[box type=’note’ fontsize=’16’] హాస్యమూ, సస్పెన్స్ మేళవించి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!’ పదిహేనవ భాగం. [/box]
[dropcap]డిం[/dropcap]భ ఆనందం అంతా ఇంతా కాదు. “నువ్వు అటు వైపు వెళ్లు. జంబూకకి దొరికినట్లు నీకు కూడా పట్నవాసం మొగుడు దొరుకుతాడు. మోటారు కారు మీద తిరగచ్చు. పట్నం చూడచ్చు. చక్కగా అక్కడి వింత వింత వంటలు తినచ్చు” అని చెప్పాడు.
కురుమ చెప్పినట్లుగా పట్నవాసం కుర్రాడు గుండు దొరికేసరికి సంబరంగా అతగాడిని బర బర లాక్కుపోయింది.
గుండుకి అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అయోమయంగా వుండి పోయాడు.
కాసేపటికి బుర్ర పని చెయ్యటం మొదలుపెట్టింది. అస్తవ్యస్త కోసం తీసిన గోతిలో వినాష్ పడ్డాడు. అస్తవ్యస్తకు చేయాలనుకున్న పెళ్లి తనకు జరిగింది. అర్థం అయ్యాక దుఖం వచ్చింది. వల వల ఏడిచాడు.
స్వయంవరంలో నచ్చిన భార్య లభించినట్లయితే అలా ఏడవటం వాళ్ళ ఆచారం. ఆనందంగా ఏడుస్తారు.
గుండు అలా ఏడవటం చూసి డింభ మరింత సంతోషించింది.
అక్కడ గోతిలో పడి వున్న వినాష్ “ఏడి వీడు. ఎక్కడ ఏడుస్తున్నాడు. ఎంతకీ రాడేం?” అని గుండుని తిట్టుకుంటూ వున్నాడు. అతనికి భయం మొదలయింది. ఎట్లా? ఏం చెయ్యాలి? మొబైల్ ఫోన్ కోసం చూసాడు. షర్ట్ జేబులో వున్న మొబైల్ కింద పడి మూడు భాగాలుగా విడిపోయింది.
ఆ మూడింటినీ జోడించి చూస్తే సిగ్నల్ చాలా బలహీనంగా వుంది. వందసార్లు ప్రయత్నించాక దొరికింది.
“కొండలరావు కొంప మునిగింది” అన్నాడు.
కానీ అతనికి వినిపించలేదు.
హాల్లో హాల్లో అని కాసేపు అరిచి ఇక చేతకాక ఊరుకున్నాడు. మెసేజ్ పెట్టాలని ప్రయత్నించాడు. అదీ వెళ్ళలేదు.
వినాష్‌కి ప్రాణభయం పట్టుకుంది. కొండలరావు కొంప మునిగింది అని చెప్దామని చూస్తే సిగ్నల్ లేదు. ఈ గుండుగాడు అదే పోత పోయాడు. “మీకెందుకు. అన్నీ నేను స్వయంగా దగ్గరుండి చూసుకుంటా” అని హామీ ఇచ్చిన కురుమ అయిపు లేడు. చీకటి పడుతోంది. ఇలా గోతిలో పడి వున్న తనకి దిక్కు ఎవరు అని ఏడుపు వచ్చింది.
ఎంతో మంది మగవాళ్ళు చేసే తప్పే అతనూ చేశాడు. నిజానికి సుఖంలోనూ, దుఃఖంలోనూ భర్తకి తోడు భార్యే. ఆమెను నిర్లక్ష్యం చేసి కష్టాలు నష్టాలూ అనుభవిస్తారు పురుష పుంగవులు. భర్త భార్య పట్ల వున్నంత ఉదాసీనంగా భార్య భర్త విషయంలో వుండదు.
ఇక్కడా అదే జరిగింది. జంబూక ఆ వేళ హడావిడిగా ఉంది. ఎవరికి ఎవరు భర్తగా లభిస్తారు అని కుతూహలం. డింభకు గుండు దొరికాడు అని తెలిసి చాలా సంతోషించింది. డింభ తనకి చాలా ఆప్తురాలు, అలాగే గుండు తన భర్తకి దగ్గర వాడు. డింభ కూడా తనకు దగ్గరగా వుంటుంది అని సంతోషించింది.
ఆ సమయంలో భర్త గుర్తు వచ్చాడు. ‘ఏడి, చాలా సేపటి నుండి కనిపించటం లేదు’ అని వెతికింది.
గుండుని అడిగింది. అప్పుడు గుర్తు వచ్చింది గుండుకి. నిజం చెప్తే గొడవలు వస్తాయి. కాబట్టి ‘అటు వైపు వెళ్తాను అన్నారు’ అని చెప్పాడు.
వెంటనే వెతుక్కుంటూ బయలుదేరింది. అటువెళ్ళి కేక పెట్టింది. అది వినిపించింది వినాష్‌కి. పోయే ప్రాణం లేచి వచ్చింది. తనూ కేక పెట్టాడు. జంబూక కంగారుపడింది. వెతికితే కనిపించాడు.
గోతిలో జంతువు లాగా పడి వున్న భర్తను చూసి భోరున ఏడిచింది. బయటికి తియ్యాలని ప్రయత్నించింది. కానీ చాతకాలేదు. పరుగున వెళ్ళి అందరికీ చెప్పింది.
అందరూ పరుగులు పెడుతూ వచ్చారు. వినాష్‌ని బయటికి తీశారు. కాలు విరిగిపోయింది. చెయ్యి కూడా ఇంత లావు వాచింది. వినాష్‌కి భయం తగ్గింది కానీ బాధ మొదలయింది. విల విల లాడిపోయాడు.
అది చూసి జంబూక ఒకటే ఏడుపు.
ఎముక విరిగింది అని వెదురు బద్దలతో కట్టి వైద్యం ప్రారంభించారు వాళ్ళు. కానీ అస్తవ్యస్త వద్దు అన్నాడు. “అక్కడ పుట్టి పెరిగిన మనిషి. జరిగింది పెద్ద ప్రమాదం. వైద్యం వికటిస్తే ప్రాణాలకే ముప్పు. అక్కడికి తీసుకు వెళ్దాం” అన్నాడు.
వాళ్ళు ఏదో ఆలోచన చేస్తుంటే జంబూక గోల పెట్టింది. “వెంటనే వెళ్దాం” అంది. అస్తవ్యస్త కారులో అస్తవ్యస్త, డోలాయ, వినాష్, జంబూక. వెనక వినాష్ కారులో గుండు, డింభ మరి కొందరు బయలు దేరారు.
అక్కడ రాత్రి కొండలరావు ఫోన్‌లో కుయ్ కుయ్ మంటు మెసేజ్‌లు.
ఇంత రాత్రి వేళ ఎవరా అని చూసాడు. ఎప్పుడో ఇచ్చినవి అప్పుడు సిగ్నల్ అందేసరికి ఇప్పుడు వచ్చాయి. అన్నీ వినాష్ దగ్గరి నుంచి.
కొండలరావు కొంప మునిగింది.
వుసూరుమన్నాడు కొండల రావు.. కొంతకాలంగా సుఖంగా వున్నాను. మళ్ళా మొదలు.
కొండలరావుకి కోపం వచ్చింది. ‘అడవిలో వదిలేసి వచ్చినా కొంప మునిగితే నేనేం చెయ్యను’ అని విసుక్కంటూ ఫోన్ చెయ్యబోతుంటే శాంత కుమార్ దగ్గర నుండి ఫోన్.
ఏడుస్తూ ఫోన్ చేసాడాయన. “కంగారు పడకండి. నేను తిన్నగా హాస్పిటల్ దగ్గరికి వస్తాను. ఏర్పాట్లు చూస్తాను” అన్నాడు.
ఇద్దరూ ఒకే సమయానికి చేరారు హాస్పిటల్ దగ్గరికి.
“ఏవిటి ఈ ఘోరం కొండలరావు, కాలు చెయ్యి ఒకేసారి విరగటం ఏమిటి” అని ఏడ్చాడు శాంత కుమార్.
“ఏముంది ఏదో వెధవ పని చేసి ఉంటాడు, కాలు చేయి వీరి చేసి ఉంటారు” అన్నాడు కొండలరావు.
మరి కాసేపటికే అస్తవ్యస్త కారు వచ్చేసింది. వాళ్ల కోసం కాచుకుని ఉన్న హాస్పిటల్ వాళ్లు వినాష్‌ని లోపలికి తీసుకువెళ్లారు.
ఆపరేషన్ చేశారు. ‘ఏమి ప్రమాదం లేదు ఆరు వారాలు కదలకుండా మంచం మీదనే ఉండాలి’ అన్నారు. ఆపరేషన్ అయినా మూడోరోజు రూమ్‌కి షిఫ్ట్ చేశారు.
విజిటింగ్ అవర్స్‌లో ఎవరైనా రావచ్చు అన్నారు, కానీ ‘విచిత్ర వేషంతో ఉన్న జంబూకని మాత్రం హాస్పిటల్ లోకి రానివ్వం’ అని ఖచ్చితంగా చెప్పేశారు. జంబుక గోల గోల పెట్టింది బతిమాలింది. కొట్లాడింది అయినా వాళ్లు వినిపించుకోలేదు.
కష్ట సమయంలో భర్తకు దూరంగా ఉండటం నరకంగా అనిపించింది జంబుకకు. వెంటనే పనివాళ్ల సాయంతో తన అవతారం మార్చుకుంది. పంజాబీ డ్రెస్ వేసుకుంది జుట్టు కత్తిరించుకుని.
పోనీ వేసుకుంది, చెప్పులు కూడా వేసుకుంది. అప్పుడు హాస్పిటల్‌లోకి రానిచ్చారు.
వినాష్ కాస్త కోలుకున్నాక ‘అసలు విషయం ఏమిటి కాలు చెయ్యి ఎలా విరిగాయి’ అని అడిగాడు కొండలరావు. చెప్పాడు వినాష్.
“ఏదో ప్లాన్ వేస్తే ఇలా అయింది” అన్నాడు. కొండలరావుకి ఒళ్ళు మండిపోయింది. “నీకేమైనా గుర్తుందా బుద్ధి ఉందా? ఎన్నాళ్లు? ఏదో వెధవ పని చేసి కొంప మీదికి తెచ్చుకుంటే గాని తోచదా? కుదురుగా ఉండలేరా?” అని తిట్టిపోశాడు.
“నీలాటి వాడికి పెళ్ళి అవటమే గొప్ప. ఎవర్తె అయినా చేసుకున్నా ఏడాది తిరగకుండానే విడాకులు పారేసిపోతుంది. అయినా ఇదేమైనా బొమ్మలాటా? కట్టుకున్న భార్యను వదిలించుకోవాలని చూడటం పాపం” అని తిట్టిపోశాడు.
అవేమీ తెలియని జంబుక భర్తని భర్తని కంటికి రెప్పల చూసుకుంటోంది. అన్ని సేవలు చేస్తోంది తిండి, నిద్ర నామమాత్రం.
అలవాటు లేని దుస్తులు, అలవాటు లేని వాతావరణం అయినా నోరెత్తకుండా తనకోసం అంత శ్రమ పడుతున్న భార్యని చూసి వినాష్ మనసులో ఏదో మూల జాలి కలిగింది. అదివరకు ఉన్న ద్వేషం, విసుగు తగ్గిపోయాయి.
శాంత కుమార్‌కి కూడా మనసు మారింది. ‘ఆటవిక యువతి అయినా మంచి పిల్ల. ఈ రోజుల్లో నువ్వెంత అంటే నువ్వెంత అనే వాళ్ళే తప్ప, భర్తను అమితంగా అభిమానించే అమ్మాయిలు ఎక్కడ వున్నారు? పెళ్లి దైవ నిర్ణయం. అడవిలోని ఉసిరికాయనూ సముద్రం లోని వుప్పుకల్లునూ కలిపినట్లు వీళ్లనే కలిపాడు’ అనుకున్నాడు.
జంబూకలో కూడా మార్పు వచ్చింది. వినాష్ చుట్టూ వున్న వాతావరణం, అతని వైభవం అర్థం అయ్యాయి. అతని లోకం వేరు. తను అతనికి తగిన భార్య కాదు అనిపించింది.
ఆరు వారాలు గడిచాయి. వినాష్ ఇంటికి వచ్చేశాడు. రెండు వారాలు తరువాత ఇంటికి వెళ్ళచ్చు అని అన్నారు గానీ ఎందుకులే అని కట్టు విప్పేదాకా అక్కడే వున్నారు.
అతను ఇంటికి వచ్చిన కొద్ది రోజులకు జంబూక ఒక విషయం గమనించింది. తను గర్భవతి. ఆనందం కలిగింది. అప్పుడే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది.
ఒక పక్క సంతోషం. మరో పక్క బాధ..
కొద్దిగా భాష నేర్చుకుంది. కానీ పొడి ముక్కలతో పని గడవదు. ముఖ్యమైన విషయం చర్చించాలి. కాబట్టి మనిషి సాయం వుండాలి. అస్తవ్యస్తను పిలిపించింది. డోలాయతో కలిసి వచ్చాడు అస్తవ్యస్త.
అందరినీ కూచోబెట్టి కళ్ళ నీళ్ళు తుడుచుకుని మాట్లాడటం మొదలు పెట్టింది జంబూక. వాళ్ళ ఆచారం ప్రకారం స్త్రీ గర్భవతి అయిన తర్వాత భర్తను వదిలేసి బిడ్డతో వుండవచ్చు. అదే చెప్పింది అందరి ముందూ.
అస్తవ్యస్త తెల్లపోయాడు. మందలించాడు. నచ్చచెప్పాడు..
వినాష్‍కి అర్ధం అయీ కాకుండా వుంది. ఏమిటి అని అడిగాడు. అస్తవ్యస్త మెల్లిగా చెప్పాడు. అందరూ నిర్ఘాంతపోయారు. కొండలరావుకి బాధ కలిగింది.
“చూడు నాయనా విన్నావుగా. ఇది క్లిష్ట సమస్య. నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి” అన్నాడు.
వినాష్ నోరు విప్పగానే ఆపేశాడు శాంత కుమార్. “నువ్వుండు. నేను చెప్తాను” అన్నాడు.
వినాష్ వారించాడు. “ఇది నాకు సంబంధించిన సమస్య, నేనే నిర్ణయం తీసుకుంటాను” అన్నాడు. అంతట నిశ్శబ్దం. అందరూ ఎదురు చూస్తున్నారు ఇతను ఏం చెప్పాడో అని.
వినాష్ నోరు విప్పాడు. “జంబూక ఎక్కడికి వెళ్లడానికి లేదు. ఇక్కడే ఉంటుంది. ఇక్కడే మా బిడ్డకు జన్మనిస్తుంది” అని చెప్పేసాడు. అంతట ఆనందం.
అతని నిర్ణయం విని అస్తవ్యస్త అమితంగా ఆనందించాడు. అతని ద్వారా విషయం తెలుసుకున్న జంబూక అతని కాళ్ళ మీద పడిపోయింది.
అడవి నుండి జంబూక తల్లిదండ్రులు వచ్చారు. రమ్మని వియ్యంకుడు స్వయంగా ఆహ్వానించాడు.
శుభవార్త విని పరమానంద పడిపోయారు. కూతురిని అల్లుని తమ వెంట తీసుకువెళ్లాలని సిద్ధమయ్యారు, కానీ శాంతకుమార్ వారించాడు. “ఇప్పుడే కోలుకుంటున్నాడు కావలిస్తే మీరే ఇక్కడ ఉండి మీ కూతురి మంచీ చెడ్దా చూసుకోండి” అన్నాడు.
“అలా వుండటం కుదరదు,” అని చెప్పి, “మందులు పసర్లు ఇచ్చి మళ్ళీ వస్తాం” అని వెళ్ళిపోయారు.
ఇద్దరు అమ్మాయిల్ని పెట్టి జంబూకకి మన కట్టూ బొట్టూ భాష నేర్పటం ప్రారంభించారు. మూడు నెలల లోనే చాలా మారిపోయింది. భర్తకి గుండు చేసి అలంకరించడం, ఎత్తుకు తిరగటం లాంటివి మానేసింది. ఇంట్లోనే వుంటోంది. ‘పూర్తిగా మారాక బయటికి తీసుకు వెళ్తా’ అన్నాడు వినాష్.
భాష రావటం వల్ల మొగుడూ పెళ్ళాల మధ్య మాటలు నడుస్తున్నాయి.
(తరువాత కధ మళ్ళీ).