55. స్నేహ లేఖ

0
5

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో పాఠకుల ఎంపికలో ప్రథమ బహుమతి పొందిన కథ. రచన: గీతూ రాయ్. [/box]

[dropcap]రెం[/dropcap]డు సంవత్సరాల క్రితం షిర్డీ వెళ్ళి బాబాని దర్శించుకుందామని నాకు బుద్ధి పుట్టింది. ఇంట్లో కూడా సరే అన్నారు. షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వ్ చేయించుకున్నాను.

స్టేషన్ చేరేసరికి బాగా ఆలస్యం అయింది. ఎలాగో సామాన్లు తీసుకుని రైలు ఎక్కాను. బయట డోర్ దగ్గర చార్టు చూస్తే నా ఎదురు, పైన బెర్త్‌లన్నీ సీనియర్ సిటిజన్స్‌వే. ప్రయాణం ఎలా ఉంటుందిరా భగవంతుడా అనుకున్నాను మనసులో. నాది లోయర్ బెర్త్. ఎదురు బెర్త్ మీద తాతగారు కూర్చుని కాఫీ తాగుతున్నారు. పెద్ద వయసు వారిలా కనబడుతున్నారు కానీ, చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా బాగా పలకరించి మాట్లాడారు. ప్రయాణం బోర్ అనిపించలేదు. నాకు తెలియని ఎన్నో క్రొత్త విషయాలు ఆయన దగ్గర నేర్చుకునే అవకాశం దొరికింది.

తాతగారు తన జీవితానుభవాలను నాతో పంచుకున్నారు. “నా పేరు సత్యనారాయణ. నేను బడిపంతులుగా ఉద్యోగం చేశాను. ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు నేర్పాను. కానీ, నాకు జీవిత పాఠం నేర్పింది మాత్రం నా మిత్రుడు ‘గోపాల్ రావు’ అన్నారు.

“అదెలా తాతగారు?” ఆశ్చర్యంగా అడిగాను నేను.

చిన్నగా నిట్టూర్చి, తాతగారు చెప్పడం ప్రారంభించారు. “మాది చిన్న కుటుంబం. నా భార్య కూడా పంతులమ్మే. మాది ప్రేమ వివాహం. మాకు ఒక కొడుకు. పేరు వినయ్. మా అబ్బాయి చిన్నతనంలోనే నా భార్య కాలం చేసింది. అప్పటి నుండి వినయ్‌కి తల్లీ, తండ్రీ నేనే. ఇంజనీరింగ్ చదివించి, మంచి ఉద్యోగంలో చేరి స్థిరపడ్డాకా పెళ్ళి చేశాను. కొన్ని రోజులు బాగానే గడిచాయి. వయస్సు పెరగడం వలన ఓపిక తగ్గింది. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకు భారమై, ఎంతోమంది వృద్ధాశ్రమానికి వెళ్తున్నారు. వారిలో నేనూ ఒకడిని.”

“అదేంటి తాతగారు? మీ అబ్బాయి మిమ్మల్ని చూసుకోలేదా?” అని అడిగాను.

“లేదు బంగరం. వాదికి నేను బరువని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. కొన్ని రోజులకు ఆరోగ్యం క్షీణించింది. మానసికంగా సంతోషంగా లేను. ఒకరోజు మంచం దిగుతూ కాలు జారి పడిపోయాను. నడుముకు బాగా దెబ్బ తగిలింది. ఆశ్రమం వారు డాక్టరును పిలిపించారు. ఆయన పరిశీలించి నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. మందులు ఇచ్చారు. కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. పడుకునే ఉండాలంటే చాలా విసుగ్గా ఉండేది. ఆశ్రమంలో కేర్‌టేకర్స్ బాగానే టైం ప్రకారం ఇబ్బంది లేకుండా చూశారు. ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి, త్వరగా తీసుకుపొమ్మని దేవుడితో దెబ్బలాడేవాడిని. ఒకరోజు పొద్దున నా బెడ్ పక్కన ఇంకో మంచం వేసి అన్ని ఏర్పాట్లు చేస్తూ హడావిడిగా ఉంది. విషయం ఏమిటయ్యా అని అడిగాను. డైబ్భై రెండు సంవత్సరాల వృద్ధుడు కాన్సర్‌తో బాధ పడుతున్నాడు. ఎక్కువ రోజులు బ్రతకడని చెప్పారు డాక్టరు. అందుకే హడావిడి అన్నాడు కేర్‌టేకర్. కొంతసేపటికి ఆయనని తీసుకువచ్చి పడుకోబెట్టారు. ఆయన పేరు గోపాల్ రావు. అంత అనారోగ్యంలోనూ ఆయన అందరినీ పలకరించి సరదాగా మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. మంచి స్నేహం ఏర్పడింది మా మధ్య. ‘నువ్వు యింత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావ్ గోపాల్’ అని అడిగాను. అప్పుడు గోపాల్ రావు నాతో చెప్పిన మాటలు ఇవి: ‘మనల్ని వద్దు అనుకొని వదిలేసిన పిల్లలు సంతోషంగానే ఉన్నారు కదా! మనం ఆలోచించే విధానం మార్చుకోవాలి. మనం కోరుకునేది పిల్లల సంతోషమే కదా! వాళ్ళతో ఋణం తీరిపోయింది. కానీ, జీవితం అయిపోలేదు. పిల్లలకు బరువుగా ఉన్నామని ఆలోచించి దిగులు పడద్దు. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ, మనం, మనతో ఉన్నవారిని సంతోషపెట్టగలిగితే చాలు. బ్రతికే ఈ కొద్ది రోజులు ప్రశాంతంగా గడుపుదాం.’

గోపాల్ రావు చెప్పిన మాటలు మరిచిపోలేను. జీవితం మీద అయిష్టం ఏర్పడిన నాకు బ్రతకాలన్న కోరిక కలిగింది. నాలో క్రొత్త మార్పును చూశాను. మంచంలో బల్లిలా అతుక్కుపోవటం వలన బయట ప్రపంచం తెలియటం లేదు. గోపాల్ రావు పడుకునే మంచం దగ్గరగా ఒక కిటికీ వుంది. గోపాల్ కిటికీలోంచి బయటకు చూస్తూ ప్రకృతి అందాలను, అందమన పూల మొక్కల గురించి వర్ణించేవాడు. మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపించేది. రోడ్దు మీద వచ్చే పోయే వాహనాల గురించి, అటువైపుగా ఎవరైన నడుస్తూ వెళ్తే వారి గురించి చక్కగా వర్ణించేవాడు. నిజంగా చూస్తున్నట్లు అనిపించేది. రెండు వారాలు ఎలా గడిచిపోయిందో. తరువాతి రోజు రాత్రి గోపాల్ రావు కాలం చేశాడు. చనిపోయే ముందు రోజు తనకి షిర్డీ వెళ్ళాలని ఉందన్నాడు. కొద్ది రోజుల పరిచయం స్నేహంగా మారించి. గోపాల్  రావు మళ్ళీ కనబడడు అన్న ఆలోచన వచ్చినప్పుడు మనస్సుకు చాలా బాధ అనిపించేది. వారం రోజుల తరువాత నా బెడ్ గోపాలరావు పడుకునే చోటుకు మార్చారు. ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా, ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామా అని ఎదురుచూశాను. ఉదయం కిటికీనుంచి బయటకు చూసేసరికి ఆశ్చర్యపోయాను. ఖాళీ స్థలం. గోపాల్ రావు చెప్పినట్లు పూల మొక్కలు, వాహనాలు ఏమీ లేవు. చెత్త పారబోస్తున్నారు. చూడడానికి అసలేమీ బాగోలేదు. అలాంటి స్థలం గురించి కూడా గోపాల్ రావ్ ఎంత అందంగా ఆలోచించాడు? అనుకున్నాను.

మర్నాడే ఆశ్రమానికి వచ్చిన మా అబ్బాయి, వాడి చేతిలో గోపాల్ రావు నా గురించి వ్రాసిన ఉత్తరం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను.

‘నాన్నా! నన్ను క్షమించు. ఇక నుండి నువ్వు మాతోనే ఉండాలి’ అంటూ నా కాళ్ళని స్పృశించాడు. వాడిలోని పశ్చాత్తాపం నన్ను అణువణువునా కరిగించింది.

నా ప్రియమిత్రునికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుతూ అతని చివరి కోరిక తీర్చడానికి షిర్డీ పయనమయ్యాను” చెప్పారాయన.