[box type=’note’ fontsize=’16’] “అమ్మంటే పసిగుండెకు కొండంత అండనిచ్చే ఆసరా” అంటున్నారు డా. భీంపల్లి శ్రీకాంత్ ఈ కవితలో. [/box]
[dropcap]అ[/dropcap]నుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూనే
మనకోసం నిరంతరం తపిస్తూనే ఉంటుంది
అమ్మంటే ఎప్పటికీ ప్రేమను పంచే దయామయి
తియ్యనైన గోరుముద్దలు ముద్దుగా తినిపిస్తూనే
ఆప్యాయతను రంగరించి ప్రేమను పంచుతుంది
అమ్మంటే ఆకాశమంతటి కరుణాంతసముద్రం
తడబడుతూ తప్పటడుగులు వేస్తున్నప్పుడల్లా
చిటికెనవేలుతో భవిష్యత్తుకు మార్గాన్ని చూపిస్తుంది
అమ్మంటే పసిగుండెకు కొండంత అండనిచ్చే ఆసరా
నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచుతూనే
మాతృప్రేమ మాధుర్యాన్ని పంచుతుంటుంది
అమ్మంటే అంతులేని ప్రేమనిచ్చే అనురాగదేవత
నిరంతరం బిడ్డల ఆలనాపాలనా చూసుకుంటూనే
అమృతంలాంటి ప్రేమను మురిపెంగా అందిస్తుంది
అమ్మంటే ఎప్పటికీ తీర్చుకోలేని రుణానుబంధం.