[box type=’note’ fontsize=’16’] “కాస్తంత స్పష్టంగా ఆలోచిద్దాం, ప్రయత్నం మొదలుపెట్టి గెలుపు సాధిద్దాం, మానసిక ఆనందంతో జీవనయానం చేద్దాం” అంటున్నారు పి. తులసీదాసు ఈ కవితలో. [/box]
[dropcap]ఉ[/dropcap]మ్మడి కుటుంబాలు గతించాయి
వ్యష్ఠి కుటుంబాలు అవతరించాయి
ఆర్థిక వనరులు పరిమితమై
మానవ సంబంధాలు వ్యాపార సంబంధాలయ్యాయి
ఆర్థిక పరిపుష్టి కోసం
ఇద్దరూ సంపాదనకై పరుగులిడాల్సిందే
లేచింది మొదలు పడుకునే వరకూ
ఉరుకులు పరుగుల జీవితం
జీవనయానంలో
ఎన్నో సవాళ్ళు,
ఆలోచనలు, తెగని సమస్యలు
ప్రక్కవారి అభివృద్ధిపై ఓర్వలేనితనం
కాలక్షేపం ముసుగులో
బుల్లితెరలు అందించే ఆందోళనా కార్యక్రమాలు
ఏమి చేయాలో తెలియని తికమక స్థితిలో
ఒక లక్ష్యం లేని పరుగు…
లోపించిన శాంతి, ప్రశాంతత!
పెరిగిన మానసిక ఒత్తిడి
ఫలితంగా భయానక వ్యాధులతో పోరాటం
మనల్ని మనం ప్రశ్నించుకుందాం!
మానసిక ఆందోళనకు
కారణాలు వెదుకుదాం
మానవ జీవితం చాలా చిన్నది
కాస్తంత స్పష్టంగా ఆలోచిద్దాం.
ఆధ్యాత్మిక చింతన, ధ్యానం
వంటి ఉపకరణాలతో
త్రిగుణాలను
సమన్వయపరుద్దాం.
మొద్దుబారిన మొదడుకు సాంత్వన కల్పిద్దాం
ప్రణాళికతో గందరగోళం తొలగించుకుందాం
ప్రయత్నం మొదలుపెట్టి గెలుపు సాధిద్దాం
మానసిక ఆనందంతో జీవనయానం చేద్దాం.