కట్లపాము కాదు పొట్లకాయే

0
3

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి గంగాధర్ వడ్లమన్నాటి పంపిన హాస్య కథ “కట్లపాము కాదు పొట్లకాయే”. చెప్పుడు మాటలతో ఓ ఆత్మీయ బంధాన్ని దూరం చేసుకోవడం అర్థరహితమని చెబుతున్నారు రచయిత. [/box]

హాల్లో దివాన్ కాట్ పై దుప్పట్లు సరిచేస్తున్నదల్లా, గుమ్మం వైపు చూస్తూ, నవ్వుతో “అరె మంగత్తయ్యా. ఎన్నాళ్ళకి వచ్చావ్. మావయ్య రాలేదా” అంటూ ఎదురెళ్ళి మరీ చిరునవ్వుతో ఆమెని ఎంతో అభిమానంగా ఆహ్వానించింది.
“మీ మావయ్యా. చాల్లే. ఆయన నూతి కప్ప. ఎక్కడికీ రారు. ఇప్పుడు కూడా ఆయన తరపు బంధువులమ్మాయి పెళ్ళంటేనే ఆయనికి బదులు నేను వచ్చాను” చెప్పిందామె సోఫాలో కూలబడుతూ.
ఇంతలో లలిత, “రాధమ్మా, ఈ సామాను లోపల పెట్టు” చెప్పింది వాళ్ళింటి పనమ్మాయితో. రాధమ్మ వస్తూనే మంగమ్మ గారిని చూస్తూనే నమస్కారం చేసి చిన్న నవ్వు నవ్వి ఆమె బ్యాగ్‌ని లోనికి తీసుకెళ్లబోతూ, “అమ్మగారూ మా అయ్యికాడినుండి పోనొచ్చింది. బేగి రమ్మన్నాడు. మజ్జానo ఎల్లి ఓ మూడు రోజుల్లో వచ్చేత్తాను” అని అడగడంతో “సరే వెళ్ళిరా” చెప్పింది లలిత. తర్వాత కొద్ది సేపటికే రాధమ్మ ఊరు బయలుదేరి వెళ్లిపోయింది.
రాధమ్మని కింద నుండి పైకి దీర్ఘంగా చూసిన మంగమ్మ, “ఈ పిల్ల ఎవరే” అడిగింది ఆశ్చర్యంగా.
“ఎవరేoటత్తయ్యా. మా ఇంటిలో మనిషి. పేరుకి మాత్రం పనిమనిషి” చెప్పింది లలిత.
“ఏoటమ్మడూ నువ్వు. వయసులో ఉన్న అమ్మాయిని పనమ్మాయిగా పెట్టుకున్నవా. చోద్యం కాకపోతే?” అంది బుగ్గలు నొక్కుకుంటూ.
“ఏంటత్తయ్యా. ఇపుడు ఏమైందని. ఏం చెప్పాలనుకుంటున్నావ్?”
“ఏమైందా. మా ఎదురు ప్లాట్‌లో కూడా ఇలానే ఓ జంట ఉండేవారు. ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో, ఉదయం పోయి సాయంత్రానికి కానీ రారు. దాంతో, ఓ పనమ్మాయిని పెట్టుకున్నారు. ఆమె పొద్దున్న ఇల్లు ఊడ్చి, ఇద్దరికీ టిఫిన్ అదీ చేసి, ఇద్దరికీ లంచ్ బాక్స్‌లు పెట్టేది. తర్వాత వారు ఆఫీస్‌కి వెళ్ళగానే, ఇల్లు శుబ్రo చేసి, బట్టలు వాషింగ్ మెషీన్‌లో వేసేది. ఆ తర్వాత టి‌వి చూస్తూ కూర్చునేది. లేదంటే నా దగ్గరకి వచ్చి, మళ్ళీ వాళ్ళు రాగానే కాఫీ అదీ ఇచ్చి, తర్వాత రాత్రి వంట పూర్తి చేసి ఆమె ఇంటికి వెళ్లిపోయేది. అయితే, రాను రాను ఆ పనమ్మాయి వాళ్ళతో బాగా కలిసిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి ఒంట్లో బాలేదని ఆఫీసుకి హాఫ్ డే సెలవు పెట్టి ఫ్లాట్‌కి రాగానే, ఆ అబ్బాయి పనమ్మాయితో కాస్త చనువుగా ఉండటం చూసిందట. ఆఫీసులో ఉండాల్సినవాడు ఆ సమయంలో ఇంట్లో ఎందుకున్నాడు అని ఆశ్చర్య పోయిందట.”
“మరి వెంటనే ఇద్దరినీ నిలదీసిందా” అడిగింది లలిత.
“నువ్వూ, నేనూ అయితే అలానే చేసేవాళ్ళవేమో. కానీ ఆమె రెండు మూడు రోజుల్లో ఇల్లు మార్చేసింది. అలా మార్చేసే ముందు ఆ పనమ్మాయికి కొంత డబ్బు ఇచ్చిoది. మళ్ళీ ఇది పునరావృతం అయితే ఈసారి పోలీసుల ద్వారా వెళ్తాననడంతో ఆమె ఏకంగా ఊరు వదిలిపోయింది. తన భర్తకి కూడా అర్థం అయ్యీ కానట్టు, ‘పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది. కానీ ఎవరూ తనని గమనించడం లేదనుకుంటుంది. కానీ అది దాని భ్రమ అని దానికి తెలీదు పాపం’ అనడంతో బుద్ది తెచ్చుకున్నాడట. ఆమె ఓ సారి నన్ను కలిసినపుడు చెప్పింది.”
ఆమె మాటలు విన్న లలిత ముఖం రంగులు మారింది. ఓ క్షణం ఆగి “ఔనత్తయ్య. నువ్వంటుంటే నాకూ అనిపిస్తోంది. ఈయన కూడా మా రాధమ్మకి ప్రతి పండగకీ చీరలు, డ్రెస్సులు కొంటారు. రాధమ్మ పనిలో ఉన్నా, రాధమ్మా నీకు ఇష్టమైన సీరియల్ వస్తోంది, రా చూద్దువు గాని అని పిలుస్తారు. నేను దాన్నేమైనా అంటే చాలు, నా మీద ఒంటి చేత్తో లేస్తారు” చెప్పిందామె మంగమ్మ గారితో.
“అలాగా. అయితే నీ కాపురం చేతిలోంచి జారడానికి సిద్ధంగా ఉన్న గాజు గ్లాసన్నమాట.”
“అదేంటత్తయ్య అలా అంటావ్. ఏదేదో చెప్పి చివరకి నా కాపురంపై డౌట్ పెట్టవ్. ఇప్పుడు నాకు చెయ్యి కాలు పనిచేయడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి” అడిగిందామె ఆందోళనగా.
“ఏం చేయనక్కరలేదమ్మడూ. అది ఊరు నుండి వచ్చేసరికి, మరో పనమ్మాయి, కాదు కాదు పనవ్వని పెట్టుకో. ఏ గొడవా ఉండదు. కట్ల పాముని నువ్వు పొట్లకాయనుకుని భ్రమ పడుతున్నావు” అని మంగమ్మ చెప్పి చెప్పగానే, క్షణం ఆలోచించి సరే అనేసింది. పైగా మధు కూడా కాంప్‌కి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అని, పక్క వీధిలో పనిచేసే భాగ్యవ్వని పనిలో పెట్టేసింది లలిత. అలా ఆమెని పనిలో కుదిర్చిన రెండవరోజు సాయంత్రం, బీరువా తెరిచి ఉండటం, బంగారం, కొంచెం డబ్బూ కూడా కనబడకుండా పోయింది. తర్వాత మంగమ్మా,లలితలు చిత్రంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మంగమ్మ కొంచెం అయోమయంగా తల వంచుకుంది. ఇంతలో రాధమ్మ వచ్చింది.
ఆమెని చూస్తూనే, “ఏంటి ఓ రోజు ఆలస్యం?” అడిగింది లలిత అసహనంగా.
ఆ మాటలకి రాధమ్మ కొంచెం సిగ్గుపడుతూ, “అమ్మగారూ మరేమో, నాకు మా ఊల్లో నిచ్చిత్తార్దం జరిగిందండి. మనువు కూడా ఓ పదేను రోజుల్లోనండి. అంతా అప్పుడప్పుడే అనేసుకొని చేసేశారు. మా అయ్య మీకు పోను సేసి సెప్పమన్నాడు. పదేను రోజుల తర్వాత వత్తానని. కానీ నాకే మనసొప్పలేదండీ. మీరు ఈ రెండు వారాలు రెక్కలు ముక్కలు సేసుకు కష్టబడుతుంటే, కొత్త పెల్లి కూతురి వోదాలో ఆడ ఎట్టా ఉండగలనమ్మా. పైగా నన్ను సొంత తోడ బుట్టిన దానిలా సూసుకునే అయ్యగారూ, సొంత మనిసిలా సూసుకునే మిమ్మల్ని వొగ్గేసి అన్ని రోజులు అంటే ఏదోల అనిపించినాదండి. అమ్మగారూ నాకు కాబోయే వాడిది మన ఊరే. నేను రెండు పూటలు వచ్చి పనులు సేసి పోతానండి” చెప్పిందామె.
అప్పటివరకూ మంధర మాటలు విన్న కైకేయిలా ఉన్న లలిత, ఒక్క సారిగా రాధమ్మ మాటలతో, రామపాద స్పర్శకి మనిషైన శబరిలా ప్రశాంతంగా మారి, రాధమ్మ వైపు రెండు అడుగులు వేసి ఆమెని గట్టిగా హత్తుకుంది.
‘చెప్పుడు మాటలతో ఓ ఆత్మీయ బంధాన్ని దూరం చేసుకునే దాన్నే. కట్లపాము పొట్లకాయని పోలి ఉంటుంది. అందుకని పొట్లకాయలపై ద్వేషం పెంచుకోవడం అర్థరహితం’ అనుకుంటూ కన్నీళ్లు ఒత్తుకుంది లలిత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here