గళ్ళ నుడికట్టు

7
3

[box type=’note’ fontsize=’16’] జీవితాన్ని గళ్ళ నుడికట్టుతో పోలుస్తూ… “సాధిస్తున్న కొద్దీ, గళ్ళు పూరిస్తున్న కొద్దీ, చుట్టూ చప్పట్ల ప్రోత్సాహం – గళ్ళ నుడికట్టు మెల్లమెల్లగా నిండిపోయింది, నా ఆయుష్షు పాత్ర క్రమక్రమంగా ఖాళీ అయిపోయింది” అంటున్నారు శ్రీధర్ చౌడారపు ఈ కవితలో. [/box]

[dropcap]క[/dropcap]ళ్ళతో ప్రపంచాన్ని
కాస్తంత పరిచయం చేసుకోగానే
మెల్లగా పక్కనొచ్చి నిలబడింది జీవితం
వందేళ్ళ కాలానికి సరిపడా
వందగడుల అడ్డం నిలువు ఆధారాల
గళ్ళనుడికట్టును
నా కళ్ళ ముందు నాజూకుగా విప్పి పెట్టేసి

నిలువు ఆధారాల నిచ్చెన మెట్లెక్కుతూ
అడ్డం ఆధారాల దారుల్లో ఆరాటంగా నడుస్తూ
ఆధారాలను, ఆ దారాలను ఆధారంగా చేసుకుని
తెలిసిన పరిచయాల పరిసరాలలో
తెలివితేటల దీపం వెలుగులతోనో
కండబలపు ధూపం ఆకర్షణలతోనో …
తెలియని, గుర్తెరుగని చోటుల్లో
తెలివి అక్కరకురాని ముళ్ళబాటల్లో
అడిగో అడుక్కునో, బెదిరించో దేబిరించో
కత్తి మెడపై పెట్టో, కాళ్ళు రెండు గట్టిగా పట్టో….
ఎక్కడెక్కడో దాక్కున్న
ఒకో లక్ష్యపు అక్షరాన్ని ఆప్యాయంగా ఏరుకుని
ఒకో గమ్యపు పదాన్ని గట్టిగా పట్టుకుని
ఒకో బంధాన్ని పదబంధాల్లో పదునుగా ఇరికించి
ఖాళీ గడులను పూరిస్తున్నాను
నుడికట్టు ఖాళీ స్థలాన్ని తగ్గిస్తున్నాను

సాధిస్తున్న కొద్దీ, గళ్ళు పూరిస్తున్న కొద్దీ
చుట్టూ చప్పట్ల ప్రోత్సాహం,
నలువైపులా కేరింతల ఉత్సాహం
కరుగుతున్న ఖాళీలతో
నా గుండెల్లో నిండుతోన్న కొండంత బలం
పెరుగుతున్న వయసుతో
నా చుట్టూరా నిలబడుతోన్న కొండంత బలగం

మౌనంగా గమనిస్తున్న విధి
ఆఖరి గడి నింపగానే, చివరి గంట కొట్టేసింది
మనసులో అనుకున్నది సాధించిన తృప్తి
గుండెలో ఏదో చెప్పలేని బరువెక్కిన అనుభూతి
విజయం పొందిన గర్వంతో విలాసంగా చూస్తే
అలా దూరంగా అలసటతో నిలిచి
వింతగా, వేదనతో వీడ్కోలు చెబుతోంది
క్రమక్రమంగా కనుమరుగవుతోన్న నా జీవితం

దూరంగా ఏవో చప్పుళ్ళు దృష్టిని ఆకర్షిస్తే
ఏమిటా అని నేను ఆరాటంగా ఆరా తీస్తే
ఊరిపొలిమేరల వైపు మెల్లమెల్లగా సాగుతోంది
నా సన్నిహితులూ సహజీవనుల బృందం
అందరి మధ్యలో ఎత్తుగా ఊరేగింపుగా నేను
అందరినోట “రామ్ నామ్ సత్య హై” మాట

ఇప్పుడర్థమైపోయింది
గళ్ళ నుడికట్టు మెల్లమెల్లగా నిండిపోయింది
నా ఆయుష్షు పాత్ర క్రమక్రమంగా ఖాళీ అయిపోయింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here