అపురూమైన అనుభవం: “తుంబడ్” చిత్రం

5
4

[box type=’note’ fontsize=’16’] “ఈ సినిమా గురించి చెప్పడానికి వీలు కాదు, కేవలం అనుభవించాల్సిందే. చూడబోయే ప్రేక్షకుడినుంచి ఆ అనుభవాన్ని దొంగలించరాదు” అంటున్నారు పరేష్ ఎన్. దోషితుంబడ్” చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]హిం[/dropcap]దీలో మంచి సినెమాలకు కరువు పోయింది. వొకోసారి మిస్సవుతామేమో అనిపించేలా వస్తున్నాయి చిత్రాలు. ఇది తప్పకుండా అలాంటి చిత్రమే. అతిశయోక్తి కాదు. భయానక, బీభత్స, రహస్యమయ కథ, నిధి గురించిన వేట, జానపద గాథ, నీతి బోధకం: వీటిలో యేది? అన్నీ అన్నా పర్వాలేదు. ఇన్ని వున్నా కంగాళీ కాకుండా, ప్రేక్షకుడి ఆసక్తిని నిలబెట్టే కథనం.

మహారాష్ట్రలో వో వూరు తుంబడ్. కథా కాలం 1918 నుంచి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి కొన్నేళ్ళ వరకూ. కథ క్లుప్తంగా ఇది: వొక ప్రాచీన దేవత తన కుహరమైన భూమి నుంచి పదహారువేల కోట్ల దేవతలను సృష్తిస్తుంది. అయితే ఆమెకు తన ప్రథమ సంతానమైన హస్తర్ అంటే యెక్కువ ముద్దు. హస్తర్ కు లోభితనం యెక్కువ. భూమిలోని బంగారమంతా హస్తగతం చేసుకున్నాక పంటపొలాలు,ఆహారం వెనక పడతాడు. మిగతా దేవతలకు ఆగ్రహం వచ్చి హస్తర్ మీద ప్రహారాలు చేస్తారు. అది చూడలేక ఆ ప్రాచీన దేవత హస్తర్‌ను తన కడుపులోనే దాచుకుంటుంది. హస్తర్‌కి వొక శాపముంది, భూమి మీద గనక అతని పేర యెవరన్నా పూజలు చేసినా అంతా సర్వనాశనమవుతుంది, నిద్రిస్తున్న హస్తర్ నిద్రలేస్తే ప్రళయమే. ఆ ఆపద రాకుండా వుండాలని ఆ ప్రాచీన దేవత హస్తర్ పేరు యే శాస్త్రాల్లోనూ లేకుండా తుడిచివేస్తుంది. అయినా యెలా జరుగుతుందో గాని తుంబడ్ లో యెవరో హస్తర్‌కు గుడి కట్టిస్తారు. అక్కడి నుంచి వొక పక్క వో కుటుంబంలో మూడు తరాల కథ, జాగ్రత్తగా గమనిస్తే భారతదేశంలోనే వస్తున్న అలాంటి మారుతున్న కథే కనిపిస్తుంది.

తుంబడ్‌లోని వో విధవరాలు జమీందారుకు సేవలు చేస్తూ, తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ, తన ఇంట రహస్యంగా కట్టేసి వుంచిన వో అవ్వకు వేళకు తిండి పెడుతూ గడుపుతుంది. ఇదంతా ఆ జమీందారు ఆమెకు బదులుగా వో బంగారు నాణెం ఇస్తాడన్న ఆశతో. చిన్న పిల్లలకు ఆ అవ్వ గురించి కుతూహలం, భయం. “పడుకో, లేదంటే హస్తర్ వస్తాడు” అన్న మాటలకు ఆ అవ్వ మెత్తబడటం ఇంకా ఆశ్చర్యం. తల్లిని అడిగినా చెప్పదు. వో సాయంత్రం తల్లి రాక ఆలస్యమైతే కొడుకు ఆ అవ్వకు తిండి పెట్టడానికెళ్ళి చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి తెచ్చుకుంటాడు. ఆ జమీందారు చనిపోయాక ఆమె తన కొడుకు వినాయకరావుతో వూరు వదిలి వెళ్దామంటుంది. తుంబడ్ లో రహస్య నిధిని వెతకకుండానేనా, అంటాడు వాడు. నువ్వు మళ్ళీ తుంబడ్ మాట యెత్తకుండా వుంటే ఇస్తాను అని తన కొంగులోంచి బంగారు నాణెమొకటి తీసిస్తుంది. తల్లి మాట వినదు కాబట్టి గాని, ఆ కుర్రవాడికి ఆ వొక్క నాణెంతో తృప్తిగా లేదు. వాళ్ళు పూణెకు మకాం మారుస్తారు. ఇప్పుడు వినాయకరావు (సోహం షా) పెద్దవాడయ్యాడు. వివాహితుడు. ఇప్పుడు ఆపడానికి తల్లి లేదు. తుంబడ్ కు ప్రయాణమవుతాడు. యెట్లాగో ఆ నిధిని వెతికి పట్టుకుంటాడు. వో మార్వాడీ వడ్డీ వ్యాపారస్తుడికి (దీపక్ దాంలే) నాణెం అమ్ముతాడు. ఇక ఇది తరచు కృత్యమైపోతుంది. క్రమంగా అతను ఆస్తులు పోగేసుకోవడం, ఆ మార్వాడీకి కన్ను కుట్టి రహస్యంగా వినాయక్ ని వెంబడిస్తాడు. వినాయక రావు కొడుకు కాస్త పెద్దయ్యి తన తండ్రి లాగే తుంబడ్ లో ఆసక్తి, కుతూహలం ప్రదర్శిస్తాడు. ఇక తన తర్వాత తన కొడుకే కదా ఇది నేర్చుకోవాల్సిందని వొక రోజు అప్రెంటీస్‌గా తన కొడుకుని కూడా తీసుకెళ్తాడు. అసలు ఆ తుంబడ్ లో ఆ నిధుల కథ యేమిటి, హస్తర్ సంగతి యేమిటి, వీటికి అవతల కూడా దర్శకుడు యేదన్నా చెప్ప దలిచాడా?, ఈ కథని మన దేశపు వేర్వేరు కాలాలతో లంకె కుదిర్చి యేదన్నా ప్రత్యేకంగా చెబుతున్నాడా? ఇవన్నీ చిత్రం చూసి తెలుసుకోవాల్సిందే.

నాతో యెంతమంది యేకీభవిస్తారో తెలీదు గాని నాకు చిత్రం మొత్తం అయ్యాక గుర్తుకొచ్చింది డేఫ్నె డు మోరియే నవల “మై కజిన్ రేచెల్”. అది కూడా ఉత్కంఠభరిత కథే, అయితే మనం భయపడేది వొకానొక మానవ ప్రవృత్తికి, దాని పరిణామాలకీ. ఇందులో అత్యాశ అనొచ్చా? అయినా ఈ చిత్రంలో కథ కంటే కూడా మాట్లాడుకోవాల్సినవి చాలానే వున్నాయి. వొక ప్రత్యేక ప్రక్రియగా సినెమాను చూసేవాళ్ళు అది చూస్తున్నంత సేపు తమకు కలిగే సంవేదనలను ఆ దర్శకుడు యేం చేస్తే కలిగాయో కాసేపు కళ్ళు మూసుకుని, కాసేపు చెవులు మూసుకుని చూస్తే అవగతమవుతుంది. ఆ నిర్మాణాన్ని సూక్ష్మంగా పరీశీలించాల్సి వస్తుంది. మనం ఇన్ని హారర్ చిత్రాలు చూశాము. ఆ అనుభవంతో ఇప్పుడు అవాక్కవుతాం అనుకుంటూ వుండిపోవలసిందే గాని ఆ రకమైన హారర్ ఇందులో లేనే లేదు. దర్శకుడి వుద్దేశం కూడా బహుశా అది కాదు. కొంచెం సేపు తర్వాత దాని సంగతి మరచిపోయి చాయాగ్రహణం చూస్తాము. వుంటే చాలా ఇరుకైన బావుల్లాంటి చోట్ల, లాంతరు వెలుగులో దృశ్యాలు, లేదంటే చాలా విశాలమైన ఆకాశం, మబ్బు పట్టి, విశాలమైన మైదానాల మీద కుంభ వృష్టి. వీటి మధ్య గొడుగు పట్టుకుని వో మనిషో, ఇద్దరు పిల్లలో, వో బండో కనపడుతుంది. మళ్ళీ మన మనసు ట్రాక్ మారుతుంది. సంగీతం. యెక్కువ సంభాషణలు లేని చోట్ల ఆ వాద్యాలే యేదో చెబుతుంటాయి, యేవేవో స్పందనలు కలిగిస్తుంటాయి. అంతా కొత్తగా వుంటుంది, మన చిత్రాలవరకూ. పోయినవారం మాట్లాడుకున్న “అంధాధున్” ఉత్కంఠనైనా మాటలలో చెప్పే వీలుంది కాని ఇది మాత్రం కేవలం అనుభవించాల్సిందే. చెప్పడానికి వీలు కాదు. ఇంతకంటే యెక్కువ వ్రాయాలంటే యెప్పటిలాగే కథ అడ్డం వస్తుంది, చూడబోయే ప్రేక్షకుడినుంచి ఆ అనుభవాన్ని దొంగలించరాదు.

ఆనంద్ గాంధి అంటే “ది షిప్ ఆఫ్ థీసియస్” గుర్తుకొస్తుంది. ఆ మహానుభావుడే దీనికి స్క్రిప్టు వ్రాసినవారిలో వొకడు. అందులో చేసిన సోహం షా ఇందులోనూ చేశాడు, అద్భుతంగా. కుతూహలం, దురాశ, కామ లాలస, వ్యామోహం, కాఠిన్యం, తెంపరితనం అన్నీ కనబడతాయి ఆ మోములో. దీపక్ దాంలె, సమద్ కూడా చాలా బాగా చేశారు. మిగతా పాత్రలు కూడా బాగా వచ్చాయి. రాహి అనిల్ బర్వే, ఆదేష్ ప్రసాద్, ఆనంద్ గాంధి ల దర్శకత్వం A1. ఇది రాహి తొలి చిత్రం. నారాయణ్ ధరప్ వ్రాసిన “తుంబడ్ చే ఖోట్” కథ ఆధారంగా ఈ చిత్రం తీశారు. చదివిన కథ అనుకున్నట్టుగా రావడంలేదు అనుకుంటున్నప్పుడు ఆనంద్ ఆ స్క్రిప్ట్ కు మెరుగులు దిద్ది కొంత వరకు దర్శకత్వం కూడా చేశాడు. దాదాపు పదేళ్ళు పట్టింది ఇది పూర్తి కావడానికి. దీని వెనుక వున్న అందరి passion అర్థమవుతుంది ఇది చూస్తే. అజయ్ అతుల్ సంగీతం బాగుంది. కాని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జెస్పెర్ కిడ్ అందించిన నేపథ్య సంగీతం. మూడు తరాల కథకు మూడు పేటల గొలుసులా అల్లాడు సంగీతాన్ని. కేవలం ఆ సంగీతం కోసం మరోసారి చూడొచ్చు అన్నా తప్పులేదు. ఇవేవీ పట్టకపోయినా ప్రతి ప్రేక్షకుడూ ఆ చాయాగ్రహణానికి దాసోహం అనాల్సిందే. అలా అందించింది పంకజ్ కుమార్. రంగూన్, షిప్ ఆఫ్ థీసియుస్, హైదర్లు కూడా కళ్ళముందు మెదులుతాయి ఇతని పేరు వింటే. యే చిత్రానికైనా రాత బల్ల తర్వాత ఎడిటింగ్ బల్ల మీదే చివరి మెరుగులు దిద్దుకుని వో రూపు కడుతుంది. సమ్యుక్త ఎడిటింగ్ ఇంత అందంగా లేకపోతే కొంచెం తక్కువ హత్తుకునేది ఈ చిత్రం. కొంచెం ఆవేశంలో యెక్కువ పొగిడేశానేమో గాని అతిశయోక్తి మాత్రం కాదు.

ఆ గ్రాఫిక్స్ స్థాయి కూడా చాలా ఉన్నతంగా వుంది. ఇక నితిన్ చౌధరి-రాకేశ్ యాదవ్ ల ప్రొడక్షన్ డిజైన్ కూడా. ఆ తలుపులు, వాటి తాళాలు, ఆ కుడ్యచిత్రాలు, ఆ వాకిళ్ళు ఆ కాలం నాటి కాయస్థ బ్రాహ్మణ వేశభూషాలు, అప్పటి నగలు, అప్పటి బళ్ళు, వొకటేమిటి ప్రతి చిన్న విషయమూ చాలా శ్రధ్ధగా చేసింది.

పెద్దయ్యాక వినాయకరావు ఆ అవ్వను చూడడానికెళ్తే అప్పటికే ఆమె లోతుగా వేళ్ళూనీ వృక్షమై వుంటుంది. భయానకంగా. అలాగే ఆ హస్తర్ ఆహారం కోసం తల్లడిల్లడం, ఆహారం దొరకగానే భుజించి, బంగారు నాణేలను విసర్జించడం. తల్లి ఇచ్చిన వొక్క నాణెం చాలక తల్లిని బ్లాక్‌మెయిల్ చేయడానికి చిన్నప్పుడే దీన్ని నదిలో పారేస్తాను చూడు అనే ఆ బాలుడు పెద్దయ్యాక ప్రతి ప్రయాణం నుంచీ గుప్పెడు నాణేలు తేవడం. ఇక అతని కొడుకు వరకు వస్తే అతనెలా చేశాడన్నది వూహించవచ్చు. ప్రతి చావు తర్వాతా వో మంట చూపిస్తాడు, కాని ఈ వెంపర్లాట చావదు. మనం కూడా మన వశం తప్పినప్పుడు చెవుల్లో అతిమంద్ర స్థాయిలో చెప్పుకోవాలి, “వూరుకో, లేదంటే హస్తర్ వస్తాడు” అని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here