4. అంతులేని కథ

0
4

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]వి[/dropcap]శాలమైన పచ్చని వరి చేలు. ప్రకృతికాంత పచ్చరంగు పట్టుచీర కట్టుకున్నట్టు కళకళలాడుతూన్న పరిసరాలు. ఆ చేలకు కాపు కాస్తున్నట్టు ఓ పక్క విస్తీర్ణమైన అరణ్యం… మరో పక్క నిండుగా, కనుల పండువుగా అలంకరించుకున్న పల్లెపడచులా గ్రామం… చేలగట్ల పైన పహరా సైన్యంలా తలలు ఎత్తుకుని ప్రకృతిని పరామర్శిస్తూన్న కొబ్బరి, తాటి, ఈత చెట్లు… వాటితోపాటే పండ్ల తోటలు, తోపులు… వాటిని ఆవాసం చేసుకుని రైతులతో సాంగత్యం నెరపుతూన్న పక్షిజాలం. అలంకరించుకున్న కొత్త పెళ్ళికూతుళ్ళలా, పురి విప్పుకున్న వరి కంకెలు చిరుగాలికి పులకరిస్తూ కనువిందు చేస్తున్నాయి. రైతుల మదిని ఆహ్లాదపు సోనలతో తడుపుతున్నాయి… ఆకాశం వంక చేతులు జోడించాడు సుబ్బయ్య.

 “ఏం సుబ్బయ్యా, గరువు మీద కూర్చుని బీడుపడ్డ పొలాన్ని పండించమని దేవుడికి మొక్కుకుంటున్నావా ఏంది?” అంటూ సాటి రైతు భూషయ్య వచ్చి నవ్వుతూ పలుకరించడంతో ఉలికిపడి చూసాడు సుబ్బయ్య. కమ్మని కల కరగిపోయింది.

వాస్తవం ఛర్నాకోలతో వెన్ను మీద ఛెళ్ళున కొట్టడంతో అయోమయంగా చుట్టూ పరికించాడు సుబ్బయ్య… ఎంత మేర చూసినా ఎండి బీటలువారిన పంట పొలాలు! దాహం తీర్చుకుని ఎన్నేళ్ళో అయినట్టు నీటిచుక్క కోసం తపించిపోతూ నోళ్ళు తెరచుకుని ఆశగా ఆకాశం వంక చూస్తున్నాయి. మేఘశకలాలు ఎక్కడైనా కనిపిస్తాయేమో, వర్షించమని అర్థించుదామన్న ఆర్తి వాటిలో. నీరు కరవై మోడువారిన వృక్షసముదాయం ఇంధనంగా మారిపోవడంతో కనుచూపు మేరలో ఎక్కడా పక్షిజాడ కానరావడంలేదు. తరతరాలుగా రైతుకు పెద్ద దిక్కులా, భూములకు రక్షణ కవచంలా ఉండి… ఏటేటా మేఘమథనం కావించే అడవితల్లి ఆనవాలు లేకుండాపోయింది!

నేలమట్టం చేయబడ్డ ఆ కాన స్థానే ఇప్పుడు విశాలమైన మైదానం. అందులో ముమ్మరంగా సాగుతూన్న కట్టడాల కార్యక్రమం. తరచు వినవస్తూండే వన్యమృగాల అరుపులు, వీనుల విందు గావించే పక్షి కూజితాల స్థానంలో – ఇప్పుడు ఫ్యాక్టరీల నిర్మాణంలో ఉపయోగిస్తూన్న మరయంత్రాల చప్పుళ్ళు, రణగొణధ్వనులూను!

అంతవరకు పాత వైభవాన్ని తలంపుకు తెచ్చుకుంటూ పారవశ్యంలో మునకలు వేస్తూన్న సుబ్బయ్యను, కట్టెదుట సాక్షాత్కరించిన కఠిన సత్యం వెక్కిరించింది. ‘అలనాటి బంగారుకాలం మళ్ళీ వస్తుందంటావా, భూషయ్య బావా?” అనడిగాడు బేలగా.

భూషయ్య జాలిగా వీక్షించాడు. సుబ్బయ్య మదిలో చెలరేగుతున్న భావాలు అర్థమయిపోయాయి. “ఏమోరా, సుబ్బయ్యా! చెప్పడం కష్టమే” అన్నాడు. అలా అంటుంటే అతని గొంతులో నిరాశ, మదిలో దుఃఖం. అతని మస్తిష్కంలో గతం గిర్రున తిరిగింది…..

***

ఐదేళ్ళక్రితం వరకు తమ బతుకులు వడ్డించిన విస్తళ్ళు. తమ పొలాలలో బంగారం పండేది. అంతలోనే రాష్ట్రం రెండు చెక్కలయింది. కొత్త రాష్ట్రాన్ని ‘బంగారు రాష్ట్రం’ గా రూపొందిస్తామంటూ వేదికలెక్కి ఊదరగొట్టేసారు పాలకులు. ఆ క్రమంలో పరిశ్రమలను పెంచడానికి, ఆర్థిక స్థోమతను పెంపొందించడానికీనంటూ… అవేవో ‘సెజ్’ లట! మందులు తయారుచేసే కంపెనీలట! రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వాటిని నెలకొల్పాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నదట. వాటివల్ల ప్రజలకెంతో మేలు జరుగుతుందట. ఆర్థిక స్థోమత పెరుగుతుందట. దేశం ప్రపంచ స్థాయికి చేరుకుంటుందట! అందుకోసం వేలకొద్ది ఎకరాల భూములు అవసరమట. ప్రభుత్వ భూములు దురాక్రమణదారుల కబ్జాల మూలంగా కోర్ట్ లిటిగేషన్లో ఉన్నాయట. అందువల్ల ప్రైవేట్ భూములను – పంట పొలాలతో సహా, బలవంతంగా సేకరించి, బలిసిన పెట్టుబడిదారుల పరం చేస్తోంది ప్రభుత్వం. రైతుల మొత్తుకోళ్ళుగాని, నిపుణుల అభ్యంతరాలు గాని ప్రభుత్వం చెవులకు ఎక్కడంలేదు. ఆందోళన జరిపే అన్నదాతల పైన బలప్రయోగం చేస్తోంది. అడవులను నాశనం చేయడం వల్ల, పంట భూములను ఫ్యాక్టరీలుగా ఫ్యాన్సీ షాపులుగా మార్చడం వల్ల కలుగబోయే విపత్తును గుర్తించడంలేదు. సంభవింపనున్న ఆహారపు కొరత ప్రమాదాన్ని పసిగట్టడంలేదు. అదంతా ప్రజల అభ్యున్నతికీ, వెసులుబాటుకేననీ చెబుతున్నా – ఎవరి ప్రయోజనాలకోసమో అర్థంకావడం లేదు.

సెజ్‌లు, ఫార్మా కంపెనీల సూపర్ పథకంలో భాగంగా దట్టమైన అడవి కళ్ళముందే నేలమట్టమయిపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ వుండిపోయారంతా. ఏళ్ళ తరబడి దాన్ని ఆవాసంగా చేసుకున్న జంతువులు, పక్షులు అదృశ్యమయిపోయాయి. వరుణదేవుడు ఆగ్రహించడంతో మేఘాలు ఆ ప్రాంతాన్ని వెలివేసాయి. భూస్వాములు, పెద్ద రైతులు తమ భూములను అయినకాడకు అమ్మేసారు. భూషయ్య, సుబ్బయ్య వంటి సన్నకారు రైతులు కొందరు ఉన్న ఆ ఒక్క జీవనాధారాన్నీ వదులుకోలేక ఏటికి ఎదురీదారు. ప్రభుత్వం ఆశచూపిన నష్టపరిహారపు మొత్తాలు కాని, కంపెనీలలో ఉద్యోగాల ఎరలు కాని ప్రలోభపెట్టలేకపోయాయి వారిని… గాఢంగా నిట్టూర్చాడు భూషయ్య.

సుబ్బయ్య మదిలోనూ ఇంచుమించు అవే ఆలోచనలు కందిరీగల్లా కుడుతున్నాయి… తండ్రి నుండి సంక్రమించిన రెండెకరాల మాగాణీని కష్టపడి ఐదుకు పెంచుకున్నాడు తాను. దాంతో జీవితం సజావుగా సాగిపోతోంది. కొడుకు పట్నంలో చదువుతుంటే, కూతురు పెళ్ళికి ఎదిగివచ్చింది… అంతలోనే ఉప్పెనలా వచ్చిపడింది, ప్రభుత్వపు భూముల సేకరణ చట్టం. అడవులు మాయమై వానలు కరవయ్యాయి. ఫ్యాక్టరీ పనుల పుణ్యమా అంటూ సారవంతమైన నేలలో చెమ్మ ఇంకిపోయింది. రాళ్ళు చేరుకున్నాయి. పంటకాలువలోని నీరు కన్‌స్ట్రక్షన్ వర్క్స్‌కి మళ్ళింపబడడంతో చేల గొంతుకలు ఎండిపోయాయి. సాగుకు నీళ్ళు మృగ్యమయ్యాయి. రైతు పరిస్థితి అధ్వాన్నమయింది.

అటు నీటి సదుపాయము, ఇటు పెట్టుబడి కొరవడడంతో ఉక్కిరిబిక్కరయిపోయాడు అన్నదాత. బ్యాంక్ రుణాలు పలుకుబడి కలవారికే పరిమితం. ఉన్నవాడికే లోన్లు! దానికి తోడు, ‘తమ పార్టీ అధికారానికి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తామనీ, రైతులెవరూ లోన్లు తీర్చవద్దనీ’ ఎన్నికలకు ముందు ఎలుగెత్తి చాటడంతో, అది నమ్మిన రైతులు బ్యాంక్ లో తీసుకున్న అప్పులను తీర్చడం మానేసారు. ఆ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాక, రైతుల రుణాలను వెంటనే కాక మూడు వార్షిక వాయిదాలలో తీర్చుతామంటూ చెప్పడం జరిగింది. దాంతో రైతుల బ్యాంక్ బకాయిలు అలాగే ఉండిపోయాయి. నిబంధనల ననుసరించి బ్యాంకులు వారికి కొత్త అప్పులు ఇవ్వలేమని మొండిచేయి చూపడం జరిగింది. అందువల్ల ఎరువులకు, విత్తనాలకు షాహుకార్లను దేబిరించకతప్పలేదు. వారి నుండి అధిక వడ్డీలకు (నూటికి 30 నుండి 36 శాతం చొప్పున) తెచ్చిన రుణాలు రైతులకు వెన్నుమీది రణాలుగా మారాయి. ప్రభుత్వం రైతుల బ్యాంక్ రుణాలను తనకు బదిలీ చేయించుకుని, మెల్లగా తీర్చినట్టయితే రైతుకు ఆ దుస్థితి ఏర్పడేదికాదన్నది నిర్వివాదాంశం.

ఆ నేపథ్యంలో రెండెకరాలు అమ్ముకోక తప్పలేదు తనకు. వరి పంట ఆశ వదులుకుని సాటివారితోపాటు తానూ వేరుశనగ వేసాడు. అదీ కలసిరాలేదు. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులూ తన కష్టాలకు తోడయ్యాయి. రైతులందరి పరిస్థితీ అదే అయింది. రైతన్నను ఆదుకోవలసిన ప్రభుత్వం తన బాధ్యతను మొసలికన్నీటి వరకే పరిమితం చేయడంతో – ఆదుకునే నాథుడు లేక, అప్పుల్లోంచి బైటపడే మార్గం కానరాక రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయి. బతుకులో కంటే చావులోనే స్వస్థత చేకూరుతుందేమోనన్న ఆలోచనతో నిండు జీవితాలను అర్థంతరంగా ముగించుకున్న అభాగ్య రైతన్నల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా, ప్రభుత్వపు ఆలోచనలో మార్పు వచ్చినట్టు కనిపించదు. పైపెచ్చు వారి మరణాలకు కారణం వ్యవసాయపు ఇబ్బందులు కావనీ, జబ్బులేననీ నుడివిన సందర్భాలూ లేకపోలేదు. రైతు చనిపోయాక ఎంతో ఉదారంగా ‘ఎక్స్‌గ్రేషియా’ని ప్రకటించే అధికారులకు, ఆనక దాని విషయమే గుర్తుండదంటే అతిశయోక్తి కాదు! అనాథలైన రైతు కుటుంబాలకు ఆ సొమ్ము అందాలంటే ఎన్ని అవస్థలో! అన్నీ రాజకీయాలే!!…..

భూషయ్య వచ్చి సుబ్బయ్య పక్కను కూర్చున్నాడు, ఆరిపోయిన చుట్టను వెలిగించుకుంటూ. “ఏమిటి సుబ్బయ్యా, ఎందుకలా దిగులుగా కనిపిస్తున్నావ్?” అంటూ పరామర్శించాడు.

సుబ్బయ్య బదులు ఇవ్వలేదు. అతని వంక శూన్య దృక్కులతో చూసాడు. ఆ చూపులలో ఎంతో వ్యధ ఉంది… కొద్ది రోజులలో కూతురి పెళ్ళి పెట్టుకున్నాడు తాను. ఎకరం పొలం కట్నంగా ఇస్తున్నాడు. పెళ్ళి ఖర్చులకు మరో ఎకరం బేరం పెట్టాడు. అంతలోనే పట్నం షరాబు ఇంటికి వచ్చాడు. విత్తనాలకు, ఎరువులకు అతని వద్ద తీసుకున్న రుణం మీద వడ్డీ పాపంలా పెరిగిపోతోంది. ఆర్నెల్లుగా వడ్డీ కూడా చెల్లించలేకపోయాడు తాను. కూతురి పెళ్ళి సంగతి ఎలా తెలిసిందో, షరాబు తన మనుషులతో వచ్చి పీకమీద కూర్చున్నాడు, తన బాకీ చెల్లించమని. ఎంత బ్రతిమాలినా వినిపించుకోలేదు. గడువు పొడిగించడానికి ఒప్పుకోలేదు. నానా దుర్భాషలూ ఆడాడు. జబర్దస్తుగా ఇంట్లో చొరబడి పొలం కాగితాలు పట్టుకుపోయాడు. అడ్డుపడబోతే తన మనుషుల చేత కొట్టించాడు… రెండు రోజుల క్రితం జరిగింది ఆ సంఘటన. ఓ పక్క అవమానభారంతో కృగిపోతుంటే, మరోపక్క వియ్యాలవారి నుండి కబురు – తాము ఆ సంబంధం వదలుకుంటున్నట్టు…

 “సుఖాలలాగే, కష్టాలూ కలకాలం నిలవవంటారు, సుబ్బయ్యా! జీవితం గడ్డు అనిపించినప్పుడే మనసు గట్టిపరచుకోవాలన్న సత్యాన్ని గతంలో నువ్వెందరికి చెప్పలేదూ? బాధపడకు. మనకూ మంచిరోజులు వస్తాయి” అంటూ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించాడు, స్నేహితుడి బాధను అర్థంచేసుకున్న భూషయ్య. “పొద్దు కూకుతోంది, ఇంటికి పోదాం పద”.

నిస్తేజంగా లేచి భారంగా అడుగులు వేసాడు సుబ్బయ్య మౌనంగానే… ఆ రాత్రంతా ఏవేవో ఆలోచనలతో అతని కంటిపైకి కునుకు రాలేదు.

***

మర్నాడు తొలికోడి కూయకముందే చెరువుగట్టుకని వెళ్ళిన సుబ్బయ్య, పొద్దు పొడిచే వేళకు గరువు దగ్గర ఎండ్రిన్ త్రాగి ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త ఆ గ్రామంలో గుప్పుమంది.

సుబ్బయ్య భార్య, కూతురు అతని శవం మీద పడి ఘొళ్ళుమన్నారు. పట్నంలో ఉన్న కొడుక్కి కబురు వెళ్ళింది. “ఏం పని చేసావయ్యా! నీ దారి నువ్వు చూసుకుంటే… నీ మీదే ఆధారపడున్న నేనూ, పిల్లలూ ఏమయిపోతామనుకున్నావ్? నీతోపాటే మాకూ తలో గుక్కెడూ ఇస్తే చావు కూడా నీతో సంతోషంగా పంచుకునేవారం కామా? ఈ పని చేసేముందు ఓ క్షణం మా గురించి ఆలోచించలేదెందుకయ్యా?” – భోరున విలపించింది సుబ్బయ్య భార్య.

ఆ హృదయవిదారక దృశ్యం అక్కడ చేరినవారందరి హృదయాలనూ కలచివేసింది. ఆ ఏడాదిలో ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఏడవ రైతు అతను!

భూషయ్య కండువా తడిసిపోయింది. ‘నిజమేరా, సుబ్బయ్యా! నువ్వు తొందరపడ్డావనిపిస్తోందిరా. పొలాలు పోయి, పంటలు పండక, అప్పులవాళ్ళ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఎందరికో ధైర్యం చెప్పి ఆపిన నువ్వు, ప్రాణం తీసుకునేముందు ఓ క్షణం ఆగి, ఆలోచించలేకపోయావా! నువ్వు అదే చేసుంటే నీ కుటుంబం ఇలా వీధిన పడేదా? అనాథలా మిగిలేదా? నువ్వుండగా పరిష్కరించలేని సమస్యల్ని నీవాళ్ళెలా ఎదుర్కోగలరనుకున్నావురా?…’ అతని మనసు మౌనంగా రోదించింది.

అతని ఆలోచనలు ప్రభుత్వపు అనాలోచిత కార్యక్రమాల వైపు మళ్ళాయి… ప్రపంచీకరణలో భాగంగా ప్రజలను ఉద్ధరించాలన్న ఉత్కంఠతో సాగుభూములను సెజ్‌లు గాను, ఫ్యాక్టరీలుగాను మార్చాలనుకునే సర్కారు – ఓ క్షణం సావధానంగా ఆలోచించివుంటే… పచ్చని చేలను, చిక్కని అడవులనూ నాశనం చేసేముందు ఒక పరి ఆలోచించియుంటే… వనాలు, వాటిలో నివసిస్తున్న జంతుజాలము, పక్షిజాతులూ పర్యావరణ రక్షణకు చేస్తూన్న మేలు గురించీ, వాటి ఆవశ్యకత గురించీ… వాటిని ధ్వంసం చేయడం వల్ల కలిగే అనర్థాలను గురించీ… ఆలోచించివుంటే… ఇలాంటి అనర్థాలు జరిగేవేనా??

దేశాభివృద్ధికి పరిశ్రమలు అవసరం కావచ్చును. కాని, ప్రజలకు తిండి పెట్టే పంటపొలాలను రాతి నేలలుగా మార్చడంలో, జీవధారలను అందించే అడవులను నరకడంలో గల ఔన్నత్యం ఏమిటో… సామాన్యుడి బుద్ధికి అందని విషయం. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల అతని కుటుంబం మాత్రమే నష్టపోవచ్చును. కాని, ఓ రైతు ఆత్మాహుతి వల్ల లక్షలాదిమంది ఆకలితో అల్లాడిపోతారన్న సత్యం ఎప్పుడు గ్రహింపుకు వస్తుంది!? ప్రపంచదేశాలతో పోటీపడి దేశాన్ని ఆర్థికపరంగా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆలోచనలో తప్పులేదు. కాని, అందుకు చెల్లించే మూల్యం ఏమిటీ అన్న ఆలోచన అవసరం కాదా? ఇతర దేశాలలా కాక, మనది వ్యవసాయపరమైన దేశం అన్నది విస్మరించితే ఎలా!

పరిశ్రమలు పెరిగినా పంటలు తరిగితే ప్రజలు ఏమి తిని బ్రతుకుతారు? సైనికుడు క్షేమంగా ఉంటేనే దేశభద్రత సురక్షితంగా ఉన్నట్టు, రైతు చల్లగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోవడం ఒక ఎత్తైతే, అతితెలివితో ఉన్నదాన్ని అనారోగ్యానికి గురిచేయడం మరో ఎత్తు! భవిష్యత్తులో దేశపు ఆర్థికస్థితి బావుండాలన్నదే సెజ్‌ల ఉద్దేశ్యమైతే… అజ్ఞానంతో విజ్ఞానం పేరిట పర్యావరణాన్ని ఓ పద్ధతి ప్రకారం నాశనంచేస్తూ భావి తరాలకు మనం చేస్తూన్న కీడు గురించి – ఓ క్షణం నిదానంగా ఆలోచిస్తే, పర్యావరణంపట్ల గల నిర్లక్ష్యపు వైఖరి మారదా? దశాబ్దానికో కొత్తరకపు భయంకర వ్యాధి ఉత్పన్నం కావడానికి కారణం – పర్యావరణంపట్ల మనం చూపే బాధ్యతారహితమైన వైఖరి కాదా? ఎవరికి వారే రాబోయే తరాలకు ఆస్తులను కూడబెట్టాలని తాపత్రయపడుతున్నారే తప్ప – తమ మనుమలు, మునిమనుమలు, వారి సంతతి యొక్క ఆరోగ్యం గురించి ఒక్కరైనా ఆలోచించిన పాపాన పోతున్నారా??

ప్రతి వ్యక్తీ పలచబడుతూన్న ఓజోన్ పొర గురించి మాట్లాడడమే తప్ప – దాన్ని అరికట్టాడానికి, ఆ పొరను ఉద్ధరించడానికి, పర్యావరణ రక్షణకు తన వంతుగా ఏం చేస్తున్నాడా అన్నది ఎన్నడైనా ఆలోచించాడా? శబ్దకాలుష్యం, జలకాలుష్యం, వాతావరణ కాలుష్యం – ఎటు చూసినా కాలుష్యమే, మనుషుల మనసుల్లా! పర్యావరణ కాలుష్యాన్ని నూటికి నూరు పాళ్ళు అరికట్టడం సాధ్యం కాకపోవచ్చును. కాని, అందుకు కనీసప్రయత్నమైనా కానరాదే! ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోలేని విజ్ఞానం ఎందుకు? వ్యవస్థ ఎందుకు?? ఆవాసాల కోసమో, అభివృద్ధి కోసమో చెట్లను నరికించే పెద్దలు పొంచియున్న ప్రమాదాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఈ దుస్థితిని గూర్చి ఆలోచించే నాథుడే లేడా? ‘పర్యావరణో రక్షతి… రక్షితః’ అన్న సత్యాన్ని గుర్తించేవారే లేరా??…

పోలీస్ జీప్ సైరన్‌తో ఉలికిపడి దీర్ఘాలోచనలోంచి బైటపడ్డాడు భూషయ్య. నిర్జీవంగా పడున్న మిత్రుడి వంక చూసాడు. ‘నీ బుర్రలో ఇంతటి భయంకరపుటాలోచన సుళ్ళు తిరుగుతోందన్న సంగతి నేను నిన్ననే పసిగట్టివుంటే, నిన్ను దక్కించుకునేవాణ్ణేమోరా, సుబ్బయ్యా! ప్రజల ఆకలి తీర్చడం కోసం అలుపూ సొలుపూ ఎరక్కుండా శ్రమించే మన బతుకులు చివరికిలా ముగియవలసిందేనా?!’ అనుకున్నాడు సజల నయనాలతో.

సుబ్బయ్య ఆత్మహత్య విషయం ఆలకించి అధికారులు వచ్చారు, ఆనవాయితీగా అతని కుటుంబాన్ని పరామర్శించడానికి. సుబ్బయ్య అకాలమరణానికి మూలకారణం ‘పర్యావరణపు హత్య’ అన్న నగ్నసత్యాన్ని గుర్తించలేని ప్రభుత్వం – అతని కుటుంబానికి యధావిధిగా ‘ఎక్స్‌గ్రేషియా’ను ప్రకటించి, చేతులు దులిపేసుకుంది…!!