[box type=’note’ fontsize=’16’] పాతికేళ్ళుగా పుట్టెంట్రుకలు తీయించుకోలేకపోయిన పూర్ణారావు, చివరికి ఏ పరిస్థితుల్లో జుట్టును వదిలించుకున్నాడో ఆదూరి హైమవతి హాస్యంగా వివరిస్తున్నారీ కథలో. [/box]
“పూర్ణా! పూర్ణా! నీవే దిక్కు- నీవే తప్ప ఇతః పరంబెరుగమయ్యా మన్నింపం దగున్ హితులన్ స్నేహితులన్, కాపాడు పూర్ణా కాపాడు” అంటూ పదిమంది స్నేహితులువచ్చి ఒకరు కాళ్ళూ, మరొకరు గడ్డమూ, చేతులూ, బుగ్గలూ ఏది అందితే అది పట్టుకుని బ్రతిమాలసాగారు.
“ఏందిరా ఇది? ఏమైందీ?” అంటూ పూర్ణారావు ఆశ్చర్యంగా వారిని అడిగాడు.
అంతా ఒక్కమారు పూర్ణ పాదాలమీద పడి “కాపాడు తానంటేనే లేస్తాం. లేకపోతే ఇక్కడే నిద్రపోతాం? నీవే మాకు తిండీ తిప్పలూ గట్రాచూడాల్సి వస్తుంది” అంటూ బోర్లా పడుకున్నారు పూర్ణ పాదాల చెంత.
“ఒరే చెప్పి చావండి, ఊరికే శివ పరమాత్మలా వరాలిచ్చి ఆపైన ఇబ్బంది పడలేను” అంటూ కాస్త బెట్టు చేశాడు.
అంతా వాడి కాళ్ళ దగ్గర బాసింపెట్లు వేసుకుని కూర్చున్నారు.
“ఒరే! మేం ఈ కాలేజ్ డేకి ఒక నాటకం వేద్దామని నిర్ణయించుకుని రిహార్సల్స్ కూడా చేస్తున్నామా! దీన్లో సత్యభామ పాత్రధారిణి కోసం ఒక నాటకాల అమ్మాయిని బుక్ చేశాం. మన వాళ్ళెవ్వరూ సత్యభామ వేషానికి తగిన నాజూగ్గాళ్ళు లేరు. అంతా భీమ, బకాసుర, సుయోధన, లంకిణి, శూర్పణఖ లాంటి పాత్రలకైతే సరిపోతారు కానీ నాజూకు స్త్రీ పాత్రలకు పనికి రారని నీకూ తెల్సుగా. ఇంతలో ఎవరో ఎక్కువ డబ్బిస్తానన్నారని, ఆ మాయలాడి వెళ్ళిపోయి, ఫోనాఫ్ చేసి కూర్చుంది. ఎక్కడుందో తెలీదు. రికార్డింగ్ కూడా ఐపోయింది. ఊరికే చేతులు తిప్పడమే.” అంటూ ఆగారు.
“సరే. ఐతే నన్నేం చేయమంటార్రా!”
“బాబ్బాబు! కాస్త ఆ సత్యభామ వేషం వేసిపెట్టు. మా నాయన గా, మా బంగారుగా!” అంటూమళ్ళీ గడ్దం పుచ్చేసుకున్నారు.
“ఇవి కాళ్ళు కావు చేతులనుకో. సారీ సారీ. ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. కావలిస్తే కాళ్ళే పట్టుకుంటాం. మా బంగారే మా బాబే” అని సావాసగాళ్ళు అంటుండగా,
“ఛ నోర్ముయ్యండి. నేను ఆడవేషం వెయ్యడమేంట్రా!”
“అదేంట్రా అలా అంటావు? ఎంతమంది నాటకాల్లో ఆడ వేషాలెయ్యట్లేదు. ఎందరు భరతనాట్యం నేర్చుకున్న మగవారు సత్య భామ నృత్యం చేయట్లేదు. అవార్డులు పొందలేదూ! అంతెందుకూ సినిమాలో సత్యభామ వేషం వేయలేదా కమలా హాసన్.”
“అవన్నీ నావద్ద చెప్పకండి. వెళ్ళండి. నేను చదువుకోవాలి.”
“అబ్బో వీడొక్కడేనండీ చదివేది. మేమతా చవటసన్నాసులం.”
“ఏం వెంపటి చినసత్యం శిష్యులకంటే గొప్పవాడివా!”
“ఎందరో పురుషులు స్త్రీ వేషాలేసి మెప్పించారు”
“వారందరినీ స్ఫూర్తిగా తీసుకోరా! ఈ ఒకసారికీ మమ్ము కాయరా! కాపాడరా! స్నేహితుల పరువు నిలపరా! బాబ్బాబు.”
“పోండ్రా నావల్ల కాదు” అని విదిలించుకున్నాడు పూర్ణ.
“బ్రతిమాలుతున్నామని బండెక్కి – సారీ కొండెక్కి కూర్చోకు. మన విద్యార్ధుల పరువు కాపాడవా! నీ బాధ్యత కాదా! అమ్మాయిలంతా నవ్వరా! మన నాటకం ఆగిపోతే. ఆ అవమానం నీకూ చెందదా!”
“ఐనా మొన్నమొన్నటి వరకూ హైస్కూల్లో ఆడవేషాలెయ్యలేదూ! మాకా చెప్తావ్? అంతా హేళన చేయకుండా మేం నిన్ను కాయలేదూ! ‘అమ్మపుట్టిల్లు మేన మామ దగ్గరానీ’ మాకు చెప్పకురా!”
“ఒరే నాయనా! మా మాట వినరా! నీగ్గాంగా ఇంత జుత్తుందని, నీవు కాంగా నాజూగ్గా ఉన్నావనీ ఉట్టెక్కి కూర్చోకు.”
“అసలు వేయకుండా ఎలా మాతో కలసి ఉంటావో చూస్తాం” అంటూ సామ, దాన, భేద, దండోపాయాలకు దిగారు స్నేహ బృందం.
ఏం చేయాలో తోచింది కాదు పూర్ణకు.
స్నేహుతులను వదులుకోలేడు. ‘అలాని కాలేజ్‌లో కూడా ఆడ వేషం వేస్తే ఇప్పుడున్న‘జుత్తు’ ఎగతాళికి మరింత ఎక్కువై పోయి అంతా నానా వెక్కిరింపూ చేస్తే ఏం కావాలి. ఏంచేయాలో తోచింది కాదు.
“ఒరే పూర్ణా! ఎవ్వరికీ చెప్పం. అంతా ఆ నాటకాలమ్మాయే వచ్చి వేసిందని చెప్తాం. సరా! ప్రామిస్” అంటూ అంతా తలలపై చేతులుంచుకుని మోకాళ్ళ మీద కూర్చున్నారు. పూర్ణకు ఒప్పుకోకతప్పింది కాదు.
ఆ నాటకం సక్సెసై బోలెడన్ని బహుమతులు, సత్యభామ పాత్ర కూ, నటనకూ వచ్చాయి. ఐతే స్నేహితు తమ మాట నిలుపుకుని లెవ్వరూ ఆపాత్రవేసింది పూర్ణేనని చెప్పలేదు.
కానీ ఆపైన కానీ ఆపైన ఉత్సాహం ఉరకలెత్తి అలా కాలేజ్‌లో ఇంటర్మీడియేట్‌లో ఆడ వేషాలేయడం మొదలైంది పూర్ణకు. అలా అలా వరుసగా స్త్రీ పాత్రలు ధరిస్తూ గొప్ప పేరు తెచ్చుకున్నాడు. బహుమతులూ అవార్డులూ గట్రా చాలానే వచ్చాయి.
అందరి ప్రోద్బలంతో కాలేజీలోనే జరుగుతున్న కూచిపూడి భరతనాట్యం క్లాసుల్లో చేరి నాట్యం కూడా అవలీలగా నేర్చేసుకున్నాడు, సన్నగా రివటలా ఉండటాన. ఎన్నెన్నో ప్రోగ్రాం ఇచ్చాడు.
వాడి జుట్టే వాడి ఆడవేషాలకూ , అవార్డులకూ ఆలవాలమైంది.
జుట్టేంటంటారా! అదో పెద్దకథ. అసలు కథ చెప్పకుండా కొస చెప్తే ఏమర్థమవుతుంది? వస్తున్నా అక్కడికే. నేను పూర్ణ స్నేహబృందలో ముఖ్యుడినిలేండి.
పూర్ణారావు తల్లిదండ్రులకు బుద్ధుని వరప్రసాదంగా లేక లేక పుట్టాడు. కాశీ వెళ్ళి బుద్ధ గయలో మూడు రోజులు నిద్రచేసి మొక్కుని వచ్చారు. అంతకు ముందే ఎన్నెన్నో మొక్కులు మొక్కుని ఉన్నారు. చివరగా వెళ్ళిన బుధ్ధగయ సందర్శనం తర్వాత పుట్టాడని, ఆ పేరు పెట్టుకున్నారు.
‘పూర్ణ’ అనేది బుద్ధుడి పదిమంది ముఖ్య శిష్యులలో ఒకడైన కపిలవస్తు రాజు శుద్ధోదనుడి గురువు కుమారుడు. ఇంచు మించు బుద్ధుడి వయస్సువాడు. బుద్ధుడి శిష్యులందరిలోకీ బాగా మాట్లాడగల వాడుగా పేరు తెచ్చుకున్న వాడు. అందుకని ఆ పేరుపెట్టుకున్నారు పూర్ణ అమ్మానాన్నానూ.
వాడికి పుట్టెంట్రుకలు తీయించను వాడి పదో నెల్లో వాడి అమ్మా నాన్నా తిరుపతి ప్రయాణం పెట్టుకున్నారు. ప్రయాణానికి తయారు కాగానే వాడి తాతయ్య ఉన్నట్లుండి రాత్రికి రాత్రే టపా కట్టేశాడు. దాంటో వాడి పుట్టెంట్రుకలు వాయిదా పడ్దాయి.
రెండో ఏట ఊరి పొలిమేర దాటించరాదనీ, పుట్టెంట్రుకలు ఇవ్వరాదనీ ఆగిపోయింది పుట్టెంట్రుకల ఫంక్షన్.
వాడి అమ్మానాన్నా ఊరంతా బస్సేసుకుని తిరుపతి, తిరుత్తణి ఇంకా ఇంకా వారు మొక్కున్న అనేక పుణ్యక్షేత్రాలకు యాత్రల కెళుతుంటే వాడ్ని బామ్మ దగ్గరే ఉంచేసి బయల్దేరారు. అంతా వెళ్ళేప్పుడు తిరుమలకు నడక దారిన కొండెక్కి వచ్చేప్పుడు బస్సులో దిగుతుండగా కుంభవృష్టి కురుస్తుండగా బస్సు దిగుడులో టైర్లు జారి లోయ లోపడి ఇరవై పొర్లిగింతలు పెట్టి ఒకేసారి ముప్పైమందినీ వైకుంఠం తీసుకెళ్ళింది.
అంతా ముసలీమూతకా కనుక వాళ్ళ వాళ్లంతా ఒక ఏడ్పు ఏడ్చి ఊరుకున్నారు. కానీ పాపం పూర్ణ అమ్మానాన్నా మధ్య వయస్కులే. దాంతో వాడి జీవిత భారం బామ్మ మీదపడి పోయింది. పాపం బామ్మ కొడుకునూ కోడల్నీ ఒకేసారి పోగొట్టుకున్న శోకాన్ని దిగమింగి, వాడు దిక్కు లేనివాడు కాకుండా అక్కున చేర్చుకుని అమ్మానాన్నా అయి పెంచసాగింది.
వాడికి మూడో ఏట పుట్టెంట్రుకలకని బయలేరుతుండగా వాడి బామ్మకు మలేరియా జ్వరం పట్టుకుంది. దాంతో పుట్టెంట్రుకలు మళ్ళా వాయిదా పడ్దాయి.
పుట్టెడు వెంట్రుకలు ముఖానపడుతుండగా బామ్మ జడ వేయసాగింది. వాడి జడ చూసి అంతా నవ్వటమే. మరి కొందరు అల్లరి అమ్మలు వాడి జడలో పూలు కూడా పెట్టసాగారు.
ఆటలకని వెళితే అంతా ‘పూర్ణమ్మా’ అని సాగదీసి పిలిచి ఆటలు పట్టించసాగారు.
ఇహ ఇలాకాదని వాడి బామ్మ ఒక మంచి రోజుచూసి ఊరి బాలాజీ గుళ్ళో గుండు చేయించి ఆ వెంట్రుకలన్నీ ముడుపు కట్టించాలని వెళ్ళింది. దార్లో దట్టుకుని ఆమె బోర్లాపడి కాలు ఫ్రాక్చరైంది.
“బుధ్ధి తక్కువదాన్ని. ఏడుకొండలవాడికిచ్చిన మొక్కు మరో చోట తీర్చుకుంటానంటే ఒప్పుకుంటాడా వెంకన్న. బాగా బుధ్ధి చెప్పాడు. ఎప్పటికైనా నీ కొండకే వచ్చి మొక్కు చెల్లిస్తా ఆపద మొక్కులవాడా! క్షమించు” అని మొక్కుకుంది.
అలా వాడు ‘పెరుగుతూ పెరుగుతూ పెదబావ కోతైనట్లు’ బామ్మ కనుసన్నల్లో అమాయక శిఖామణిలా, చాంతాడంత జుత్తుతో పెరగసాగాడు. పుట్టెంట్రుకల మాట మరచిపోయి హాయిగా బామ్మ వాడికి జడేస్తూ మనవరాళ్ళు లేని కొరత తీర్చుకోసాగింది.
ఐదో ఏట బళ్ళో వేయగానే వెళ్ళి చక్కగా చదువుకోసాగాడు. బళ్ళో వాడికి స్కూల్ మాస్టార్లు, స్కూల్ వార్షికోత్సవ సందర్భంగా అందంగా అరచేయంత కళ్ళతో, తీరైన ముక్కుతో పచ్చని మేనిఛాయతో, బారెడు జుత్తుతో ఉన్న పూర్ణకు భారతమాత వేషం, ఝాన్సీ లక్ష్మీ బాయి, రుద్రమదేవి వంటి వేషధారణలకు సెలెక్ట్ చేసి, వేయించి బోలెడన్ని బహుమతులు, సైన్స్ ఫేర్స్‌లో స్కూల్‌కూ, వాడికీ కూడా తెప్పించి మహదానందపడసాగారు.
అలా హైస్కూల్ వరకూ వాడి చదువు ఉండూర్లోనే మహిళా పాత్రల పోషణతో గొప్ప గుర్తింపు తెచ్చుకుంటూ సాగింది. ఇల్లంతా బహుమతులతో నిండిపోయింది. ఒకపెద్ద గది వాడి బహుమతులకోసం అట్టే పెట్టింది బామ్మ. అరలు కట్టించి, వాటికి అద్దాలు బిగించి మరీ బహుమతులు దాచేది. ఎవరొచ్చినా చూపి ఆనందించేది.
ఎప్పుడు పుట్టెంట్రుకలన్నా ఏదో ఆటంకం రావటాన బామ్మ పూర్ణారావు పుట్టెంట్రుకల మాట పక్కనుంచేసింది.
హైస్కూల్లోనే స్నేహితుల సలహా మేరకు పెద్ద టోపీ కుట్టించుకుని పెట్టుకోసాగడు. అంతా టోపీవాలా అని ‘నిక్ నేం’ పెట్టడంతో టోపీ తీసేశాడు. వారి మాటలు పట్టించుకోడం మానేశాడు. స్నేహితులంతా వాడిని ఏమన్నా అని ఎగతాళి చేసినవారిని ఎదిరించి సపోర్ట్ చేయడంతో వారు వినేట్లు ఏమీ అనే వారు కాదు. స్నేహితులు సపోర్ట్ చేస్తున్నందుకు పూర్ణ వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. బామ్మ వారికి బోలెడన్ని స్వీట్లూ మిఠాయిలూ చేసి పెట్టేది. దాంతో వారితో స్నేహం బలపడింది.
ఎలాగోలా బామ్మను ఒప్పించి కాలేజ్ కెళ్ళేలోగా పుట్టెంట్రుకలు తీయించేద్దామనుకున్నాడు. బామ్మ సరేని ఒక వేద పండితుడ్ని అడిగింది. ఆయన వాడి జాతకం చూసి, “తల్లీ ఇంతకాలం ఉంచారు. ఈ ఏడాది కాగానే వానికి ఆ కాస్తా జంధ్యపు పోగు, అదే తల్లీ ఉపనయనం చేయించి, గాయత్రి ఉపదేశం చేయించి అప్పుడు అర్ధముండనం, ఐదు పిలకలూ పెట్టి ఆపై నెల్లో తీయిచ్చేస్తే సరి. ఇంతకాలం ఎలాగో గడిపారు. ఈకాస్తా ఆగండి, పిల్లాడికీ దీర్ఘాయుష్షూ, మీకూ పూర్ణాయుష్షూనూ. ఇద్దరికీ మంచిది” అని చెప్పడంతో ఓర్చుకోక తప్పింది కాదు. అలా జుత్తుతోనే కాలేజ్‌లో అడుగుపెట్టాల్సి వచ్చింది మన పూర్ణా.
ఇహ తప్పక కాలేజ్‌లో చేరేప్పుడు ముందుగానే ఆలోచించి తలకు సిక్కు తలపాగాలాగా కట్టుకోడం నేర్చేసుకుని దాంతో మొదటగా కాలేజ్‌లో అడుగెట్టాడు. అంతా అతడు శిక్కు అనుకున్నారు.
కొద్దిరోజులకే కాలేజ్‌లో ఇద్దరు శిక్కు కుర్రాళ్ళు చేరి మన పూర్ణా విషయం తెల్సుకుని “ఏమోయ్! నీవు శిక్కువు కాదు. మాలా తలపాగా పెట్టుకుని మమ్ము అనుసరిస్తే మేం సహించం. మమ్మల్ని ఎగతాళి చేయడంగా భావించి రిపోర్ట్ చేస్తాం జాగ్రత్త. తీసెయ్ లేదా చాలా దూరం వెళుతుంది విషయం” అని బెదిరించడంతో మరునాడు అప్పటికపుడు, పండితులు కట్టుకునే లాగా ఒక పెద్ద పంచె తెచ్చి నానా కష్టాలూ పడి రాత్రంతా నేర్చుకుని కట్టుకుని వచ్చాడు.
అంతా ‘పండిట్ జీ!’ అని పిలవసాగారు.స్నేహితులు అంతా కలసి వాడికి హైస్కూల్లో లాగా సపోర్ట్ ఇచ్చి ‘వాడినేమన్నా అంటే విషయం తీవ్రమవుతుందని’ హెచ్చరించాక చాటుగా పండిట్ అని చెప్పుకోసాగారు. రోజూ తలపాగా కట్టుకోడమూ కష్టమై చివరకు గాంధీ టొపీతో సెటిలై పోయాడు.
కాలేజీలో వాడి నటనా వైభవం, అవార్డుల, రివార్డుల పంటలూ వాడికి బోలెడంతమంది ఫ్యాన్స్‌ను కూడగట్టాయి. దాంతో మా పూర్ణారావును ఎవ్వరూ ధైర్యం చేసి నిక్‌నేంతో పిలిచే వారే లేకుండా పోయారు.
వాడు సత్యభామ వేషం వేశాడంటే ఆడవారే వాడిని ప్రేమించేస్తున్నారు. ఇహ పురుష పుంగవులు అదేనండీ యువత వాడిని అంటే వాడి ఆడవేషాలను ప్రేమించసాగారు. గాంధీటోపీలో ఉన్నపుడు వాడి నెవ్వరూ గుర్తే పట్టలేరు. సన్నటి నూనూగు మీసాలతో మెరిసే బుగ్గలతో, పసిడి రంగులో ఆరడుగులున్న ఆజానుబాహువు ప్యాంట్ షర్ట్‌లో ఉన్నపుడు వాడినెవ్వరూ, ఈమే సారీ ఇతడే సత్యభామనీ, ద్రౌపదనీ, చిత్తూరు రాణి అనీ, రుద్రమ దేవి అనీ, రుక్మిణి అనీ అంకా అనేకానేక ప్రధాన మహిళా పాత్రలకు ప్రాణం పోసిన నటుడనీ గుర్తించనేలేరు.
బామ్మ “ఒరే ! నాయనా! పూర్ణా. ఉపనయనం, ఆ తర్వాత పుట్టెంట్రుకల మాటేంట్రా!” అంటే “ఉండవే, నాకు తీరికే లేదు. మరో వారానికి ఈ మారు సీత పాత్ర వేస్తున్నానే ప్రాక్టీస్ కెళ్ళాల, పైగా పరీక్షలొకటి వచ్చి పడుతున్నాయి. చదువూ కొండెక్కకుండా చూసుకోవాలి” అంటూ తోసేసుకోసాగాడు.
వాడి పుట్టెంట్రుకలే వాడి పాలిటి వరమయ్యాయి. ఆడవేషాలకు తలమీద జడ అల్లిన టోపీ [విగ్] పెట్టుకుని అది జారిపోకుండా నటనమీద కాక దాని మీద దృష్టి పెట్టుకుని అనేకమంది తన తోటివారు పాత్రలో లీనం కాలేక తలమీది జడటోపీ మీదే ధ్యాస ఉంచి నటనలో ఫెయిలైపోతుండగా తన సహజ పుట్టెంట్రుకలు తనకెంత మేలుచేస్తున్నాయో అర్థమైంది పూర్ణాకి.
ఎలాగో వాడి డిగ్రీ పరీక్షలు సైతం అయ్యాయి. ఇంజనీరో, డాక్టరో చదవను డ్రామా, డ్యాన్స్ ప్రాక్టీసులకు అవరోధమని తేలికైన డిగ్రీతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత మాస్టర్ డిగ్రీ ఉంటే బావుంటుందని నటనలో మాస్టర్స్ డిగ్రీ కోసం ప్రయత్నిస్తున్నపుడు జరిగిందీ సంఘటన.
యూనివర్శిటీకి వెళ్ళినపుడు అక్కడో ‘భామనే సత్యాభామనే’ అన్నట్లుండే అందమైన రూపంతో, అసలు నడుముందా, లేదా అన్నట్లున్న ఒక మెరుపు తీగను చూశాడు పూర్ణారావు. అంతే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. మనస్సు పారేసుకున్నాడు. ఎక్కడెక్కడో వెతుక్కున్నాడు. అది ఆ మెరుపు తీగ దగ్గర కెళ్ళి దాక్కుందని తెల్సుకున్నాడు.
అన్నం తినడం నిద్రపోడం తగ్గిపోయింది, బామ్మ వాడిలో మార్పు గమనించింది. ‘ఏదో ఉంది కథ’ అనుకుంది. ‘చెప్తాడులే నిదానంగా’ అని సరిపెట్టుకుంది.
ఆ యూనివర్శిటీ లోనే సీటువచ్చి చేరాడు. కానీ మనస్సు మాత్రం తనలో లేదు. ఆ మెరుపుతీగతో వెళ్ళిపోయింది. మొదటి రోజు కాలేజ్ కెళ్ళి క్లాసులో కూర్చున్నాడు. యథాలాపంగా పక్కకు చూశాడు. అదిరిపడ్డాడు. మెరుపుతీగ తన పక్కనే ఉంది. ఎక్కడ లేని హుషారు వచ్చిపడింది. మహా సంతోషంగా మాటి మాటికీ పక్కకు చూస్తూ క్లాసులో పాఠంలో వెనుక బడుతున్నాడు. నాటకాలూ, డ్యాన్స్ ప్రోగ్రాంస్ అన్నీ మానేశాడు. దిగులుతో గడ్డం కూడా పెంచేస్తున్నాడు.
ఒకరోజున ధైర్యం చేసి ఆ మెరుపుతీగతో “హలో!” అన్నాడు.
ఆమె నవ్వుతూ “హలో మీరు గాంధీ వారసులా? కాంగ్రెస్ వాదులా! తల మీద ఆ టోపీ ఏంటీ? యువకులిలాగేనా ఉండేది? ఆ గడ్డమేంటీ?” అంది ఆ మెరుపుతీగ మొహమాటం లేకుండా.
నవ్వాడు. “బాగోలేదా ! “అన్నాడు.
“మీ తల మీది జుట్టు ఎంత దాచినా కనిపిస్తూనే ఉంది. మొక్కా? దేనికోసం. దాన్ని దాచను టోపీ పెట్టుకుంటున్నారనుకుంటాను. మీ ముఖం మీసమున్న ఆడపిల్లలా ఉంటుంది, నాకు మొహమాటం లేకుండా మాట్లాట్టం అలవాటు. మీ ముక్కూ మొహం, రంగూ ఎంతందంగా ఉన్నా, మీ పెర్శనాలిటీ ఎంత బావున్నా మీ జుత్తు, దాన్ని దాచనూ ఈ గాంధీటోపీ చూసి ఏ ఆడపిల్లా మిమ్మల్ని ప్రేమించదు. మీరు నాకేసి చూస్తున్న దొంగచూపులు గమస్తూనే ఉన్నాను, ఐతే మీ జుత్తు మాత్రం మనప్రేమకు అడ్దు.” అంటూ ఖచ్చితంగా చెప్పేసి అటు తిరిగి కూర్చుందా మెరుపుతీగ.
ఆమె చేతిలో పుస్తకం జారి క్రిందపడింది. దాన్ని వంగి తీసి ఇస్తుండగా దాన్లోంచీ ఒక ఫోటో క్రింద పడింది. అది తన సత్యభామ వేషం ఫోటో. ‘ఓహో’ అనుకున్నాడు. ‘ఏమైనా ఈమెరుపుతీగను వదులుకోలేను కావల్సితే ఈ జుత్తైనా వదులుకుంటాను కానీ’ అనుకున్నాడు.
ఫోటో,పుస్తకం తిరీగ్ ఇస్తూ: “ఈమే మీ అక్కా!”అన్నాడు.
“ఔను. అంత బావుందా!” అంది.
“వైనాట్, సర్టెన్లీ. ఒక్కమాట. మీ పేరు తెల్సుకోవచ్చా! ..”అన్నాడు .
“అవన్నీ జుత్తు తర్వాతే. పేలుపడితే ఎవరు పోగొడతారు? రోజూ ఎవరు జుత్తు దువ్వి ముడేస్తారు. ఐనా యువకులకిదేం ఫ్యాషన్? ఎవరి ఫ్యాషన్. ఏ క్రికెట్ర్ అనుసరణ? ఎందుకీ జుత్తు” అంది గబగబానూ.
“ఐనా అడిగారు గనుక చెప్తున్నాను. నా పేరు మేఘన” అంది.
“థాంక్స్” అన్నాడు.
తనకు కీర్తీ, అవార్డులూ తెచ్చిపెట్టిన ఆ పుట్టెంట్రుకలనైనా వదిలించేసుకుంటాను కానీ ఈ మెరుపుతీగను మాత్రం వదులుకోలేను.
ఎలా ఎలా అని ఆలోచించడం సాగించాడు. బామ్మకు పండితుడు చెప్పినట్లు ఉపనయం చేయించేసుకుంటేనో, అబ్బో అవంతా ఒకపట్టాన కుదరవు. వెంటనే పుట్టెంట్రుకలను వదిలించాలి
ఎలా ఎలా అని, ఆలోచించి ఒక రోజున ధైర్యం చేసి ఇంటిచుట్టూ ఉన్న తోటలో, ఎవ్వరూ చూడకుండా తన తల మీద తానే కర్రతో పెద్దగా బాదుకున్నాడు. రక్తం చిమ్మింది.
“బామ్మా!” అంటూ కేకేశాడు. కళ్ళుతిరిగాయి. చప్టా మీద సొమ్మసిల్లాడు.
బామ్మ కర్ర పోటేసుకుంటూ పరుగుపరుగున వచ్చింది. చూసింది. రక్తం ఓడుతున్న మనవడ్ని. చుట్టుపక్కలవారిని కేకేసి హాస్పెటల్లో వేసింది.
డాక్టర్ గారు వచ్చి చూసి, ముందు జుత్తు తీయాలనీ ఆపైన కుట్లు వేస్తామనీ చెప్పారు. బార్బర్ను పిలిపించాడు, ఆర్జెంటన్నాడు.
“హయ్యో నాయనా! డాక్టరూ ! పుట్టెంట్రుకలయ్యా! పుట్టెంట్రుకలు” అని అరిచింది. అడ్డుకుంది.
“బామ్మా! నీ పుట్టెంట్రుకలు కూలా! నీకు మనవడు కావాలా? వాడి తలమీది జుత్తు కావాలా? ఐనా పిల్లల్ని పుట్టించే వయస్సు వస్తే ఇంకా పుట్టెంట్రుకలేంటి? అడ్డులే, వైద్యం చేయనీ” అని కోప్పడి జుత్తు గొరిగించాడు. వైద్యం చేయసాగాడు.
బామ్మ హడావిడిగా వెళ్ళి ఆ జుత్తంతా చిమ్మి ఏరి ఒక పోలీధీన్ కవర్లో దాచింది.”స్వామీ పుట్టెంట్రుకలు చివరికిలా పాతికేళ్లకు హాస్పటల్లో తీయాల్సి వచ్చింది. మన్నించయ్యా! మన్నించు” అంటూ మొక్కుకుంది. “వాడికి పెళ్ళిచేసి కాలినడకన దంపతుల్ని తెచ్చి నీ హుండీలో ముడుపు వేసుకుంటానయ్యా!” అని మొక్కుకుని పమిటకొంగు అడ్దంగా చింపి ఆ జుత్తు మూటకట్టింది, ద్రౌపది కృష్ణుని వేలికి కట్టు కట్టను చీర కొంగు చింపినట్లు.
స్నేహితులకందరికీ తెల్సి పరుగు పరుగున వచ్చారు.
మత్తులో పడి ఉన్న పూర్ణా “మెరుపుతీగ, మెరుపుతీగ, మేఘనా! మేఘనా!” అని కలవరించడం విన్నారు.
“అయ్యో! ఎంత పనైందిరా!”అని బాధపడ్డారు .
స్పృహ వచ్చాక బామ్మ లేకుండా చూసి “మెరుపు తీగెవర్రా! మేఘన ఎవర్రా!”అని అడిగారు.
మోదీకి రాహూల్ కన్నుకొట్టినట్లు పూర్ణా సావాసగాళ్ళకు కన్ను కొట్టి విషయం టూకీగా చెప్పాడు.
అంతా పరుగుపరుగున కాకి కబురుమోసినట్లు వెళ్ళి, కాదు కాదు దమయంతికి నలుని సందేశం అందించినట్లు మేఘనకు కబురందించారు.
మేఘన ఆఘమేఘాలమీద రావడమేంటీ, విచారం వ్యక్తపరచడమేంటీ, బామ్మకు విషయం తెలీడమేంటీ, క్షణాల్లో జరిగిపోయాయి.
బామ్మ తన ఊహ నిజమైనందుకు సంతోషించి, ఇద్దర్నీ అక్కున చేర్చుకుని, హాస్పెటల్ నుంచీ విడుదల కాగానే, వివాహానికి ముహూర్తం పెట్టించింది.
చివరకు పూర్ణారావు పుట్టెంట్రుకలు ప్రేమాయణంతో పూర్తయాయి.
అదండీ మా వాడి పుట్టెంట్రుకల కథ.