[box type=’note’ fontsize=’16’] నర్మదరెడ్డిగారు రచించిన “కొలంబస్ అడుగుజాడల్లో మా ప్రయాణం” పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. ఎప్పుడో స్కూల్ రోజుల్లో పుస్తకాల్లో చదువుకున్న ‘కొలంబస్’ని గుర్తు చేసుకుంటూ – పెరిగి పెద్దయ్యాక, జీవితంలో స్థిరపడ్డాక, ఒక యాత్రికురాలిగా ఆయన తిరిగిన మార్గంలో పయనిస్తునప్పుడు తనలో కలిగిన ఆ అనుభూతిని పుస్తక రూపంలో వెల్లడించారు రచయిత్రి. [/box]
[dropcap]ప[/dropcap]ర్యటనాసక్తి గల తెలుగువారిలో నర్మదరెడ్డి గారు ఎన్నదగిన స్త్రీ యాత్రికులు. ఇప్పటికే 135 దేశాలు తిరిగారు. ఎన్నో అనుభవాలను ప్రోది చేసుకున్నారు. యాత్రా వ్యాసాలు, పుస్తకాల ద్వారా తమ అనుభూతులను పాఠకులతో పంచుకున్నారు. వారి కొత్త పుస్తకం ‘కొలంబస్ అడుగుజాడలలో మా ప్రయాణం’.
ఎప్పుడో స్కూల్ రోజుల్లో పుస్తకాల్లో చదువుకున్న ‘కొలంబస్’ని పెరిగి పెద్దయ్యాక, జీవితంలో స్థిరపడ్డాక ఒక యాత్రికురాలిగా ఆయన తిరిగిన మార్గంలో పయనిస్తునప్పుడు తనలో కలిగిన ఆ అనుభూతిని పాఠకుల ముందు ఉంచే ప్రయత్నమే ఈ పుస్తకం. కొలంబస్ తన ప్రయాణాన్ని నాలుగు దఫాలుగా చేయగా, నర్మద గారు ఈ యాత్రను మూడు దఫాలుగా చేశారు.
మొదటి దఫాలో న్యూ యార్క్, పోర్టోరికో, సెయింట్ థామస్, అంటిగ్వా – బర్బుడా, బార్బడోస్, సెయింట్ లూసియా, సెయింట్ కిట్టిస్ అండ్ నేవీస్, కొలంబియా, పనామా! రెండో దఫాలో – క్యూబా, మెక్సికో, గ్వాటమాలా, నికరాగ్వా, కొస్టారికా, ఎల్ సాల్వడార్, హోండురాస్, బెవిజె! మూడో దఫా మొరాకో, స్పెయిన్ తదితర దేశాలు తిరిగారు. దాదాపు 35 రోజుల పాటు 35,600 కిలోమీటర్లు!
క్రిస్టోఫర్ కొలంబస్ గురించి:
పాఠకులను తమ యాత్ర కథనంలోకి నడిపేముందు, క్రిస్టోఫర్ కొలంబస్ గురించి వివరించారు. 1446లో ఇటలీలోని జెనోవా గ్రామంలో జన్మించిన కొలంబస్ బాల్యం గురించి, సముద్రం, నౌకాయానం పట్ల అతనిలో కలిగిన ఆసక్తిని వివరించారు రచయిత్రి. ఆసియా ఐరోపాల మధ్య ఉన్న సిల్క్ రూట్ మార్గం ఎందుకు మూతపడిందో తెలిపి, భారత్, చైనా దేశాలకు కొత్త మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఏర్పడిన నేపథ్యాన్ని వివరించారు. అవగాహనాలేమితో, దురభిప్రాయాలతో సముద్రయానం దుస్సాహసంగా మారిన వైనాన్ని తెలిపారు.
మొదట కొలంబస్‌లో కలిగిన సందేహాలను, టొస్కవెల్లీ వాటిని ఎలా నివృత్తి చేశాడో, ఇండియాకి సముద్రమార్గం కనుగొనడానికి ఎలా ప్రోత్సహించాడో చెప్పారు. సముద్రమార్గం ద్వారా ఇండియా చేరుకోవాలన్న కొలంబస్ నిశ్చయం దృఢమైంది.
ఆర్థిక సహాయం చేస్తాడేమోనని తన ప్రణాళికలన్నీ పోర్చుగల్ రాజుకి వివరిస్తే, అతను చేసిన మోసం తెలిసి కొలంబస్ రహస్యంగా స్పెయిన్‌కి వెళ్ళిపోతాడు. ప్రయాణానికి నిధుల కోసం ఎందరెందరినో అడిగి లేదనిపించుకుంటాడు.
స్పెయిన్ రాణి ఇసాబెల్లాని ఒప్పించడంలో విజయం సాధించినా, నౌకల్నీ, సిబ్బందినీ సమకూర్చుకోడం కష్టమవుతుంది కొలంబస్‌కి.
శాంటా మారియా, పింటా, నీనా అనే మూడు ఓడలలో బయల్దేరిన కొలంబస్ బృందాలకు ఎదురైన సమస్యలను తెలిపారు.
ఈ సముద్రయానం వెనుక కొలంబస్ అసలు ఉద్దేశాలను రచయిత్రి వివరిస్తారు. తాను అడుగుపెట్టిన రాజ్యాలలో కొలంబస్ స్థానికులతో కలిసిపోయిన తీరును, రాజ్యం స్పెయిన్ రాణిదని ప్రకటించిన విధానాన్ని తెలిపారు.
నాలుగు దఫాల యాత్రలో కొలంబస్‌కి ఎదురైన కష్టాలు, అతనితో సిబ్బంది ఎదుర్కున్న సమస్యలు, మధ్యలో స్పెయిన్‌లో జైలుపాలవడం వంటివి వివరించారు.
చివరికి తాను అనుకున్నట్టుగా భారతదేశాన్ని కాకుండా రెండు విశాలమైన కొత్త ఖండాలను కనుగొన్న కొలంబస్ స్పెయిన్‌లో ఓ సామాన్యుడిలా మరణించాడని చెబుతారు..
కొలంబస్ అడుగుజాడల్లో:
రచయిత్రి కొలంబస్ ప్రారంభించినట్టే, తమ యాత్రను కూడా కానరీ ఐలాండ్స్ నుంచే ప్రారంభించారు. ఆ ద్వీపమాలిక గురించి తెలియజేశారు, అక్కడ పరిచయమైన వ్యక్తుల గురించి వివరించారు.
తర్వాత హెమింగ్వే నడయాడిన నేల, చే గువేరా ఉద్యమించిన గడ్డ అయిన క్యూబా వెళ్ళారు. ప్రపంచ వారసత్వ పట్టణమైన క్యూబాలో పర్యాటక ప్రదేశాలన్నీ చూశారు. ‘నేషనల్ థియేటర్ హవానా’ చూశారు. అక్కడి నుంచి ట్రినిడాడ్ వెళ్లారు. తర్వాత ‘పర్క్యూ ఎల్ క్యూబానో’ అనే చోట ఆదివాసులు వండిన భోజనం తిన్నారు. హవానాలోని ‘ప్లాజా డిలా రివల్యూషన్’ చూశారు. ఒకప్పుడు ఇక్కడే ఫిడేల్ కాస్ట్రో గొప్ప ఉపన్యాసం ఇచ్చారని తెల్సి ఉద్వేగానికి లోనవుతారు. శాంటామార్టాలోని చే గువేరా మెమోరియల్‌ని సందర్శించినప్పుడు పలు ఉద్యమాలలో పాల్గొని దేశం కాని దేశానికి ఎన్నో సేవలందించిన చే ని స్మరించుకుంటారు.
పోర్టోరికోలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియని మనుషులు కాకుండా యంత్రాలు చేయడం రచయిత్రిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ‘పల్మర్ డెల్మర్’ అనే ప్రాంతంలో పడవలను దాచుకునే విధానం ఆసక్తి కల్గిస్తుంది. మెర్కాడో, శాన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లో తిరుగుతున్నప్పుడు 73 ఏళ్ళ మహిళను కలుసుకోవడం, కంటి చూపు సరిగా లేకపోయినా తన ఇంటిని చక్కగా అలంకరించుకోవాలన్న ఆమె తపనని వివరిస్తారు.
తరువాత ‘ఎమరాల్డ్ ఆఫ్ కరేబియన్’ అని పేరు పొందిన సెయింట్ థామస్ ద్వీపాన్ని సందర్శించారు. అత్యంత స్వచ్ఛమైన నీరు ఉండే ‘కికి బీచ్’ గురించి చెబుతారు. అక్కడి ప్రాంతంలో ప్రసిద్ధమైన పక్షులు, జంతుజాలం గురించి తెలిపారు. పుట్టినప్పుడు ఆడచేపగా పుట్టి, ఎదిగే కొద్దీ మగచేపగా మారే అట్లాంటిక్ ట్రంపెట్ చేప గురించి తెలిపారు.
ఆంటిగ్వాలో బెండాల్స్ గ్రామం దాటాక వచ్చే రెయిన్ ఫారెస్ట్‌ని చూసి ఆ వర్షారణ్యం గురించి వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద యాచింగ్ సెంటర్ అయిన నెల్‌సన్స్ డాక్‌యార్డ్‌ని చూశారు. అక్కడి నుండి బర్బుడాలోని హారిసన్ కేవ్ చూసి, దాని వివరాలు తెలియజెబుతారు. అక్కడి నుంచి రాబిన్‌సన్ క్రూజో బీచ్‌కి వెళ్ళారు.
ఎంతో సుందరమైన ప్రకృతి అందాలను నింపుకున్న సెయింట్ లూసియాకి వెళ్లారు రచయిత్రి. అక్కడ ట్విన్ పిటాన్స్ చూస్తారు. సెయింట్ లూసియాకి ‘హెలెన్ ఆఫ్ వెస్టిండీస్’ అనే పేరు ఎలా వచ్చిందో తెలిపారు.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దీవులలోని 1626లో బ్రిటీషువారికి, అమెరికన్లకీ మధ్య జరిగిన యుద్ధం జరిగిన ప్రాంతంలోని నది – బ్లడీ రివర్‌ని చూశారు. ఇక్కడ మొదటి ప్రపంచయుద్ధ వీరుల స్మారక చిహ్నం ఉంది. ఇక్కడి బీచ్‍లను వర్ణిస్తారు రచయిత్రి. కిట్టీస్ లోని జీవజాలం గురించి వివరిస్తారు. ఛార్లెస్‌టౌన్ స్థానికుడైన అలెగ్జాండర్ హామిల్టన్ కథని ఆసక్తిగా చెప్పారు రచయిత్రి.
ఉప్పుగనుల కోసం ఎన్నో యుద్ధాలు జరిగిన సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని సందర్శించారు రచయిత్రి. మహే బీచ్ దగ్గర విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ఎంత దగ్గరగా ఉంటాయో చెబుతూ విమానాలు మనుషుల్ని తాకుతాయా అన్నట్టుంటుంది అంటారు. 2017 నాటి ఇర్మా తుఫాను గాయాలింకా మానలేదంటారు.
కొలంబియాలో ఉప్పగుహలు, సిటీ సెంటర్, గుటావిటా చెరువు, నేషనల్ పార్క్, క్రేటర్, గోల్డ్ మ్యూజియం చూశారు. కార్టజీన సమీపంలోని ఓసియానా అనే స్థలంలో సముద్రతీరంలో డాల్ఫిన్స్ సందర్శకులకు ముద్దులు పెడతాయని చెప్తారు.
మధ్య అమెరికాలో అతి చిన్న దేశమైన ఎల్ సాల్వడార్ లోని ‘శాంటా అనా వాల్కనో’ చూశారు. స్థానిక మ్యూజియంని దర్శించి సుప్రసిద్ధ కవయిత్రి క్లారిబెల్ ఆలెగ్రియా గురించి తెలుసుకుంటారు. మానవ హక్కుల కోసం ఆవిడ జరిపిన పోరాటాన్ని వివరిస్తారు.
పనామాలో పనామా కాలువను చూసి, దాని గురించి వివరించారు. అక్కడి బొలివర్ విగ్రహాన్ని చూశారు.
మధ్య అమెరికాలో అతి పెద్ద దేశమైన నికరాగ్వాలో ముంబాచా రెయిన్‌ఫారెస్ట్‌ని కాలినడకని తిరిగి చూశారు. ఎంతో మంది రచయితలకి నిలయం ఈ దేశం అని చెబుతారు. గ్రనడాలోని పాడిపరిశ్రమ, చేనేత పరిశ్రమల గురించి చెబుతారు. ఇక్కడ 50 అగ్నిపర్వతాలు ఇంకా చైతన్యంగా ఉన్నాయని చెబుతారు.
సందర్శించిన అన్ని దేశాల చరిత్రని, ఆర్థిక స్థితిగతులను, రాజకీయ నేపథ్యాలను సందర్భోచితంగా వివరించారు రచయిత్రి.
ముగింపు:
కొలంబస్ తిరిగిన దేశాలను తిరుగుతుంటే ఆయా ప్రాంతాల సంస్కృతి, అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, విశ్వాసాలు ఒకవైపు అబ్బురపరుస్తూ, అనందాన్నిచ్చినా, మరి కొన్ని చోట్ల కొలంబస్ సాహస యాత్ర మూలంగా ఈ దేశాల గురించి తెలిసిన యురోపియన్స్ స్థానికులపై దాడి చేసి వారి సంపదను దోచుకోవడమే కాకుండా వారి సంస్కృతిని విధ్వంసం చేసిన విధానం కూడా అక్కడక్కడ కనిపిస్తుందని రచయిత్రి చెబుతారు. కొన్ని చోట్ల కొలంబస్ యాత్ర గురించి గొప్పగా ఉహించుకొని పోయిన ఆమెకు స్థానికుల్లో కొలంబస్ పట్ల కనిపించిన ఆగ్రహం మరో అనుభవం.
ఆసక్తిగా చదివించే యాత్రా రచన ఇది.
***
కొలంబస్ అడుగుజాడల్లో మా ప్రయాణం (ట్రావెలాగ్)
నర్మద రెడ్డి
సంహి ప్రచురణలు, 4-7-17/B3, శ్రీ సాయి నగర్, నాచారం, హైదరాబాద్ 502334.
పుటలు: 168
వెల: ₹ 120/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, ప్రచురణకర్త