[box type=’note’ fontsize=’16’] సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. [/box]
[dropcap]ప్రా[/dropcap]జ్ఞస్తు లభతే జ్ఞానం
న జడో గురు బంధనాత్ ।
ముకురే దృశ్యతే బింబం
న కదాపి మృదాం చేయే ॥
ఆటవెలది
గురుని బోధ లన్ని పరమసంతోషాన
ప్రాజ్ఞు డెపుడు పదిల పరచు కొనును
జడుల కెపుడు నద్ది సాధ్యమ్ము గాదయా !
అరసి చూడ గాను అవని యందు
అద్ద మందు గాంచు అసలైన బింబమ్ము
మురిసి చూడ మట్టి ముద్ద యందు
గాంచ గలమె మహిని క్షణకాలమైనను
తెలుసు కొనుము ఇద్ది తేట గాను ౪౬
***
ఆలానే గృహ్యతే హస్తీ
వాజీ వల్లాసు గృహ్యతే ।
సద్వాక్యే గృహ్యతే విద్వాన్
దుష్టో విత్తేషు గృహ్యతే ॥
తేటగీతి
కట్టు కొయ్యకు కట్టిన గజము లొంగు
కనగ గుఱ్ఱమ్ము లొంగును కళ్ళె మేయ
పసిడి పలుకుల లొంగును పండితుండు
లబ్ధి జూపిన లొంగును లుబ్దు డెపుడు ౪౭
***
మాతా పితృభ్యాం జామాత్రా
భ్రాత్రా పుత్రేణ భార్యయా ।
దుహిత్రా దాసవర్ణేణ
వివాదం న సమాచరేత్ ॥
తేటగీతి
అమ్మ నాన్నల తోడను ఆలి తోడ
అన్న దమ్ముల తోడను అల్లు తోడ
కొడుకు తోడను కూరిమి కూతు తోడ
తనదు పనివారి తోడను మనుజు లెపుడు
తగవు లాడంగ తగదయ్య తగదు తగదు ౪౮
***
సుహృదాం హితకామానాం
యః శృణోతి న భాషితమ్ ।
విపత్ సన్నిహితా తస్య
స నరః శత్రునందనః ॥
ఆటవెలది
హితులు జెప్పు మహిత హితవాక్కుల నెపుడు
తలను దాల్చ కుండ ధరణి జనులు
కోరి తెచ్చు కొంద్రు కోటి కష్టాలను
అరుల మురియ జేయ అనవరతము ౪౯
***
దురాశా దుర్దశాచేతి
ద్వేభార్యే మే పతివ్రతే।
దురాశా పురతోయాతి
దుర్దశా మాం న ముఞ్చతి ॥
ఆటవెలది
నడచు నొకతె ముందు నడచు నొకతె వెంట
భార్య లిరువు రయ్య పరగ నాకు
విడువ లేను నేను పెద్ద భార్య నెపుడు
వదల బోదు చిన్న భార్య నన్ను
ఎలమి తోడ వలచి ఎద జేరి నిలచు
దొడ్డ భార్య పేరు చెడ్డ ఆశ
విడువ కెపుడు వెన్నంటి యున్నట్టి
చిన్న భార్య పేరు చెడ్డ దశర ౫౦