నేనూ- ఒక అమెరికా పనిమనిషీ

0
4

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి స్వాతీ శ్రీపాద పంపిన హాస్య కథ “నేనూ – ఒక అమెరికా పనిమనిషీ”. తమ అమెరికా పనిమనిషి బ్లూస్ గురించి చెబుతున్నారు రచయిత్రి. [/box]

అమెరికా పేరెత్తగానే పెద్ద బండ నెత్తిన పడినట్టు అవుతుంది. అవును కదా… ఇక్కడ హాయిగా మహారాణిలా పనిమనిషికి పురమాయించి అన్ని పనులూ చేయించుకుని తిరిగిన వాళ్ళం అక్కడకు వెళ్ళగానే మళ్ళీ కొత్తగా కాపురం మొదలెట్టినట్టు చీపురూ చేటా చేతబుచ్చుకోవాలి.

శనిదశ నడిచే వాళ్ళు తప్పకుండా అమెరికా వెళ్తారు. ఆ దశేమిటో ఇలా ఫ్లైట్ ఎక్కక ముందే అర్థం అవుతుంది. ఉరుకులు పరుగులు పెడుతూ అవసరం ఉన్నవీ లేనివీ షాపింగ్‌లకు తిరగడంతో మొదలు. పిచ్చి మొహాల మాదిరి వందసార్లు బరువు తూచుకునే మిషన్లు ఎక్కడం దిగడం, సూట్‌కేస్‌ల బరువులు తూచేందుకు. మొత్తానికి తీసివేతలు కూడికలు పూర్తయాక, కావలసిన మ౦దులూ మాకులూ సర్దుకుని భుజాలు లాగేసే బాగ్ నిండా ఎక్కువయిన సామానులు కుక్కుకు బయలుదేరితే దారిపొడుగునా తలతిరిగిపోయే టెన్షన్, ఈ సూట్‌కేసులు ఇంట్లో తూచుకున్నా అక్కడికి వెళ్ళాక ఎక్కువైతే ఏంచెయ్యాలి? వాడిని బతిమాలితే ఒప్పుకుంటాడా ? ఏమో…

చచ్చీ చెడీ చెకిన్ పూర్తయే వరకూ తలనొప్పే. ఆ తరువాత సెక్యూరిటీ చెకింగ్- అదేమిటో ఉన్నవన్నీ తీసి నిఘా చూపు ముందర పరచినా ఎక్కడ ఏం కనిపిస్తుందో  ఒళ్లంతా ఒకసారి తడిమి చూస్తే గాని తృప్తి పడరు. మనలో మన మాట ఈ బాడీ చెకింగ్ ఆడవాళ్ళు పూర్వజన్మలో మగవారి ఉంటారని నా అనుమానం.  గంటల గంటల వెయిటింగ్, వాళ్ళ మొహాలూ వీళ్ళ మొహాలూ చూస్తూ, ఎవరు మాట కలిపినా అరేబియన్ ఎడారిలో తోడూ దొరికినట్టు పొంగిపోడం, చివరికి ఫ్లైట్ ఎక్కాక మరో గోల …

సన్నటి సీట్లలో మనను మనం కట్టేసుకుని కాళ్ళ నొప్పులు వేళ్ళ నొప్పులతో, వాడు పెట్టినది తింటూ ఇచ్చింది తాగుతూ చచ్చీ చెడీ విమానాలు ఎక్కుతూ దిగుతూ, ఎస్కలేటర్లు ఎక్కుతూ దిగుతూ వాకింగ్ బెల్ట్స్‌పై నడుస్తూ ఇరవై నాలుగు గంటల తరువాత విమానం దిగేసరికి ఆకారాలు మారిపోయి కాళ్ళు , మొహం ఉబ్బిపోయి బట్టలు నలిగిపోయి. దిగిన తరువాత మరో ప్రశ్నల పరంపర, కుక్కలు వాసన చూడటం అవి తెచ్చారా ఇవి తెచ్చారా అన్న ఆరా, ఎలాగైతేనేం బిక్కు బిక్కుమంటూ ఇల్లు చేరే సరికి

చావుతప్పి కన్నులొట్టపోయినట్టు అయిపోతాం.

అయితే దారిలో మంచి శుభవార్త  చెవినపడింది.

“అమ్మా మాకొక హవుస్ కీపర్ దొరికింది. నువింక హాయిగా కూచుని టీవీ సీరియల్స్ చూసుకోవచ్చు.”

నిజంగా అది శుభవార్తే . పెరుగుతున్న వయసులో ఇప్పుడు మళ్ళీ వంటా వార్పే కాకుండా తోమడం కడగడం తుడవడం మడతెయ్యడం మాటలా ?

ఇల్లు చేరగానే సూట్‌కేస్‌లు ఖాళీ చేసి , పిల్లలను ముద్దుచేసి ఇంటి చుట్టూ మొక్కలను పరామర్శించి జెట్ లాగ్ వల్ల నిద్రలోకి జారుకున్నా…

ఇహ ఆ మర్నాటి నుండి వాళ్ళ హవుస్ కీపర్ అనబడే పనిమనిషితో నా ప్రహసనం మొదలు.

కళ్ళకి చలవకళ్ళద్దాలు, కాళ్ళకు హైహీల్స్ ముదురు ఎరుపు రంగు లిప్ స్టిక్ , వస్తూనే హాయ్ అంటూ విష్ చేసి తనను తాను పరిచయం చేసుకుంది.

“తాన్యా”

ఓహో అనుకున్నాను.

“మీ పేరు తెలుసుకోవచ్చా… ”

“అన్నపూర్ణ”

“ఆన్ పూరన్..”

“సరే నేను నిన్ను ఆన్ అంటాను ఓకేనా” ఒక నిర్ణయం నా ముందు ప్రపోజల్ మాదిరిగా పెట్టింది.

పుట్టి బుద్దిఎరిగి  నా కన్నవాళ్ళకూ, నన్ను కట్టుకున్న వాడికీ కూడా నా పేరు ఎలా కుదించాలో, నన్నిలా ఆన్ అని ముద్దుగా పిలవవచ్చని వాళ్లకు ఎందుకు తట్టలేదో తెలిసి చావలే.

మా వాళ్ళంతా ఒకటే నవ్వులు.

“ఆన్ మీ డ్రెస్ చాలా బావుంది” అంటూనే తన చిన్న బాగ్ తీసుకుని  బాత్రూమ్‌లో దూరింది.

రంగూ రూపు చూసి అమెరికన్ అనుకున్నాను, కాని అదేదో దేశస్తులని చెప్పాడు మా వాడు. అదో రెండు మూడు గంటలు పని చేస్తుందని చెప్పి ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు.

బాట్ రూమ్ నుండి బయటకు వచ్చింది తాన్యా. దాని మరో రూపం చూసి నివ్వెరపోయాను

జీన్స్ పాంట్ పైన ఫుల్ షర్ట్ స్థానంలో మోకాళ్ళు దాటని నిక్కరు స్లీవ్ లెస్ టాప్. దీని ఫోటో తీసుకోవాల్సిందే, మన ఇండియన్ పనిమనుషులకు చూపించటానికి అనుకున్నాను.

ముందుగా గబగబా కాఫీ మేకర్ ఆన్ చేసి “ మీకూ కాఫీ కావాలా” జవాబు చెప్పే లోగానే రెండు గ్లాసుల కాఫీ చేసి నాకొకటి ఇచ్చి అదొకటి తీసుకుంది.

ఇంట్లో ఉన్నపాంట్రీ వెతుక్కుని రెండు బ్రెడ్ పీస్‌లు టోస్ట్ చేసి తెచ్చుకుంది. వాటికి బాగా బటర్ పట్టించి తీరిగ్గా తినడం మొదలు పెట్టింది.

ఆమె తిన్న ప్లేట్, కాఫీ మగ్ సింక్‌ ఉన్న గిన్నెల్లో వేసింది రామచంద్ర.

గబా గబా గ్లవుస్ తొడుక్కుని టాప్ కింద నాలుగు గిన్నెలు కడిగి డిష్ వాషర్‌లో అడ్డదిడ్డంగా పెట్టి ఆన్ చేసి పారేసింది.

మిగతావన్నీ సెకండ్ అండ్ థర్డ్ ట్రిప్స్.

నెమ్మదిగా తన ఫోన్ తీసుకుని ఎవరితోనో మాటలు మొదలు పెట్టింది. అది ఇంగ్లీష్ కాదు.

ఈ లోగా స్నానం సంధ్యా ముగించుకుని వచ్చేసరికి ఇంకా ఆవిడగారి బాతాఖానీ సాగుతూనే వుంది.

ఈలోగా ఫోన్లో మాట్లాడుతూనే పిల్లదాన్ని నిద్రలేపింది.

“హనీ , నీకు అరగంటలో క్లాస్ ఉంది. అయిదు నిమిషాల్లో బ్రేక్ ఫస్ట్‌కి రావాలి”

అప్పటికే నిద్ర మేల్కొని ఐపాడ్‌లో కళ్ళు పెట్టిన చిన్నది మూడు సార్లు హేచ్చారించాక లేచి వచ్చింది.

దాని ముందు ఒక బవుల్‌లో అవేవో సీర్రియాల్ అట నల్లటి గుళ్ళు వేసి –

“పాలు కావాలా? జ్యూస్ కావాలా?”

అలా అడిగాక పిల్ల పాలెందుకు తాగుతుంది? జ్యూసే అంటుంది కాని. చకచకా రాగి గ్లాస్లో జ్యూస్ పోసి అక్కడపెట్టింది. ముందు గమనించలేదు

అది ఆ గుళ్ళు నాలుగు తిని పది వదిలేసి జ్యూస్ రెండు గుక్కలు తాగి మూడొంతులు వదిలేసి దాని క్లాస్‌కి వెళ్ళడానికి రెడీ అయింది.

లోపల రాగి ఉన్న గ్లాస్లో జ్యూస్ వేస్తే ఆ చిలుమంతా అందులోకి దిగి వెలపరం రాదూ?

నెత్తీనోరూ బాదుకోవాలనిపించింది.

అనుకున్నట్టుగానే క్లాస్‌లో వాంతి చేసుకుందట, దాన్ని అరగంటలో ఇంటికి తెచ్చింది.

అదొక ప్లాస్టిక్ డబ్బా పట్టుకుని బెడ్ రూమ్‌లో మంచం ఎక్కింది. వాంతి అయితే మంచం దిగకుండా ఆ డబ్బాలో చేసుకుందుకు.

డిష్ వాషింగ్ అయినట్టుంది. నెమ్మదిగా ఒక్కో వస్తువూ తియ్యనూ షెల్ఫ్‌లో సర్దనూ చివరికి స్పూన్లు కూడా ఒక్కొక్కటి తీసి స్పూన్ ఆర్గనైజర్లో పెట్టడం.

మొత్తానికి ముప్పావు గంట లోడ్ తియ్యడానికి అరగంట లోడ్ చెయ్యడానికి…

నెమ్మదిగా ఇల్లు ఒక  అరగంట తుడిచింది, ఫోన్‌లో మాట్లాడుతూ.

మధ్యాహ్నమూ అంటే పిల్లలకు సరిగ్గా ఒక గరిటెడు అన్నం, ఒక గరిటెడు కోడలు చేసి వెళ్ళిన వేపుడు , ఒక చిన్న బవుల్‌లో పెరుగు, మళ్ళీ

“హనీ జ్యూస్ ఆర్ వాటర్?” అంది.

నా వచ్చేరాని యాక్సెంట్ లో చెప్పా – జ్యూస్ కాదు తిండితో నీళ్ళే ఇవ్వాలని, పనిలో పని కాపర్ గ్లాస్ లో జ్యూస్ వెయ్యరాదని.

“నాకు మీ వంటలు చాలా ఇష్టం’ అంటూ ప్లేట్ తీసుకుని గబగబా ఒక చపాతీ పరచుకుని దాంట్లో అన్నం కూడా పెరుగు వేసుకుని చుట్టుకుని తినేసింది. ఈసారి దానికి చూపించాలన్న ఉద్దేశ్యంతో డిష్ వాషర్ నుండి అయిదు నిమిషాల్లో చకచకా సామాన్లు తీసా సరదాగా.

“థాంక్యూ ఆనా హెల్ప్ చేస్తున్నందుకు” అంది.

మళ్ళీ గిన్నెలు డిష్ వాషర్లో పెడ్తుంటే చెప్పా అలా కాదు ఆ మిగిలి పోయిన  మాడు, ఫుడ్ వదలాలని స్టీల్ స్క్రబ్బర్తో తోమి చూపించా.

తెల్లారి ఉదయమే ఆమె రాగానే డిష్ వాశార్లో ప్లేట్స్, వరసలో గ్లాస్ బుల్స్ ఒక వరసలో కప్స్, గ్లాస్లు అన్నే సరిగా సరదాక ఇంకా చోటు మిగిలింది.

మొత్తానికి రోజంతటికీ ఒక్కసారి క్లీనింగ్ సరిపోతు౦ది. చూసి నేర్చుకుంటుందనుకున్నా కాని

“నువ్వు చాలా మంచి పనిమంతురాలివి ఆనా “అంటూ ఆ పని రోజూ నాకే అప్పగించింది.

ఈ మాట ఎవరికి చెప్పను … వచ్చి చక్కని పనిమనిషి మాన్పి౦చానన్న గోల నాకెందుకు? నెల రోజుల్లో నేను దాని అసిస్టెంట్ నయిపోయా..

వంట చెయ్యడం ఆలస్యం గబగబా పెట్టుకు తినెయ్యడం, పిల్లలకు ఇష్టమని ఒక రోజు సగ్గుబియ్యం వడియాలు వేయించా, ఐ లవ్ దీస్ అంటూ వేయించిన వాటిల్లో సగం కరకరా నమిలేసింది.

నెల తిరిగి తిరుగు ప్రయాణం సమయానికి నేను పీనుగులా అది ఏనుగులా తయారయ్యాం. గంటకు 15 డాలర్లు తీసుకునే ఆ పెయిడ్ సర్వెంట్‌కు నేను అన్ పేయిడ్ సర్వెంట్‌ను. దానికి వండి పెట్టి తిన్నవి డిష్ వాషర్లో సర్ది, దాని బాట్ల మరకలు వదిలించి, వెనకాల పని చేసాక, ‘బాగా అలసిపోయాను’ అనేది.

“అయ్ మిస్యూ ఆనా” అంటూ ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఇదీ అమెరికా పనిమనిషి బ్లూస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here