సిరి ముచ్చట్లు-15

0
3

[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని; యవ్వనప్రాయంలోని జ్ఞాపకాలను గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో పదిహేనవ ముచ్చట. [/box]

[dropcap]సి[/dropcap]రికి +2లో మంచి ర్యాంకే వచ్చింది. మెడిసన్‌లో ఎంట్రన్స్ లేకుండానే సీట్ వచ్చింది. కానీ అర్థిక పరిస్థితుల కారణంగా ఎక్కువ ఆశలకు పోకుండా బి.యస్.సి.లో చేరింది సిరి.

అన్నయ్యలిద్దరి చదువులూ ముగిసి ఉద్యోగాన్వేషణలో వున్నారు. నాన్నమ్మ తాతయ్యలు చాలా వృద్ధులయ్యారు. అయినా భవవంతుడి దయవలన ఆరోగ్యంగానే వున్నారు. నాన్నకు సిరి నెంతో… ఎంతో చదివించాలని ఆశ. కానీ సహకరించని ఆర్థిక స్థితి.

1969లో తెలంగాణా ఉద్యమం జరుగుతున్న రోజులవి. నాన్నకు ముల్కీ సర్టిఫికెట్ లేదనీ, ఆంధ్రావాలా అనీ – చేస్తున్న మున్సిపల్ క్లర్క్ ఉద్యోగంలో నుండి తీసేసారు. ఎవరినెంతగా ప్రాధేయపడినా, ఎవరూ కనికరించ లేదు. అందరూ దిగులు పడ్డారు. చివరికి అమ్మ, నానమ్మ తమ నగలు అమ్మేస్తే, నాన్నకు బుక్ షాప్ పెట్టుకునే అవకాశం లభించింది.

అన్ని రకాలైన టెక్సట్ బుక్సుతో పాటు, స్టడీ మెటీరియల్ కూడా అమ్మడం వల్ల నాన్న బుక్ షాప్‌కి మంచి పేరే వచ్చింది. ఆ విధంగా ఎవ్వరినీ చేయి చాచకుండా బ్రతుకు బండిని లాక్కొస్తున్నాడు నాన్న. స్వంతిల్లుండడం వల్ల అద్దె భారం కూడా లేదు.

రాజా, రామూలకు ఉద్యోగాలు రావాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు, శక్తివంచన లేకుండా వాళ్ళూ ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాయణం, దక్షిణాయనం ప్రభావం అప్పుడప్పుడే ప్రబలుతున్నది. అంటే రికమండేషన్ గానీ, లంచంగానీ యివ్వగలిగితే ఉద్యోగం తప్పక దొరికే అవకాశమన్న మాట. అవి రెండూ ఇవ్వలేని నిస్సహాయత రాజూ రామూలది. మంచి మార్కులు సాధించిన తమకు న్యాయసమ్మతంగానే ఉద్యోగాలు రావాలనే కోరిక, పట్టుదల కూడా వాళ్ళకుంది. ఒకటి, రెండు చోట్ల వాళ్ళెళ్ళిన ఇంటర్వూలో ఆశాజనకంగానే అనిపించింది. అపాయింట్‌మెంట్ లెటర్ కోసం వేచి వున్నారు వాళ్ళు.

“నాన్నా మన బజారులోని ముగ్గురు పిల్లలు ట్యూషన్ చెప్తావా అక్కా అని అడిగారు. ఒక్కొక్కరికి 20 రూపాయలు చొప్పున వచ్చిన మంచిదేగా?” అని నాన్నతో చెప్పింది సిరి.

నాన్న దెబ్బతిన్నట్లుగా చూస్తూ ‘నువ్వూ సంపాదిస్తేగాని గడవని హీనదశలో వున్నామా తల్లీ?’ అన్నాడు.

‘ఛ.. ఛ అదేమి మాట నాన్నా? కాలేజీ నుండి వచ్చాక 4 గంటల నుండీ నేను ఖళీగానే వుంటాను. ఒక అయిదారుగురు పిల్లలు వస్తే, నెలంతా కూరగాయల ఖర్చుకు సరిపోతుంది. నేనేమీ వాళ్ళింటికి వెళ్ళను గదా, వాళ్ళే వస్తారు’ అన్నది సిరి.

“ఉదయమనగా లేచి హోం వర్క్ చేసుకొని, అటు టైప్ షార్ట్‌హ్యాండ్ లెర్నింగ్ కెళ్తావు. రాగానే కాలేజీ కెళ్తావు. అలసిపోతావు తల్లీ. ఏమీ వద్దులే” అన్నాడు నాన్న.

“నాకేమీ కష్టం కాదు నాన్నా. రేపు ఒకటో తారీఖు నుండి పిల్లలను రమ్మంటాను. కాదనకండి” అభ్యర్ధనగా అన్నది సిరి.

ఆ సంభషణంతా వింటున్న తాతయ్య “ఆ పిల్లలు మనింటికే వస్తారు కదరా, ఏదో కాలక్షేపం అవుతుంది వద్దనకురా” అన్నాడు. నానమ్మ కూడా అవునంది. అమ్మ వైపు చూసాడు నాన్న. ‘ఒప్పుకోండి’ అన్నట్లుగా చూసింది అమ్మ.

‘సరే… మీ ఇష్టం’ అన్నాడు నాన్న.

‘థాంక్యూ నాన్నా’ అన్నది సిరి సంతోషంగా.

తర్వాత నలుగురు పిల్లలతో మొదలైన సిరి ట్యూషన్ సెంటర్ చూస్తుండగానే 10-15 మంది వరకూ పెరిగింది. తన తొలి సంపాదనైన 40 రూపాయలు చూసుకొని మురిసిపోయింది సిరి. పట్టుబట్టి అందరినీ ఒప్పించి, ఇంటిల్లిపాదినీ తీసుకెళ్ళి ఫామిలీ ఫోటో దిగింది సిరి.

ఎన్నో ఏళ్ళు గడిచినా, సిరి జీవితంలో ఆ ఫోటో ఒక తీయని జ్ఞాపకంగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here