[box type=’note’ fontsize=’16’] “నిత్యం అన్నిటి గురించి, ఫిర్యాదులు చేస్తూ గడుపుతూ.. జీవించడం మానేసి, కేవలం ఏదో బ్రతుకుభారం మోస్తున్నాము అనుకునే వాళ్ళకి, ఈ దంపతులిద్దరినీ చూపించాలి” అంటూ ఓ జంట గురించి చెబుతున్నారు అందె మహేశ్వరి “కన్నుల వెన్నెల” కథలో. [/box]
[dropcap]”ప్లీ[/dropcap]జ్ ప్రహస్” అని రెండు రోజులనుండి అడుగుతూనే ఉంది ప్రజ్ఞ.
“వద్దు ప్రజ్ఞా! నాకు ఈ గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు పెట్టకు దయచేసి” అని మెత్తగానే కసిరాడు ప్రహస్.
“ఐతే నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. ఒక్క రోజే కదా, ఎప్పటినుండో ఇలా చాలామందితో కలిసి వెళ్ళాలని ఉంది. కానీ, కుదర్లేదు. ఈ ఒక్కసారికి ఒప్పుకుందురూ!!” అని మారాం కూడా చేసింది.
నువ్వొక్కదానివి వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళెవరో కూడా తెలియకుండా ఎందుకు చెప్పు అని ‘కోర్టులో కొట్టేసిన కేసులా’ తన అభ్యర్ధనను కొట్టేసాడు.
సాధారణంగా తన ఇష్టాల్ని ఎప్పుడూ కాదనడు. కానీ, పరిచయం లేని వాళ్ళతో ఒకరోజు మొత్తం అందులోనూ గుడికి అనేసరికి ప్రహస్ అంత సుముఖంగా లేడు. ఈ మనిషి ఒప్పుకోడులే ‘మగాధిక్యత’ అని ప్రహస్‌తో పాటుగా మగజాతి మొత్తాన్నీ తిట్టుకుంది, దేవుడితో సహ కలిపి “ఏం, నీ దర్శనానికి నోచుకోలేదా” అని. తను ఎప్పుడూ అంతే! దేవుడితో పోట్లాడి పనులు చేయించుకుంటుంది. ఏమైనా అంటే, “మానాన్న దగ్గర ఎంత చనువుందో దేవుడి దగ్గర కూడా అంతే చనువుంది” అంటుంది. అందుకేనేమో, దేవుడు కూడా “పోన్లే! అవి కావాలి, ఇవి కావాలని ఎప్పుడూ అడగదు. ఎప్పుడైనా ఒకసారి, ఇలాంటివే ఏవో అడుగుతుంది. మళ్ళీ తనతో పోట్లాడి నేను అమృతాంజనం ఎందుకు రాసుకోవడం. ఆ వాసనకి మా దేవేరితో తిట్లులెందుకు తినడం” అనుకుని తీర్చేస్తూ ఉంటాడు.
అందువల్ల, రెండురోజుల తర్వాత.. “వెళ్ళొద్దామోయ్! అంతగా అడుగుతున్నావుగా!” అని ముగించేలోపే, ఆ యాత్ర అని మెయిల్ చేసిన సమన్వయకర్తకి (కో-ఆర్డినేటర్) సమాధానం ఇచ్చేసింది ‘మేము ఇద్దరము వస్తున్నామండీ! ప్రహస్, ప్రజ్ఞ’ అని.
“ఇంత ఆరాటపడున్నావని తెలియదే నాకు. వద్దన్నానని కసి తీరా తిట్టుకుని ఉంటావే?” అని ప్రశ్నార్ధకం మొహం పెట్టాడు ప్రహస్.
“మిమ్మల్నే కాదు, ఆ దేవుడితో సహా కలిపి మగజాతిని మొత్తం తిట్టుకున్నా!” అని అరమరికలు లేకుండా చెప్పింది ప్రజ్ఞ. వాళ్ళిద్దరూ అంతే! దాపరికాలు లేకుండా అన్నీ మాట్లాడుకుంటారు. గొడవలైనా పర్లేదు. మనసులో ఏమీ ఉంచుకోకూడదని, మిథునం సినిమాలో అప్పదాసు, బుచ్చిలక్ష్మిలా పెద్ద గంటెలతో చిన్న గొడవలు పడుతూ, చిరు అలకలతో ఇల్లంతా అలికేస్తూ.. అన్యోన్యంగా ఉంటారు.
మొత్తానికి ప్రహస్ ఒప్పుకున్నందుకు ప్రజ్ఞ మొహంలో వెయ్యి దీపాలు వెలిగాయి.
“ఇవ్వాల్టికి మన ఇంట్లో కరెంటు ఖర్చుతప్పిందోయ్! కరెంటు దీపాలు వెయ్యక్కర్లేదు” అని నవ్వేశాడు ప్రహస్.
ఇంతకీ ఈ గొడవ అంతా ఏంటి అంటే, నరసింహ చతుర్దశికి కొంతమంది భారతీయులు కలిసి దక్షిణజర్మనీ లోని ‘సింహచలం’ గుడికి దర్శనానికి వెళ్ళాలని పథకం వేశారు. కానీ, వాళ్ళెవరో తెలియదు. కొత్తగా ఈ ఊరికి రావడంవల్ల, మెయిల్ గ్రూప్స్‌లో మాత్రం ఉన్నారంతే!
వెళ్తే, వాళ్ళే పరిచయం అవుతారు. మనకి దర్శనం కదా ముఖ్యం అని ప్రజ్ఞ పట్టు. మొత్తానికి దేవుడు – తలనొప్పి తెచ్చుకోడం ఇష్టంలేక, ప్రహస్ చేత వెల్దాం అనిపించాడు.
అందరికన్నా ముందే వెళ్ళి బస్సులో కూర్చుకున్నారు ఇద్దరూ. వరుసగా, బస్సులో ఎక్కుతున్న వాళ్ళని పరిచయం చేసుకుంటున్నారు. అందరూ కాకపోయినా చాలవరకూ పరిచయం అయ్యారు. మొదట్లో కొంచెం బిడియంగా ఉన్నా ప్రహస్ మెల్లగా ఎవరైనా వచ్చి పలకరిస్తే మాట్లాడుతున్నాడు. వాసుదేవ్ (సమన్వయకర్త) అందరిని పలకరిస్తూ, ఎవరికైనా ఆధ్యాత్మిక సందేహాలుంటే తీరుస్తున్నారు. అలా సరదాగా సాగుతుంది వాళ్ళ ప్రయాణం.
ప్రజ్ఞ కూర్చున్న పక్క వరుసలో ఒక అమ్మాయి ఉంది. చామనచాయిలో చక్కగా ఉంది. తనవైపే చూస్తున్న ఆ అమ్మాయిని పలకరింపుగా నవ్వింది ప్రజ్ఞ. కానీ, తిరిగి తను నవ్వకపోయేసరికి, ఏదో ఆలోచిస్తున్నట్లుందిలే అని మళ్ళీ ప్రహస్ వైపు తిరిగి ఏదో చెప్తూ తన బుగ్గలు లాగుతూ కూర్చుంది. కాసేపయ్యాక, వెనక సీట్లలో అందరూ ఆధ్యాత్మిక, రాజకీయ చర్చాగోష్టి మొదలుపెడితే, ప్రజ్ఞ కూడా వాళ్ళ దగ్గరకి వెళ్ళి కూర్చుని తనవంతుగా మాట్లాడుతుంది.
హమ్మయ్య, ఈ వసపిట్ట బారి నుండి కాస్సేపు విముక్తి అని చెవుల్లో వైర్లు పెట్టుకుని తమిళం రాకపోయినా ఆ తమిళపాటలేవో వింటూ కూర్చున్నాడు (అది కూడ ప్రజ్ఞ పనే, అన్ని తమిళం పాటలు పెట్టింది సంచారవాణిలో [మొబైల్]). పక్కవరసలో ఉన్న అదే అమ్మాయి వైపు ప్రహస్ కూడా పలకరింపుగా నవ్వాడు. కానీ, అటుప్రక్కనుండి ఏమీ స్పందన లేదు. ప్రహస్ కూడా ఏమోలే అని మళ్ళీ కళ్ళు మూసుకుని పాటలు వింటూ ఉన్నాడు. ప్రజ్ఞ మాత్రం అరవంలోనూ, ఆంగ్లంలోనూ తన వాగ్దాటి చూపిస్తుంది. “బాబోయ్! చెవుల్లో వైర్లుకాదు, పెద్ద పైపులు పెట్టుకున్నా దీని గొంతునుండి నేను తప్పించుకోలేను.. ఇక దీన్ని ఆపడం వీళ్ళవల్లకాదు” అని తనలో తాను నవ్వుకుంటున్నాడు ప్రహస్.
గుడికి వచ్చేశారు. మెల్లగా అందరూ దిగుతున్నారు. అయితే, ఇందాక పలకరిస్తే నవ్వలేదన్న ఆమెకు 5 సంవత్సరాల పాప. ఎవరేమంటే అది తిరిగి చెప్తూ ఉంది. దానికి, ఆమె”భలే అందరినీ అనుకరిస్తుందే” అని తమిళంలో ఆమె భర్తతో చెప్పి నవ్వుతూ ఉంది. సరే ఇదంతా చూస్తున్న ప్రజ్ఞ, ప్రహస్ నవ్వుతూ వాళ్ళకన్నా ముందే దిగేశారు. దర్శనానికి ముందు అందరూ, రెస్ట్‌రూమ్స్‌కి వెళ్తున్నారు. ప్రజ్ఞ కూడా అందరి ఆడవాళ్ళతోపాటు అక్కడ క్యూలో వేచి ఉంది.
“పరిమళా!” అని ఎవరో పిలుస్తుంటే పేరు బాగుందే, అని వెనక్కి తిరిగి చూసింది. ఆ బస్సులో నవ్వని అమ్మాయి. తన చెయ్యి పట్టుకుని ఇంకెవరో తీసుకొస్తున్నారు, పరిమళ చేతిలో కర్ర చూస్తే గానీ, ప్రజ్ఞకి అసలు విషయం అర్థం కాలేదు. ఒక్క నిమిషం తనేం చూస్తుందో తను నమ్మలేకపోయింది. ఒక్క నిమిషం గుండెనెవరో పిండేసినట్లనిపించింది. ఇంత చక్కగా ఉంది, ఏంటి దేవుడా! ఇది చాలా బాధపడింది. ఆ తర్వాత దర్శనం, భజనలో లీనమై ఈ విషయాన్ని కాసేపు మర్చిపోయింది. తర్వాత అందరూ భోజనాల దగ్గరకి వాసుదేవ్ దగ్గర కూపన్స్ తీసుకుని వెళ్ళారు. ప్రజ్ఞ, ప్రహస్‌ని పక్కకు పిలిచి పరిమళ గురించి చెప్పింది. కర్ర చూపిస్తే గానీ, తనూ నమ్మలేదు.
ఈలోపు, ప్రహస్‌కి తెలిసిన వాళ్ళెవరో కనిపిస్తే మాట్లాడటానికి పక్కకి వెళ్ళాడు. ప్రజ్ఞకి మాత్రం అలోచనంతా పరిమళ గురించే. ఏమై ఉంటుంది, పుట్టినప్పటి నుండీ ఇంతేనా? లేక మధ్యలోనా? తను చూడటానికి నాలానే మాములుగానే ఉందే అని ప్రశ్నల వర్షంతో బుర్ర అంతా తడిపేసింది.
ఈ ఆలోచలతో మునిగి ఉన్న ప్రజ్ఞ భుజం మీద పిలుస్తునంట్లుగా ఒక చెయ్యి తాకింది. “ఏంటి ప్రహస్” అని వెనక్కి తగ్గింది. తన కళ్ళల్లో నీళ్ళు చూసి ఏమైందో అని కంగారుపడింది. ప్రహస్ పక్కకి పిలిచి చెప్పాడు “ఆమె ఎం.బి.బి.ఎస్. చేసిందట. గోల్డ్ మెడలిస్ట్ కూడాను. డెలివరీ అప్పుడు ఏదో కాంప్లికేషన్ వల్ల తనకి చూపు పోయింది. 5 సంవత్సరాలయిందట. చూపు తెప్పించడంకోసం ప్రయత్నిస్తున్నార్ట. ఇందాక వర్మగారు, ఆయన స్నేహితుడికి చెప్తుంటే విన్నాను.”
ఆ మాటలు విన్న ప్రజ్ఞకి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. పరిమళవైపు, ఎంతో ఆరాధనగా చూసింది. పరిమళ వాళ్ళ అమ్మాయిపేరు శ్రీజ. శ్రీజ తనకన్నా వయసులో చిన్న పిల్లలని తీసుకొచ్చి పరిమళతో కలిసి ఆడుకుంటుంది. ఆ దృశ్యం చూడగనే ప్రజ్ఞ కళ్ళవెంబడి నీరు కారుతున్నా, అప్రయత్నంగా పెదవులపై చిరునవ్వు మెరిసింది. కాసేపయ్యాక, పరిమళ (ఒక్కతే నిలబడి ఉంది) తన చలికోటు గుండీ పెట్టుకోడానికి ప్రయత్నించి, కుదరక వదిలేస్తుంటే ప్రజ్ఞ వెళ్ళి, తనని పరిచయం చేసుకుని, గుండీ పెట్టింది. ప్రజ్ఞకి అసలు కొత్త, పాతా తేడానే తెలియదు. డబ్బాలో రాళ్ళేసిననట్లుంది వీళ్ళ భాష అని మనమందరం అరవోళ్ళని, మళయాళం వాళ్ళని అన్నా కూడా, తాను మాత్రం, భాషా(ఈ మధ్య మళయాళం కూడా అర్థం అవుతుంది ఇక మాట్లాడటమే తరువాయి) మరియూ వయో పరిమితి లేకుండా అందరితోనూ గలగలా మాట్లడేస్తుంది. ఈ విషయం పరిమళకి కూడా అర్థమయినట్లుంది. ఒకటి రెండు సార్లు, ప్రజ్ఞ వేరే ఎవరితోనో మాట్లాడుతుంటే ‘ఎవరు? ప్రజ్ఞేనా!’ అని గుర్తుపట్టేసింది కూడా. మెల్లగా పరిమళ కూడా బాగా స్నేహంగా మాట్లాడ్తుంటే తనకు చాలా సంతోషం వేసింది.
దర్శనం, ఊరేగింపు, పారాయణం మళ్ళీ భోజనం అయ్యేసరికి రాత్రి 10 అంటే తిరుగు ప్రయాణానికి వెళ్లింది. కోవెల దగ్గరకు బస్సు రాదట. బయట రోడ్డు వరకూ నడవాలి అని చెప్పారు.
మర్నాడు పౌర్ణమి కావడంవల్ల వెన్నెల వెలుగుల్లో అందరూ నడుస్తున్నారు. శ్రీజ వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని నడుస్తుంది (నడిపిస్తుంది). శ్రీజ కి ముందు పార్థసారథి (పరిమళ భర్త) నడుస్తూ ఉన్నారు. ప్రజ్ఞ, ప్రహస్ వారి వెనకనే నడుస్తున్నారు. ఉన్నట్లుండి పార్థు పరిమళతో “ఇవాళ వెన్నెల మల్లెపువ్వులతో పోటీ పడి మరింత తెల్లగా అయింది. చంద్రుడు తనని తాను అద్దంలో చూసుకుంటున్నట్లున్నాడు. సిగ్గుతో బుగ్గలు ఎర్రబడినట్లున్నాయి. అక్కడక్కడా మనకి మచ్చలా కనిపిస్తున్నాయి. తళుకుల తారలు మేము మెరవలేమా అని పోటిపడి మిణుకు మిణుకు మంటున్నాయి” అన్నారు.
వెంటనే పరిమళ “చంద్రుడు ఎటువైపున్నాడండీ?” అని అడిగితే, ఇటువైపు అని ఆయన చూపిస్తుంటే, (అరుంధతి నక్షత్రం చూస్తున్న నూతన వధూవరుల్లా) వెంటనే, పరిమళ.. “ఆహా! ఎంత బావున్నాడండీ ఇవాళ చంద్రుడు” అని నవ్వేసింది. దానికి పార్థు వెంటనే “నువ్వు ఏదో ఆలోచిస్తూ ఇంత మంచి వెన్నెలరేయిని ఆస్వాదించడం లేదని నీకు చెప్పానోయ్. ఇప్పుడు కదా నేను నీ కన్నుల వెన్నెల చూసేది” అని నవ్వేశారు.
(ఇదంతా తెలుగులో అనువదించి ప్రహస్‌కి చెప్పింది ప్రజ్ఞ)
“మనసుకే వైకల్యముంటుంది. ఈ తనువుకి కాదు” అని భావించే వాళ్ళిద్దరి వెనక నడిచే ప్రజ్ఞ, ప్రహస్ ఆదర్శప్రాయంగా, చూస్తూ క్షణకాలం నిలబడిపోయారు. మళ్ళీ వాసుదేవ్ “పదండి పదండి” అని కేకలేస్తేగానీ, ఈ లోకంలోకి అడుగుపెట్టలేదు.
‘కన్నుల వెన్నెల పూయించి అని పింగళివారు చెప్తుంటే ఏమో అనుకున్నా. అసలు భావం ఇప్పుడు బోధపడింది’ అన్నాడు ప్రహస్.
“అన్నీ ఉన్నా, ఏదో కోల్పోయాము, ప్రపంచం మునిగిపోతుందేమో అన్నట్లు, నిత్యం అన్నిటి గురించి, ఫిర్యాదులు చేస్తూ గడుపుతూ.. జీవించడం మానేసి, కేవలం ఏదో బ్రతుకుభారం మోస్తున్నాము అనుకునే వాళ్ళకి, ఈ దంపతులిద్దరినీ చూపించాలి లేదా చెప్పాలి. వీళ్ళిద్దరూ ఎందరికి స్ఫూర్తిదాయకం అవుతారో కదా!” అనుకుంటూ బస్సెక్కారు.