[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]
[dropcap]అ[/dropcap]మ్మ గురించి ఇక్కడ చెప్పాలి. నేను పుట్టగానే అమ్మకి ఆర్.టి.సి.లో వుద్యోగం వచ్చిందట. కాంటిన్‌లో పని చేసే రత్నమ్మ అనే ఆవిడకి నన్నిచ్చి చూడమని తను మధ్య మధ్యలో వచ్చి పాలిచ్చి, అమ్మ చాలా గారాబంగా పెంచిందట. అన్నయ్య తర్వాత నేను ఎనిమిదేళ్ళకి పుట్టాను.
అమ్మ ఇల్లు అంటే ఆర్.టి.సి. క్వార్టర్స్, వచ్చాకా అమ్మమ్మ ఇల్లు అయిందది. ఆంధ్రా నుండి ఎవరు హైదరాబాదొచ్చినా స్వతంత్రంగా ఇక్కడే దిగేవారు. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో సిగరెట్ ఫ్యాక్టరీ (వజీర్ సుల్తాన్ టొబాకో) వెనకాల వుండేవి మా క్వార్టర్స్. ఇవి దాటితే రామ్‌నగర్ అన్నమాట! మా పెద్ద పెద్దమ్మ భర్త మహారాష్ట్ర ఎలెక్ట్రిసిటీ బోర్డ్‌లో పని చెయ్యడంతో, ఆవిడ పిల్లలు ముగ్గురినీ అంటే లక్ష్మి అక్కా, వాణి అక్కా, రాము అన్నయ్యలని అక్కడ తెలుగు మీడియం లేదని, అమ్మ దగ్గరికి పంపించేసారు. పెదనాన్న ఎలాగూ అమ్మమ్మకి తమ్ముడు. ఆవిడ ఆ ముగ్గురినీ, మా అమ్మ సంతానం అయిన నన్నూ, అన్నయ్యనీ పెంచేది! అప్పట్లో పెంచడం అంటే తిండి తిప్పలు చూడడం, చదువుల గురించి పట్టించుకోడం! మేం ఎవ్వరం పెద్దగా అల్లరి చేసేవాళ్ళం కాదు! అల్లరీ పెంకితనం అంటూ చేస్తే నేనే. కానీ మిగతా వాళ్ళకీ నాకూ పది పన్నెండేళ్ళు తేడా వలన నన్ను చాలా గారాబంగా చూసేవారు. ఆర్.టి.సి. స్కూల్లో నన్ను నాలుగో ఏట చేర్పించడానికి మా అమ్మమ్మ తీసుకెళ్తే వాళ్ళు ఐదు వచ్చాకా ఒకటో తరగతిలో చేర్చుకుంటాం అన్నారుట. మా పెద్దమ్మ పరమ జీనియస్, ఆవిడ ఒక్క జడ వేసుకుని పరికిణీ జాకెట్టూ వేసుకున్న నాకు రెండు జడలేసి, గౌన్ వేసి మళ్ళీ సేమ్ హెడ్ మాస్టర్ దగ్గరకి మధ్యాహ్నం తీసుకెళ్ళి ఆయన్ని బురిడీ కొట్టించి (నోటికొచ్చిన డేట్ ఆఫ్ బర్త్ వేయించి) జాయిన్ చేయించేసింది! ఆ విషయం అమ్మని ఇప్పటికీ దెప్పుతుంటాను. ఇంకో ఆర్నెల్లు ఆడుకోనిస్తే మీ సొమ్మేం పోయిందని. మా అమ్మ అమ్మమ్మ ఎలా చెప్తే అలా నడుచుకునేది. స్వార్థం అనేది తెలీదు! “ఇది నా ఇల్లూ… నా పిల్లలని ప్రత్యేకంగా చూడాలి” లాంటివేం వుండేవి కావు. “రాముడొచ్చాడు… ఉద్యోగం వచ్చేదాక ఇక్కడ వుంటాడే పాపాయీ” అని అమ్మమ్మ అన్నా; “పాపాయ్… ఒక అమ్మాయిని పంపుతున్నాను… ఆర్.టి.సి.లో ఉద్యోగం వేయించు… బాగా ఆర్థిక ఇబ్బందుల్లో వున్నారు” అని పెద్దమ్మ పంపించినా “అలాగే” తప్ప మా అమ్మ నోటి నుండి వ్యతిరేకంగా ఇంకో మాట వచ్చేది కాదు! పర్యవసానంగా ఇంట్లో ఎప్పుడూ చుట్టూలుండేవారు. ఎవరో ఇల్లు చిన్నదని పురుడు పోసుకోడానికి అమ్మాయిని తీసుకొచ్చాం అనేవారు. ఇంకొకరు… మా నాన్నగారు మంచి రోజున పోలేదు, ఇల్లు పాడుపెట్టాం, మీ ఇంట్లో ఆరు నెలలుంటాం… అనేవారు! రెండు వరండాలూ, రెండు గదులూతో వుండే ఆ రాజభవనం, పుష్పక విమానంలా ఎవరొచ్చినా ఆశ్రయం ఇచ్చేది! నాన్న ఏదో పల్లెటూర్లో అగ్రికల్చర్ డిపార్టుమెంట్‍లో డ్రాఫ్ట్స్‌మన్‌గా ఉద్యోగం చేస్తు ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుండేవాళ్ళు! అమ్మ అప్పుడప్పుడూ కూరపొడీ, సాంబార్ పొడీ, కందిపొడీ, పల్లీ పొడీ, నువ్వుల పొడీ అన్నీ తీసుకుని మిర్యాలగుడానో, కోదాడో ఎక్కడ నాన్న ఉన్నారో ఆ ఊరికి వెళ్ళొస్తూ వుండేది!
మా నాన్నకి ఇంట్లో ఇంతమంది వుండడం నచ్చేది కాదు. ఆయన రాగానే ఓ ఆటో పిలిచి నన్ను ఎక్కించి ఆబిడ్స్ తాజ్‌కి తీసుకెళ్ళి “ఒక దోశ… అదొచ్చేలోగా మురుకు… లేదా ఒక పెసరట్… అదొచ్చే లోగా ఆలూ బజ్జీ…” ఇలా ఆర్డర్ ఇచ్చి, చివరకి మాత్రం ‘బాసుందీ’ తప్పకుండా పెట్టించి వరుసగా రెండు సినిమాలు చూపించి, నాకు ఇష్టమో కాదో అర్థమయిందో లేదో చూడకుండా, రెండు గౌన్లు, చెప్పులూ కొని ఇంట్లో దింపి, మళ్ళీ ఊరికెళ్ళిపోయేవారు. అలా వెంటవెంటనే ఒకే రోజులో చూసినవే.. రాధమ్మ పెళ్ళి, జీవిత రంగం, చక్రవాకం, ఝీల్ కే ఉస్ పార్… అలా అన్న మాట. మనకీ సినిమా పిచ్చి అప్పటినుండే ప్రారంభం అయిందేమో!
పెద్ద పెద్దమ్మ పిల్లలతో బాటు, రెండో పెద్దమ్మ పిల్లలు విజయక్కా, శాంతక్కా, రమక్కా, హనుమంతు అన్నయ్య, చిన్న అన్నయ్య వాళ్ళు కూడా అమ్మ దగ్గర స్వతంత్రంగా వుండేవారు. ఆదివారం వస్తే అమ్మ పిల్లల కోడిలా, మా అందరినీ వేసుకుని జూపార్క్‌కో, సినిమాకో తీసుకెళ్ళేది! హోటల్ మాత్రం తప్పనిసరి!
అమ్మ మంచి సింగర్. క్లాసికల్ నేర్చుకున్నా, లైట్ మ్యూజిక్ ఎక్కువగా పాడేది. ఆర్.టి.సి. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో ఎప్పుడూ ఫస్టూ లేక సెకండ్ ప్రైజులు గెలుచుకునేది. ఐ.పాప అనే ఆవిడ క్లాసికల్ పాడేది. ఇంద్రగంటి జానకీబాలా, మా అమ్మా పోటాపోటీల మీద పాడేవారు. ఒకసారి రవీంద్రభారతిలో ‘హోఠోం మే ఐసీ బాత్’ అనే పాట వన్స్ మోర్ అని మూడుసార్లు అమ్మ చేత పాడించడం నాకు తెలుసు! అమ్మ పేరు సత్యవతీదేవి అని చాలా తక్కువమందికి చుట్టాలకి తెలుసు! “మా పాపాయి వుందా?” అని ఆఫీస్‌కి వెళ్ళి అడిగేవారుట.
అమ్మ ఆల్ ఇండియా రేడియోలో నాటికలు వేసేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి ‘గోపీ’ హోటల్లో ఇడ్లీ పెట్టించేది. చట్నీ సాంబార్‌తో పాటు, చిన్న గిన్నెలో నెయ్యి ఇచ్చేవాడు కారంపొడిలోకి! లేదా పక్కన సరోవర్ హోటల్ వుండేది! అమ్మ నెల నెలా చీరలు కొనేది. రెండుసార్లు కట్టుకున్నాకా, వాటిని మధ్యలోకి చింపి రెండు ఓణీలు చేసి అక్కలకి ఇచ్చేసేది. అప్పట్లో 18 రూపాయలకి కూడా చీరొచ్చేది. నా పుట్టిన రోజుకి ఎప్పుడూ కొత్త బట్టలు లేకుండా చెయ్యలేదు. నాకు 12/- రూపాయలకి గౌన్ కొన్న రోజులు కూడా తెలుసు. అప్పుడప్పుడూ ఓ జీపో కారో బుక్ చేసి, మమ్మల్ని అందరినీ వేసుకుని పెద్ద పెద్ద క్యాన్‌లలో పులిహోరా, దద్ధోజనం లాంటివి చేసుకుని జూపార్క్, నౌబత్ పహాడ్ (ఇప్పటి బిర్లామందిర్), సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ, గండిపేట… ఇలా అన్ని తిప్పి చూపించి తీసుకొచ్చేది!
అమ్మలో అమ్మమ్మ దానగుణం ఎలా వుండేదంటే, కొన్ని ఫ్యామిలీస్‌ని పూర్తిగా పోషించేవారు. అలా అని వీళ్ళేం లక్షాధికారులు కాదు. అందరం మధ్య తరగతి వాళ్ళమే!
మా ఆర్.టి.సి. కాలనీలో, వాళ్ళూ బలభద్రపాత్రుని వాళ్ళే… చాలా కష్టాల్లో వున్నారని అమ్మకి ఒక కొలీగ్ చెప్పింది. అమ్మ ఆ సంగతి అమ్మమ్మ చెవిన వెయ్యగానే, అమ్మమ్మ వాళ్ళకి బియ్యం, పప్పూ, కూరలూ, మా అమ్మవి ఓ నాలుగు చీరలు తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళబ్బాయి కాలేజీ ఫీజు కట్టి, ఆడపిల్లలకి టైపూ షార్టుహ్యాండులో జాయిన్ చేసి ఆదుకోవడం నాకింకా గుర్తే!
అలాగే భర్త పెద్ద కుటుంబాన్ని వదిలేసి పారిపోయిన దూరపు చుట్టాలని, ప్రతి నెలా రేషనూ, వాళ్ళ ముసలి అత్తగారి కోసం కాఫీ పొడీ, పిల్లలకి పుస్తకాలతో బాటు, దీపావళి వస్తే టపాకాయలు కూడా మాకు కొన్నవాటిలో షేర్ పెట్టి పంచడం నాకు గుర్తు! తర్వాత వాళ్ళంతా వృద్ధిలోకొచ్చారు. వీళ్ళ శ్రమ వృథా పోలేదు. నన్ను చిన్నప్పుడు చూసుకున్న రత్నమ్మ కూడా నాకు పిల్లలు పుట్టేదాకా, ప్రతి నెలా వచ్చి ఎంతో కొంత సాయం పొందేది. చివరకి ఇంట్లో బియ్యం బాగు చెయ్యడానికి వచ్చిన పోచమ్మా, లక్ష్మమ్మా అనే వాళ్ళు తమ భర్తలకి వుద్యోగం లేకుండా వున్నారంటే ఆ బాలయ్య, గోపయ్యలకి కూడా ‘కస్ కస్ తట్టీ’లకు నీళ్ళు కొట్టే వుద్యోగాలు ఎండాకాలంలో వేయిస్తే, తర్వాత పెర్మనెంట్ అయి ‘మాలీ’లుగా, ఇళ్ళు కూడా కట్టుకున్నారు అమ్మ పేరు చెప్పుకుని! ఉంటేనే దానం చెయ్యాలన్నది తప్పు… ఉన్నంతలో చెయ్యాలని చిన్నప్పటి నుండే మేం అమ్మా అమ్మమ్మలని చూసి నేర్చుకున్నాం. స్కూల్లో అమ్మమ్మ పిల్లలంటే ప్రత్యేకంగా చూసేవారు. ఆవిడ చాలా క్రమశిక్షణతో మమ్మల్ని పెంచింది. మా వాణక్క ఆర్.టి.సి.లో వుద్యోగం చేసే రోజుల్లో స్నేహితురాలి ఇంటికి చెప్పకుండా వెళ్ళిందని, మర్నాడు వాళ్ళమ్మని నాగ్‌పూర్ నుండి పిలిపించి అమ్మమ్మ పెళ్ళి సంబంధాలు చూడమని, మూడు నెలలు తిరక్కుండా పెళ్ళి చేసేసింది! అలా వుండేవి రూల్స్.
మా పెదనాన్న నడివయసులోనే కాన్సర్ బారిన పడి, అకాల మృత్యువు పొందారు. చివరి క్షణాల్లో బొంబాయి జె.జె. హాస్పిటల్స్ నుండి డిస్‌ఛార్జ్ చేయించి, “ఎక్కడికి వెళ్తావు?” అంటే, “మా పాపాయి దగ్గరకి” అన్నారు. మా ఇంటికొచ్చాకే ప్రాణం విడిచారు. ఆయన పోయాకా, మా వాణక్కకి మా అమ్మ ఆర్.టి.సి.లో వుద్యోగం వేయిస్తూ, ‘నా పిల్లలకి నేను ఇంక ఆర్.టి.సి.లో వుద్యోగం అడగను’ అని కూడా రాసిచ్చేసింది! వెనకా ముందూ చూడనంత ఉపకార గుణం. పర్యవసానంగా మా అన్నయ్య ఎమ్.కామ్. చదివి కూడా అస్సాం, గౌహతీ వెళ్ళి ఎన్.బి.సి.సి.లో వుద్యోగం చేయాల్సొచ్చింది.
(సశేషం)