[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ కెన్యా రచయిత గుగి వా థియాంగో నవల ‘వీప్ నాట్ చైల్డ్’కి తెలుగు అనువాదం ‘ఏడవకు బిడ్డా…’. అయోధ్యా రెడ్డి అనువదించిన ఈ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]
తెల్లవాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధంలో నల్లవాళ్ళను పోర్టర్లుగా తీసుకుపోయారు. అందులో ‘నుగొతో’ కూడా వున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో అతని ఇద్దరు కొడుకులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏ సంబంధం లేని యుద్ధాలలో, వాళ్ళు ఎందుకు పోరాడాల్సి వచ్చిందో వారికి అర్థం కాదు. నుగొతో కు ఇద్దరు భార్యలు. చిన్న భార్య ‘యోకబి’కి తన కొడుకు ‘జొరొగొ’ ఇంగ్లీషు మీడియంలో చదివి ప్రయోజకుడు కావాలని కోరిక, ధ్యేయం కూడా. తన పిల్లలు బంధువులు, చివరకు స్నేహితులు ఎవరూ తెల్లవాళ్ళ కోసం త్యాగాలు చేయడం ఆమెకిష్టం లేదు. తన కొడుకుల్లో ఎవరైనా ఇంగ్లీషు చదువులు చదివి వుంటే – తన భర్త హావ్‌లాండ్స్ వంటి తెల్లవాడి దగ్గర తలవంచి పనిచేసేవాడా అని ప్రశ్నిస్తుంది.
నుగొతో పెద్ద కొడుకు ‘బోరో’ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని వస్తాడు. ఎప్పుడూ ముభావంగా ఉండే బోరో బాగా తాగి ప్రభుత్వం మీదనో, తెల్లవారి మీదనో కోపం వచ్చినప్పుడు పిచ్చి కేకలు వేస్తాడు. రోజులు గడిచినా బోరోకు బయట ఎక్కడా ఉద్యోగం దొరకదు. ఓ పక్క బతుకుతెరువు లేదు, మరో పక్క ఉన్న భూమి కస్తా తెల్లవాడి పాలైపోయింది. మొదటి ప్రపంచయుద్ధం ఫలితంగా హావ్‌లాండ్స్ ఇంగ్లండ్ నుంచి కెన్యా వచ్చి స్థిరపడిపోయాడు. వ్యవసాయం చేయిస్తూ భూస్వామిగా మారిపోయిన హావ్‌లాండ్స్ వద్ద నమ్మకస్తుడైన జీతగాడిగా నుగొతో పనిచేస్తుంటాడు. నుగొతో కష్టార్జితం వల్లనే హావ్‌లాండ్స్ ఉన్నతస్థితికి చేరుకుంటాడు. స్కూల్లో జొరొగొ చురుకైన విద్యార్థి అయినప్పటికీ – అతని జాతి, పేదరికం వల్ల స్కూలు విద్యార్థులు అతడ్ని అవమానించి ఏడిపిస్తుంటారు. జొరొగొను అల్లరి పిల్లల బారి నుండి ‘విహాకి’ కాపాడుతూంటుంది. నల్లజాతీయుల్లో ఏకైక భూస్వామిగా ఎదిగిన జాకొబో కూతురు ఆమె.
కెన్యాలో పరిస్థితులు, నిరుద్యోగ సమస్య, తెల్ల జాతీయుల దోపిడి విధానం, బలవంతంగా ఆక్రమించుకున్న తమ భూముల విషయమై పోరాడాలని నిర్ణయించుకుంటారు. తెల్లవాళ్ళకు వ్యతిరేకంగా నైరోబీలో జరుగుతున్న పోరాటానికి ప్రతిస్పందనగా ఆ ఊళ్ళో వున్న నల్లవాళ్ళు శ్రమకు తగిన వేతనం కోసం సమ్మెకి పిలుపునిస్తారు. ఇంట్లో అంతా ఆకలికి మాడి చస్తారని తెలిసి కూడా నుగొతో, పని మానేసి సమ్మెలో చేరుతాడు. నల్లవాడైనప్పటికీ జాకొబో, మిగతా నల్లవాళ్ళని హీనంగా చూస్తూ, తెల్లవాడిలా ప్రవర్తిస్తూ సమ్మెను అణచివేసి, వాళ్ళ మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాడు. జాకొబో మీద తిరగబడిన నుగొతో ను పోలీసులు చితకబాదుతారు. ప్రతీకారంగా తన స్థలంలో వున్నందున జాకొబో, నుగొతోను అక్కడి నుండి వెళ్ళగొడతాడు. అత్యంత బీదరికంలో ఉన్న జొరొగొ ఫిఫ్త్ స్టాండర్డ్‌లో ప్రవేశిస్తాడు. విహాకి మరో ఊరు వెళ్ళి బాలికల బోర్డింగ్ స్కూల్లో చేరుతుంది.
అక్రమంగా స్థిరపడ్డ తెల్లజాతీయులకు వ్యతిరేకంగా, స్వాతంత్ర్యం కోసం మౌ మౌ యువకుల పోరాటం ఉధృతమవుతోంది. హావ్‌లాండ్స్‌తో కలిసి జాకొబో నల్లవాళ్ళపై అత్యాచారాలు, దౌర్జన్యాలు చేస్తూంటాడు. బోరో అడవిలోకి వెళ్ళి విప్లవనాయకుడవుతాడు. ప్రజా పీడకుడైన జాకోబోను చంపివేస్తాడు. జాకోబో హత్యకు కారకుడైన బోరో ఆచూకి కోసం పోలీసులు వచ్చి జొరొగొను పట్టుకుపోతారు. చిత్రహింసలు పెడతారు. జాకొబో హత్యానేరం మీద నుగొతో రెండో కొడుకు ‘కామౌ’ను పోలీసుకు అరెస్టు చేస్తారు. కొడుకుని విడిపించడం కోసం జాకొబోను చంపిన నేరం తనపై వేసుకుని, నుగొతో పోలీసుల వద్దకు వస్తాడు. కసి మీద ఉన్న హావ్‌లాండ్స్ రహస్యాల కోసం క్రూరాతిక్రూరంగా నుగొతోను చిత్రహింసలు పెడితో నుగొతో చనిపోతాడు. ప్రతీకారంగా బోరో హావ్‌లాండ్స్‌ని చంపేస్తాడు. డబ్బు కోసం జొరొగొ భారతీయ షాపులో కొన్ని రోజులు పనిచేసి, తన మనస్తత్వానికి సరిపోక మానేస్తాడు. తను ఎంతగానో ప్రేమించిన విహాకి దూరమవుతుంది. పోలీసులకు చిక్కిన తన అన్నలు బోరో, కామౌ; డిటెన్షన్ క్యాంపులో వున్న ‘కోరి’ బతుకుతారన్న నమ్మకం లేదు. నిరాశతో, జీవితం మీద విరక్తితో జొరొగొ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. దిక్కులేని వాళ్ళుగా మిగిలిపోయిన ఇద్దరు తల్లుల బాధ్యత తన మీద వుందని గ్రహించి జొరొగొ ఇంటిముఖం పడతాడు.
‘తమ భూములు తమవి కాకుండా ఎక్కడి నుండో వచ్చిన తెల్లవాళ్ళ స్వంతం ఎలా అవుతాయి? వాళ్ళు నల్లవాళ్ళని పశువుల కన్నా హీనంగా ఎందుకు చూస్తారు?’ అని జొరొగొ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. స్కూల్లో తెల్ల టీచర్లు, విద్యార్థుల వివక్షను చవిచూస్తాడు. ఒక మెట్టు పైకెదిగిన నల్లవాళ్ళు కూడా తెల్లవాడిలా ప్రవర్తించడం దారుణమని తలపోస్తాడు. తన అన్న కామౌను వండ్రంగి గంగా దగ్గర పని నేర్చుకోడానికి పెడతాడు. అతను తనకు వచ్చింది పక్కవాడికి నేర్పితే వాడెక్కడ బాగుపడతాడోనని తన నైపుణ్యాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. నల్లజాతీయులలో భూస్వామిగా ఎదిగిన జాకొబో కూడా తెల్లవాళ్ళతో సమానంగా నల్లవాళ్ళను హీనంగా చూడడం జొరొగొ భరించలేకపోతాడు. పొట్ట చేత పట్టుకుని ఆఫ్రికాకు పోయి, వ్యాపారాలు చేసుకుంటూ బాగుపడిన భారతీయులు కూడా తెల్లవాళ్ళలానే ప్రవర్తిస్తూ, నల్లవాళ్ళని హీనంగా, బానిసలుగా చూడడం అక్కడ కనిపిస్తుంది. భారతీయ వ్యాపారుల్లో ఎక్కువమంది స్వార్థపరులే, పిసినారులే. వ్యాపారం కోసం మానవత్వాన్ని చంపుకుని బతికేవాళ్ళని ఈ పుస్తకంలో తెలియజేస్తారు. ఇది రచయిత ఆత్మకథాత్మక నవల. పేదరికం.. వర్ణ వివక్ష, అవమానాల మధ్య పెరిగిన గుగి బాల్యాన్ని ఈ నవల తెలియజేస్తుంది. జాత్యాహంకారుల నిరంకుశత్వంలో గుగి కుటుంబం ఎలా నాశనమైందో ఈ నవల వివరిస్తుంది. ఇది ఒక గుగి కథనే కాదు, మొత్తం నల్ల జాతీయుల చరిత్రకి, వేదనకి అద్దం పడుతుంది.
ఇంతవరకు తెలుగులోకి వచ్చిన గుగి రచనలలో ఎక్కడా కనిపించని సరళ సుందరమైన భాష ఇందులో కనిపిస్తుంది. చక్కటి అనువాదం, మంచి పఠనీయతా గుణంతో ఈ పుస్తకాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దిన అయోధ్యారెడ్డి కృషి, ప్రతిభ ప్రశంసనీయం. టైటిల్ కూడా చక్కగా కుదిరింది. గుగి జీవితం – సాహిత్యాలను వివరిస్తూ ఎన్. వేణుగోపాల్ రాసిన ముందుమాట ఈ పుస్తకానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అందరూ చదవాల్సిన మంచి పుస్తకమిది.
***
ఏడవకు బిడ్డా…
రచన: గుగి వా థియాంగో
అనువాదం: అయోధ్యా రెడ్డి
ప్రచురణ: మలుపు బుక్స్, #2-1-1/5, నల్లకుంట, హైదరాబాదు – 500 044.
పుటలు: 182, వెల: ₹150
ప్రతులకు: ప్రచురణకర్త, ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు.