[box type=’note’ fontsize=’16’] “ఎందరో అకుంఠిత దీక్షతో, విశాల భావనతో, నిరాపేక్షతో, నిష్పక్షపాత దోరణితో వ్యవస్థాగతమైన విజ్ఞానాన్ని విపులీకరించి, వాటి పునాదుల అసమగ్రత, లోతులేనితనం విశదం చేసి, భారతీయ తాత్విక దృక్పథం ఏవిధంగా ఆ లోపాలను సరిదిద్దుతోందో సిద్దాంత పరచాలి” అంటున్నారు మోటమర్రి సారధి ఈ వ్యాసంలో. [/box]
[dropcap]నా[/dropcap]రాయణ/సదాశివ సమారంభం, వ్యాస-రామానుజాచార్య మధ్యమాం, అస్మదాచార్య పర్యంతాం, వందే గురు పరంపరాం!
“నిటారుగా నిలబడగలగే వారు, ధైర్యంగా తల ఎత్తుకోగలగే వారు, సత్యంగా తమను తాము నమ్ముకోగలిగే వారు, ఒక వందమంది వుంటే, ఈ ప్రపంచం ఒక్కసారిగా విప్లవపూరిత మవుతుంది” అంటారు, స్వామి వివేకానంద. ఆ రీతిని మనిషి ఎదగటం ఎంత కష్టమో! ఎందుకంటే మనిషే కాదు, సమస్త ప్రాణికోటిని నడిపేది, ఆకలి! మానవ చరితని ఔపోసన పట్టి, మనషి అంతః బాహ్య సంఘర్పణలని మత విషయంగానే కాక, వైజ్ఞానికంగా, వేదాంతిగా విశ్లేషించిన, వివేకానంద మానవజాతి నడవడిని బలంగా ఇలా వక్కాణిస్తారు: “Man is guided by the stomach. He walks, and the stomach goes first and the head afterwards. Have you not seen that? It will take ages for the head to go first” నడిచేటప్పుడు మానవ శరీర ఆకృతిని ఉటంకిస్తూ, వివేకానంద మనకు వివరించే దేమిటంటే: మనిషిని ముందుకు నడిపేది ఆలోచన కాదు, ఆకలి. మనిషి ఆకలిని అధిగమించి, వివేచనతో ముందడుగు వేయడానికి యుగాలు పట్టవచ్చు! మానవ నైజాన్ని క్లుప్తీకరించి, మానవజాతి నడతను ఇంత స్పష్టంగా బహుశ ప్రపంచంలో ఏ వేదాంతి చెప్పి వుండరని నా నమ్మిక.
ఎందుకీ తాత్విక చింతన? సమస్త సృష్టిలో వివేచన, భాష, దానిని నిక్షిప్తం చేసే సాంకేతికత ఒక మానవజాతికే సొంతం. దాని ద్వారా ఒక ఉన్నత సంస్కృతిని ఊహించగలిగాడు. తద్వారా తన జీవితాన్ని, తన వారి జీవితాన్ని సులభతరం చేసుకొన్నాడు. చేసుకొంటున్నాడు, చేసుకొంటాడు కూడా! మానవ పరిణామాన్ని చార్లెస్ డార్విన్ వాదంతో అర్థం చేసుకోవచ్చు. మరి, మానవత పరిణామాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆది మానవుడు – కొండలు, గుహలు, అడవులలో నివసిస్తూ, మైదానాలకు విస్తరించి, జనవాసాలను ఏర్పరచుకొని, నగర జీవనానికి లేదా నాగరికతకు నాంది పలికాడు. ఈ ప్రయాణంలో: తన చుట్టూ ఉన్న జంతుజాలంతో, ప్రకృతితో నిరంతర పోరాటం సాగించాడు. తన గుంపు కాని వారితో తగా,
తన తండా కాని వారితో తగా
తన ప్రాంతం కాని వారితో తగా-
ఆ పై తన గుంపులోని వారితో తగా చివరికి తనవారితో తగా…
ఈ నిరంతర పోరాటాల నుంచి, తగాల నుంచి, మనిషి ఎదిగాడు. తగాల రూపు మారింది. తల్లి, తండ్రి, భార్య, కొడుకు, కూతురు ఆదిగా- మానవ సంబంధాలని ఏర్పాటు చేసుకొన్నాడు. సంఘ నిర్మాణానికి నాంది పలికాడు. నీతి, నిజాయితీని, ఒక నిబద్ధతని ఏర్పరుచుకొన్నాడు. రాగాన్ని, నాదాన్ని పరిపుష్టి చేస్తూ, గానాన్ని కనుగొన్నాడు. లోచనలను అవలోకిస్తూ, ఆలోచనలను పరికిస్తూ, భావాలను ఏర్పరచుకొన్నాడు. భావాలను వ్యక్తీకరించడానికి- సంజ్ఞలను, చిత్రాలను, ఆ తదుపరి అక్షరాలను, మాటలను సృజించాడు. మాటల మూటలు ప్రోగుపడగా, వాక్యాలు వృద్ధి పొందాయి. వ్యాకరణాదులు ఛందస్సు ఏర్పరచి, సమున్నత సాహితీ రూపాలను ఆవిష్కరించాడు. సంఘ నియమాలు, సామూహిక విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకొన్నాడు. మహోన్నత కళాసంపదని, సంస్కృతిని ఆవిర్భవింప చేశాడు. మనిషి అక్షరం, రాగం, నాదం, భావం పదిల పరిచిన ప్రభాత సంధ్యల ప్రారంభ ఘడియలలో నిక్షిప్తం చేసిన మహత్తర విజ్ఞానమే వేదం!
ఈ వేద విజ్ఞానం మతాన్ని నిర్వచించలేదు. కులాన్ని విభజించలేదు. ప్రాంతాన్ని విడదీయలేదు. సమస్త మానవాళిని, సమస్త జీవరాశిని ఒకటిగా చూపింది. మనిషి, మనిషినీ సమాయత్త పరిచింది. మనిషికి పారమార్ధికతని, ఉత్కృష్ట స్థానాన్ని నిర్వచించింది. మనిషి అందుకోవలసిన, చేరుకోవలసిన గమ్యాన్ని నిర్దేశించింది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ – అసత్యం నుండి సత్యానికి, చీకటి నుండి కాంతికి, మృత్యువు నుండి అమృత తత్వానికి సాగమని ఋగ్వేదం ఉద్వేషించింది.
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః।
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ॥
అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక! అందరూ ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండుగాక! అందరికీ ఉన్నతి కలుగుగాక! ఎవరికీ బాధలు లేకుండు గాక! ఒక్క క్షణం, ఆలోచించండి, మానవ పరిణామం ఎంత పరిపక్వ దశకు చేరినప్పుడు మనిషి ఇంత ఉన్నతంగా ఆశించగలడు!
అంతటి మహోత్కృష్టమైన భావనల మిళితమైన జ్ఞానం నిజంగా మానవజాతిని మహోన్నత శిఖరంపై నిలబెట్టినదా? మన గతమంతా మంచిగానే, మానవజాతి ఈతిబాధలు లేక వసించినదా? అంటే, మన కగుబడే చరిత్ర వేరుగా కనిపిస్తుంది. “మంచి గతమున కొంచెమేనోయ్” అన్నాడు మహాకవి గురజాడ. ప్రపంచ మానవాళి చరిత్రని తనదైన శైలిలో విశ్లేషించిన, మహాకవి, యుగకర్త అయిన శ్రీశ్రీ తన ‘దేశ చరిత్రలు’ కవితలో ఏమంటారో, మనం ఒక్కసారి పరిశీలిద్దాం:
“ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగమ్
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహసిక్తం
రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదికిన దొరకదు
గతమంతా తడిసె రక్తమున,
కాకుంటే కన్నీళ్ళతో
వైషమ్యం, స్వార్థపరత్వం,
కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్థలు,
మాయలతో మారుపేర్లతో
చరిత్ర గతి నిరూపించినవి.
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా ? ఇకపై సాగదే.
ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పడు!
దాచేస్తే దాగని సత్యం
నైలునదీ నాగరికతలో
సామాన్యుని జీవనమెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,
అది మోసిన బోయీ లెవ్వరు?
తక్షశిలా, పాటలీపుత్రమ్,
మధ్యధరా సముద్రతీరమ్,
హారప్పా, మొహంజొదారో,
క్రో-మాన్యాన్ గుహముఖాల్లో..
చారిత్రక విభాత సంధ్యల
మానవకథ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దే పరమార్థం?
ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?
ఏ వెల్గుల కీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?”
కవిశేఖర, ఆంధ్ర షేక్‌స్పియర్ శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ఆధునిక ఆంధ్ర కవిత్రయంలో ఒకరిగా గణతికెక్కారు. వారి అజరామరమైన సాక్షి వ్యాసాలలో అనేకానేక అంశాలను, 100 సంవత్సరాల క్రితం, సమాజ శ్రేయస్సు ధ్యేయంగా విశ్లేషించారు. ఆ పరంపరలోని ‘కాలస్వరూపుడు’ వ్యాసం భారతీయ తాత్విక పరిణామంలో కొన్ని ముఖ్య ఘటనలను, ఎంతో నాటకీయంగా మన కనుల ముందుంచే ఒక అద్భుత రసగుళిక. నేను తొలిసారి ఈ వ్యాసాన్ని 1977లో చదవడం, ఆ తదుపరి 1977-79 ఇంటర్మీడియట్లో తెలుగులో పాఠ్యాంశంగా చదవడం జరిగింది. నాలుగు దశాబ్దాలుగా ఆ వ్యాసం నా మదిలో కదలాడుతూనే ఉంది. ఆ స్పూర్తితో, అందులో కొన్ని ముఖ్య విషయాలు మీతో పంచుకొని, మన ముందున్న కర్తవ్యాన్ని గురించి ప్రస్తావించే చిన్న ప్రయత్నం. పానుగంటి వారు తన వ్యాసంలో ఒక విరాట్పురుషుడు జంఘాలశాస్త్రిని ఒక అద్భుత గొట్టంలోనికి నెట్టి, బైస్కోప్ లోలాగా గతం కనుల ముందు కదలాడినట్లు కథనం చేశారు. అది ఇలా సాగుతుంది:
“జంఘాలుడా! సృష్టి స్థితి లయ కారణుండును, సర్వ జగన్నియా మకుండును, సాధు రక్షకుండును, క్రూర శిక్షకుండును, సర్వ జీవాంతర సాక్షి భూతుండును అగు భగవంతుడు ఎక్కడనో యున్నాడనుసరికి- అతనికి నాపై ఇష్టమని ఒకడు, నాపై గోపమని మరియొకడు, నాపై తటస్తుడని మఱియొకడు, నా వైదిక కర్మములచేత జెవులు నులిమి యాతని స్వాధీన పఱచుకొందునని మఱియొకడునై- జనులెల్లరు కొసవెల్లులెత్తి, ఛాందసులై, త్రాగుబోతులై, మాంస భక్షకులై, సర్వ విధముల పాడై, దేశము నంతయు దేవునిపేర, సర్వవిధముల ధ్వస్తము చేసిరి కాదా? చూడు! దేవుని పేరిట, దేవుని శక్తుల పేరిట, ఎన్ని కోట్ల గొఱ్ఱెల తల లెగురుచున్నవో, ఎన్ని కోట్ల దున్నపోతులు హింసింప బడుచున్నవో, ఎన్ని లక్షల నరహత్యలు జరుగుచున్నవో, ఎన్ని కోట్ల కూనల కల్లు, జనులు దైవ ప్రీతి కొఱకు త్రాగుచున్నారో– యందువలన ఎన్ని సంసారములు మాసిపోవు చున్నావో చూచితివా? దైవ మూలముగా నిట్లు పెరిగిన అజ్ఞాన దుష్కృత రాశిముందు హిమవత్ పర్వతమెంత? జీవ హింస వలన దొలగిన రక్త ప్రవాహముల ముందు సింధు గంగా బ్రహ్మపుత్ర వఱదలెంత?
అందువలన, అహింసా ప్రధానమైనదియు– సర్వభూతహిత దయామృత బోధక మైనదియు అగు మతము బుద్ధుడు- సర్వజనోద్దరణార్థమై బోధించాడు. చూడుము, అదిగో బుద్ధుడు, మట్టిచెట్టు క్రింద పద్మాసీనుడై ఉన్నాడు. అతడు నీకు బాగుగా కనబడుచున్నాడా? ఈతడు వేదప్రమాణమును అంగీకరింపక పోవుటచే ఇతని మతమవైదిక మతం. దైవ తత్వము గురించి సాధ్యమైనంత వరకు మూకీభావము వహించేను. అందుచే కొంతవఱకు నాస్తే మతము కూడాను. దేవుని పేరేత్తనైన తగదు, వేదములను దోచివైనాడు. భక్తిని బహిష్కరించినాడు. ఇంక కావలసినదేమి? జనుల కెంత బరువు తగ్గినది! సర్వ వర్ణము లొక్కటే యనగ- వైదిక మతమునకు అసూయ చెందియున్న ఇతర మతములు కెవ్వున కేక వైచి- యెగిరి గంతిడి- సంతసమున మిన్నుముట్టినవి. చూడు చూడు- ఎన్నికోటుల జనులు బుద్ధమతమున చేరుచున్నారో! కనబడుచున్నదా! రవంత పైకి చూడుము- చీనాదేశమున నెందరు స్వీకరించుచున్నారో- ప్రక్కనున్న జపానులో కూడా చూడుము. మతమిట్లు వ్యాపింపజేసి బుద్ధుడు అస్తమించినాడు.
తిరుగ భరత ఖండమున జూడుము. జనులు నీతిని మఱచిపోయినారు- అహింసను మఱచిపోయినారు – సర్వజన ప్రేమమును మఱచిపోయినారు- దేవుడు లేడని, వేదములు పెంటపై బాఱవేయదగినవని మాత్రమే అని జ్ఞప్తి యందుంచుకొని- జనులు సత్కర్మ దూరులై, యన్యోన్య హింసాపరులై, నీతి బాహ్యులై, క్రూరవర్తనులై, యాగమ నిందాపరులై, నాస్తికులై, పతితులై, భ్రష్టులైరి. బుద్ధుడుదయించక ముందున్న దురవస్థ కంటే, నిప్పుడు రౌద్రతరమగు దురవస్థ సిద్ధించినది.
ఈ భయంకారవస్థను బాపుటకై దక్షిణదేశమునుండి శంకరాచార్యులు వచ్చుచున్నాడు. కనబడు చున్నాడా? అతడేలా ఉన్నాడు? సన్నముగా ఉన్నాడు. తలకంతకు నుదురే ప్రధానముగా కనబడుచున్నది. ముక్కు రవంత మొనదేరి ఉన్నది. కానీ యా చుబుకము, ప్రపంచాతీత పట్టుదలను సూచించుచున్నది. అతడు ఆ కాలవు మతములను ఖండించుటలో బౌద్ధమతమును కూడా ఖండించినాడు. బుద్ధమతం వేదబాహ్య మతమనియు, నాస్తిక మతమనియు, దాని నెటులైన భారతవర్షం నుండి బహిష్కరింప వలయునని అతడు ఎన్ని పాటులైన పడినాడు. బౌద్ధులతో భయంకరములగు వాదములొనర్చినాడు. వజ్రసన్నిభములగు రాతలతో ఖండించినాడు. బౌద్ధుల నినుప గానుగల నాడించినాడు. కనబడుచున్నదా? బౌద్ధ మతగ్రంథములన్ని పరశురామప్రీతి చేసినాడు. బౌద్ధమత నాశము కొరకాతడు చేయని ప్రయత్నము లేదు, పడని బాధ లేదు.
యోగాచార్యులు, సౌత్రాంతికుడు, వైభాషికుడు, మాధ్యమికుడు అని బుద్ధునకు నల్వురు శిష్యులు. బుద్ధుని బోధనలీ నల్వురకు నాలుగు విధములుగా అర్థమైనది. వారు వారివారి శిష్యులకు బోధించుటలో మరియెన్నో యసందర్భాభి ప్రాయములు బుద్ధ మతములో చేరినవి. అట్టి బుద్ధమతమునే శంకరాచార్యుడు ఖండించినాడు. అతడు మాత్రమేమి చేయగలడు? ఖండనార్థమై లభించినదదియే! ఖండించిన యంశము లేవో బుద్ధుని మతమునకు బ్రప్రధానము లైనవికావు. ప్రధానాంశము లన్నియు శంకరాచార్యుడు అంగీకరించి తన మతమున జేర్చుకొనినాడు. బుద్ధుని పునర్జన్మమును, జీవాత్మ మిధ్యాత్వమును శంకరాచార్యుడు గ్రహించినాడు. బుద్ధుడు భక్తిని సమూలముగా దోచివైచినాడు. శంకరుడు దానికి ప్రాముఖ్యత నీయలేదు. బుద్ధుడు జ్ఞానమే ముక్తికి సాధనమని చెప్పినాడు. శంకరుడు దానినే తీసుకొనెను. ప్రపంచము మిధ్యయని శంకరుడు చెప్పినాడు. బుద్ధ శిష్యుడగు మాధ్యమికుడు ఆమాట నిదివఱకే చెప్పినాడు. తుదకు బౌద్ధమతమునే- ఈశ్వరావాలంబనమిచ్చి- వేదములపై నిలువబెట్టి- శంకరాచార్యుడు అద్వైతముగా మార్చినాడు. అందువలననే అద్వైతమునకు ప్రచ్ఛన్న బౌద్ధమతమని పేరు వచ్చినది. శంకరుడు అవతార సమాప్తి నొందినాడు.
ఎక్కడ జూచిన జ్ఞానులే- ఎక్కడ జూచిన జగన్మిధ్యావాదులే- ఎక్కడ జూచిన వేదాంతులే- అందఱు బ్రహ్మములేశంకర మతావలంబులెందరో- కపట వేషధారులై, జ్ఞాన శూన్యులై, వ్యభిచార పరాయణులై, దొంగలై, నరహంతలై, భ్రష్టులై పోయిరి. మంచి మార్గ మెవడైన కనిపెట్ట, దానిలోని ఉత్తమావస్థను జేరితిమని- కల్లరులు, కపటులు, నటించి, నటించితుదకామార్గమునకు గూడ నపయశస్సును జేకూర్తురు. జనులు కపటిని గౌరవించుటతోడనే- ఓ అన్నియు వేసములే అన్నియు నటనములే- అన్నియు మర్మములే- అన్నియు మాయలే- అన్నియు కనికట్టులే- అన్నియు గారడులే- తిరుగ ప్రజలు మహాదురవస్థలో నున్నారు. ఎవ్వడైన వచ్చి ఉద్ధరించిన గాని బాగు పడునట్లు లేదు..
ఇదిగో! ఈసారి చూడుము. అతడే రామానుజాచార్యుడు. పండు తమలపాకువలే నున్నాడు. చంద్ర కిరణముల కంటే నాతని చూపులు చల్లగానున్నట్లున్నవి. అతని మొగము పాలుద్రాగు పసిపాపని మొగమువలే నమాయకమై, యకల్మషమై, యచ్ఛమై, అమృతమయమై ఉన్నది. ప్రజలను ధరింపజేయుటకై- భవబంధతారక మంత్రమును మాధవస్వామి గోపురమెక్కి ఉపదేశించినాడు. సార్వజనీనానురాగసంయుక్తుడగు అతని హృదయమునకు అద్వైత మెక్కినది కాదు. జగన్మిధ్యా తర్కము మెదటికి సాధనం గాని హృదయమునకు బోధనము కాదని యాతని నమ్మకము. పరబ్రహ్మమున కజ్ఞానాచ్ఛాదన మను అద్వైత బోధ మాతనికి మహా భయంకరముగను మహాపరాధముగాను గానబడెను. ముక్తి సాధనమని శంకరు డానతిచ్చిన జ్ఞానమును, భక్తి కంగముగా జేసి- ముక్తికి భక్తియే ప్రధానమని యాతడు సాధించినాడు. భరత ఖండమున నాల్లు మూలలు మాఱు మ్రోగునట్లు- భక్తియే ముక్తి సాధనమని- రామానుజాచార్యుడు బోధించి- పరమపదమును జేరెను.
ఇక తరువాతి వారీతని బోధనములనే లాగిలాగి, సాగదీసి సాగదీసి, భ్రష్ట మొనర్చిరి. మతమంతయు ధ్వస్తపరిచిరి. హృదయముననున్న విష్ణు భక్తి పరీక్షార్హము కాదయ్యెను, బాహ్య వైష్ణవ లక్షణములు కడుపు బద్దలు చేయజాలి యుండెను. అందు భక్తులే- శ్రీవైష్ణవులే- పరమ భాగవతులే- భక్తియే ప్రధానము. కర్మజ్ఞానములతో పనిలేదు. ఈ భక్తి మరింత ముదిరి పరిపక్వదశ నొంది ప్రపత్తి అయినది. వైదిక కర్మము చచ్చినది, స్నానం లేదు, సంధ్యావందనము లేదు, ఆచమనము లేదు, పాద ప్రక్షాళనమైన లేదు. సర్వకర్మ పరిత్యాగము సిద్ధించినది. ప్రజలు తిరిగి దురవస్థలో నున్నారు.
ఈసారి చూడుము, అతడే మధ్వాచార్యుడు. అతడెంత బలాడ్యుడో చూచితివా! కలియుగ భీముడు. అప్పటి రామానుజమతము రీతిని- ధ్వస్తమైన కర్మమును దిరుగ స్థాపించుటకై ఇతడు ఉద్భవించాడు. యోగాభ్యాసాది కర్మములను- వైదిక కర్మములను విధ్యుక్తముగ నాచరించుటకు ప్రప్రధానమైనది- శరీరదార్ద్యము! దానిని బోధించుటకే యీతడిట్టి యినుపనరములతో- ఉక్కు కండలతో- వజ్ర శరీరముతో పుట్టినాడు. సురాపాన- సుందరీలోలత్వాదిదురభ్యాసములచే నప్పటిజనులు- కబురపు రాయలవలె- నాటిపోవుచున్నారు. వడియములవలె నెండిపోవుచున్నారు. మొదట వేద విహితకర్మలు నాచరింప వలయును. అటుపైన జ్ఞానభక్తు లంకురించును. సాత్వికాహారముచే – దుర్వ్యసనదూరతచే బ్రాణాయామాది సాధనసంపత్తిచే – శరీర పాటవమును సంపాదించుకొని – దానిని సత్కర్మములందుపయోగపరచి- మీరు తరించి- దేశమును తరింపజేయుడని యీతడు బోధించినాడు. ఈతని బోధనములు కూడా దరువాతి వారెంత వఱకు ధ్వస్తము చేయుట కవకాశం ఉండెనో యంతవఱకు ధ్వస్తము చేసినారు. పరిశుద్ద స్నాన మాచరించుట, పంది గుంటలో పడుట- తప్పు దిద్దుకొనుట, తీరుగ తప్పులో బడుట- పై కెగురుట, పండ్లు విఱుగబడుట – ప్రకృతి మర్యాదయై యున్నది.” అని ముగిస్తాడు విరాట్ పురుషుడు.
విశ్లేషణ
మనిషి ఆవిర్భవించిన నాటి నుండి, తన చుట్టూ ఉన్న తోటి మానవుల తోను, ప్రకృతి తోను, ఏవిధంగా అనుబంధం ఏర్పరచుకుంటూ, తన అనుభవాలను, అనుభూతులను తన విశ్లేషణను ప్రోది చేసుకోవడానికి వివిధ వ్యక్తీకర పనిముట్లు (భాష మరియు ఇతర కళలు) ఆవిర్భవించుకున్నట్లు మనకు అనిపిస్తుంది. తొలి నాళ్ళలో తాను ఎదుర్కొన్న ప్రకృతితో పోరాటం, క్రమంగా దారి మళ్లి తన తోటి సమూహం పైనే ఆధిపత్యము కోసం తహతహగా సమాజ రీతి మార్పు చెందుతూ వచ్చిందని అనిపిస్తుంది. నా ‘తెల్ల చొక్కా స్మృతి’ అనే కవితలో ఇలా వివరించాను:
“భుజ బలం పాలించిన నాడు
భూమి రక్తంతో ఉప్పొంగింది…
మేధో బలం రాణించిన నాడు
మానవ జాతి సంక్లిష్టతలో మునిగింది…”
రంగాచార్యగారు తన ‘వేదం జీవన నాదం’ లో ఈ విధంగా అంటారు:
(పుట. 6) “వేదం పేర జరిగిన కర్మకాండను ఆదిశంకరుడు నిరసించాడు. అతడు వేద కర్మల మీద తిరుగుబాటు చేశాడు. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ, సకలమూ బ్రహ్మమే అనే ఉపనిషత్ సూక్తం శంకరుని అద్వైతానికి మూలాధారం. కర్మ విద్వత్తుకు శాస్త్రానికి సంబంధించినది కాదని, ఆచారమేనని వివరిస్తాడు.”
(పుట. 7) “రామానుజుడు ఆచార్యాజ్ఞను లెక్క చేయక తిరునారాయణపుర దేవాలయ గోపురం ఎక్కి- కులమత వివక్షత లేక సమస్త జనానికి తిరుమంత్రం ఉపదేశించారు. గురువుగారు అడిగితే “స్వామీ! నేను ఒక్కణ్ణి నరకానికి పోయినచో ఇంత మహాజనానికి మోక్షం లభిస్తుంది గదా!” అన్న మహా సంఘ సంస్కర్త రామానుజుడు.”
(పుట. 11) “వేదాల్లోనూ, రామాయణ భారతాల్లోనూ విగ్రహారాధన లేనేలేదు. హీనయాన బౌద్ధులు బుద్ధభగవానుని చిహ్నాలను మాత్రమే ఆరాధించారు. మహాయాన ప్రవర్తకుడైన నాగార్జునుడే బుద్ద విగ్రహాలను ప్రవేశ పెట్టాడు. ఆ తరువాతనే విగ్రహారాధన ప్రారంభం అయిందని నా నమ్మకం. మనం సాకార నిరాకార బ్రహ్మములను ఉపాసించాం. నిరాకార బ్రహ్మోపాసన భారతదేశం నుంచే మహమ్మదు, క్రీస్తు ప్రవక్తలు స్వీకరించారు.”
(పుట. 25) “చిన్న ప్రాణిని పెద్ద ప్రాణి– పెద్ద ప్రాణిని అంతకంటే పెద్ద ప్రాణి పొట్టన పెట్టుకోవడం ఆటవిక న్యాయం. సృష్టి మొదలై సుమారు 195 కోట్ల సంవత్సరాలైంది. ఇంతటి కాలంలో నరుడు ఎంతో ప్రగతి సాధించాడు. కాని కుటుంబం నుంచి అంతర్జాతీయం దాకా నరుడు ఆటవిక నీతిని మాత్రం దాటలేక పోతున్నాడనేది మన నిత్య జీవితానుభవం. మనిషి మానసింగా మారడం బట్టలు మార్చినంత తేలిక కాదు. సామాజిక పరిణామాలు భౌతిక పరిణామాలంత సులభం కాదు. సామాజిక, సాంఘిక, మానసిక పరిణామాలను రోజులు, నెలలు, సంవత్సరాలలో కొలువలేం. దాని పరిమాణం దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు కూడా కావచ్చు. అయినా మార్పు లేకపోవడం కూడా సాధ్యమే!”
సంఘ జీవనంలో క్రమంగా వచ్చిన ఈ మార్పులకు కలత చెందిన హృదయాలు ఉన్నాయి. అందుకే సమాంతరంగా మానవుని ప్రకృతిపై మరియు తోటి మానవుల మనుగడపై పెరుగుతున్న పెత్తనాన్ని నిరసించిన సామాజికవేత్తలు నేడే కాదు, ఎల్లప్పుడు ఉన్నారు. సర్వ మానవ, జీవకోటికి శాంతిని, సౌభాగ్యాన్ని ఆశించే ఎన్నో వేద మంత్రాలు (శాంతికి సహితం శాంతిని అభిలషించడం) మనలను అబ్బుర పడేలా చేస్తాయి. ఎందరో మహానుభావులు ఉదయించారు, సమాజ స్థితిని విశ్లేషించి, మంచి, చెడులను తర్కించి, అందరి మంచికి తమదైన శైలిలో ఉన్నత మార్గాలను చూపారు. పానుగంటి వారు ప్రధానంగా నలుగురు మహాపురుషులు వారి వారి కాలాలలో ఒనరించిన బృహత్ కార్యాలను వివరిస్తూ, వారి తదుపరి కల్లరులు, కపటులు ఏ విధంగా మార్గాలను తిరిగి ధ్వస్తపరిచారో మనముందు ఉంచారు.
భారతీయ తాత్వికత: ప్రపంచ విద్యావ్యవస్థలో దాని స్థానం, కర్తవ్యం
పానుగంటి వారి 12 పేజీల సుదీర్ఘ వ్యాసంలో చెప్పిన కొన్ని ప్రధాన అంశాలను మాత్రమే మనవి చేశాను. కానీ, ఆయన జైన, చార్వాక, సిక్కు మతాల గురించి, మధ్వాచార్య తదుపరి పరిణామాలు గురించి కానీ, ఆయన ప్రస్తావించలేదు. వేమన తను కనుగొన్న సత్యాన్ని, అతి సరళంగా, సామాన్య జననానుడిలో అందించాడు. అలాగే గత 100 సంవత్సరాలలో మరెందరో మహా పురుషులు తమ తమ మార్గాలను సెలవిచ్చారు. నేటి సాంకేతికత, సోషల్ మీడియా, లేదా ప్రవాస భారతీయుల వల్లగాని ఎందరో ఆధ్యాత్మిక వ్యక్తులు ప్రజలకు దగ్గరయ్యారు. వీటిని సమన్వయ పరచవలసిన ఆవశ్యకత ఉంది. అందరూ మార్పుని, మనిషి మనిషిగా జీవించడాన్ని ఆశించి, తమ తమ పరిధిలో ముందుకు పోయినవారే.
బహుశ పాశ్చ్యాత్య వేదాంతులను మాత్రమే పరిశీలించిన మార్క్, “తత్వవేత్తలు ఈ ప్రపంచాన్ని గురించి వ్యాఖ్యానించారు. కానీ దాని అసలు ప్రయోజనం ప్రపంచాన్ని మార్చడం.” అని. ఒక విధంగా పరిశీలిస్తే, బుద్దుడు, శంకరుడు, రామానుజుడు, వేమన, వారివారి కాలాల్లో విప్లవ వాదులే, మహత్తర మార్పుకు దారితీయించినవారే! ఒక కోణంలో పరిశీలిస్తే, భగవద్గీత ఆనాడు ప్రబలంగా ఉన్న అనేక తాత్విక చింతనలకు (సాంఖ్య, కర్మ, భక్తి, జ్ఞాన, జ్ఞాన కర్మ సన్యాస, కర్మ సన్యాస, ఆత్మ సంయమ, గుణత్రయ మొదలైన యోగాలు) సమన్వయం లాగా, వేదవ్యాసుడు ఒక మహత్తర సమన్వయ కర్తగా అనిపిస్తాడు. భగవద్గీతలోని కొన్ని అంశాలను విపులీకరిస్తే, జ్ఞానదాయకంగా మలిస్తే, సైకాలజీ, ఫిలాసఫీ, మేనేజిమెంట్, వ్యక్తిత్వ వికాస విభాగాలకు ఆధార భూతమైన ఒక అద్భుత తాత్విక దృక్పధంగా నిలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
ఈనాడు ప్రపంచ పరివ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో సామాజిక మరియు మేనేజిమెంట్ విజ్ఞానము (Psychology, Philosophy, Science, Management and Social Science) మరియు పరిశోధనలలో ఎక్కడ మన భారతీయ తత్వవేత్తల గురించి వారి ఆలోచనా సరళి గురించి అగుపడదు. మతం, తార్కికత మరియు ఆచారం కలగలిసి పోయి- విశ్వ శ్రేయస్సు, వసుధైక కుటుంబ ఆలోచన అణగారి, ఉజ్వలమైన మన తాత్విక సంపద ఆచరణ యోగ్యం కన్న, భక్తితో కొలువ వలసిన శిలలుగా రూపాంతరం చెందాయి. ఒక విధంగా చెప్పాలంటే, యుగాల మానవ చరితలో, ఎన్నదగిన తాత్విక మార్గమేదీ, భారతీయ భావనలో లేదు అనేది, extant academic literature మనకు చెప్పక చెప్పే పాఠం! ఇది శోచనీయం! ఇది మనందరం గుర్తించవలసిన నిజం.
ఆధునిక విజ్ఞానం సమస్తం గ్రీకు తాత్వికవేత్తలైన సోక్రటీస్ లాంటి వారి ఆలోచనా సరళి పునాదిగా నిలిచాయి. అంటే ఈ విజ్ఞానం క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దానికి మించి వెనుకకు చూడలేక పోతున్నాయి. అంతటికంటే పురాతనమైన భారతీయ తత్వ విధానానికి సముచిత స్థానం ఇవ్వలేదు. ఎందుకంటే భారతీయ తాత్వికత, Western Philosophy కి భిన్నంగా, ఇహానికంటే, పారమార్ధికతకు ప్రాముఖ్యత నిచ్చింది. అలాగే ఆ మహామనీషుల భోధనలలోని తాత్విక చింతనను కూడా భారతీయ ఇతిహాసం మతంతో ముడిపెట్టడం వల్ల అవి బహుశా తత్వశాస్త్ర పరిశోధకులు పరిగణనలోకి తీసుకోలేదేమో!
ఇవన్నీ చాలా జటిలమైన మౌలిక ప్రశ్నలు. భారతీయ ఆలోచనా సరళిని academic స్థాయికి తీసుకొని రావడం ఒక భగీరథ యజ్ఞం! ఎందరో అకుంఠిత దీక్షతో, విశాల భావనతో, నిరాపేక్షతో, నిష్పక్షపాత దోరణితో వ్యవస్థాగతమైన విజ్ఞానాన్ని విపులీకరించి, వాటి పునాదుల అసమగ్రత, లోతులేనితనం విశదం చేసి, భారతీయ తాత్విక దృక్పథం ఏవిధంగా ఆ లోపాలను సరిదిద్దుతోందో సిద్దాంత పరచాలి. ఆ రోజు, ఏదో ఒకరోజు వస్తుందని, ఆ భగీరథ యజ్ఞానికి ఈ వ్యాసం శ్రీకార మవుతుందని ఆకాంక్షిస్తూ, ఇంతటితో, ‘కాలదర్శిని: తాత్విక చింతన’, సశేషం. ఓం తత్ సత్!
ఉపయుక్త గ్రంథాలు:
దాశరధి, రంగాచార్య (2007). వేదం-జీవన నాదం. ఎమెస్కో ఆర్షభారతి, విజయవాడ.
పానుగంటి, లక్ష్మీనరసింహారావు (1952). సాక్షి వ్యాసాలు (6 సంపుటాలు). వావిళ్ల రామశాస్తులు అండ్ సన్స్, మద్రాస్.
శ్రీశ్రీ, మహాప్రస్థానం.