రంగుల హేల 8: కట్ చేసి అతికితే సరి!

1
4

[box type=’note’ fontsize=’16’] మాటి మాటికీ మనసును కష్టపెట్టుకోవడం, చిన్న బుచ్చుకోవడం లాంటి ప్రహసనాలు లేకుండా హాయిగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి “రంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]వై[/dropcap]రాగ్యం గురించీ తామరాకు మీద నీటి బొట్టు లాంటి జీవనం గురించీ చిన్నప్పటి నుండీ వింటూనే ఉంటాం. జిడ్డు కృష్ణ మూర్తి నుంచీ ఓషో మీదుగా నేటి జగ్గీ వాసుదేవన్ వరకూ కొంతైనా చదువుతూనే ఉంటాం. నిత్యం భగవత్ గీతా బోధనలు ఎక్కడో అక్కడ చెవుల్లో పడుతూనే ఉంటాయి. వాటికి సాయం మనం తిన్న ఢక్కా మొక్కీల సంపద ఎలాగూ ఉంటుంది. అనుభవాలతో పండిన తల వీపు తడుతూ ఉంటుంది. ఇక చాకో గారి లాంటి ప్రాజ్ఞుల ప్రసంగాలు అప్పుడప్పుడూ చెవిలో వేసుకుని ఆహా! స్థితప్రజ్ఞత సాధించేశాం కదా! అనుకుని ఆత్మవిశ్వాసంతో జీవించేస్తూ ఉంటాం.

పక్క ఫ్లాట్ ఆవిడ తలుపులు తియ్యగానే ఎదురుగా వస్తూ అభావంగా చూసేసరికి చివుక్కుమని పోతాం. ఆవిడ నవ్వలేదేమిటి? అసలు నేను నవ్వానా? కుక్కపిల్లని చూసి కూడా నవ్వుతానే నేను! మరైతే ఆవిడ ప్రతిగా చిరునవ్వు చిందించ లేదేమిటి? నేనేమైనా అనుకోకుండా ఆమెను నొప్పించానా? ఎక్కడన్నా పొరపాటు జరిగిందా? తర్జన, భర్జన! ఆవిడ సాయంత్రం వచ్చి తలుపు కొట్టి, మా నాన్నకి ఆరోగ్యం బాగా లేదని తెలిసి ఉదయం నుంచీ పరేషాన్‌లో ఉన్నా! ఇప్పుడే ఫోన్ వచ్చింది డాక్టర్ భయం లేదని చెప్పాడట. అనగానే గాల్లో తేలిపోతాం, అమ్మయ్య! అని.

 పనిమనిషి రానని ఫోన్ చెయ్యగానే మనకి తెలిసిన విషాదపు పాటలన్నీ చెవుల్లో మోగుతాయి. (“ఎవరికి ఎవరూ సొంతమూ?”, “ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నమూ!” లాంటివి) ఓ రోజు పనమ్మాయి రాకపోతే చచ్చిపోతామా? అని అనుకోలేం!

ఇక బంధుకోటి విషయానికి వస్తే మనమెంత వాళ్ళని కావిలించుకున్నా వాళ్ళు మనల్ని కలుపుకోరు. వారికెంతో గౌరవ మర్యాదలిచ్చినా వాళ్ళు మనల్ని తుంచిపడేసిన వివరాలు వద్దన్నా మన చెవుల్లో పడి మనల్ని టెన్షన్ సముద్రంలో పడేసి, ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత ఒడ్డున పడ్డ చేపల్లా గిల గిలా కొట్టుకునేట్టు చేసి చివరికి బీ. పీ. షుగర్‌ల బారిన పడేస్తాయి.

మన వాళ్లకి మనం సహాయం చెయ్యాలి అని ఆవేశపడి చుట్ట పక్కాలకి అప్పులిచ్చి తిరిగి తీర్చమన్న పాపానికి వాళ్ళు మనల్ని విలన్‌లని చేసి నిందించినపుడు దిగ్బ్రాంతికి లోనవుతాం. చివరికి అనేకసార్లు అయిన క్షవరాలు నేర్పిన వివరాలు మనకి వద్దన్నా నిర్మమకారం నేర్పుతాయి.

ఇలాంటి రక రకాల అనుభవాల వల్ల కలిగిన విజ్ఞానంతో మనం మన చుట్టూ గోడ కట్టేసుకుని ఒంటి పిల్లి రాకాసిలా ఎవరి నోట్లోనూ పడకుండా ప్రశాంతంగా బతికేద్దామంటే మాత్రం వీలవుతుందా? ఏ పిన్నమ్మో, పెద్దమ్మో నోరు చేసుకుని ఇంత తెలివి తక్కువగా తయారయావేంటమ్మాయ్ అంతంత చదువులు చదువుకుని? నలుగురితో పాటు నారాయణా అని పాడుకుంటూ లోకం తీరింతే అనుకుని అందరితో కలిసి పోవాలమ్మా! అని ఓ ఉచిత సలహా ఇచ్చేసి ఆ పై మన మీద జాలి లాంటిది పడి, పనిలో పనిగా రెండు మొట్టికాయలు కూడా వేసేస్తారు.

ఒకోసారి అనుకోకుండా భలే నిజాయితీ గల బంధు మిత్రులు దొరుకుతుంటారు. అలాంటప్పుడు మళ్ళీ మనం అలవాటు చొప్పున అందరినీ నమ్మేసి మాయలో పడిపోవడం, పళ్ళు రాల గొట్టుకోవడం ఆ విధంగా పాత కథ పునరావృతం కావడం లాంటి ప్రమాదాలు జరక్కుండా చూసుకోవాలి. లేకపోతే “ఏళ్లేందుకొచ్చాయి? ఏటిపల్లానికి కాకపొతే!” అన్న నానుడి బారిన పడిపోతాం.

అంచేత మనమంతా పైకి అందరితో కలిసినట్టే ఉంటూ ఎవరినీ అమాయకంగా హైస్కూల్ పిల్లల్లా అతుక్కుపోకుండా ఒక మధ్యే మార్గం కనిపెట్టాలి. అందరూ మనవాళ్లే కానీ ఎవరూ మన వాళ్ళు కాదు అన్న తత్త్వం వంట బట్టించుకోవాలి. దీనికి సాధన అవసరం.

ముందస్తుగా మనం అందరితో మానసికమైన అటాచ్మెంట్ కట్ చేసుకోవాలి. పైకి రాసుకు, పూసుకున్నట్టే ఉండాలి. లోపల మాత్రం కాదు. డిటాచ్డ్ అటాచ్మెంట్! కేక్‌ని ముక్కలుగా చేసి మళ్ళీ దగ్గరగా జరిపినట్టన్నమాట. చూస్తే కలిసినట్టుగా ఉంటుందంతే! కావలసినప్పుడు ముక్కల్ని పక్కకి జరపొచ్చు. అప్పుడింక మాటి మాటికీ మనసును కష్టపెట్టుకోవడం, చిన్న బుచ్చుకోవడం లాంటి ప్రహసనాలు లేకుండా హాయి హాయిగా ఉంటాం. నిజానికి సూపర్ ఫీషియల్ సంబంధాలే మనల్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతాయి, తెలుసా!

నది సముద్రుణ్ణి కలవడానికి వెళుతున్నట్టుగా దారిలో కొండలు,గుట్టలు, కంచెలు, మంచెలు దాటుకుంటూ రాళ్ళూ, రప్పలూ తప్పించుకుంటూ ఆగకుండా నిదానంగా సాగిపోవడమే కదా! సుఖ జీవన పయనం అంటే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here