[box type=’note’ fontsize=’16’] అబ్బాయిలా పుట్టినా తనని తాము అమ్మాయిగా భావించుకునే ట్రాన్స్‌జెండర్ మనోవేదనకి అద్దం పట్టిన కథ స్పందన అయాచితం వ్రాసిన “ప్రియమైన సోదర సోదరీమణులు మరియు…”. [/box]
[dropcap]అ[/dropcap]ప్పుడు నాకు పదకొండేళ్ళు. నాన్న, అమ్మ, నేను అప్పుడే ఆసుపత్రి నుంచి వచ్చాం. అప్పటికే నానమ్మ, తాతయ్య బోరున ఏడుస్తున్నారు. వస్తూనే నాన్న కూడా తల కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అమ్మ గది మూలలో కూర్చుని, ముఖం ఒళ్ళో దాచుకొని ఏడుస్తోంది.
ఏం జరిగిందో తెలియదు. కానీ నాకు జరగరానిదేదో జరిగిందని అర్థం అయ్యింది. ఆసుపత్రిలో నాన్న డాక్టరు కాళ్ళు పట్టుకున్నాడు- ఏదైనా చెయ్యమని.
డాక్టరు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు – ‘అబ్బాయిది ఇంకా చిన్న వయసు. ఇప్పుడు ఆపరేషన్ కుదరదు. పద్దెనిమిది లేదా ఇరవై ఏళ్ళు వస్తే, అబ్బాయి శరీరం తట్టుకోగలదు. అప్పటి వరకు ట్రీట్‌మెంట్ చేద్దాం.’ అని చెపుతున్నాడు.
నాకు ఆపరేషన్ అన్నా, ట్రీట్‌మెంట్ అన్నా అంత భయం అనిపించలేదు. కానీ ఒక్క విషయంలో చాలా భయం వేసింది. మాటిమాటికి అంతా నన్ను ‘అబ్బాయి … అబ్బాయి…’ అంటుంటే ఏదో తెలియని భయం.
“వీళ్ళు నన్ను గుర్తు పట్టటం లేదా? లేక నేనే తప్పుగా అనుకుంటున్నానా? లేక వీళ్ళు కావాలని చేస్తున్నారా? ఆ సంగతి అమ్మని అడిగితే ఏడుస్తుంది. నాన్నని అడిగితే కొడతాడు… ఎందుకని? నా వయసుకి అర్థంకాని నా ప్రశ్న.. నా భయం….!”
నాకు తెలిసింది, నన్ను నేను అర్థం చేసుకుంది- “నేను అమ్మాయిని కదా?”
***
మాది మరీ డబ్బున్న కుటుంబం కాదు, అలాగని మధ్య తరగతి కుటుంబం కూడా కాదు. అవసరాలకీ, ఆనందాలకీ సరిపోయేంత డబ్బున్న కుటుంబం. ఉన్నంతలో మంచి పేరు ప్రఖ్యాతులున్న కుటుంబం. మా నాన్న లాయర్. మా అమ్మ టీచర్. నాకు ముగ్గురు అక్కలు. మా అమ్మానాన్నలకు ముగ్గురు అమ్మాయిలు, అయితే మగపిల్లవాడు కావల్సిందే అని పట్టుబడితే తప్పనిసరై నాలుగో సంతానంగా నన్ను కన్నది మా అమ్మ.
కొడుకు ఉండాల్సిందే అనే సమాజపు విలువల బలవంతం మీద నా పుట్టుక జరిగింది. కేవలం నా పుట్టుకే కాదు, నా అస్తిత్వం కూడా సమాజపు విలువల బలవంతం మీదే ఆధారపడి ఉంది.
ఈ భూమ్మీద కేవలం స్త్రీ పురుషులే ఉండాలా?
ఎనిమిదో తరగతి తరువాత నన్ను బడి మానిపించారు. అమ్మాయిలు ‘పెద్ద మనిషి’ అయ్యాక నాలాంటి వాళ్ళు ఉండకూడదని స్త్రీ సమాజం అభ్యంతరం చెప్పింది. మగవాళ్ళతో నాలాంటి వాళ్ళు కలవకూడదని పురుష సమాజం తిరస్కరించింది. మా వాళ్ళు కూడా అన్నిటికీ తల వంచుకున్నారు. అందరి ముందు నన్ను తల దించమన్నారు.
నేను ఇంట్లోనే పుస్తకాలు చదివేదాన్ని. వయసు పెరుగుతున్న కొద్దీ నన్ను విచిత్రంగా చూసే చూపులు… పెదవులను పళ్ళబిగువుతో ఒత్తి పెట్టే నవ్వులు… ముడిచిన కనుబొమ్మలు వేసే ప్రశ్నలు… నన్ను హిజ్రా అని అసభ్యంగా పిలిచే పిలుపులు… అన్నీ పెరుగుతున్నాయి. చిన్నప్పటి నుంచీ ఇచ్చిన హార్మోన్స్ ట్రీట్‍మెంట్ వల్ల పదహారేళ్ళకు నాకు సన్నగా గడ్డం, మీసం కనిపిస్తున్నాయి.
అది చూసి మా నాన్న పొంగిపోయాడు. ఆయన కళ్ళలో నిశ్చింత. రోజూ దగ్గరకు వచ్చి నా ముఖంలో జరుగుతున్న మార్పులను పరీక్షగా చూసేవాడు. కానీ నాకే రోతగా ఉండేది.
“అమ్మాయికి గడ్డమా? ఛీ ఛీ…!”
మా అక్కలు చూడు ఎంత మృదువుగా ఉంటారో… నా గడ్డాన్ని మీసాన్ని చూసి సిగ్గుతో చచ్చిపోయేదాన్ని…
మా అక్కలు కాళ్ళ మీద ఉన్న వెంట్రుకలను తొలగించడానికి వాడే క్రీములను దొంగలించి వాడాను. అది మా నాన్నకు తెలిసింది. విపరీతంగా కోపం వచ్చింది. బెల్టుతో వాతలు పడేట్లు కొట్టాడు. ఇంకెప్పుడు అలా చేయనని ఆయన కాళ్ళ మీద పడ్డాను.
నన్ను ఏదీ అంత బాధించేది కాదు. కానీ “అబ్బాయి” అని నన్ను పిలిచే పిలుపు నా గుండెను చీల్చుతున్నట్లుండేది.
అక్కలకు చిన్నగైన బట్టలు నేను తొడుక్కునేదాన్ని. కానీ నాన్న వాటన్నిటినీ తగలబెట్టాడు. బలవంతంగా ప్యాంటు షర్టు వేసుకున్నప్పుడు చుట్టూ జనం నా రొమ్ముల వైపే చూసేవారు. నాకు అందరి ముందు నగ్నంగా ఉన్నట్లు అవమానం కలిగేది. నా జుట్టు కత్తిరించి క్రాఫ్ చేయించినప్పుడు నా వికృతపు ముఖాన్ని అద్దం విసిరికొట్టేది.
సమాజం ముందు గట్టిగా అరవాలనిపించేది. “నేను మొగవాడిని కాదు… కాదు… కాదు… ” అని.
కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదే. నన్ను స్త్రీలు కూడా కలవనీయటం లేదే?
ఈ సమాజంలో నేను ఒకరిని కాదా?
నా పుట్టుకకి పురిటినొప్పులు లేవా?
నేను నాభి లేకుండా జన్మించానా?
నా మెదడులోని కణాలకు స్పందన లేదా?
భగవంతుడి మహాసృష్టియైన మానవ జన్మలో కూడా ఓ విభాగంగా విభజించలేని రహస్యం నా పుట్టుకలో ఏముంది? మరి నేనెవరిని? నా పుట్టుక ఏమిటి?
నా ప్రశ్నకు ఎవరు సమాధానం ఇస్తారు? సృష్టికర్త పెదవి విప్పడు. నా కారణజన్ములు ఏడవడం తప్ప ఏమీ చెప్పరు. సమాజం వేలెత్తి చూపుతుందే తప్ప సమాధానం ఇవ్వదు.
చివరికి ఆ రోజు రానే వచ్చింది. ‘నేను ఎవరు?” అన్న ప్రశ్నకు అంతం చెప్పేందుకు….
నాకు ఇప్పుడు ఇరవై ఏళ్ళు … తొమ్మిది నెలల క్రితం నాకు ఒక ఆపరేషన్ జరిగింది.
“మాస్టెక్టోమి” అనే శస్త్ర చికిత్స చేసి, నా రొమ్ములు తొలగించారు. ‘ఆపరేషన్ సక్సెస్’ అని డాక్టర్ చెప్పాడు. మెల్లమెల్లగా కోలుకుంటున్నాను.
ఇప్పుడు షర్టు వేసుకుంటే నా పైభాగం అచ్చు మగవాడిలా ఉంది.
అమ్మానాన్న చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఎలా ఉందో తెలియదు గానీ వాళ్ళు పొంగిపోతున్నారు. కానీ నాకేమీ సంతోషంగా లేదు. ఏదో కోల్పోయినట్టు ఉంది.
ఒకే ఒక్క ఆలోచన.
ఇలా సమంగా ఛాతి ఉంటే లంగా ఓణీ వేసుకుంటే ఏమన్నా బాగుంటుందా? ఛీ ఛీ… చీర కట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది…! బాధ వేసింది..
ఇపుడు నాకు రెండవ ఆపరేషన్ “హిస్టరెక్టోమి” చేస్తారట. రేపొద్దున్నే ఆరు గంటలకే ఆపరేషన్. నన్ను ఆసుపత్రిలోనే ఉంచి అమ్మా నాన్న ఇంటికి వెళ్ళిపోయారు.
నాకు తోడుగా ఒక నర్సు ఉంది. వయసులో పెద్దావిడ.
“ఈ ఆపరేషన్ లో ఏం చేస్తారు?” అని ఆమెను అడిగాను.
“తెలియదు.. ఇలాంటి ఆపరేషన్ ఇప్పటివరకు మా హాస్పటల్లో జరగలేదు.”
“పోనీ ఎక్కడ కోస్తారు?” ఆమె నిట్టూర్చింది…… “నడుం దగ్గర…”
“నడుం దగ్గర కోసి ఏం చేస్తారు?” ఆమె అటూ ఇటూ చూసి, ఏదో ఆలోచిస్తున్నట్టు…. “తెలియదు కానీ… నీలో ఉన్న అవయవాలు మార్చి, నిన్ను మొత్తం మగవాడిగా చేస్తారు.”
నేనేం మాట్లాడలేదు… కొంచెం సేపు మౌనం తరువాత… ఆమె నా దగ్గరకు వచ్చింది.
“ఏం భయపడకు. అంతా మంచే జరుగుతుంది. ఈ ఆపరేషన్ తరువాత నీ కష్టాలన్నీ పోతాయి.”
“కష్టాలు పోవడం అంటే?” ఆమె నన్ను విచిత్రంగా చూసింది.
“రేపట్నుంచీ అందరూ నిన్ను మగవాడు అంటారు.”
“మరి నేనేమనుకుంటాను?” ఆమెను సూటిగా అడిగాను.
ఆమె నా ముఖంలోకి చూసి తలవంచుకుంది. “ఆయా, నాకో సహాయం చేస్తావా?”
“ఏంటి బాబు?”
“నేను తెచ్చుకున్న బట్టల బ్యాగు ఇస్తావా!”
ఆమె అందించింది. నేను తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాను. బ్యాగ్ లోపల ఎవరికీ కనబడకుండా చాటుగా ఉంచిన పసుపు రంగు చీరను బయటకు తీసాను. కట్టుకుంటే ఎంత అందంగా ఉంటానో ఊహించుకున్నా. ప్రేమగా దాన్ని నిమిరాను.
నన్ను చీరలో చూసి ఆయా నోరు తెరిచింది….. “ఇదేంటి బాబు ఎక్కడికి వెళుతున్నారు? అమ్మా నాన్న ఏమనుకుంటారు?”
“నేను అమ్మానాన్న కోసం వెళ్ళటం లేదు. నా కోసం నాలాంటి ఎందరి కోసమో వెళుతున్నాను. మేము కూడా మీలో ఒక్కరిమని, మాకు ఏ ఆపరేషన్లు అక్కరలేదని నిరూపించడానికి వెళుతున్నాను.”
“వద్దు బాబు, డాక్టరుకు తెలిస్తే నన్ను తిడతారు.”
నేను గట్టిగా నవ్వాను.
“ఒక మంచి పనికోసం ఆ మాత్రం తిట్లు తినొచ్చు, తప్పులేదు” కన్నుకొట్టాను. నా బ్యాగ్ తీసుకొని బయటకు నడిచాను.
***
ఎప్పుడో చిన్నప్పుడు చదివాను.
ఒకసారి వివేకానంద స్వామి అమెరికాలో ఉపన్యాసం ఇస్తానన్నారట. అందుకు అమెరికా వాళ్ళు మొదట ఒప్పుకోలేదట. కానీ తరువాత ఆయనకు మాట్లాడ్డానికి రెండు నిమిషాలు, కేవలం రెండు నిమిషాలు సమయం కేటాయించారట.
కానీ ఆ మహానుభావుడు స్టేజి ఎక్కి మాట్లాడ్డం మొదలుపెట్టాక అక్కడి ప్రపంచం మొత్తం రెండు గంటల సేపు స్తంభించిపోయిందట.
ఆయన మొదలుపెట్టిన మొట్టమొదటి వాక్యం “ప్రియమైన సోదర సోదరీమణులు…”
నాక్కూడా అలా ప్రపంచం తోటి మాట్లాడాలని ఉంది. కానీ నాకు రెండు గంటలు అవసరం లేదు. ఆయన చెప్పిన ఆ వాక్యాన్ని పూర్తి చేసే చిన్న అవకాశం ఇస్తే చాలు. ఆ వాక్యాన్ని పూరించే రెండు క్షణాలు చాలు. కేవలం రెండు క్షణాలు. “ప్రియమైన సోదర సోదరీమణులు మరియు మేము…..!”