9. పెంపకం

0
3

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో పాఠకుల ఎంపికలో తృతీయ బహుమతి పొందిన కథ. రచన: ముద్దుకృష్ణ [/box]

[dropcap]అ[/dropcap]ప్పుడే తలస్నానం ముగించి ఆ తడి కురులను ఆరబెట్టుకుంటున్న నవ్య… రూమ్‌లో నుంచి హాల్‌లో ఉన్న టి.వి.లో వార్త విని, ఉలిక్కిపడి హాల్లోకి వచ్చింది. ఎవరూ లేరు…. తనే టి.వి.ని పెట్టి ఆఫ్ చెయ్యటం మర్చిపోయి అలాగే స్నానానికి వెళ్ళింది. అమ్మా నాన్న ప్రభుత్వ ఉద్యోగులు కావటంతో ఆఫీసులకి వెళ్ళిపోయారు. కాలేజీ సెలవులు కావటంతో ఇంట్లో ఒక్కర్తే ఉంది. టి.వి.లో వార్తని చూసి కాళ్ళకింద భూమి కంపించిన భావం కలిగింది. అలాగే సోఫాలో కూలబడి టి.వి శబ్దాన్ని కాస్త పెంచింది. చెవులు రిక్కరించుకుని విన్నది. ప్రతిరోజూ ఇలాంటి వార్తలు విన్నా పెద్ద పట్టించుకునేది కాదు. ఏదో సోది అనుకునేది. ఇప్పుడు మాత్రం తన మనసంతా ఆ వార్త పైనే లగ్నం చేసి ప్రతి పదాన్నీ వింటుంది. టి.వి.లో మరో వార్త రావటం మొదలైంది. టి.వి.ని మ్యూట్‌లో పెట్టి సోఫాలో వెనక్కి వాలి… ఆలోచనలని వెనక్కి తీసుకెళ్ళింది.

నవ్య ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. నగరంలో మంచి పేరున్న కళాశాలలోనే చదువుకుంటుంది. చూడటానికి మరీ అప్సరసలా కాకపోయినా చూడాలనిపించే రూప లావణ్యం కలిగి ఉంటుంది. అమ్మా నాన్నకి తను, తమ్ముడు ఇద్దరే సంతానం. ఇద్దరినీ సమానంగానే చూస్తారు. మరీ గారాబం కాదు…. అలా అని మరీ చాదస్తంతో ఉండరు. ఇంట్లో పరిమితమైన స్వేచ్చ ఉంటుంది. కళాశాలలో కూడా మంచి అమ్మాయిగానే పేరు సంపాదించింది. తన ఫ్రెండ్స్ అంతా కాస్త ఉన్నత కుటుంబాలకు చెందినవారు. వాళ్ళ ఆహార్యం అలానే ఉంటుంది. వాళ్లు నవ్యని పప్పు సుద్ద అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో పాటు లేట్ నైట్ పార్టీ లకు వెళ్ళదు. పబ్ కల్చర్‌కి దూరం. అందుకే ‘నీకు ఎంజాయ్ చెయ్యటం రాదు’ అంటూ ఉంటారు. తను కొట్టిపారేసినా అప్పుడప్పుడు వాళ్ళు చెప్పేది నిజమా అని కూడా అన్పిస్తుంది. వాళ్ళ స్నేహితుల గుంపులో వేరే కళాశాల అబ్బాయిలు కూడా ఉంటారు. అప్పుడప్పుడు వాళ్లు కలుస్తూ ఉంటారు.

ఆ గ్యాంగ్‌లో నవీన్ కూడా ఒకడు. పేరుకు తగ్గట్టు మంచి ఒడ్డూ పొడుగు కలిగిన చూడచక్కని రూపం. దానికి తోడు మంచి మాటకారి. అతని మాటలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ బ్యాచ్ లోనే కాదు… వేరే గ్రూప్‌లో కూడా అతనికి అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది. అందరితో చాల చనువుగా, ఫ్రెండ్లీగా ఉంటాడు. ఒకసారి వీళ్ళంతా వాళ్ళ స్నేహితుడు రవి పుట్టినరోజు సందర్భంగా గోవా ట్రిప్ వెళ్లాలని అనుకున్నారు. స్వతహాగా రవి ఉన్నత కుటుంబానికి చెందటం మూలానా మొత్తం ఖర్చు తనే భరించేట్టు ప్లాన్ చేసారు.

నవ్యని అందరూ బాగా ఒత్తిడి చేసారు. దానితో కాదనలేక ఇంట్లో అడిగి చెప్తా అంది. తనకీ మనసులో ఎక్కడో వెళ్ళాలని ఉంది. వాళ్ళలా ఎంజాయ్ చెయ్యాలని ఉంది. తనూ ఇంట్లో అడిగింది. ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నామని, కాలేజీ వాళ్లు తీసుకుని వెళుతున్నారని అబద్ధం చెప్పింది. నాన్న ఏం మాట్లాడలేదు. ఎంత డబ్బులు కావాలని అడిగి,  అంతకంటే ఎక్కువే ఇచ్చారు ఎందుకైనా ఉపయోగపడతాయని. డబ్బులు తీసుకునేటప్పుడు కాస్త గిల్టీగా అనిపించింది. కానీ అక్కడ ఎంజాయ్ గుర్తొచ్చి ఊరుకుంది. వాళ్ళ స్నేహితుల గుంపులో ఒక ముగ్గురు కార్లు తీసుకొచ్చారు. అందులో గోవా ప్రయాణం మొదలైంది.

ప్రయాణంలో అందరూ భలే ఎంజాయ్ చేస్తూ…. ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ సరదాగా వెళ్ళసాగారు. నవ్య స్వతహాగా నెమ్మది కావటంతో మిగతావాళ్ళతో కలవటానికి కొంత సమయం తీసుకుంది. ఈ లోగా నవీన్ చొరవ తీసుకుని ప్రతీ విషయంలో తనని కలుపుతూ మాట్లాడేవాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా మెల్లగా అలవాటైంది. మెల్లగా తనూ వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఎక్కడన్నా విరామం కోసం ఆగినపుడు అందరికంటే నవీన్ కాస్త ఎక్కువ తనని పట్టించుకోవటం తను గమనిస్తుంది. అలా అని తను మరీ ఏదో మనసులో పెట్టుకుని చేస్తున్నట్లు ఉండేది కాదు.చాలా సాధారణంగా అందరితో ఉన్నట్లుగానే ఉన్నట్టు ఉండేవాడు. అలా వాళ్ళ ప్రయాణం గమ్యం చేరేసరికి రాత్రి అయ్యింది. అందరూ ఫ్రెష్ అయ్యాకా బీచ్‌కి వెళ్ళారు… అక్కడ అంతా జంటలు జంటలుగా జనాలు ఉన్నారు. ఈ ఫ్రెండ్స్‌లో కూడా నలుగురు అలానే వేరేగా వెళ్ళారు. డిసెంబర్ నెలాఖరు కావటంతో కొత్త సంవత్సరపు హడావిడి అక్కడ బాగానే ఉంది. అలా ఆ ప్రయాణం, అక్కడ గడిపిన సమయం నవ్యలో తెలియని ఒక కొత్త మార్పునకు శ్రీకారం చుట్టాయి. ఇన్నాళ్ళు తను కొంత సరదా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నా అనే భావన… అదే సమయంలో నవీన్‌తో మాట్లాడుతూ ఉంటే కలిగే ఆ ఫీలింగ్ భలేగా అనిపించేది… ఆ నాలుగు రోజుల్లో వాళ్ళు మరింత దగ్గరయ్యారు. చివరిరోజైతే వాళ్ళ చిలిపి కొట్లాటకి, ఒకళ్ళ మీద వేరొకలు వేసుకునే జోక్స్‌కి మిగతా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. నవ్యలో ఆ మార్పు చూసి మిగతావారు…. ‘మేడంగారు ఇన్నాళ్ళకి పెద్దమనిషి అయ్యారు’ అని వెటకారాలాడసాగారు. తిరుగు ప్రయాణంలో చివరి సీట్లో వీళ్ళిద్దరే కూచుని కబుర్లు చెప్పుకున్నారు… తగిలీ తగలనట్లు వాళ్ళ మోచేతులు తగిలినా…. తెలిసినా తెలియనట్లు నటన… ఇద్దరికీ అర్థమౌతున్నా… అర్థంకానట్లు ఉండిపోవటం… అలా ఒకరి చేతులు మరొకళ్ళు పట్టుకునేంత చనువు వచ్చేసింది… వచ్చేసింది అనే కంటే తీసేసుకున్నారు. అలా ఆ చివరి మజిలీలో తను నవీన్ భుజంపై తలపెట్టి పడుకునేంత వరకూ వచ్చింది.

ఆ రోజు మొదలు… కాలేజీ పూర్తవ్వగానే ఇంటికి వెళ్ళాల్సిన నవ్య ఏదో ఒక సాకుతో ఇంటికి ఆలస్యంగా చేరటం. అప్పుడప్పుడూ రాత్రి మరీ ఆలస్యంగా రావటం వాళ్ళ నాన్న గమనిస్తూనే ఉన్నారు… కాకపోతే ఎప్పుడూ తనని అడగలేదు. వాళ్ళ అమ్మ అడిగినా ఏదో సాకు చెప్పి తప్పించుకునేది. ఒక రాత్రి అమ్మానాన్న తన గురించి చర్చించుకోవటం తను తలుపు మూలగా వింది. అమ్మ చెప్తూ ఉంది…. ‘ఈ మధ్య దాని ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందండీ… అస్తమాను ఇంటికి లేట్‌గా రావటం అడిగితే ఏదో ఒకటి చెప్తుంది. ఫోన్ కూడా వాడకం పెరిగింది. నాకేదో అనుమానంగా ఉందండి’ అంటే, నాన్న ‘అలా ఆలోచించటం తప్పు లక్ష్మీ… తనని అనుమానించటం అంటే అది మన పెంపకాన్ని మనమే అనుమానించినట్టు. అయినా తను ఎప్పుడు మన దగ్గర ఏం దాచిందని? తనని ఒక కూతుర్లా కంటే ఒక స్నేహితురాల్లా పెంచా… నా చిట్టితల్లి నన్నెప్పుడూ మోసం చెయ్యదు.. అనవసరమైన ఆలోచనలు మాని పడుకో ’ అని అన్నారు. భార్య బెంగని పోగొట్టటానికి అలా అన్నాడే కానీ తన మనసులో ఎన్నో ప్రశ్నలు, ఆలోచనలు అలాగే పదిలంగా ఉన్నాయి. ఎందుకంటే తను ఏమీ పట్టించుకోనట్లు ఉన్నా…. అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. కాకపోతే వయసులో ఉన్నవాళ్ళని హేండిల్ చెయ్యటానికి సమయం చూడాలి, పద్ధతి తెలియాలి, ఓర్పు కావాలి. లేదంటే చాలా కష్టం. అమ్మానాన్న మాటలు విన్న నవ్యకు ఒక్క క్షణం చాలా గిల్టీగా అనిపించింది. వాళ్ళ నమ్మకం వమ్ము చేస్తున్నాననే భావం ఒకవైపు, అయినా ఈ వయసులో చెయ్యాల్సిన సరదాలు ఆ వయసులో చెయ్యటం తప్పు కాదని చెప్పే స్నేహితులచే ప్రభావితమైన ఆలోచనలు మరో వైపు…. చిన్న సంఘర్షణ…చివరకు త్రాసు రెండోవైపునకు మొగ్గింది. చెడు మహా అందమైనది… ఇట్టే ఆకర్షిస్తుంది….

ఆ రోజు నవీన్ పుట్టినరోజు. ఫ్రెండ్స్ అంతా కాలేజీ ఎగ్గొట్టి పార్టీ కోసం ఊరి చివర రిసార్ట్‌కి వెళ్ళారు. ఆ రోజంతా అక్కడే గడిపి సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు… నవీన్, నవ్యను తను డ్రాప్ చేస్తా అని చెప్పి మిగతావాళ్ళని పంపించేసాడు. వాళ్ళంతా వెళ్ళాకా తనని తిన్నగా తనుండే ఫ్లాట్‌కి తీసుకెళ్ళాడు. అది ఒక అపార్ట్‌మెంట్. అందులో నవీన్ పెంట్‌హౌస్‌లో ఉంటున్నాడు.. చాలా విశాలంగా ఉంది. ఫుల్ ఫర్నిష్డ్ హౌస్. చాలా బావుంది. తన టేస్ట్‌కి తగ్గట్టు రూమ్‌ని అందంగా మలుచుకున్నాడు. మంచి టేస్ట్ ఉందనిపించింది.

పెంట్‌హౌస్ కావటం మూలంగా, ముందు విశాలమైన ఖాళీ ఉంది. అక్కడనుంచి వీక్షణం, భలే ఉంటుంది.  సూర్యాస్తమయ వేళ కుంకుమ పూసినట్లు ఉన్న ఆకాశాన్ని, ఎర్రని వర్ణ రంజితమైన సూర్యుణ్ణి చూసి చాలా గొప్పగా అనిపించి బయటకు వచ్చి గోడ పక్కగా నిల్చుని ఆ దృశ్యాన్ని చూస్తోంది నవ్య. అలా చూస్తుండగా… వెనకనుంచి వెచ్చని శ్వాస తగిలి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది నవ్య. అతి దగ్గరగా నవీన్. ఒక్కసారి ఉలికిపడింది.

‘ఎలా ఉంది నా ఈ ప్రపంచం?’ నవీన్ ప్రశ్న.

‘చాలా బావుంది నీలా’ అందమైన సమాధానం.

‘ఎంతైనా నీ కంటేనా?’ పొగడ్త కలిసిన ప్రతిసమాధానం.

చిన్న గర్వంతో కూడిన సిగ్గు.

ఏదో తెలియని భావన తన చుట్టూ ఒక విద్యుత్తులా ఆవహించిన భావన. ఇది అతని మాటల ప్రభావమా? వయసు చేసే చిలిపి సరసమా? కానీ ఏదో తెలియని మాయ. అది ఆమె మాటల్లో, చూపుల్లో కనిపిస్తూనే ఉంది. ఎంతోమందితో సాన్నిహిత్యం ఉన్న నవీన్ అది గమనించటంలో, ఆ భావన అవతలి వాళ్ళలో ప్రేరేపించడంలో ఆరితేరినవాడు. సమయానుకూలంగా దగ్గరగా జరిగి…. మాటలో మాట కలుపుతూ..

 ‘ఈ రోజు ఇలా ఉండిపోతే ఎంత బావుంటుందో’ … ఆశ కలిగిన మాట.

‘ఎందుకో’ (సిగ్గుపడుతూ వేసిన ప్రశ్న).

‘ఇంత అందం… ఇంత దగ్గరగా… నా పక్కన.. నాతో పాటు ఒంటరిగా… ఇలాంటి సమయం కోసం ఎన్నేళ్ళైనా తపస్సు చెయ్యొచ్చు. ’

 ‘అబ్బో సారు కవిత్వం చెబుతున్నారు… చాలించండి ఇంకా…’ అని హొయలుపోయింది.

‘నువ్వు పక్కనుంటే కవిత్వమేం ఖర్మ… గ్రంధాలే వ్రాసేయగలం. అయినా మధురమైన ఈ సమయం అధర మధురమైతేనా?’

‘ఏయ్.. చాలింక…. ఆపు నీ కవిత్వం.’ చిన్న సిగ్గుతో కూడిన కిలకిలా నవ్వు. ఆ నవ్వుని అవకాశంగా మార్చుకున్నాడు నవీన్. దగ్గరకు చేరి మెడ చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని చెవిలో చిన్నగా ‘అయినా దానిలో మజా నీకేం తెలుసు’ అన్నాడు. ‘అబ్బో తమకేదో తెలిసినట్టు’ అంది.

‘అందుకే కదా ఆ అమృతాన్ని ఆస్వాదించాలనుకుంటున్నానే తేనెతుట్టా’ అన్నాడు.

‘తేనెతుట్టనా?’

‘హఁ అవును…. తేనె ఇచ్చేది తేనెతుట్టనే కదా..’

‘ఏంటీ?’ అంది…. అంతే…. మెడచుట్టూ వేసిన చేతితో ఒక్కసారిగా తనని తనవైపునకు తిప్పుకొని ఆమె ఆధారాలను తన అధరాలతో బంధించాడు. ఒక్కసారిగా ఉలికిపడిన నవ్య తన చేతుల్లోంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ అంతకంటే రెట్టింపు బలంతో నవీన్ ఆమెను మరింత దగ్గరగా జరుపుకుని రెండు చేతులతో తనని పూర్తిగా కౌగిట్లో బంధించుకుని అధర చుంబనం కావించాడు. మొదట్లో పెనుగులాడినా… అతనంటే ఉన్న ఇష్టం… అతని స్పర్శలోని ఆకర్షణ.. మొదటి ముద్దు రగిలించిన తపన… తనని అతనికి వశపడిపోయేలా చేసాయి. అలా తన కౌగిట్లో ఒదిగిన ఆమెను మెల్లగా లోపలికి తీసుకుని పోబోయాడు.

‘నా చిట్టితల్లి నన్ను మోసం చెయ్యదు…’ ఎక్కడో అంతర్లీనంగా ఒక మాట. అంతే ఒక్కసారిగా తన బలాన్నంతా కూడగట్టుకుని నవీన్‌ని దూరంగా నెట్టేసింది. ‘క్షమించు నవీన్…. మనం తప్పు చేస్తున్నాం…ఇది కరెక్ట్ కాదు.’ అంది. ‘హేయ్…కమాన్… మరీ సిల్లీగా ఆలోచించకు. ఇప్పుడు ఇదంతా కామన్. అయినా మనకు నచ్చినట్లు ఉండటం తప్పెలా అవుతుంది? అయినా మనకి ఆకలి వేస్తే అన్నం తింటాం కదా…. ఇదీ అంతే… థింక్ బియాండ్ ది బోర్దెర్స్… బి ఎంజాయ్… సెలెబ్రేట్ ది లైఫ్’ అని దగ్గరకు తీసుకోవాలనుకున్నాడు. కానీ తను దూరం జరిగి… ‘నీలా ఆలోచించలేను నవీన్. నాకీ పద్ధతి నచ్చలేదు. ఐ యాం సారీ’ అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోయింది.

ఆ క్షణం నుంచి మళ్ళీ తన వెనకటి జీవితంలోకి వెళ్ళిపోయింది నవ్య. నవీన్‌తో మాట్లాడాలనే ప్రయత్నం చెయ్యలేదు. అటువైపునుంచి కూడా మళ్ళీ పిలుపులేదు. ఆమెకు ఒక్కటైతే అర్థమైంది. తననుంచి నవీన్ ఆశించింది ప్రేమ కాదు. కనీసం ఒక్కసారి కూడా మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. ఎందులో అయితే ఏదో ఆనందం ఉందనుకుందో అది తాత్కాలికం. క్షణికావేశములో చేసిన చిన్న తప్పులే జీవితాన్ని తల్లకిందులు చేసేస్తాయి. అలా రోజులు గడుస్తున్నాయ్. అలా కొన్నిరోజుల తర్వాత నవ్య ఈ వార్తను చూస్తోంది. ‘అమాయకులైన అమ్మాయలను ఆకర్షించటం, ప్రేమ పేరుతో వలవేయటం. మాటలతో తన గదికి తీసుకువచ్చి వాళ్ళతో గడిపిన ఏకాంతక్షణాలను తన రహస్య కెమెరాలో బంధించటం, తర్వాత వాళ్లను బెదిరించటం. ఇది నవీన్ అనే వ్యక్తి చేస్తున్న పని. ఒక అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చాకచక్యంగా అతనిని పట్టుకున్నారు. అతని గదిలో అలాంటి వీడియోలు మరిన్ని బయట పడ్డాయి. దానితో అతనిని కటకటాలకు వెనక్కు పంపారు’. ఆ అమ్మాయికి పలువురి అభినందనలు… ఇంటర్వ్యూలు. ఆ వార్తను విన్న నవ్యకు గుండె కొట్టుకోవటం కొన్ని క్షణాలు ఆగినట్లైంది. తను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తన కుటుంబ పరువు ఈరోజు గంగలో కలిసిపోయేది. అమ్మా నాన్న ముందు అసలు ఎలా ఉండగలిగేది? తను చేసిన తప్పిదం గుర్తొచ్చింది. ఒక్కసారిగా ఆలోచిస్తే అమ్మానాన్నల నమ్మకాన్ని ఎంతలా ఒమ్ము చేసిందో తలచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో వచ్చేస్తోంది. కన్నీళ్లు ఆ మాలిన్యాన్ని కడిగేస్తూ హృదయాన్నిస్వచ్ఛపరుస్తున్నాయ్. అలా చాలాసేపటి తరువాత అలాగే సోఫాలో పడుకుండిపోయింది.

బయట తలుపు కొట్టిన శబ్ధం విని లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా నాన్న. ముఖం దించుకుని వెళ్ళిపోబోయింది… నాన్న నీళ్ళు అడగటంతో వెళ్లి తెచ్చి ఇచ్చి తలదించుకుని వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేసింది. నాన్న కళ్ళలోకి సూటిగా చూడలేకపోతుంది. కానీ కూతురి మనసు అర్థం చేసుకున్న ఆ తండ్రి… ‘నవ్యా… ఏమైంది తల్లీ… ఎందుకలా ఉన్నావ్?’ … ‘ఏం కాలేదు నాన్న… ఏదో తలనొప్పి’ అని చెప్పి తప్పించుకోబోయింది.’ ‘నాతో చెప్పుకోలేనంత సమస్యా?’ సూటిగా విషయానికి వచ్చేసాడు. ‘నువ్వు దాచాలన్నా దాగదమ్మా…. నేనూ నీ ఫ్రెండ్ లానే కదా…. చెప్పరా’ రెట్టించి అడిగేసరికి…. అసలే భారంగా ఉండటం వల్ల, ఇంకా ఆపుకోలేక మొత్తం విషయమంతా తన తండ్రితో చెప్పేసింది. అంతా విన్న ఆయన… ‘జరిగిందేదో జరిగిపోయింది…. తప్పు తెలుసుకున్నావ్. ఏదో ఆకర్షణ మూలాన, వయసు ప్రభావాన అలా జరిగింది…. కానీ ఆ పెను ప్రమాదంనుంచి నిన్ను నీ విచక్షణ, నా పెంపకం కాపాడాయి. ఇప్పటికి ఇదే సంతోషం. ఇకనుంచి ఏం చేసినా పరిపరి విధాలా ఆలోచించి చెయ్యి. మనం చేసే ప్రతిపనీ మన ఉన్నతికి సహాయపడాలి… మనల్ని అగాధంలోకి నెట్టకూడదు. దేవుడు నిన్నెప్పుడూ చల్లగా చూస్తాడు… జరిగింది పీడకలలా మర్చిపోయి ప్రశాంతంగా ఉండరా… ఈ విషయం మన మధ్యనే ఉండిపోవాలి. నువ్వు మునుపటిలానే ఉండాలి… ఉంటావ్ కూడా…. లేకపోతే నామీద ఒట్టు.’ అన్నారు. నవ్య సంభ్రమాశ్చర్యాలతో తండ్ర్రిని చూస్తోంది. ఇలాంటి తండ్రినా తను మోసం చేసింది అని…. కాకపోతే పశ్చాత్తాపం, తండ్రితో తన మనసులోని భారం చెప్పుకోవటంతో ఏదో బరువు దించుకున్న భావన, కలగలిసి…. ఆనందం రెట్టింపైంది. ఆనందాశ్రువులతో తండ్రిని కౌగిలించుకుంది. అతను కూడా ఆ చిట్టితల్లి తల నిమిరి నిజమైన హీరో అనిపించుకున్నాడు.

యవ్వనంలో వయసు ప్రభావితం వలన కొన్నిసార్లు దారి తప్పే అవకాశం ఎక్కువ. అందుకే మన విచక్షణ ఎప్పుడూ చైతన్యవంతమై ఉండాలి. తప్పొప్పులు తెలుసుకోగలిగి, మనల్ని మనం నియంత్రించుకునే బుద్ధిని కలిగిఉండాలి. అప్పుడే జీవితంలో పైకి ఎదగగలం. చిన్న తప్పులకు జీవితం, భవిష్యత్తు బలికారాదు. తల్లితండ్రులు కూడా తమ పిల్లలతో ఒక స్నేహితునిలా ఉండి వారికి సరైన మార్గం చూపించాలి. వాళ్ళ మార్గంలోకి వెళ్లి వాళ్ళను ఒప్పించాలి. అనవసర నియంత్రణతో,  కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ.

అంకితం:

“తల్లిదండ్రులను ప్రేమించే, పెద్దలను గౌరవించే మంచి సంస్కారం కలిగిన పిల్లలకు… పిల్లలను స్నేహితులుగా భావిస్తూ… మంచిచెడులను ఓర్పుగా, నేర్పుగా చెప్పి జాతిరత్నాలను తయారుచేసే తల్లిదండ్రులకు”.