలు అని క్యాంటీన్ యజమాని బలవంతంగా అంటగట్టాడు. నీవు సైకిలు గురించి పట్టుపట్టేవు కాబట్టి నీకు పంపించేశాను. మరి సైకిలు యజమాని వచ్చి అడిగితే, అతనిది అతనికి ఇచ్చేయక తప్పదు గదా! ఈ మధ్య అల్లుళ్ళ కోరికలు తీర్చేందుకు మామగార్లకు అప్పుగా కొంత డబ్బు ఇవ్వాలనే ప్రతిపాదనలున్నాయని మా యం.యల్.ఎ. చెబుతున్నాడు. కాబట్టి ఈసారి అసెంబ్లీ సమావేశం దాకా ఓపికపడితే నీకు మంచి సైకిలు కొనివ్వగలను” అని ఉత్తరం రాస్తాడు. అది చూసి ముకుందానికి ఏడుపే మిగులుతుంది. ఇక బడిపంతులు సన్యాసిరావు చాలీచాలని జీతంతో పండగ వచ్చిందంటే హడలిపోతుంటాడు. ముగ్గురు కూతుర్లను పండగకి పిలిచి మర్యాదలు చేసే తాహతు లేదు. అల్లుళ్ళ పీడను భరించలేడు. అప్పుడు తాను పెళ్ళయిన కొత్తలో బహు కుటుంబీకుడైన తన మామను పీడించిన విధానం జ్ఞాపకం వచ్చి పశ్చాత్తాపం చెందుతాడు. “మామా అల్లుడే!! ఒకప్పుడు” తను తన మామను సైకిలు కోసం ఏడ్పిస్తే, ఇప్పుడు తన అల్లుళ్ళు కట్నాల కోసం తనను ఏడిపిస్తున్నరని తెలుసుకుంటాడు. ఈ రెండు కథలలో అల్లుళ్ళు సైకిలు కోసం మామలను ఏడిపించడం ఒకేలా వచ్చింది.

ప్రజలకు మంచి వైద్యం అందజేయడానికి డాక్టర్ ధనుంజయ కొత్త మందులు తెలుసుకోవాలనీ, ఇంజక్షన్ ఇవ్వడం నేర్చుకోవాలని ఊరి కమిటీ తీర్మానిస్తుంది. డాక్టర్ ధనుంజయ ఇంజక్షన్లు ఇవ్వడం నేర్చుకోడానికి పడిన పాట్లు, చివరకు డాక్టరు ధనుంజయ ఇంజక్షన్ ఇవ్వడం అంటే రెండో మూడో నరాలు తెగిపోక తప్పదని నిర్ధారణ అయిపోతుంది. అందుకే ఆయన “నరాంతకుడు”. ఇక ఉత్తరాల రావు అనే రచయిత, ఎన్నో కథలను రాసి పత్రికలకు పంపించినా, అవి తిరిగి వస్తూనే ఉంటాయి. ఒకసారి పంపిన కథ అనుకోకుండా అచ్చయితే, అందరికీ పత్రికలు ఇచ్చి చదివింపజేసి సంతోషించిన రచయిత, కథకు పారితోషికం కోసం పత్రిక వారికి రాస్తాడు. అయితె పత్రిక వారు ఉత్తరాల రావు రాసిన కథ, రెండేళ్ళ క్రితం తమ పత్రికలోనే వచ్చిన కృతఘ్నం గారి కథయనీ, దానిని మక్కికి మక్కీగా కాపీ చేసి పంపించినందుకు సంజాయిషీ అడుగుతారు. దానికి ఉత్తరాల రావు, నేను ఆ కథ రాసి కృతఘ్నం గారి కూతురితో పరిచయం ఉండడం వలన ఆ కథను సరిచేసి పంపమని ఇచ్చాను. ఇప్పటి వరకు నాకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో, ఆ కథ మీకు పంపించాను. ఇక మీదట నా కథలు ప్రచురించే ముందు, మీ పాత సంచికలు తిరగేసి చూసుకోండని ఉత్తరం రాస్తాడు. దాంతో పత్రిక వాళ్ళు తమ పత్రికలో స్వర్గస్తులైన కృతఘ్నం గారు రెండేళ్ళ క్రితం రాసిన కథ – ఇప్పుడు ఉత్తరాల రావు రాసిన కథ ఒకటేనని మా పాఠకులు, మేము కూడా తేల్చివేశాం.  ఈ చర్చ వలన మా పత్రిక సర్క్యులేషన్ కూడా పెరిగింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటానలు జరగవని హామీ ఇస్తూ, ఇంతటితో ఈ చర్చను ఆపి వేస్తున్నామనే ప్రకటన వెలువడుతుంది. ఈ కథనంతా “ఏడు ఉత్తరాలు”లో సంక్షేపించడం బాగా వచ్చింది.

ఈ కథలన్నీ 1958-70 మధ్యకాలంలో రాసినవే. 1974లో వెలువదిన ఈ “శ్రీమతి నిరసన దీక్ష” అనే సంపుటిలో 15 కథలున్నాయి. ఇవన్నీ హాస్య కథలే. ఈ కథా సంపుటాన్ని ప్రఖ్యాత హాస్యనటుడు రాజబాబుగారికి అంకితం ఇవ్వగా, వారు ఆనందంగా స్వీకరించి రచయితను సత్కరించారు.

ఈ కథలే కాకుండా పత్రికల్లో వచ్చిన మరో ఆరు కథలను పరిశీలిద్దాం. ప్రతి చోటా “దొంగలు!(న్నారు) జాగ్రత్త” అనే బోర్డు వుంటుంది. కానీ దొంగలూ! జాగ్రత్త అనే బోర్డు పెట్టించాల్సిన అవసరం మన రచయిత వల్ల కలుగుతుంది. ఒక రాత్రి రచయిత భార్య గుళ్ళో ఉత్సవాలకని పోతుంది. ఇంటికి తాళం వేసి రచయిత వరండాలో పడుకుంటాడు. అర్ధరాత్రి దొంగలు వచ్చి తాళం తీయడానికి ప్రయత్నిస్తుంటారు. మేలుకొన్న రచయిత వెళ్ళి “తాళం పగలగొట్టకండి, ఇదిగో తాళంచెవి” అని ఇస్తాడు. అందులో ఒకడు కత్తి తీయగా వారించి, తనే ఇంట్లోకి తీసుకెళ్ళి అంతా చూపిస్తాడు. వారు నగలు, డబ్బు గురించి అడిగితే గుమాస్తా జీతంతో వాటిని సంపాదించలేక పోయానని చెబుతాడు. గిన్నెలు తీసుకెళ్దామంటే అవి చిల్లులతో పాతబడి పోయుంటాయి. ఇంత పేద సంసారాన్ని చూసి దొంగలు ఆశ్చర్యపడతారు. బియ్యం కోసం చూస్తే, అవి జీతం వచ్చిన పదిహేను రోజులకే అయిపోయాయి. రేపు ఎక్కడన్నా అప్పు చేయాలె అని చెపుతాడు. దొంగలకు జాలి వేసి, ఇంటికి తాళం వేసి మాతో రా అని రచయితను తీసుకుపోతారు. అలా వాళ్ళు హోటల్‌కు తీసుకుపోయి టిఫిన్, కాఫీ ఇప్పించి బిల్లు కడతారు. “అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తాం. ఏదైనా డబ్బు సహాయం చేస్తాం. వద్దంటే నీ ప్రాణాలు నీవి కావు. నీ భార్యతో కూడా చెప్పు. మీకెలాంటి ప్రమాదం ఉండదని” చెప్పి వెళ్ళిపోతారు. జరిగిన సంగతి విన్న ఆయన శ్రీమతి – “దొంగలలో కూడా మంచివాళ్ళుంటారండి” అని సముదాయిస్తుంది.

ఇంకో కథలో రోజూ కామేశ్వరరావు ఆ దారి వెంట వెళ్తూ, మధ్యలో ఒక ఇంట్లో కనిపించే కమల వైపు చూడడం అలవాటు అవుతుంది. ఇతను వచ్చే సమయానికి ఆమె కూడా ఏదో పని కల్పించుకుని కనిపిస్తునే ఉంటుంది. ఇద్దరూ పెళ్ళయిన వాళ్ళే. ఒకరోజు కమల భర్త దారెంట వెళ్తున్న కామేశ్వరరావును గౌరవంగా ఇంట్లోకి పిలిచి, రచయితగా భార్యకు పరిచయం చేస్తాడు. కాని తాను రచయిత కాదు, వాళ్ళు పొరబడుతున్నారనుకుంటాడు. అంతలో అతను కూర్చున్న కుర్చీ విరిగి, కామేశం కింద పడతాడు. ఆ చప్పుడుకు విలన్ లాంటి వ్యక్తి వచ్చి కుర్చీ విరగ్గొట్టినందుకు నూరు రూపాయలు వసూలు చేసి, నీకు ఆడాళ్ళు కావాలి బే అని చెంపదెబ్బ కొట్టి బయటకు తోసేసి, తలుపులు వేసుకుంటాడు. ముందు జరిగిన గౌరవం, తరువాత జరిగిన అవమానంతో “గౌరవావమానం” అనే కథ తయారయింది. వ్యాకరణ చర్చలతో ప్రారంభమైన ఈ కథ ప్రారంభం ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది.

హైదరాబాద్ నగరంలో పడిన బాధలను వివరించే కథ “హైద్రాబాధ”. ఇందులో అవధాని గారి పెద్దబ్బాయి ఆంజనేయులుకు హైదరాబాదులో ఉద్యోగం దొరకగానే ఇండ్ల వేట ప్రారంభిస్తాడు. ఆయన అనుభవాలను ఇందులో తెలియజేశారు. అలాగే హైదరాబాదులో బస్సు ప్రయాణాలు ఎంత ప్రాణాంతకంగా వుంటాయో వివరించారు. అయితే ఈ కథలో సగ భాగంగా ఉన్న బస్సు ప్రయాణ అనుభవాలు “సిటీబస్సు – చిట్టిపంతులు” కథలోని పంతులు అనుభవాలు ఒకటే. గవర్రాజు గారి అమ్మాయి మాణిక్యమ్మను చూడటానికి, ఇప్పటికి పద్దెనిమిదిసార్లు పెళ్ళిచూపులకు రావడం తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. చివరకు అమలాపురం అంబాజీపేట సంబంధం గంతకు తగ్గ బొంతలా కుదిరిన విషయాన్ని హాస్యభరితంగా తెలియజేశారు.

పారసైట్ కథలో బస్టాండులో వున్న శివానందం దగ్గరకు బిచ్చం వేయమని వచ్చిన కుర్రాడిని అసహ్యించుకుని డొక్కలో తన్ని వెళ్లగొడతాడు. వాళ్ళంతా సొసైటీపై పారసైట్స్ అనీ, వాళ్ళందరినీ బజార్లో పందుల్లా కాల్చి చంపాలని మాట్లాడుతాడు. బస్సులో టికెట్టు కోసం చూసేసరికి పర్స్ కనిపించదు. అది చెబితే ఎవరూ నమ్మక దించేస్తారు. డబ్బు ఎలా అని ఆలోచిస్తూ తిరుగుతూ వుంటే, తన చిన్ననాటి మిత్రుడు రామం కనిపిస్తాడు. వాడ్ని ఓ పది రూపాయలు అప్పు అడిగితే, బిచ్చగాడిలా చూసి వెళ్ళిపోతాడు. దిక్కుతోచక తిరుగుతూంటే, పొద్దున తన్ని వెళ్ళగొట్టిన కుర్రాడు వచ్చి బస్ ఎక్కుతుంటే జారిపడిన పర్సు అందజేస్తాడు. సంతోషించి పది రూపాయలు ఇవ్వబోతే తీసుకోడు. “అంత డబ్బు నా దగ్గర వుంటే దొంగతనం చేశానని కొడతారు. నాకు ఒక్క పైస చాలు” అంటాడు. వాడు నిజమైన మనిషి, అల్పసంతోషి. తను మనిషి కాడు. తనలో మానవత్వం మచ్చుకైనా లేదు. తనే పారసైట్. తనలాంటి వాళ్ళను బజారులో నిల్చోబెట్టి కాల్చివేయాలని రియలైజ్ అవుతాడు.

“శవజాగరణం” కథలో దొంగతనాలు మానేసిన పాత దొంగ రంగయ్య, ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా వినకుండా దొంగతనానికి వెళతాడు. ఊరవతల తాళాలు వేసి వున్న ఒక ఇంట్లో దూరిన రంగయ్యకు ఒక మూలుగు వినిపిస్తుంది. చూస్తే మూల గదిలో మంచానికి అంటుకుపోయిన ఒక ముసలామె. కొడుకులు కోడళ్ళు ఆమెను పట్టించుకోకుండా, ఆమె చావుకై ఎదురుచూస్తుంటారు. దాహంతో అల్లాడిపోతున్న ఆమెకు సేదదీర్చి ఓదార్చిన దొంగతో ఆమె తన బాధలన్నీ చెప్పుకుని, నేను చస్తే నా పిల్లలు అంత్యక్రియలు చేయకూడదు. నీవే దహనం చేయి. ఇది వరకే రాసి వుంచిన వీలునామా తీసుకో అని చెప్పి కన్ను మూస్తుంది. అలాగే రాత్రంతా “శవజాగరణం” చేసిన రంగయ్యను, పొద్దున్న తాళాలు తీసిన ఇంటివాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు. పోలీసులకు పట్టిస్తానంటే, నేనేమీ దొంగిలించలేదు. ఆమె చివరి క్షణాలలో  నేనే ఆమెకు జీవగంజి పోశానని చెప్పి, వాళ్ళ స్వార్థాన్ని తిట్టిపోసి, ముసలమ్మ శవాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు.

ఈ ఆరు కథల్లో నాలుగు 1968-72 ప్రాంతాల్లో వెలువడినాయి. మిగతావాటిలో “గౌరవావమానం” కథ 1991లో, “శవజాగరణం” 1993లో వచ్చింది. ఈ కథలన్నీ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ప్రగతి, చుక్కానీ పత్రికలలో ప్రచురింపబడినాయి.  ఇందులో “పారసైట్”, “శవజాగరణం” సమస్యను ఆధారంగా చేసుకుని రాసిన బరువైన కథలు. దూపాటి సంపత్కుమారాచార్య, రావులపాటి పీతాంబర్‌రావ్‌తో కలిసి రాసిన కథలలో “పారసైట్” ఒకటి. ఈ రెండు కథలూ తప్ప మిగిలినవన్నీ హాస్యకథలే.

సంఘటనల పరంగా, సన్నివేశాల పరంగా హాస్యాన్ని సృష్టించడం వారి ప్రత్యేకత. తెలంగాణలో కేవలం హాస్య కథకుడిగా గుర్తింపు పొందిన మొదటి రచయితగా దూపాటి సంపత్కుమారాచార్య గురించి చెప్పుకోవాలి. సమకాలీన సంఘటనలు, పరిస్థితుల నుండే ఆయన తన కథా వస్తువులను ఎన్నుకుంటారు. అందుకే ఈ కథల్లోని పాత్రలను ఎక్కడో చూచినట్లుగా లేదా మన కళ్ళ ముందు తిరుగాడుతున్నట్లుగా ఫీలవుతాం. ముఖ్యంగా మానవ ప్రవర్తనను వ్యంగ్యంగా విమర్శిస్తూ మనం భుజం తడుముకునేలా చేయడం వారి ప్రత్యేకత.  ప్రథమ పురుషలో కథ చెబుతూ, మధ్య రచయిత ప్రవేశించి వ్యాఖ్యానించడం, కొన్ని విషయాలను వ్యంగ్యంగా చెప్పడం హాస్యకథా ధోరణికి మరింత వన్నె తెచ్చింది. అలాగే మొత్తం కథనంతా ఉత్తరాల ద్వారా నడపడం, పైగా ఆ కథను “ఏడు ఉత్తరాలు”తో ముగించి దాన్నే కథా శీర్షికగా పెట్టడం వైవిధ్యమనే చెప్పాలి. ఇందులో “కాకాల బాకా” ఓ ప్రఖ్యాత ఉర్దూ కథకు స్వేచ్ఛానుసరణ అంటారు. “అనుకున్నదొకటి” కథ ఒక ప్రముఖ ఉర్దూ వార పత్రిక ప్రకటించిన ఒకానొక కథ ఆధారంగా అని చెబుతారు. కాని ఆ కథల పేర్లు, రచయితల పేర్లు చెప్పి ఉంటే బాగుండేది.

మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావులా తమదైన ఒక విలక్షణమైన శైలి దూపాటి వారి రచనల్లో కనిపిస్తుంది. హాస్య వ్యంగ్యాలతో కూడుకున్న ఈ కథలు మంచి పఠనీయతా గుణం కలిగివుండి పాఠకులను ఆసక్తిగా చదివింపజేస్తాయి. ఆహ్లాద పరుస్తాయి.

(తాటికొండాల నరసింహారావు గారికి కృతజ్ఞతలతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here