39. ఆపన్నహస్తం

0
7

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]”ఏ[/dropcap]జెంట్ సుబ్బారావు వస్తున్నాడు ఊర్లోకి. పరిగెత్తండిరా బాబోయ్…” అంటూ వీధిలో పిల్లలతో ఆడుతున్న రవి ఆటలు ఆపి పరుగులు తీసాడు… సైకిల్ పైహుషారుగా ఈలవేస్తూ వస్తున్న సుబ్బారావుకి రవి మాటలు చెవిలో పడనే పడ్డాయి..

“ఒరెయ్…. ఆగరా నువ్” అంటూ సైకిల్ స్పీడు పెంచి రవిఎదురుగా ఆపాడు సైకిల్‌ని.. “ఏరా రవి? నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తోందిరా..? ఏం అంటున్నావు ?? ఏంటా పరుగులు!!” అని నిలదీసాడు ఏజంట్ సుబ్బారావు..

“మరేమో… మరేమో…”

“హా.. ఏంటి మరేమో??”

“మరేమోనండి.. మీరు మాటిమాటికీ మా ఊరొస్తుంటే మా పెద్దోళ్ళంతా తమాషాగా అనుకుంటూ నవ్వుకుంటుంటారండి..”

“ఏం. ఏం అనుకుంటున్నారేంటి??”

“అదేనండి… మీరేటో కట్టమంటూ తెగ విసిగిస్తూంటారనీ..” అంటూ ఉన్నట్టుండీ పరుగందుకున్నాడు రవి..

ఉసూరుమనిపించింది ఏజంట్ సుబ్బారావుకి…

ఇంత మూలనున్న వెంకన్నపాలెంకు చచ్చీ చెడీ 12 కిమీ సైకిల్ తొక్కి అడపా దడపా వస్తుంది వీళ్ళచేత మాటలు తినడానికా??

పల్లె జనం.. బీమా ఉపయోగం గురించి.. నాలుగు మాటలు చెప్తే – అర్థం చేసుకుంటారనీ, వారికి ఆపన్నహస్తం అవుతుందనీ – ఏదో పాలసీ చేయించుకుంటారనీను తన తాపత్రయం… తనకు కమీషన్ వస్తుందన్నది నిజమేకానీ.. కనీసం బస్ సౌకర్యం లేని మూల నున్న పల్లెటూరుకు సైకిల్ తొక్కీ తొక్కీ తను పొందుతున్న శ్రమ విలువ మాటేంటి?? బాధగా నిట్టూర్చాడు సుబ్బారావు..

ఈ సారైనా ఊళ్ళో ఎవరైనా పాలసీ చేయించుకుంటే సరి.. లేదంటే వీళ్ళచేత మాటలు పడ్తూ రావడానికి తనకేం పన్లేదా? అర్థం చేసుకున్నారా సరే లేదా వేరే ఊరు చూద్దాం అనుకుని, సైకిల్ మీద ఊళ్ళోకి బయలుదేరాడు  ఇన్సూరెన్సు ఏజంట్ సుబ్బారావు..

వెంకన్నపాలెంలో అంతో ఇంతో చదువుకున్నవాళ్ళు ఉన్నా, వారిలో పట్నాల్లో ఉద్యోగం కోసం వెళ్లిపోయినవారే ఎక్కువ.. వ్యవసాయం చేసుకుంటున్న వారే ఆ ఊళ్ళో మిగిలారు.. పాడీ-పశువులూ ఉన్న ఊరు కాబట్టి ఓ వెటర్నరీ డాక్టరు శివరామ్ అక్కడే ఉంటున్నాడు..

శివరామ్ చదువుకున్న మనిషి కనుక – అంతో ఇంతో ఊరిజనాలకి బీమా గురించి మంచిచెడ్డలు బోధపరుస్తూండటంతో ఊర్లో రైతులు వాళ్ళవాళ్ళ పశువులకి బీమా చేయించడం మొదలు పెట్టారు ఈ మధ్యే.. మనుషులకు కూడా బీమా చేయిస్తే కల్గే లాభాలను వెటర్నరీ డాక్టరుచేత వివరిస్తే కొంత ప్రయోజనం ఉంటుందని అనిపించింది సుబ్బారావుకి..

సైకిల్ వెటర్నరీ హాస్పిటల్ వైపు మళ్లించాడు..

***

“రండి సుబ్బారావుగారూ.. కూర్చోండి..” కుర్చీ చూపిస్తూ ఆహ్వానించాడు శివరామ్ …

“ఎలా ఉంది సార్.. ఇక్కడ మీ ప్రాక్టీస్…. మీ ఫామిలీతో సహా ఈ ఊర్లోనే ఉంటున్నారని తెల్సింది”.. అడిగేడు సుబ్బారావు..

“అవును.. ఇంత స్వచ్ఛమైన వాతావరణం పట్నాల్లో ఎక్కడ దొరుకుతుంది.. అది సరే.. మీ ప్రయత్నంలో నా వంతుగా దాదాపుగా ఊర్లో ఉన్న పశువులకు బీమా చేయించగలిగేను.. మీ పని ఎంతవరకు వచ్చింది.. ఎన్ని పాలసీలు పూర్తయ్యాయి??” అనడిగేడు శివరామ్..

“ఏం చెప్పమంటారు… ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది.. ఊర్లోకి నేను వస్తూంటే అందరూ తలో దిక్కూ పారిపోతున్న వైనం… వీరి మంచికోసం చెప్తున్నా- అర్థం చేసుకోలేకపోతున్నారు డాక్టర్ గారు.. పశువులకు భీమా చేయించినట్లే – మీరే మనుషులకు కూడా వైద్యం చేయాలి.. ఎలాగైనా… తమ భవిష్యత్ ఆపదలనుండి రక్షించుకునేలా బోధపర్చాలి.. మీ మాటైనా ఈ ఊరి జనాలకు అర్థం ఐతే అదే పదివేలు..” చేతులు జోడించాడు సుబ్బారావు.

చూద్దాం అన్నట్లుగా తలపంకించాడు డాక్టర్ శివరామ్…

ఇంతలో బయట “డాట్రు బాబూ”.. అంటూ అరుపులూ ఏడుపులూ వినిపించీ ఒక్కసారిగా బయటకు వచ్చేడు శివరామ్, ఆ వెనుకే సుబ్బారావు కూడా…

“ఏమయింది రంగయ్యా” అంటూ శివరామ్ ఆదుర్దాగా ప్రశ్నించేడు..

“బాబూ.. నా ప్రాణంగా చూసుకుంటున్నగౌరి ఒక్కసారిగా కూలబడిపోయింది.. రండి బాబూ” అంటూ పరుగులు తీసాడు రంగయ్య ఇంటివైపు..

గౌరిని పరీక్షించిన శివరామ్ చనిపోయిందని నిర్థారించాడు..

‘పదేళ్ళకిందట కొన్నాను. గోవైనా మనిషిలా సాకేను.. రోజుకు ఐదారు లీటర్ల పాలు ఇచ్చేది.. అవి అమ్ముకునే నా పిల్ల పెళ్ళి చేయగలిగేను.. అది పురిటికొచ్చినవేళ.. ఇపుడు నన్ను అన్నాయం చేసి ఎళిపోయావా గౌరీ ‘అంటూ ఏడ్చేడు రంగయ్య…

“రంగయ్యా.. గౌరి మరణం జీర్ణించుకోలేనిదే.. కాదనను.. నువ్వు గుండె దిటవు చేసుకో.. ఇపుడు నీకేమయినా ఐతే నీ కుటుంబ పరిస్థితేంటి.. నీ గౌరి చనిపోయి కూడా నీ కూతురు పురిటికి డబ్బు సమకూర్చింది.. అది నువ్వు గోవుకు చేయించిన బీమా రూపంలో… త్వరలోనే నీకందుతుంది..

ఆ మాటలు వింటూనే గౌరిని చూస్తూ… చనిపోయికూడా నన్ను ఆదుకున్నావా అంటూ రోదించేడు రంగయ్య ..

డాక్టరు శివరామ్, ఇన్సూరెన్సు ఏజంట్ సుబ్బారావు కలిసి ఊరందరిని సమావేశపరిచారు.. డాక్టరు శివరామ్ గౌరి చనిపోయిన తరువాత వచ్చిన బీమా సొమ్మును రంగయ్యకు అందిస్తూ..

“చూడు రంగయ్యా!నువ్ పశువు కోసం చేసిన బీమా నీకు ఉపయోగపడింది.. అలాగే మనం మన కోసం చేయించుకునే బీమా మన తదనంతరం మన కుటుంబానికి ఆసరా అవుతుంది.. తద్వారా వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి… బీమా చేయించుకోవడానికి ఇప్పటికైనా మీ అపోహలు తొలగించుకోండి. భవిష్యత్తులో రాబోయే ఆపదలనుండి రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి.. ఇపుడు మీరు ఆదా చేసే కొద్దిమొత్తము, పాలసీ ముగింపు కాలానికి మీరు ఉంటే మీరే పెద్దమొత్తంలో అందుకుంటారు.. లేదా మధ్యలో ఏదైనా జరగరానిది జరిగితే – మీ కుటుంబం వీధిన పడకుండా కాపాడిన వారవుతారు.. అందుకు ఉదాహరణే ఈ రోజు రంగయ్య కూతురు పురిటికోసం అప్పుచేయకుండా గౌరికి చేసిన బీమా కాపాడింది….” అంటూ ముగించాడు డాక్టరు శివరామ్ …

ఇన్సూరెన్సు ఏజెంట్ సుబ్బారావు ఇపుడు ఊర్లోకి వస్తుంటే ఎగతాళి లేదు.. ఎదురుచూపే అందర్లోనూ.