మనసులోని మనసా-11

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]నా [/dropcap]చిత్రలేఖనాభ్యాసంబెట్టిదనిన…

నాకు నేను వేసే బొమ్మల గురించి తలచుకున్నప్పుడల్లా కొంచెం విచారం, మరి కొంచెం నవ్వు వస్తూంటాయి.

చాలా చిన్నతనం నుంఛే నేను బొమ్మలు వేస్తూ వచ్చేను.

నాకు అయిదేళ్ళు నిండి ఆరు జరుగుతున్నప్పుడు మా నాన్నగారికి మాచర్ల ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అక్కడికి వెళ్ళాకనే నాకు బొమ్మలు వేయడం మీద ఆసక్తి పెరిగింది. ఇంట్లో వున్న పెద్ద తోట – చుట్టూ ప్రాంతాలన్నీ చెట్లతో, వూరి చుట్టూ చుట్టుకుని ప్రవహించే చంద్రవంక, మండాది రోడ్డంతా దట్టమైన అడవిలా పెరిగిన చెట్లు – ఇవన్నీ అప్పట్లో మాచర్లకున్న సహజ సిద్ధమైన అలంకారాలు! పల్నాటి ప్రాంతమైనా, నాగరికతకి అప్పట్లో చాలా దూరంగా ప్రజలున్నా – వారి అమాయకత్వం, తెలియనితనం నాకు బాగానే అనిపించేవి. ఎటు చూసినా పాములూ, తేళ్ళూ వున్నా – నాకు మా తోటలోని అరుగు మీద కూర్చుని గాలి విసురుకి జల్లుజల్లుగా కురిసే పున్నాగ పూలని చూసి పులకిస్తూ ఆ చెట్టునే గమనిస్తూ మరో లోకంలోకి వెళ్ళిపోయేదాన్ని. ఏదో ఒక పుస్తకం తెచ్చుకుని ఏదేదో రాసుకునేదాన్ని. ఆ పూలని కాలి బొటనవేలికి చుట్టి దండలు అల్లేదాన్ని.

అప్పుడే నన్ను ‘ఇన్‌టూ ఫస్ట్ ఫామ్’ పరీక్ష రాయించి స్కూల్లో జాయిన్ చేశారు. మొదట క్లాసుకొచ్చింది డ్రాయింగ్ మాస్టారే. మగపిల్లల బెంచీలో కూర్చుని అక్కడే కూర్చుంటానన్న నన్ను ఊరడించి, నన్ను చూడగానే ప్రేమగా నవ్వి పలుకరించి ఆయన ‘శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా…’ అంటూ భాగవతంలోని శ్లోకం పాడారు. దాని అర్థం తెలియకపోయినా ముందు శారద వుంది కాబట్టి బోల్డంత వుబ్బితబ్బిబ్బయ్యేను. ఆ తర్వాత ఆయన నన్ను అమ్మాయిల కోసం వున్న ఒకే ఒక బెంచీలోకి షిఫ్ట్ చేశారు. మంచితనానికి మహా బాగా లొంగిపోయే నేను ఆయన మాటలకి, ప్రేమకి లొంగిపోయాను.

ఆ తర్వాత చంద్రవంకకి వెళ్ళి ఈతలు కొట్టి రకరకాల రంగు సుద్దలు వాగు నుండి ఏరుకొచ్చి మా క్వార్టర్స్‌కి కాంపౌండ్ వాల్‌గా అమర్చిన పెద్ద పెద్ద నాపరాళ్ళ మీద బొమ్మలు వేయడం మొదలుపెట్టేను. నాతో పాటు మా అక్కయ్య కూడా వేసేది. మా నాన్నగారు పోస్టు మాస్టరు. మాకు పోస్టాఫీసు పక్కనే క్వార్టర్స్ ఇచ్చేవారు. అందుచేత పోస్టాఫీసుకి మాకు పార్టీషన్‌గా ఉన్న రాళ్ళనిండా మా బొమ్మలే. మా పోస్టాఫీసుకి మాచర్ల చుట్టూ ఒక యిరవై బ్రాంచి పోస్టాఫీసులుండేవి. ఇరవై మంది రన్నర్స్ చీకటితో వచ్చి బాగ్స్ పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడి ఉత్తరాల బాగ్స్ తీసుకుని వచ్చేవారు. పొడవాటి కర్రకి ఒక బాకు, గజ్జెలు వుండేవి. దానికి బాగ్ కట్టుకుని జాగింగ్ చేస్తూ వెళ్ళి తిరిగివచ్చేవారు. తిరిగొచ్చేకా వాళ్ళకేమీ పనుండేది కాదు. అలా అని ఇంటికి వెళ్ళేవారు కాదు. తోటలో పని చేస్తూ మాతో ఆడుతూ పాడుతూ తిరిగేవారు. అందులో కొందరు మేము వేసిన బొమ్మలు కడిగి మళ్ళీ కొత్త బొమ్మలెయ్యమని అడిగేవారు. కొంతమంది మోడలింగ్ చేసేవారు. మొక్కలు వేస్తున్నట్లో లేక బక్కెట్టులతో నీళ్ళు తెస్తున్నట్లో నిలబడి ’మమ్మల్ని దించు దించు’ అని వెంటబడేవారు. మేము వచ్చీరానట్లు వేసిన బొమ్మల్ని చూసి తెగ సంతోషపడుతూ మా నాన్నగారు రాగానే, “సారూ, పాప మమ్మల్ని దించిందయ్యా” అని చెప్పేవారు.

అప్పుడే ప్రముఖ చిత్రకారుడు గుర్రం మల్లయ్యగారు పని మీద పోస్టాఫీసు కొచ్చి మా బొమ్మలు చూసి, “ఈ బొమ్మలు ఎవరు వేశారు?” అని మా నాన్నగారిని అడిగారట. నాన్న నవ్వుతూ, “మీరే కాదు సర్! మా యింట్లోనూ ఒక పెద్ద ఆర్టిస్టు వుంది” అని చెప్పేరట.

“పిలవండి, చూస్తాను” అన్నారట మల్లయ్యగారు.

వెంటనే మెయిల్ ప్యూన్ వచ్చి నన్ను పిలిచాడు. నేను వెళ్ళేను.

“ఇదే మా పెద్ద ఆర్టిస్టు” అన్నారు నాన్న నవ్వుతూ.

ఆయన నవ్వలేదు. నా వంక నిశితంగా చూస్తూ “బొమ్మలు వేయడం నేర్పుతాను. నేర్చుకుంటావా?” అని అడిగారు.

నేను ఎగిరి గంతేసి “నేర్చుకుంటాను” అన్నాను.

ఆయన నాన్న వేపు తిరిగి “నేర్పిస్తే ఈ అమ్మాయి చాలా పెద్ద చిత్రకారిణి అవుతుంది. నా దగ్గరకి పంపించండి” అని చెప్పి వెళ్ళేరు.

నేనా మాట పట్టుకుని నాన్నని, అమ్మని వెళ్తానని చాలాసార్లు అడిగాను. కాని వాళ్ళు పంపలేదు.

“చాల్లేరా, ఏం నేర్చుకుంటావు, చదువుకో చాలు” అన్నారు.

ఆడపిల్లల్ని చదివించడమే గొప్ప అనే భావనలో వున్న వాళ్ళని ఇంకేమీ చేయలేకపోయాను నేను.

ఆ తర్వాత మా పెద్దమ్మ గారి అల్లుడు ఆ వూరికి ఇంజనీరుగా వచ్చారు. ఆయన పెళ్ళికి నాకు అయిదు సంవత్సరాల వయసుంటుంది. ఆయన మా బొమ్మల్ని చూసి సంతోషపడి, మా అక్కా నేను తెల్ల కాగితాల మీద దాన్నిమ్మ మొగ్గల రస్ంతో ఆకుపసరులతో వేస్తున్న రంగుల్ని చూసి బాధపడి, కొన్ని డ్రాయింగ్ షీట్స్, రంగులు, కుంచెలు, పెన్సిళ్ళు తెచ్చిచ్చేరు. ఇక మా ఆనందానికి అవధులు లేవు. ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు వేసేసేం.

ఆ తర్వాతి కాలంలో మా నాన్నగారికి నాగార్జున సాగర్ ట్రాన్స్‌ఫరయినప్పుడు నేను గుర్రం మల్లయ్య గారు నిర్మించిన మెటల్ డాం చూసి ఆయన గురించి తెలిసి ఆయన దగ్గర నేర్చుకోలేకపోయినందుకు చాలా బాధపడ్డాను.

అక్కడే రాజస్థాన్ నుంచి వచ్చి అద్భుతమైన చిత్రాలు వేస్తున్న మా స్కూల్ డ్రాయింగ్ మాస్టారు సత్యవర్మగారు కూడా నాకు నేర్పించాలని ప్రయత్నించారు, కానీ కుదరలేదు.

ఇక ఆ తర్వాత నాకు నేనుగా జె.పి.సింఘాల్ కేలెండర్లు సంపాదించి ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టాను. రంగుల కలయిక సరిగ్గా తెలిసేది కాదు. అయినా ‘పాడగా పాడగా…’ అన్నట్టుగా కొంతవరకూ మెరుగ్గా వేస్తున్నా వంటి రంగు వేయడం దగ్గర ఫెయిలవుతుండేదాన్ని. అక్కా నేనూ కలిసి తెలుపురంగులో క్రిమ్‌సన్ కలర్ మిక్స్ చేస్తే గులాబీ రంగు వచ్చేసేది. బ్రౌన్ వేస్తే నల్లగా అనిపించేది. ఇలా ఏవేవో తంటాలు పడుతుండేవాళ్ళం.

ఆఖరికి చెక్కల మీద నిర్మల్ పెయింటింగ్స్‌లా కూడా బొమ్మలు వేయడం మొదలుపెట్టాం. వెనుక బ్యాక్‌గ్రౌండ్‌కి నల్లరంగు ఎంత నీట్‍గా వేసినా డస్ట్ పడి గరుకుగా అయిపోయేది. గబగబా వేసి మంచాల క్రింద ఆరబెట్టేవాళ్ళం. ఎంత చేసినా బొమ్మ ఎంతందంగా వున్నా బ్యాక్‌గ్రౌండ్ మెరుస్తూ లేకపోవడం బాధ కల్గించేది.

అయినా అందరూ మా బొమ్మల్ని తెగ మెచ్చుకుని అడిగి తీసుకెళ్ళే పోయేవారు.

ఇక ఇలా కాదని ఎలాగైనా కొన్ని మెళకువలు నేర్చుకోవాలని నేను గుంటూరులో మా నాన్నగారు పని చేస్తున్నప్పుడు ఒక డ్రాయింగ్ మాస్టారి దగ్గర డ్రాయింగ్ హయ్యర్ చేస్తానని జాయిన్ అయ్యాను. ఆయన కొంతమంది విద్యార్థులకి డ్రాయింగ్ హయ్యర్, లోయర్‌కి ట్రయినింగ్ ఇచ్చేవారు. నేను నా చదువు మొదలైన వివరాలు చెప్పకుండా జాయినయ్యాను. ఆయన కమర్షియల్‌గా పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసేవారు. నేనాయన దగ్గర చేరిన దాంట్లో నాకు నేర్చుకోవడాని కేమీ లేదు. అవి నాలుగు పేపర్సూ పెన్సిల్‌తో వేసేవే. మాకు ఏదో వేయమని చెప్పి ఆయన హోర్డింగ్స్ వేసుకుండేవారు.

నేను యాంత్రికంగా ఆయన చెప్పినవి వేస్తూ క్రీగంట ఆయన రంగులెలా కలుపుతున్నారో, ఏయే రంగులు కలుపుతున్నారో చూసేదాన్ని. అలా చూస్తే ఆయనకు కోపం వచ్చేది. ‘మీ పని మీరు చూసుకోండి’ అని మమ్మల్ని కసిరేవారు.

మొత్తానికి దొంగచూపులతో నేను కాస్త ఆకళింపు చేసుకున్నాను.

తర్వాత మా డ్రాయింగ్ పరీక్ష చెన్నయ్‌లో జరిగింది.

నేను మా మణక్క ఇంటికెళ్ళి అక్కడి నుండి పరీక్ష హాల్ కెళ్ళి పరీక్ష రాశాను.

తర్వాత రెండు నెలలకి రిజల్ట్సు వచ్చాను. నేను పాసయ్యాను.

ఆ రిజల్ట్సు మాస్టారి దగ్గరకొచ్చాయి.

ఆయన ఆ సంతోష వార్త చెబుదామని పోస్టాఫీసు కొచ్చి మా నాన్నగారికి చెప్పారు.

“పైన ఉంది. వెళ్ళండి” అని మా నాన్నగారు ఆయన్ని పంపించారు. మా క్వార్టర్స్ మేడ మీద వుంది.

ఆయన మెట్లెక్కి వరండాలోకొచ్చి కిటికీ లోంచి ‘శారదా’ అని పిలిచేరు.

కిటికీలోంచి మా హాలంతా కనిపిస్తుంది. పొడవాటి ఆ హాలంతా నేనూ, అక్కా వేసిన బొమ్మలు గోడల మీద తగిలించి కనబడుతున్నాయి.

అందులో నేను ప్రముఖంగా వేసింది జె.పి. సింఘాల్ బ్రిటానియా బిస్కట్స్ కేలండర్ మీద వేసిన నీటిలో తడిసిన అమ్మాయి బొమ్మ.

నేను అలా తడిసిన చీరలో వున్న అమ్మాయి బొమ్మ వెయ్యడానికి చాలా తంటాలు పడేదాన్ని. కారణం శరీరం కొంత కనిపించీ కనిపించనట్లుగా వేయడం ఎలానా అని తెగ ఆలోచించేదాన్ని. దాన్ని ఛాలెంజ్‌గా భావించేదాన్ని.

చాలామంది అమ్మాయిల బొమ్మలు చాలా సాంప్రదాయంగా ముసుగుల్లో ముడిచి వెయ్యాలని భావిస్తారు. ఫేస్‌బుక్‌లో కూడా నాకు అలా వేయద్దని సలహాలు యిస్తారు. నేను వారిని తప్పుపట్టను.

కాని… ఆర్టిస్టులు ఎందుకు ఎక్కువగా ప్రకృతిని – స్త్రీని బొమ్మలు వేయడానికి ఇష్టపడతారు?

అవి సౌందర్యానికి ప్రతీక కాబట్టి.

ఒక బురఖా కప్పేస్తే యిక బొమ్మ వేయటం ఎందుకు!

నిజానికి నేను జాగ్రత్తగానే వేస్తాను.

ఆర్టిస్టుగా నా చెయ్యి వంపులు తిరిగుతుంది. వల్గారిటీ రాకుండా చూసుకుంటూనే వుంటాను.

నేను మాస్టారి పిలుపు విని – హాల్లో కొచ్చి చూసి ఎంతో సంతోషంగా – “రండి! మాస్టారూ రండి” అని ఆహ్వానించాను.

మాస్టారు నవ్వలేదు.

ఆయన మొహం పాలిపోయి వుంది. చాలా యాంత్రికంగా లోని కొచ్చారు.

“నువ్వు పాసయ్యేవు… అది చెప్పాలని…” అన్నారు చాలా నీరసంగా.

“కూర్చోండి మాస్టారూ!” అంటూ  అమ్మని పిలిచాను. అమ్మ వచ్చింది. ఆయనకి తగిన మర్యాద చేసేం.

నాన్నగారి కోసం తెచ్చిన బట్టల జత వుంటే పెట్టాను. అమ్మ స్వీట్స్ పెట్టి కాఫీ యిచ్చింది.

అవన్నీ యిచ్చినా ఆయన మొహంలో కాంతి రాలేదు. ఎందుకో నాకెంతకీ అర్థం కాలేదు.

ఆయన లేచి వెళ్తూ “నువ్వింత పెద్ద ఆర్టిస్టువని నాకెందుకు చెప్పలేదమ్మా?” అని అడిగారు.

ఆయనెందుకలా అయ్యాలో అర్థమయి నేను అపరాధ భావంతో చూచాను.

“లేద్సార్! నేను నిజంగా పెద్ద ఆర్టిస్టును కాను. నాకేదో వచ్చని అహంతో వస్తే మీరేమీ నేర్పించరు కదా సార్!” అన్నాను వినయంగా.

నా మాట ఆయనకి నచ్చిందో లేదో మరి… తల పంకించి వెళ్ళిపోయారు.

నేను నిజంగా తప్పు చేశానేమో… నాకే తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here