[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]
[dropcap]న[/dropcap]వ రసాల్లోనూ నాకు హాస్యమంటే చాలా యిష్టం.
ఎక్కడ నవ్వులుంటే అక్కడ వాలిపోవడం నా బలహీనత. నిజానికి నేను ఎక్కువగా కరుణరసం నిండి వుండే కథలే రాశాను. బహుశా అతి చిన్నతనంలో నేను చదివిన శరత్ సాహిత్యం నా మీద అలాంటి ముద్ర వేసిందేమో.
‘నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు చాలక సినిమాలు, సాహిత్యం తిరిగి అవే చదవాలా.. కాసేపు వాస్తవ దూరంగా ఉంటే వుండుగాక… నవ్వు పుట్టించేవి… సరదగా వుండేవి మాత్రమే మేం చూస్తాం’ అని కొందరి వాదన. ఇది కూడా తీసి పారేసే వాదన కాదు మరి!
ఇది వరకు ఉమ్మడి కుటుంబాలలో వచ్చీ పోయే బంధువులతో వారి చమత్కారపు మాటలతో బోల్డంత హాస్యం పుట్టేది. నవ్వుల మధ్య, పరాచికాల మధ్య ఎంతటి శ్రమనయినా భరించి చకచకా పనులు చేసేసుకుంటుండేవారు ఆడవారు.
ఇప్పుడు సహజమైన హాస్యం మృగ్యమైపోతోంది నానాటికి. అందరూ టి.వి.కి కళ్ళప్పజెప్పో, సెల్‌ఫోన్స్ పట్టుకుని రోబోల్లా పేలవమైన చూపులతో సోఫాలకి అతుక్కునో ఎవరికి వారు కూర్చుంటున్నారు. ఉన్న నలుగురిలో మాటలు లేవు. భావ వ్యక్తీకరణ గాని, ఏదయినా సంఘటన గురించి చెప్పుకోవడమో, నవ్వుకోవడమో మృగ్యమైపోయింది. గదికొకరు మంచాల మీద పడుకుని చెవులకి ఇయర్‌ఫోన్స్ తగిలించుకుని టాబ్‌లలోనో, సెల్‌ఫోన్‌లలోనో చూస్తూ కూర్చుంటున్నారు. ఒక్కోసారి వాళ్ళు ఉండి ఉండీ పకపకా నవ్వితే ఉలిక్కిపడుతుంటాం మనం.
ఏదయినా మంచి విషయమో, దేని గురించయినా ప్రక్కనే వున్నారు కదా అని షేర్ చేస్తే వాళ్ళనుండి ఉలుకూ పలుకూ వుండదు. కారణం చెవులకి తగిలించుకున్న ఇయర్‌ఫోన్స్! మనసు చివుక్కుమంటుంది. మళ్ళీ తిరిగి మనం కూడా ఏ ఫేస్‌బుక్‌నో ఆశ్రయించడం చేస్తూంటాం.
టి.వి. సీరియల్స్‌లో వచ్చే కృతకమైన హాస్యాన్ని భరించలేం. ముఖ్యంగా వాళ్ళ భయంకరమైన తయార్లు, ఆకారాలూ చూస్తే వణుకు పుడుతుంది. నిజానికి వాటిలో మనం ఏనాడూ ఊహించని వయొలెన్స్, మానవ స్త్రీ ఆకారాలలో తిరిగే పిశాచాలు, దెయ్యాలే వుంటాయి. ఇవి నిజానికి మన నర్వ్ సిస్టమ్ మీద పని చేసే త్వరలో మనల్ని రోగిస్టులని చెయ్యడం గ్యారంటీ.
హాస్యమంటే ఒకర్ని వెక్కిరించి హేళన చేయడమనుకుంటారు కొందరు. ఆ విధంగా నాలుకని చాలా పదునుగా వాడి ఇతరులని బాధపెట్టి వినోదిస్తారు.
మా చిన్నప్పుడు దూరపు బంధువుల్లో ఒకమ్మాయి వుండేది. తనకి ఇరవై రెండు సంవత్సరాలప్పుడు. ఇంకా పెళ్ళి కాలేదు. చాలా తెల్లగా పొడవుగా బాగానే వుండేది. సంబంధాలు చూస్తుండేవారు. కానీ… కట్నాల సమస్య వలన పెళ్ళి కుదరలేదట. ఆ అమ్మాయి వస్తుండగానే కొందరు ‘వస్తుంది ముదర బాల’ అనేవారు. మిగతావారు పకపకా నవ్వేవారు. పాపం ఆమె చిన్నబుచ్చుకుని ‘ఎందుకు నవ్వుతున్నారూ!’ అని అడిగేది అమాయకంగా. ‘ఏం లేదులే’ అని సర్ది చెప్పేవారు కొందరు. చిన్నవయసులో నాకది అర్థమయ్యేది కాదు గాని – తర్వాత తర్వాత ఆలోచిస్తుంటే అందులోని వ్యంగ్యం తెలిసి బాధకలిగేది.
నన్ను కూడా కొంతమంది ‘శారదేది… ఈ మధ్య కనబడటం లేదూ!’ అనేవారు, పక్కనే పెట్టుకుని.
నేను చిన్నదానినేమో, ‘ఇక్కడే వున్నా అత్తా’ అని అమాయకంగా జవాబు చెప్పేదాన్ని.
‘ఓహో! ఇక్కడే వున్నావా… మాట్లాడుతుండాలే. లేకపోతే తెలియడం లేదు’ అనేవారు. అంటే అంత నల్లగా వున్నానన్న మాట!
అదీ వెటకారం!
ఇది నిజంగా హాస్యమా!
ఒకరి మనసు నొప్పించి ఆనందపడడం శాడిజమే కదా!
నా చిన్నతనంలో అనపర్తి నుండి మా దూరపు బంధువులు రత్తమ్మ పెద్దమ్మ, అమ్మాణమ్మ మామ్మ అని యిద్దరు నెలకోసారి వస్తుండేవారు.
వారు వస్తుండటమే గచ్చు మిద గవ్వలు పోసినట్టుగా ఒకటే నవ్వుల గలగల!
అసలే నవ్వితేనే తప్పు అనే పెద్దల మధ్య హిట్లర్ పరిపాలనలో బిక్కుబిక్కుమంటూ మసిలే మాకు వాళ్ళు రావడం పెద్ద రిలీఫ్.
రత్నమ్మ పెద్దమ్మ పొట్టిగా బొద్దుగా వుండేది.
మెడనిండా పలకసరులు, చంద్రహారాలు, చేతులకి ఎనిమిది జతల బంగారు గాజుల మధ్య పచ్చవో, ఎర్రవో మట్టిగాజులు వేసుకుని, ఏ వెంకటగిరి జరీ చీరో, బొబ్బిలి చీరో కట్టుకుని పెద్ద కుంకుమ బొట్టుతో కళకళలాడుతూ నోరు చెవులకి ముడేసినట్లు గలగలా నవ్వుతూ కారు దిగేది.
ఆమె భర్త గారి పేరు అప్పారావు. టొబాకో కంపెనీలో వుద్యోగం. ఆయన పేరు పొందిన ఫుట్‌బాల్ ప్లేయరు.
ఇక అమ్మాణమ్మ మామ్మకి భర్త చిన్ననాడే పోయారట. ఆమె నాలుగు జతల బంగారు గాజులు, మెళ్ళో చంద్రహారం, వంటి నిండుగా కప్పుకున్న జరీ చీరతో, జుట్టు మెలి తిప్పిన ముడితో తయారయి వచ్చేది. పొడవుగా, సన్నగా వుండేదావిడ.
అన్నిటికన్నా మిన్నగా మిస్టరీగా వుండేదేమంటే వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో వాళ్ళకే తెలియదు.
అయినా వాళ్ళు రాగానే వాతావరణమంతా మారిపోయేది. ‘మబ్బులన్ని పోయినవీ – మధుమాసం వచ్చినదీ’ అన్నట్లుగా నవ్వులు వెల్లివిరిసేవి.
అందరూ వాళ్ళిద్దర్నీ చూసి ‘రమణారెడ్డి – రేలంగి’ వస్తున్నారనేవారు.
నవ్వులంటే పడని మా అమ్మ, దొడ్డమ్మలు… వాళ్ళనేమీ అనలేక ‘ఇప్పుడేనా రావడం?’ అంటూ పలకరించేవారు.
వాళ్ళా మాటకి కూడా పడీ పడీ నవ్వి. “ఏం రావడం ఎంకటరత్నం, పెద్ద కార్లో ఎల్లమన్నారు మీ తమ్ముడు. కాదూ కూడదని చిన్న కార్లో వచ్చేశాం” అనేవారు.
మొదట్లో ఈ పెద్ద కారు, చిన్నకారు అంటే అర్థమయ్యేది కాదు నాకు.
పెద్ద కారంటే బస్సు, చిన్నకారంటే కారన్న మాట.
“ఏం రైల్లో రాలేకపోయేరా! ఆయన కారు తీసుకోవడం దేనికి?” అనేది మా దొడ్డమ్మ. అందులో అంత అర్జెంటుగా రాకపోతేనేం – అనే అర్థముండేది. కారణం వాళ్ళు కాకినడ వచ్చేది సినిమాల కోసమేనని అందరికీ తెలుసు.
వాళ్ళా మాటని కూడా సీరియస్‌గా తీసుకునేవారు కాదు.
మళ్ళీ పడీ పడీ నవ్వి – ” ఆ బాగోతవూ అయ్యింది. ఒకసారి యిద్దరం పడీ పడీ ఎలాగొలా పాసింజర్ ఎక్కేవా… ఇదిగో ఈవిడ కాకినాడొచ్చేసిందని… సామల్లకోటలో దింపేసింది. ఇంకా నయం! తునెల్లి పోయేం కాదు” అంటూ మళ్ళీ నవ్వు.
ఆ తర్వాత “తొరగా అన్నం పెట్టేయ్ ఎంకటరత్నం. మేట్నీకి ఎల్లిపోతాం” అని అడిగి మరీ తినేసి సినిమాకి పరిగెత్తేవాళ్ళు.
తిరిగి రావడం రాత్రి పదికే. రావడం రావడం మళ్ళీ నవ్వులే.
ఇక యిద్దరూ తిన్నగా వుండక రాత్రి ఆ కథలు చెప్పేవాళ్ళు.
“ఆ ఎన్టీవోడు సాయిత్రిని ప్రేమించి ఎందుకు పెళ్ళి చేసుకోలేదంటావ్” అని అంటే
“ఛ! ఊరుకోవే… అందులో సావిత్రి ఎక్కడుంది. అంజలీ దేవి కదా!” అనేది అమ్మాణమ్మ.
“మరి జమున కూడా వుంది కదా!” రత్తమ్మ పెద్దమ్మ ప్రశ్న.
“జమునున్నది నాగేశ్వరరావు సినిమాలో” అమ్మాణమ్మ జవాబు.
వాళ్ళ ఫార్సు చూసి అందరూ పడీ పడీ నవ్వేవారు.
రాత్రంతా ఒక్కచోటే పడుకుని వాళ్ళు కథని ఎటూ తేల్చుకోలేక కీచులాడుకుంటుంటే అందరికీ నవ్వులే.
అంత మాత్రానా వాళ్ళేం బాధ పడేవారు కాదు.
మర్నాడు మార్నింగ్ షో తో సహా మూడు సినిమాలు చూసి అక్కడే పెట్టిన ఎగ్జిబిషన్‌లో ఏవేవో కొనుక్కుని వచ్చేవారు.
“ఆ జమున మొహం మరీ పొడుగ్గా వుంది. ఏవీ బాగా లేదు ఎంకటరత్నం!” అని అమ్మాణమ్మ అంటే, “వూరుకుందూ! బెంచీ కెల్తే అలాగే వుంటది” అనేది రత్తమ్మ పెద్దమ్మ.
“ఏంటీ, బెంచీ కెళ్ళేరా?” అని మా దొడ్డమ్మ కళ్ళురిమితే, “మేం ఎల్లేటప్పటికి రిజర్వుడు కుర్చీలు అయిపోయాయి – మల్లీ ఏ వొస్తామని ఎల్లిపోయాం” అనేవారు యిద్దరూ మళ్ళీ నవ్వుతూ.
“ఉండు, అప్పారావుకి చెప్పి మిమ్మల్ని కాకినాడ రాకుండా చేస్తాను” అనేది దొడ్డమ్మ సీరియస్‌గా.
వాళ్ళు కొంగడ్డం పెట్టుకుని నవ్వు దాచుకుంటూ “అవునూ ఎంకటరత్నం! ఈ గిన్నెలు కొన్నావక్కడ. ఈట్లో ఏవేసుకోవాలంటావ్?” అనడిగేవారు అమాయకంగా, వాళ్ళు ఎగ్జిబిషన్ నుండి తెచ్చిన గిన్నెల్ని చూపిస్తూ.
బదులుగా మా దొడ్డమ్మకి కూడా నవ్వొచ్చేది.
వాళ్ళున్నంత సేపూ అణువణువునా అడుగడుగూ నవ్వులే!