కాజాల్లాంటి బాజాలు-14: పాఆఆపం

    5
    5

    [box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

    [dropcap]మా[/dropcap] పద్మంపిన్నిఅంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పట్నించీ నా తరఫున మా అమ్మతో పోట్లాడి, నాక్కావల్సినవి కొనిపించేది. అలాంటి పద్మంపిన్ని ఏం మాట్లాడాలన్నా ఊతపదాన్ని కలపకుండా మాట్లాడడం నేనెప్పుడూ వినలేదు. ఆవిడ ఊతపదం.. “పాఆఆపం..” చెప్పాల్సిన విషయం చెప్పేసాక చివర్న “పాఆఆపం” అనే ఆ ఊతపదం ఎంత సాగదీస్తూ చెపుతుందంటే కాసేపటికి మనం కూడా అలా అనే పరిస్థితికి వచ్చేస్తావన్న మాట.

    “ఆ భద్రయ్య ఎంత మంచివాడో… పాపం” అంటుంది. మంచితనం పాపమెందుకయిందో అర్ధమయ్యేదికాదు.

    “ఈ చీర బాగుందే.. పాపం, వాళ్ళిల్లెంత దగ్గరో… పాపం, ఈ పాలకోవా ఎంతబాగుందో… పాపం” అంటుంటే కొన్నాళ్లకి మేం ఇంక ఆ ఊతపదాన్ని తీసేసి ఆవిడన్నదాన్ని మటుకు పట్టించుకునేవాళ్లం.

    అలాంటి పద్మంపిన్ని ఈ మధ్య మా చుట్టాలింట్లో పెళ్ళికి వెళ్ళొచ్చింది. ఆ పెళ్ళికి వెళ్ళడం నాకు కుదరలేదు. అందుకే మొన్నామధ్య పనిగట్టుకుని పద్మంపిన్ని దగ్గరికి పెళ్ళికబుర్లు వినడానికి వెళ్ళేను. నన్ను చూసి తెగ సంబరపడిపోయి, పెళ్ళివారిచ్చిన అరిసెలు, మినపసున్ని ప్లేట్లో పెట్టి, నేను తింటుంటే నా పక్కనే కూర్చుని పెళ్ళి విశేషాలు చెప్పడం మొదలుపెట్టింది పద్మంపిన్ని.

    “పెళ్ళి ఎంత బాగా చేసారనుకున్నావ్ సత్యంవాళ్ళూనూ, చూడ్డానికి రెండుకళ్ళూ చాల్లేదనుకో… పాపం. అదెంత పెద్దహాలో.. అంతా యేసీ యేట. చలికాలం వచ్చేసిందా.. అయినా యేసీలు వేసేసేరు, బోల్డు డబ్బులు కట్టార్ట మరి… పాపం.

    ఇంక ఆ పెళ్ళిమండపం ఉంది చూడూ అన్నీ తాజాపూలతోరణాలే, బెంగుళూరునుంచి ఫ్లైట్ లో తెప్పించేర్ట.. పాపం.

    అదేవిటే పిల్లా, స్నాతకంలో ఆ పెళ్ళికొడుకుని వాడి స్నేహితులందరూ ఎత్తేసుకుని ఆ బైట మైదానమంతా తిప్పేసేరూ.. ఇప్పుడందరూ అలా చేస్తున్నార్ట… పాపం.

    పెళ్ళికూతురి పెళ్ళిచీరుంది చూసేవూ, బంగారంతో నేయించినట్టుందనుకో, యాభైవేలైందిట మరి… పాపం.

    ఇంక ఒంటిమీద బంగారవంటావా.. పాపిడిబిళ్ళ, నాగరం దగ్గర్నుంచి కాలిపట్టీల వరకూ అన్నీ బంగారవేట… పాపం.

    అక్కడికీ సీతాలు నాతో అననే అంది, “కాళ్లకి కూడా బంగారం పట్టీలు చేయించేరూ, మనం కాళ్ళకి బంగారం పెట్టుకోంకదా వదినా.. అది లక్షిందేవిని అవమానించినట్టేకదా..” ఆవటాని. అయినా వాళ్లకదో లెఖ్ఖా పత్రవా… పాపం.

    మగపెళ్ళివారు మహా గట్టివారేనేవ్. విడిదిలో దిగగానే షర్బతులు ఇవ్వలేదని మహా గింజుకున్నారు, అయినా ఇంత వైభోగంగా కూతురి పెళ్ళి చేస్తున్న సత్యానికి ఆ షర్బతులొక లెక్కా.. క్షణాల్లో తెప్పించి వాళ్ల మొహాన కొట్టేడు… పాపం.

    అన్నట్టు ఆడపడుచు అలిగిందేవ్. లక్షరూపాయిలు ఆడపడుచు లాంఛనాలుచ్చుకుందిట. అయినా మళ్ళీ పెళ్ళిలో భోయనానికి రాకుండా పిడతమొహం పెట్టుకుని, బిగుసుకుని కూర్చుంది. ఎంతమందెళ్ళి బతిమాలారనుకున్నావ్. ఊహూ. కదలదూ, ఏం కావాలో చెప్పదూ. ఆఖరికి సత్యం పెళ్ళాం వెళ్ళి ఒక నవరసు ఆవిడ మొహాన్నద్దితే అప్పుడు ఒచ్చింది భోయనానికి… పాపం.

     పెళ్ళికొడుకు మేనమావట.. దుబ్బుమీసాలూ వాడూనూ.. వచ్చేప్పుడు వాళ్ల పెట్టెలు పెళ్ళివారి బస్సులో పెట్టుకోడం మర్చిపోయేర్ట. వచ్చిందగ్గర్నుంచీ అందర్నీ”మీ సబ్బిస్తారా ఓసారీ, మీ తువ్వాలిస్తారా ఓసారీ, అంటూ ఆయనా, మీ బొట్టుబిళ్ళలు ఇటో నాలుగు పడేయ్యండి వదినగారూ, ఈ చీరేదో నాకు నప్పేలాగే ఉంది” అంటూ ఆయన పెళ్ళాం ఎదుటివాళ్ల సామాన్లమీద పడ్డారనుకో… పాపం.

    అన్నట్టు ఆ పెళ్ళికొడుకు బాబాయి కొడుకున్నాట్టేవ్ పెళ్ళికి. మంచి పెళ్ళికొడుకేట. మనవాళ్ళలో అమ్మాయి లెవరైనా ఉంటే చెప్పమన్నారు…పాపం.

    సారెకి సత్యం లడ్డూలు చేయించేడూ, తిరపతిలడ్డూలంతున్నాయే ఒక్కొక్కటీనూ…పాపం. అరిసెలు మటుకు అలా నేతిలో ముంచితీసినట్టున్నాయనుకో ఘుమఘుమలాడిపోతూ…పాపం.

    పానకంబిందెలు వెండిబిందెలిచ్చేరే.. కాస్త పెద్ద సైజువే..పూచ్చేసుకునేప్పుడు కలశంలా పెట్టుకుందుకు పనికొస్తాయి…పాపం.

    పెళ్ళికూతురికి డైమండ్ నెక్లేస్ పెట్టేరేవ్ అత్తారు, ఎంత బాగుందో…పాపం..”

    ఇలా ఈ పెళ్ళివిశేషాలన్నీ “పాఆఆపం” టాగ్ లైన్ తో విన్న నాకు కూతురిపెళ్ళి చేసి మా సత్యం బాబాయ్, పెళ్ళి చేసుకుని మా సంధ్య ఎంత పాఆఆపం చేసేరో అనిపించింది ఒక్క క్షణం.

    అలాంటి పద్మంపిన్ని గురించి అంత బాగా తెలిసిన నేను అదంతా మర్చిపోయి ఇవాళ నాకు కలిగిన సంతోషాన్నిపద్మంపిన్నితో పంచుకోడానికి ఫోన్ చేసేను. పిన్నే ఎత్తింది..

    “హలో పిన్నీ, మా అబ్బాయికి పెళ్ళి కుదిరింది. రేపు మాఘమాసంలోనే ముహూర్తాలు పెట్టుకున్నాం. నీకే ముందు చెపున్నాను. ఎక్కడికీ ప్రయాణం పెట్టుకోకేం..” అన్నాను ఆనందం నా గొంతులో వినిపించేట్టు.

    వెంటనే పద్మంపిన్ని “అలాగా, మీవాడికి పెళ్ళి కుదిరిందే… పాఆఆపం” అంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here