మిర్చీ తో చర్చ-15: ‘కాల్ వలయం’

0
3

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ”. [/box]

[dropcap]సుం[/dropcap]దరాన్ని సంప్రదించాలని అర్జంటుగా మొబైల్ తీసి నంబరు నొక్కాను.

“మిర్చీ వేడిగా ఉంది. దయచేసి వేచి యుండండి”

అలాగే పట్టుకుని కూర్చున్నాను.

“మీ కాల్ మాకు అత్యంత విలువైనది. మిర్చీ బజ్జీలో మసాలా ఎంతటి పాత్ర పోషిస్తుందో, మా సంస్థలో మీరు అంతటి పాత్ర పోషిస్తారు”

కొద్ది సేపు ఏమీ వినిపించలేదు. మొబైల్‌ని అటూ ఇటూ తిప్పాను. మరల చెవి దగ్గర పెట్టుకున్నాను.

‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ…!’ అనే పాటు ముందు వినిపించే అ…. ఊ..లు వేడిగా తగులుకుంటున్నాయి.

“మిర్చీ వేడిగా ఉంది. దయచేసి వేచి యుండండి”

ఇది చాలా అన్యాయం అనిపించింది. వేడిగా ఉంటే తినేయాలి గానీ ఇలా వేచి యుండటం దేనికి?

“మీ కాల్ మాకు అత్యంత విలువైనది. మీరు మసాలా వంటివారు”

ఇది మరింత అన్యాయంగా గోచరించింది. మసాలా అంటాడు, ‘సాలా’ అంటాడు. పబ్లిక్‌గా బూతులోకి వచ్చేశాడు.

మరల ఊరించే సంగీతం వినిపిస్తోంది. ఈ ఫోన్‌ను బంద్ చేసి మరల ప్రయత్నిద్దాం అనుకుంటే తిరిగి కిందపడ్డ సాలెపురుగు మరల పైకెక్కే ప్రయత్నం తప్ప మరొకటుండదు.

“మా కోసం సమయం ఇచ్చి ఇంతసేపు కేవలం మిర్చీ సువాసనతో సరిపెట్టుకున్నందుకు మా ధన్యవాదాలు. దయ చేసి వేచి యుండండి…”

మరల సంగీతం వినిపిస్తోంది. ఈసారి ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే…’ ఈ పాట వినిపిస్తోంది. కొద్ది సేపు గడిచాక ఓ గొంతు వినిపించింది.

“హలో” అన్నాను.

“మిర్చీకి భాష లేదు…” అని వినిపించింది. “…అయినా తెలుగు కోసం ఒకటి నొక్కండి, సంస్కృతం కోసం రెండు నొక్కండి, ఆంగ్లం కోసం సున్నా నొక్కండి, హిందీ కోసం ఎనిమిది నొక్కండి….” ఇలా దేశభాషలన్నీ చెప్పి అయిదు నిముషాలు గడిపింది ఆ కంఠం. కాకపోతే బుగ్గలో రెండు మిర్చీలు దాచుకున్నట్లు అర్థమవుతోంది మాడ్యులేషన్.

ఒకటి నొక్కాను.

“మీరు తెలుగును ఎంచుకున్నారు. మీ భాష మార్చుకోవాలనుకుంటే ఏడు అంకె నొక్కండి”

ఏదీ నొక్కకుండా అలానే పట్టుకున్నాను.

“మీరు ఏ సమాధానమూ చెప్పలేదు. తెలుగైతే ఒకటి నొక్కండి. మీ భాష మార్చుకోవాలనుకుంటే ఏడు అంకె నొక్కండి”

ఒకటి నొక్కాను.

“మీ కాల్ మాకు అత్యంత విలువైనది. మీరు తెలుగును ఎంచుకున్నారు. భాష మార్చుకోవాలనుకుంటే ఏడు అంకె నొక్కండి”

నేను భాష ఎందుకు మార్చుకోవాలి? ఫోన్ అలాగే పట్టుకున్నాను. ఓ పాట వినిపించింది.

‘తేనె కన్నా తీయనిది తెలుగు భాష…’

పాట పూర్తిగా వినిపించింది. ఇప్పటికి వీది నంబరు నొక్కి అరగంట పూర్తయ్యింది.

పాట అయిపోయాక ఏదో శబ్దం వినిపించింది. అది కాలుతున్న నూనెలో మిర్చీ పడేస్తే వచ్చే శబ్దం. అయితే సుందరం ఉన్న ప్రదేశానికి కాల్ చేరిందని అర్థమవుతోంది. ఆశగా కూడా ఉంది.

“ఈ సమయంలో మా వంట వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. దయచేసి వేచి యుండండి. మీ కాల్ మాకు అత్యంత విలువైనది”

చేసేది లేక అలాగే పట్టుకున్నాను.

“ఈ మధ్య మా సేవలను మరింత మెరుగుపరిచామని మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాం. సుందరం మిర్చీ మీకు సమర్థవంతమైన సేవలను అందిస్తోంది. మీ ఒక్క క్లిక్‌తో మీ ఇంటి వద్దకు మిర్చీలు వస్తాయి. మరిన్ని వివరాలకు కోసం మా యాప్ ‘తూ చీజ్ బడీ హై మిర్చీ మిర్చీ’లోకి వెళ్ళి మీ వివరాలు ఇవ్వండి”

విసుగు వచ్చి, చేతులు నొప్పి పుట్టి ఫోన్ ప్రక్కన బెట్టి, సౌండ్ వినిపించేటట్టుగా ఉంచాను.

‘రానిక నీ కోసం సఖీ, రాదిక వసంత మాసం’ అందులోంచి వినిపిస్తోంది. క్రిందకి దింపి వదిలేస్తే గుక్కపట్టి ఏడుస్తున్నట్టు ఏడుస్తోంది. మరల చెవి దగ్గర పెట్టాను.

“మీ కాల్ మాకు అత్యంత విలువైనది. దయచేసి వేచి యుండండి. మా వంట వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. మీ కోసం అతి చక్కని, రుచికరమైనవి, కొత్త తరహాగా ఉండేవి – మీకోసం బజ్జీలు తయారవుతున్నాయి.”

“హలో” అని వినిపించింది. ప్రాణం లేచి వచ్చింది.

“ఆఁ.. హలో..”

“మీ ఆత్మస్థైర్యానికీ ఆత్మవిస్వాసానికీ మా జోహార్లు! మా వంట వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఈ లోపల మిమ్మల్ని అలరించటానికి ఒక ప్రక్రియ. ఒకటి నొక్కితే పాట వస్తుంది. రెండు నొక్కితే దాని పేరడీ వస్తుంది. ఇది మిర్చీ అందిస్తున్న అద్భుతమైన విన్యాసం. మీ కాల్ మాకు అత్యంత విలువైనది.”

ఏమీ చెయ్యలేక ఒకటి నొక్కాను.

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు…’  పాట వినిపించింది. రెండు నొక్కాను.

‘మిర్చీ అని ఇది తిన్నవారు, అరచి అరచి, విసిగిన వారు, ఏదో తినాలనీ, ఎందుకో తినాలనీ, ఉండలేరు… వెళ్ళలేరు…!’

“మీ కాల్ మాకు అత్యంత విలువైనది. దయచేసి వేచి యుండండి”

ఫోన్‌ని అవతల పక్క సోఫా మీదకి విసిరేశాను. అది ఆగిపోయింది. లాభం లేదని అలా చూస్తూ కూర్చున్నాను. అది మ్రోగడం మొదలుపెట్టింది. సుందరం కాల్ అది. ఫోన్ తీశాను.

“నీ కాల్ నాకు ఏ మాత్రం అవసరం లేదు. పెట్టేయ్” అన్నాను.

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here