[box type=’note’ fontsize=’16’] టీ తాగడడమంటే కేవలం తేయాకు, నీళ్ళు, పాలు, చక్కెర వేసి మరిగించిన ద్రావకం తాగడం కాదు, టీ తాగడమంటే మనసు విప్పి మాట్లాడుకోడం, కష్టసుఖాలు పంచుకోడం అని చెబుతున్న రచన. [/box]
పెను నిద్దుర వదిలించేది, బద్దకాన్ని దూరం చేసేది, ఉత్సాహమిచ్చేది టీ. మన దేశంలో టీ అంటే పొగలు కక్కే ఓ కప్పుడు వేడి ద్రావకం మాత్రమే కాదు, దేశపు జీవన లయలో ఒక అంతర్భాగం. దేశంలోని ఏ ఊర్లో అయినా అందరి కంటే ముందుగా మేల్కొని ఆ రోజుకి జనాలని సన్నద్ధం చేసేవి రోడ్ సైడ్ టీ కొట్లే. గరీబులైనా, అమీరులైనా పొద్దున్న లేవగానే ఓ కప్పు టీ నోట్లో పడకపోతే… తోచదు చాలామందికి. ఉదయాన్నే ఓ కప్పుడు చాయ్ కడుపులో పడితే ఉత్సాహమే ఉత్సాహం.
అద్రక్ చాయ్, ఇరానీ చాయ్, లెమన్ చాయ్, మలాయ్ చాయ్, పుదీనా చాయ్, గ్రీన్ టీ, పర్పుల్ టీ, బ్లాక్ టీ రెడ్ టీ, వైట్ టీ, యల్లో టీ… ఇలా పలు పేర్లతో వివిధ దేశాలలో వర్ధిల్లుతున్న తేనీరు… ఆధునిక జీవనంలో ప్రముఖమైనది. బంగ్లా, మణిపురిలలో ‘చా’ అన్నా, తెలుగులో ‘తేనీరు’ అన్నా, తమిళంలో ‘తేనీర్’ అన్నా, కన్నడంలో ‘చహా’ అన్నా, మలయాళంలో ‘చాయ’ అన్నా, మరాఠీలో ‘చహా’ అన్నా కళ్ళ ముందు మెదిలేది ఘుమఘుమలాడే టీ.
ప్రపంచంలో అత్యధికంగా టీ పండించే రెండో దేశం మనదే. మనదేశంలో అస్సాంలో ఎక్కువగా పండుతుంది. డార్జిలింగ్ టీ, నీలగిరి టీ చాలా ప్రసిద్ధమైనవి. అసలు టీ మన జాతీయ పానీయం!
‘సబ్ ఏక్ సాథ్ బైఠ్‌కర్ గరమ్ గరమ్ చాయ్ పీయెంగే, నరమ్ నరమ్ బాత్ కరేంగే‘ అంటాడు రాజేష్ ఖన్నా ‘బావర్చీ’ (1972) సినిమాలో. కుటుంబంలో అందరూ కలిసి కూర్చుని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే రోజు ఎంత అందంగా ప్రారంభవుతుంది కదా!
ఇంట్లో టీ తాగి ఆఫీసుకొచ్చినా, కాసేపటికే క్యాంటీన్‌కో లేదా ఆఫీసు పక్కనే ఉండే కొట్టుకో వెళ్ళి టీ తాగకపోతే చాలామంది ఉద్యోగులకు తోచదు. మిత్రులని కలిసేది కూడా చాయ్ అడ్డాల దగ్గిరే. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కట్లు… దోస్తులు… ప్రపంచం ఒక్కసారిగా మారిపోతుంది.
“జీవితం టీ చేయడం లాంటిదే! అహాన్ని మరిగించాలి, బెంగల్ని ఆవిరిచేయాలి, దిగులును పలచన చేయాలి, పొరపాట్లను వడపోయాలి… అప్పుడే సంతోషపు రుచి దొరుకుతుంది…” టీ గురించి నాకిష్టమైన ఓ కొటేషన్ ఇది!
ఎవరైనా అతిథులను భోజనానికి పిలిస్తే, వాళ్ళు రాలేమంటే కనీసం ‘టీ’కి రండి అని ఆహ్వానిస్తాం. టీకి అంత విలువుంది మన జీవితాలలో.
పనికి టీ, హస్కుకి టీ, విరామంలో టీ… టీ తో విశ్రాంతి… ఇంటి పనికి టీ, లేట్ నైట్ చదవాలంటే టీ… చలికి టీ… వెన్నెల్లో టీ… సన్నిహితులతో టీ… అపరిచితులతో టీ…
మేం నిమ్మకూరు ఎపిఆర్‌జెసిలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఉండి, రాత్రి పూట ఎక్కువ సేపు చదువుకోడానికి, నిద్ర రాకుండా ఉండడానికి రాత్రి పూట ప్రత్యేకంగా టీ ఇచ్చేవారు. చదువు మాట పక్కనబెట్టి, టీ తాగి కబుర్లు చెప్పుకునేవారం చాలామంది మిత్రులం!
“Thank God for Tea! I am glad that I was not born before Tea.” అంటాడు ఆంగ్ల రచయిత సిడ్నీ స్మిత్. “A cup of tea would restore my normality” అని అంటాడు మరో రచయిత డగ్లస్ ఆడమ్స్. “A cup of tea makes everything better.” అనే మాటలు ఎంతైనా నిజం!
టీ గురించి మరికొందరి అభిప్రాయాలు:
“Where there’s tea there’s hope.” – Arthur Wing Pinero.
“Tea is the elixir of life.” – Lao Tzu
“There is something in the nature of tea that leads us into a world of quite contemplation of life.” – Lin Yautang
“If you are cold, tea will warm you; if you are too heated, it will cool you; if you are depressed, it will cheer you; if you are excited, it will calm you.” – Willam Gladstone
“Each cup of tea represents an imaginary voyage.” – Catherine Douzel
ఇవన్నీ కాదనలేని/త్రోసిపుచ్చలేని అభిప్రాయాలు కదూ!
***
‘శ్రీ420’ (1955) సినిమాలో రాజ్‌కపూర్, నర్గీస్ పాత్రల మధ్య ఒకరంటే ఒకరి అభిమానం పెరిగే క్రమంలో – రాజ్‌కపూర్ ఒకరోజు నర్గీస్‌ని చాయ్ తాగుదామా అని అడిగి, ఎక్కడికి వెళ్దాం, తాజ్‌కి వెళదామా అని, ఇంకో ఏదో పెద్ద హోటల్ పేరు చెప్పి… వద్దులెండి బాగా అలసిపోయాను, ఫుట్‌పాత్ రెస్టారెంట్‌లో తాగేద్దాం అంటాడు. రోడ్ సైడ్ టీకొట్టులో చాయ్ తాగుదామని వచ్చి, తన దగ్గర డబ్బుల్లేకపోవడంతో “మీ దగ్గర రెండణాల చిల్లరు ఉందా, నా దగ్గర వంద రూపాయల నోటు వుంది, ఇతని దగ్గర వంద రూపాయలకి చిల్లర ఉండదు” అంటూ టీ డబ్బులు నర్గీస్ చేతే ఇప్పిస్తాడు. ఈ రకంగా వాళ్ళ ప్రేమకు చాయ్ కారణమవుతుంది. తర్వాత వచ్చే ఆల్‌టైం హిట్ సాంగ్ – “ప్యార్ హువా ఇక్‌రార్ హువా” వీక్షకులని ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో చాయ్ ప్రేమ పుట్టిస్తే, ‘కాలాపత్థర్’ (1979) సినిమాలో అమితాబ్‌కీ, శత్రుఘ్నసిన్హాకి మధ్య వాగ్వివాదానికి దారి తీస్తుంది. ఓ హోటల్‌లోకి ముందు వచ్చి, ఓనర్‌ని ముందుగా శత్రుఘ్న సిన్హా పిలిస్తే, వెనుక వచ్చిన అమితాబ్ బచ్చన్ ఓనర్‌ని పిలిచి చాయ్ తెమ్మంటాడు. అతను చాయ్ అందించబోతుంటే – “ముందు ఎవరు వచ్చారు, ముందు నిన్నెవరు పిలిచారు?” అంటూ గొడవేసుకుంటాడు శత్రుఘ్నసిన్హా. “నేను ముందు ఆర్డర్ చేశాను, టీ నా టేబుల్ మీదకే ముందు రావాలి” అంటాడు అమితాబ్. గొడవ ముదురుతుండగా అక్కడికి వచ్చిన శశికపూర్ తెలివిగా వ్యవహరించడంతో అక్కడికి తాత్కాలికంగా ఘర్షణ నిలుస్తుంది. ఈ సన్నివేశంలోని డైలాగులు అప్పటి తరాన్ని ఓ ఊపు ఊపాయంటారు.
ఇక శివ (1989) సినిమాలో క్యాంటీన్ సన్నివేశం, బాటనీ పాఠముంది పాట అందరికీ తెలిసినదే. ఈ పాటకి లీడ్‌గా వచ్చే సన్నివేశంలో అమల నాగార్జునని ‘చాయ్ పిలాతే’ అని ఎంతో చిలిపిగా అడుగుతుంది. ఈ మూడు సినిమాలలోని ఈ సన్నివేశాలు మూడు తరాల ప్రేక్షకులని కట్టిపడేశాయి. అన్నిట్లోనూ టీ ఉమ్మడి అంశం.
మృగరాజు (2001) సినిమాలో చంద్రబోస్ ‘చాయ్’ గురించి రాసిన పాట చిరంజీవి స్వరంలో ఎందరినీ ఆకట్టుకుంది. “ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్” అనే ఆ పాట టీ గొప్పదనాన్ని చాటుతుంది.
‘భలే భలే మగాడివోయ్’ (2015) సినిమాలో “ఒక అరలీటరు పాలు తీసుకుని బాగా మరగబెట్టి…” అంటూ మాంఛి టీ ఎలా పెట్టాలో నాని వివరించే సీన్ చూస్తుంటే… ఆ క్షణంలో వెళ్ళి మసాలా టీ తాగాలనిపిస్తుంది.
***
ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్ లోనూ, వాట్సప్ లోనూ టీ గురించి ఒక హిందీ కవిత బాగా వైరల్ అయ్యింది. “చాయ్ పీయేంగే?” అన్న శీర్షికతో ఉన్న ఆ కవిత వ్రాసిన కవి ఎవరో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను. కానీ వారి వివరాలు తెలియలేదు. ఇటీవలి కాలంలో హిందీలో ఇంతగా ఆకట్టుకున్న కవిత చదవలేదు నేను. మూల రచయిత ఎవరో తెలియదు కాబట్టి, ఆ అజ్ఞాతకవికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ కవితకి స్వేచ్ఛానువాదం చేశాను.
టీ తాగడడమంటే కేవలం తేయాకు, నీళ్ళు, పాలు, చక్కెర వేసి మరిగించిన ద్రావకం తాగడం కాదు, టీ తాగడమంటే మనసు విప్పి మాట్లాడుకోడం, కష్టసుఖాలు పంచుకోడం అంటాడా కవి. అపరిచితులే రెండు కప్పుల టీ తాగి ఎన్నో మాటలు మాట్లాడుకుంటే, అయినవాళ్ళు, కావల్సినవాళ్ళ మధ్య కబుర్లే ఉండవా? టీ ఒక మిష… మాటలు ప్రవాహమై పొంగాలి! ఆ హిందీ కవితకి నా అనువాదం ఇది:
టీ తాగుతారా?
‘టీ తాగుతారా?’ అని ఎవరైనా అడిగితే
వాళ్ళు మిమ్మల్ని – పాలు, చక్కెర
టీ పొడి వేసి మరిగించి పెట్టిన ఒక
కప్పు టీ తాగుతారా అని మాత్రమే అడిగినట్లు కాదు.
వాళ్ళు అడుగుతున్నారు –
చక్కెర లాంటి మధుర స్మృతులను,
తేయాకు లాంటి చేదు జ్ఞాపకాలను,
విషాదపు విషయాలను
పంచుకుంటారా? – అని.
వాళ్ళు అడుగుతున్నారు –
మీరు నాతో మీ
అనుభవాలు కొన్ని, మీ ఆశలు కొన్ని
మీ కొత్త తలంపులు కొన్నింటిని పంచుకుంటారా – అని.
ఆ ఒక కప్పు టీ తో వాళ్ళు –
తమ జీవితంలోని ఆ క్షణాలను మీతో…
ఇప్పటిదాకా ఎవరికీ చెప్పనివి…
ఇప్పటిదాకా ఎవరూ వినని కథలను..
మీతో పంచుకోవాలనుకుంటున్నారేమో…
మీతో చెప్పాలనుకుంటారు వాళ్ళు…
తమ సొంతవాళ్ళతో
చెప్పుకోలేని
మొత్తం సంగతులను…
ఒక కప్పు టీ తో
వాళ్ళు తమ చెదిరిన,
ముగిసిన కలలని
మరోసారి స్వప్నించాలనుకుంటారు.
వాళ్ళా వేడి టీ కప్పులోంచి
లేచే ఆవిరితో… కొన్ని క్షణాల పాటు
తమ అన్ని బెంగలనీ
ఊదేయాలనుకుంటారు…
తాము దక్కించుకోలేకపోయిన
తొలిచూపు ప్రేమని, ప్రేమ
చేసిన గాఢమైన బాసలని
మీ సమక్షంలో వ్యక్తీకరించాలనుకుంటారు.
ఒక్కోసారి వాళ్ళు దేశపు
రాజకీయాలపై మీతో
మాట్లాడాలనుకుంటారు.
మతం, మందిరాల
స్థితిగతులు మీకు
చెప్పాలనుకుంటారు…
ఈ రెండు కప్పుల టీ తో
ఇద్దరు అపరిచితులు
విన్నంత… కన్నంతగా
ఇన్ని మాటలు చెప్పుకుంటే…
కావలసినవాళ్ళ మధ్య
మాటలే ఉండవా?
అందుకే, ఇకపై ఎవరైనా
మిమ్మల్ని
‘టీ తాగుతారా?’
అని అడిగితే…
‘సరే’ అనండి. వాళ్ళతో
చక్కెర లాంటి మీ మధుర స్మృతులనూ
తేయాకులాంటి చేదు జ్ఞాపకాలను…
పంచుకోండి!
హిందీ మూలం:
*चाय_पियेंगे*?
जब कोई पूछता है “चाय पियेंगे..?”
तो बस नहीं पूछता वो तुमसे
दूध ,चीनी और चायपत्ती
को उबालकर बनी हुई एक कप चाय के लिए।
वो पूछता है …
क्या आप बांटना चाहेंगे
कुछ चीनी सी मीठी यादें
कुछ चायपत्ती सी कड़वी
दुःख भरी बातें..?
वो पूछता है..
क्या आप चाहेंगे
बाँटना मुझसे अपने कुछ
अनुभव ,मुझसे कुछ आशाएं
कुछ नयी उम्मीदें..?
उस एक प्याली चाय के
साथ वो बाँटना चाहता हैं..
अपनी जिंदगी के वो पल
तुमसे ..जो “अनकही” है अब तक
वो दास्ताँ ..जो “अनसुनी” है अब तक…..
वो कहना चाहता है ..
तुमसे ..तमाम किस्से
जो सुना नहीं पाया अपनों
को कभी ..
एक प्याली चाय
के साथ को अपने उन टूटे
और खत्म हुए ख्वाबों को
एक और बार जी लेना
चाहता है।
वो उस गर्म चाय
के प्याली के साथ उठते हुए धुओँ के साथ
कुछ पल को अपनी
सारी फ़िक्र उड़ा देना चाहता है।
वो कर लेना चाहता है
अपने उस एक नजर वाले हुए
प्यार का इजहार,
तो कभी उस शिद्दत से की
गयी मोहब्बत का इकरार..
कभी वो देश की
राजनीतिक स्थिति से
अवगत कराना चाहता है
तुम्हें..
तो कभी बताना चाहता है
धर्म और मंदिरों के
हाल चाल..
इस दो कप चाय के
साथ शायद इतनी बातें
दो अजनबी कर लेते हैं
जितनी कहा सुनी तो
अपनों के बीच भी नहीं हो पाती।
तो बस जब पुछे कोई
अगली बार तुमसे
“चाय पियेंगे..?”
तो हाँ कहकर बाँट लेना उसके साथ
अपनी चीनी सी मीठी यादें
और चायपत्ती सी कड़वी दुख भरी बातें..!!
స్ఫూర్తిదాయక టీ-విక్రేత:
టీ ఓ మనిషికి ఎంత స్ఫూర్తినిచ్చిందో, తన కలలనెలా సాకారం చేయించిందో తెలిస్తే… ఆ మనిషిపై గౌరవం కలుగుతుంది.
ఫిల్మ్‌పేర్ 2018 అవార్డులలో నాన్-పిక్షన్ విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘ఇన్విజిబుల్ వింగ్స్’ అనే డాక్యుమెంటరీ ఓ టీ విక్రేత కథ. కేరళలోని కొచ్చిన్‌లో ఓ చిన్న టీకొట్టు యజమాని కె.ఆర్.విజయన్, తన భార్య మోహనతో కలిసి తన టీకొట్టుతో వచ్చిన ఆదాయంతో ప్రపంచమంతా తిరిగారు. ఈ సామాన్యుల అసాధారణ కథని హరిమోహన్ లఘుచిత్రంగా రూపొందించారు. టీ జీవితాన్ని మలుపు తిప్పుతుందని చెప్పేందుకు విజయన్ జీవితమే ఓ నిదర్శనం. టీ తయారు చేయడం, అమ్మడం ఆయన జీవనోపాధే కావచ్చు; కానీ జీవితానికి భరోసా ఇచ్చి తాను కన్న కలలను సాకారం చేసుకోడంలో తోడ్పడిందనడంలో సందేహం లేదు. ఈ డాక్యుమెంటరీని యూట్యూబ్‌లో చూడవచ్చు.
చాయ్‌కి ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది?
‘టీ’యని పలకరింపులు కొనసాగిద్దాం! ఏక్ కప్ చాయ్ హో జాయ్?☕