వదిన-వంటల షో..

4
4

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి జి.ఎస్. లక్ష్మి పంపిన హాస్య కథ “వదిన-వంటల షో..”. వంటలు చెయ్యడాలూ, చేయించడాలూ కన్న హాయిగా ఓ సోఫాలో కూర్చుని ఏ ప్రశ్నకైనా నోటికొచ్చిన సమాధానాలు చెప్పడం తేలిక అనుకునే వదిన గురించి చెప్తున్నారు రచయిత్రి. [/box]

[dropcap]ఒ[/dropcap]కరోజు ఉదయాన్నే వదిన తనో వంటల చానల్లో షో చేస్తున్నానంటూ పెద్ద బాంబే పేల్చింది. నాకు మతి పోయింది. తెల్లారిలేస్తే ప్రతి చానల్లోనూ వంటల ప్రోగ్రాములే. అవి కాక ప్రత్యేకం వంటల చానల్లే బోల్డున్నాయి. మరింక ప్రాంతీయ చానళ్లలో ఆంధ్రా, తెలంగాణా, రాయలసీమ రుచులతోపాటు పొద్దున్న బ్రేక్‍ఫాస్ట్ ఏం తినాలో, లావు తగ్గడానికి ఎలా తినాలో నుంచి అమ్మ వంట, మామ్మ వంట, అత్త వంట ఆఖరికి బాబయ్య వంటలాంటి బంధువులందరి వంటలూ ఉండనే ఉన్నాయి. అలాంటి బోల్డు వంట చానళ్ళలో పాప్యులర్ షోలు ఉండగా వదిన మళ్ళీ ఇలా అనడం నాకు అంత బాగా అనిపించలేదు. ఎందుకంటే వదిన కొన్ని వంటలు బాగానే చేస్తుంది. కానీ చాలా రకాల వంటలు చెయ్యడం వదినకి రాదు. అదే అన్నాను వదినతో. చేతకాని దద్దమ్మని చూసి మహా తెలివైనవాడు నవ్వినట్టు నన్ను చూసి నవ్వింది వదిన. నాకు మహా కోపం వచ్చేసింది.

“వంటల షో అంటే వంట ఎలా చెయ్యాలో చూపించడం కాదు. నా రూటే సెపరేటు” అంది అదేదో సినిమాలో హీరోలా..

“వంటంటే వంట చెయ్యక డాన్స్ చేస్తారా?” అన్నాను కోపంగా.

నా కోపాన్ని చూసి, “ఆగాగు. అంత కోపమెందుకు? నువ్వూ మీ అన్నయ్యలాగే ఆలోచిస్తున్నావు. మీరే కాదు. చాలామందంతే. ఎవరైనా కొత్తగా ఏదైనా చేసి సక్సెస్ అయితే గొర్రెలమందలాగ పొలోమంటూ అందరూ అదే మొదలెడతారు. ఇదిగో.. ఇప్పుడు అన్నిచోట్ల అలా వచ్చే వంటల ప్రోగ్రాములే. అదే కాస్త వేరేవిధంగా ఆలోచించే వాళ్లయితే ఇట్స్ డిఫరెంట్ యూ నో..” అంది స్టైల్‌గా.

నాకు ఉడుకుమోత్తనంలాంటిది వచ్చేసింది. “ఇప్పుడు తమరు ఆవిష్కరించబోయే ఆ కొత్త విధానవేవిటో?” అన్నాను వెక్కిరింపుగా.

“అదీ.. అలా అడుగు చెపుతాను. ఇప్పుడు అన్నిచోట్లా వంటలు చెయ్యడం, వాటిలో ఉండే విటమిన్లు, పోషకాలు గట్రా చెపుతూ, అవి ఎంత తినొచ్చో. ఎలా తినొచ్చో చెపుతున్నారు. అంతే కదా. కానీ మనం అస్సలు వంట చేసుకోవడాలూ గట్రా ఇలాంటి విషయాలేం చెప్పం..” అంటూ విశ్రాంతిగా సోఫాలో వెనక్కి వాలింది.

నాకు ఆశ్చర్యం వేసింది. ఓ మూల వంటల షో చేస్తానంటూ, మరోవైపు అవి చెప్పనంటుంటే ఏమనాలి. అందుకే కుర్చీలో కాస్త ముందుకి వంగి వదిన చెపుతున్నది జాగ్రత్తగా వినడం మొదలుపెట్టాను.

“మన షో వంటల కన్సల్టెన్సీ అన్న మాట.” అంది కూల్‍గా వదిన.

నాకు ఈ మాట అస్సలు అర్ధం కాలేదు. ఇదేమైనా చదువా, ఉద్యోగమా, పెళ్ళా, విడాకులా, ఆస్తులా, తగాదాలా.. ఏవిటనుకుని కన్సల్టెన్సీ పెడుతుంది. బిత్తరపోయిన నా మొహాన్ని చూసి చిద్విలాసంగా నవ్వింది వదిన.

“చూడు స్వర్ణా, ఈ వంటలు చెయ్యడాలూ, చేయించడాలూ కన్న హాయిగా ఓ సోఫాలో కూర్చుని ఏ ప్రశ్నకైనా నోటికొచ్చిన సమాధానాలు చెప్పడం తేలిక. సలహాలివ్వడమన్నంత తేలికపని మరోటి లేదు కదా!”

“ఈ ప్రశ్నలు మనని ఎవరు వేస్తారు? ఎందుకు వేస్తారు?” అన్నాను తెల్లమొహం వేసుకుని.

“ఎందుకు వెయ్యరు? ఇంకా పాపం కొందరు ఆడవాళ్ళకి మొగుడికీ, పిల్లలకీ కావల్సినట్టు వండి పెట్టాలన్న ఆతృత పోలేదు. అందుకోసమే కదా ఇన్నిరకాల వంటలూ, చానళ్ళూను. వాళ్ళే అడుగుతారు. ఏ మొబైల్ కంపెనీతోనన్నాఒప్పందం కుదుర్చుకున్నామనుకో.. ఆ వచ్చే కాల్ కాస్ట్‌లో కొంత కంపెనీకీ, కొంత మనకీనూ.”

“కానీ, నువ్వేమైనా స్పెషల్ కోర్సులు చేసేవా ఈ సబ్జెక్ట్‌లో.. అసలు నీకేం తెలుసని ఎవరైనా నిన్ను ప్రశ్నలు అడుగుతారూ?”

 “అయ్యో స్వర్ణా, ఆ మాత్రం తెలీదా? కన్సల్టేషన్ పెట్టడానికి నువ్వేమీ కోర్సులూ గట్రా చెయ్యఖ్ఖర్లేదు. దూసుకుపోయే గుణముంటే చాలు. ఏం తెలీకపోయినా అన్నీ తెలిసినట్టు చెప్పేస్తే పోయె. ఏ సబ్జెక్ట్ లోనైనా వెంటనే సక్సెస్ తెచ్చుకున్నవాళ్ళ కన్నా, పదిసార్లు డక్కామొక్కీలు తిన్నవాళ్ళకే అనుభవం ఎక్కువుంటుంది. అలా ఢక్కామొక్కీలు తిని ఇలాంటి కన్సల్టేషన్స్ పెట్టుకున్నవాళ్లని బోల్దుమందిని చూసేను నేను. అందుకే “వంట చెయ్యడం కాదు ముఖ్యం.. దానిని తినిపించడం” అన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాను..” అంది గర్వంగా వదిన.

వదిన మాటలకి అనుమానంగా చూస్తున్న నన్ను చూసి, “కొత్తవంటలు ఎవరైనా చెయ్యొచ్చు. ఏవో రెండు రకాలు ఉడకబెట్టి చేస్తే ఓ రకం, వేయించి చేస్తే ఇంకోరకం. పైన డ్రై ఫ్రూట్స్ వేస్తే ఓ రకం, క్యారట్ తురిమి వేస్తే ఇంకోరకం. అదే కుంకంపువ్వు వేస్తే అదోరకం.. అలాంటివి నిమిషంలో ఎన్నైనా చెయ్యొచ్చు. చానళ్ళన్నీ అలాంటివాటితో నిండిపోయున్నాయి. కానీ మనం డిఫరెంట్ కదా! అందుకే ఈ వంటల సలహాలన్నమాట.” అంది.

“వంటల సలహాలు పేరు అంత బాలేదుకదా వదినా!” అంటూ పెట్టిన నా ఫేస్ చూసి

“ఆ మాత్రం నాకు తెలీదా? అందుకే నా షో పేరు ‘వంట కన్నా మేటి మీ భేటీ..’ అని పెట్టేను.” అంది.

దానర్ధం నాకు తెలీక వెర్రిమొహం వేస్తే “అయ్యో స్వర్ణా, నువ్వింకా ఎప్పుడు ఎదుగుతావ్!” అంటూ నా మీద జాలిపడి.. “ఎలాంటి వంట చేసినా వాటిని ఎలా తినిపించాలో చెపుతానన్నమాట” అంది. వదిన మాట నాకేమీ నచ్చలేదు. వంటలు చెయ్యడం చెప్పాలికానీ తినిపించడం ఎవరైనా చెప్తారా! అందుకే “మర్నాడే మూసేస్తారు నీ ప్రోగ్రామ్..” అన్నాను వదిన ఆలోచనకి మొదటిసారిగా బాధపడుతూ.

“ఏంకాదు.. టీఆర్పీ రేటింగ్ అదిరిపోతుంది చూడు” అని వదిన ఛాలెంజ్ చేస్తూ, నాలుగు ప్రశ్నలు రాసి నాకిచ్చి, “రేపు షో టైమ్ లో ఈ ప్రశ్నలడుగు..” అంది.

వదిన మాటంటే నాకు సుగ్రీవాజ్ఞే కదా! అందుకనే పొద్దున్నే తొందరగా పనులన్నీ ముగించేసుకుని, వదిన చెప్పిన నంబర్‌కి నా మొబైల్ నుంచి పోన్ చేస్తూ వాళ్ళెప్పుడు కలుస్తారా అని కాచుక్కూర్చున్నాను. నాతోపాటు మా ఇరుగింటివాళ్లనీ, పొరుగింటివాళ్లనీ కూడా పిలిచేను. ఇప్పుడో, ఇంకాసేపటికో వాళ్ళూ వస్తారు. అడగవలసిన ప్రశ్నల జాబితా నా చేతిలో సిధ్ధంగా ఉంది.

టీవీ ఆన్ చేసి, ప్రేక్షకుల ప్రశ్నలకు వదిన జవాబు లివ్వబోతున్న చానల్ పెట్టుకుని, రెడీగా కూర్చున్నాను. అదేదో పాటల ప్రోగ్రామ్ చివరి కొచ్చేసింది. తర్వాత వదిన ప్రోగ్రామే.. అసలీ వదిన్ని చూస్తే నాకందుకే ఆరాధన. టీవీ చానల్లో ప్రొగ్రామ్ చేద్దాం అనుకుని ఇంకా రెణ్ణెల్లు కాలేదు, అప్పుడే షో మొదలైపోయింది. ఇవాల్టిదే మొదటి షో. అదేంటో వదిన చేస్తున్న పనులన్నీ కొత్తగానే ఉంటాయి. అలాంటిదే ఈ షో కూడా.

“ఏం వంట చేస్తుంది మీ వదినా?” అంటూ పక్కింటి పంకజంపిన్ని రానే వచ్చింది.

“మా వదిన వంట చెయ్యదండీ.. వంటల గురించి సలహాలు మాత్రమే ఇస్తుంది..” అన్నాను.

“ఎవరైనా వంటల ప్రోగ్రామ్ మధ్యలో చిట్కాల్లాంటివి చెప్తే వింటారు కానీ వట్టి సలహాలు ఎవరు వింటారమ్మా?” అందావిడ బుగ్గలు నొక్కుకుంటూ.

“అదే మా వదిన ప్రత్యేకత..” అన్నాను వదిన్ని తల్చుకుని గర్వంగా.

అదిగో షో మొదలైంది. అబ్బ.. సెట్ ఎంత బాగుందో..

ఎదురుగానున్న తెరమీద రంగురంగుల అక్షరాలతో.. “వంటకన్నా మేటి మీ భేటీ..” అని అందంగా కన్పిస్తున్నాయి.

రకరకాల వంటల ఫొటోలున్న సెట్ అంతా కవర్ చేస్తూ కేమెరా యాంకర్ మొహం మీద కొచ్చి ఆగింది. “హాయ్ వ్యూయర్స్, నాకోసం చూస్తున్నారు కదూ! నాకు తెలుసు..” అంటూ మూతిని ముఫ్ఫైరకాలుగా తిప్పి నవ్వింది. అది నవ్వనుకోవాలా అనుకునేలోగానే మళ్ళీ మొదలెట్టింది. “ఈరోజు నుంచీ మీరు కెవ్వుకేక అనేలా “వంటకన్నా మేటి మీ బేటీ..” ప్రోగ్రామ్ వస్తుంది. (ఎప్పట్లాగే ఒత్తులు లేకుండా చెపితే “భేటీ” కి బదులు “బేటీ” అని వినిపించి కాస్త కన్ఫ్యూజ్ అయ్యేను..) వంటలు చాలారకాలు చాలామంది చేస్తారు. కానీ ఆ వంటను ఎలా తినిపించాలన్నదే ఈ ప్రోగ్రామ్. దీనిని మీరందరూ ఎంతో ఇష్టపడే వదినగారు నిర్వహిస్తారు. అదిగో.. అదిగో.. మీ మొహంలో నవ్వులు పువ్వుల్లా వెలిగిపోతున్నాయి. నాకు తెలుసు.. మీ అందరికీ వదినంటే ఎంత ఇష్టమో. సరే ముందు మనం వదినగారి అసలు పేరేమిటో అడుగుదాం..” అంటూ వదినవైపు తిరిగింది. కెమెరా కూడా వదిననే ఫోకస్ చేసింది. అదిగో వదిన.. మొహం వెలిగిపోతోంది. ఎంత ధీమాగా కూర్చుందో..ఎక్కడా స్టౌలు కానీ, గిన్నెలుకానీ, వండే సరుకులుకానీ ఏమీలేవు. కానీ ముందు టేబుల్ మీద ఏవో కాగితాలు మటుకున్నాయి. షో ప్రారంభించింది యాంకర్.

“నమస్కారమండీ వదినగారూ, అందరూ మిమ్మల్ని వదినా అనే పిలుస్తుంటారు. ఇంతకీ మీ అసలు పేరేంటండీ?”

“నమస్కారం రాధా. నా పేరు వదిన. అహా అలాగే అనుకో. ఎందుకంటే నా అసలు పేరు కన్న ఈ వదిన పేరుతోనే నేను ఎక్కువగా చలామణీ అవుతున్నాను. దానికి కారణం నా మరదలు స్వర్ణ. పాపం అమాయకురాలు. అలాంటి స్వర్ణలు మన చుట్టూ చాలామందే ఉన్నారు. వాళ్లకి ఏదో చేసెయ్యాలనే ఆతృత తప్పితే ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎంతవరకూ చెయ్యాలో తెలీదు. అలాంటి మరదళ్లకోసమే ఈ వదిన మీ ముందుకు వచ్చింది. అందుకే నా అసలుపేరు అడక్కుండా వదినగానే ఉండనివ్వండి.” అంది వదిన.

వదిన నా పేరు ప్రస్తావించినందుకు సంతోషమేసినా అంత పబ్లిక్‌గా నన్ను అమాయకురాలన్నందుకు మనసు కాస్త చివుక్కుమంది. కానీ అంతలోనే చాలామంది నాలాంటివాళ్ళున్నారని చెప్పడంతో కాస్త మనసుకి ఊరట అనిపించింది. చిన్నపిల్లలని మాస్టారు తిడితే ఉండే బాధకన్న, వాడితోపాటు వాడి పక్కవాడిని కూడా తిడితే ఉండే బాధ తక్కువే కదా! నన్ను నేను సముదాయించుకుని వదిన ఇంకా ఏం చెపుతోందా అని మళ్ళీ స్క్రీన్ వైపు చూసేను.

“వంట చెయ్యడం పదహారు కళలలో ఒకటని అందరికీ తెలుసు. చక్కగా వంట చెయ్యడం మనకి చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మా, నాన్నమ్మల దగ్గర్నుండీ, ఇప్పటి సూపర్ చెఫ్‌లు చెప్పినవాటి వరకూ అన్నీ వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. రుచిగా వంట చెయ్యడం ఒక ఎత్తయితే ఆ వంటకాన్ని ఇంట్లోవారి చేత తినిపించడం ఒక యజ్ఞమనే చెప్పాలి. అందుకే ఈ విషయంలో మీ ఇంట్లో మీరు ఎదుర్కుంటున్న సమస్యలు చెపితే వాటికి నేను చక్కని పరిష్కారాల్ని సూచించి మీరు చేసిన వంట ఫలప్రదమయ్యేలా చేస్తాను..” అంది వదిన.

ఏదైనా వ్రతం ఫలప్రదమవుతుంది కానీ, వంట ఫలప్రదమవడమేమిటో అనుకుంటుండగానే అప్పుడే నాకన్నా ముందే ఎవరో కాల్ చేసారు స్టూడియోకి.

మామూలుగానే పేర్లు చెప్పుకోవడం, బాగున్నారా అంటూ కుశలప్రశ్నలు అడగడం అయ్యాక, ఆ ఫోన్ చేసినావిడ పేరు విమలట, వదిన్ని అడగడం మొదలుపెట్టింది.

“వదినగారూ, నేను మా పిల్లలకోసం ఎంతో రీసెర్చ్ చేసి, మంచి పోషకాహారం వండుతానండీ. కానీ, అదేవిటో అది పిల్లలు అస్సలు తిననే తినరు. పైగా అలా చేసినరోజు వాళ్ల నాన్నచేత బైట నుంచి పిజ్జాలు, బర్గర్లు తెప్పించేసుకుంటారు. నేను వండిన వంటంతా వృథా అయిపోతోందని బాధ ఒకవైపు, అలా తినకూడని ఫాస్ట్ ఫుడ్ తింటున్నారని మరోవైపు బాధొచ్చేస్తోందండీ. దీనికి మీరేమైనా పరిష్కారం చెప్తారని అనుకుంటున్నాను..”

ఆవిడ ప్రశ్న వింటూనే వదిన కూర్చున్న కుర్చీలోంచి కాస్త ముందుకు వంగింది. “తప్పకుండా విమలగారూ, చూసేవా రాధా, ఇది ఒక్క విమలగారిలాంటివారి ప్రాబ్లమే కాదు. చాలామంది దీన్ని ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు విమలగారినే చూడు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలన్న పవిత్రమైన ఆశయంతో పాపం ఆవిడ బోల్డు పుస్తకాలు చదివి, ఎంతోమంది న్యూట్రిషియన్లని సంప్రదించి, చాలా టైముని వెచ్చించి, కష్టపడి. శ్రమపడి, చెమటోడ్చి, ఆయాసపడి, అవస్థలు పడి (ఇవన్ని వింటూంటే అన్నీ ఒకటే కదా అనిపించాయి నాకైతే) ఏకాగ్రతతో వంటింట్లో ఆ వేడిలో ఆ ఉక్కలో, ఆ వాసనల్లో చేతులు కాల్చుకుంటూ, వేళ్ళు కోసుకుంటూ, ఇంట్లో మిగిలిన అందరూ టీవీలు చూస్తూ, గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటే విమలగారొక్కరూ ఆ వంటింట్లో పడి పిల్లల కోసమని ఆరోగ్యకరమైన, పోషకాహార విలువలు కలిగిన వంట చెయ్యడమంటే మాటలా చెప్పు రాధా..” అంటూ దెబ్బలాడుతున్నట్టు మీదకొచ్చిన వదినని చూసి ఆ యాంకరమ్మ బెదిరిపోయి, “బెబ్బెబ్బే..” అని మాట తడబడింది.

వదిన ఫ్లో అగలేదు.

“ఈ విమలగారే కాదు రాధా. అనురాగమయి అయిన ప్రతి తల్లీ పిల్లల కోసం అలా కష్టపడుతూనే ఉంటుంది. కానీ ఈ పిల్లలు ఏం చేస్తారు? ఆ తల్లిని గమనించరు. లెక్కచెయ్యరు, తీసిపడేస్తారు. హేళన చేస్తారు. అసలు విలువే ఇవ్వరు. కానీ ఆ మాతృహృదయం చూడు రాధా, తను చేసిన ఆరోగ్యకరమైన వంట పిల్లలు తినాలని ఆ తల్లి పడే తాపత్రయం చూడూ..”

వదిన మాటలు వింటుంటే నాకు ఎంతకీ అర్థంకాని, ఒకే మాటని పదిరకాలుగా చెప్పే తెలుగు సీరియల్ జీడిపాకం డైలాగులు గుర్తొచ్చేయి. ఇంతకీ అడిగినదానికి సమాధానం ఇవ్వకుండా ఏమిటీ వదిన ఓవరాక్షనూ అనుకుంటూండగానే యాంకర్ మళ్ళీ పళ్ళన్నీ బయటపెట్టి, భుజాలు గుండ్రంగా తిప్పుతూ అడగనే అడిగింది. “ఇంతకీ విమలగారికి మీరిచ్చే సలహా ఏంటి వదినా?” అంటూ.

“అదిగో, అక్కడికే వస్తున్నాను. మనవాళ్ళు ఎప్పుడో చెప్పేరు… ముల్లుని ముల్లుతోనే తియ్యాలీ, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలీ అంటూ.. అలాగే ఇది కూడా”.. అంటూ ఆయాసం తీర్చుకుంటూ కెమెరా వైపు తిరిగి, ”విమలగారూ, వింటున్నారా! మీ సమస్యకి పరిష్కారం చాలా సులువండీ. ఏదైనా వద్దంటేనే దాని మీద మోజు పెరుగుతుంది. మన దగ్గర ఏది లేదో అది కావాలనిపిస్తుంది. అందుకని ఇకనుంచి మీ పిల్లల్ని పిజ్జాలు, బర్గర్లు కొనడం మానమని చెప్పకండి. హాయిగా కొనుక్కోనివ్వండి. ఇంకా కావాలంటే వాళ్ళొచ్చే టైమ్‌కి మీరే అవి ఇంటికి చేరేలా ఆర్డర్ చెయ్యండి..”

“హా.. ” అంటూ నోరు తెరుచుకు వింటున్న యాంకర్‌ని చూసి, “అంతే రాధా..ఇలాంటివి మనం వద్దన్నకొద్దీ మనం పిల్లలకి శత్రువులైపోతాం. అందుకని విమలగారూ, వింటున్నారా..” అన్న మా వదిన ప్రశ్నకి ఆ విమలకానీ వదిన సమాధానానికి షాకయ్యి పడిపోలేదు కదా అనిపించింది.. కానీ, అట్నుండి, “వింటున్నానండీ, కానీ అలా చెస్తే పిల్లల అరోగ్యం..” అంటున్న ఆవిడ మాటలని మధ్యలోనే కట్ చేసి, “ఏం పరవాలేదు. ఒక్క నాల్రోజులు నేను చెప్పినట్టు చెయ్యండి. మీరెంచక్కా మీక్కావల్సినవి వండుకుని, తినేసి హాయిగా టీవీలో కలువరేకులు, ముళ్ళబాటలు, నీటి బుడగలు, వనజ గిరిజ సీరియల్స్ చూసుకోండి. ఇంక అయిదోరోజు చూసుకోండీ, మీ పిల్లలే కాదు మీ శ్రీవారు కూడా “విమలా, అన్నం వండవా!” అనడక్కపోతే నేనీ షో చెయ్యడం మానేస్తానంతే.. చాలెంజ్..” అంది ధీమాగా వదిన. అమ్మ, వదినమ్మా, అలా వచ్చేవా.. అనుకుంటూండగానే ఇంకో కాల్ వచ్చింది.

“నాపేరు హేమండీ.. నాకు ఇంట్లో అన్నీ క్లీన్‌గా ఉండాలి. ఎక్కడి వక్కడ ఎప్పటి కప్పుడు ఎంతో శుభ్రంగా పెట్టుకుంటానండీ. వంట కూడా చాలా రుచిగా చేస్తానని అందరూ అంటారు. కానీ, మా శ్రీవారే, ఏం వండినా, ఎంత బాగా వండినా ఎప్పుడూ మెచ్చుకోరు సరికదా, అన్నింటికీ వంకలు పెడుతుంటారు. ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోనని తెగ సాధిస్తారు. అస్తమానం అన్నీ వాళ్లమ్మని చూసి నేర్చుకోమంటారు. అక్కడికీ అన్నీ ఆవిడ చెప్పినట్టే చేస్తానండీ, హూ.. అయినా అదేంటో అలా గొణుగుతూనే ఉంటారు. ఇంటినీ, వంటనీ మా శ్రీవారికి నచ్చేలా చెయ్యాలంటే నేనేం చెయ్యాలండీ..”

హేమ అడిగిన ప్రశ్న విని, “మీ పెళ్ళై ఎన్నాళ్ళైందండీ హేమగారూ?” అనడిగింది వదిన.

“రెండేళ్ళైందండీ..” అన్న జవాబు విని, “చూడండి హేమగారూ, రెండేళ్ళు కాదు ఇరవై రెండేళ్ళైనా ఏ మొగుడూ భార్యని మెచ్చుకోడండీ. అందులోనూ వాళ్లమ్మలా చేస్తున్నావని అస్సలు అనడు. దీనికి మీకు చక్కటి పరిష్కారం చెప్తాను. చేస్తారా మరీ!” ఊరిస్తూ అడిగింది వదిన..

“అంతకన్నానా.. మా వారి కోసం ఏమైనా చేస్తానండీ..” అంది హేమ. నేను టివీకి మరింత దగ్గరగా వెళ్ళి వదినేం చెప్తుందా అని ఆసక్తితో వింటున్నాను.

యాంకర్ వైపు తిరిగి వదిన మొదలెట్టింది. “చూడు రాధా, ఇప్పుడీ హేమ ఇలా అమాయకంగా బయటపడింది కానీ చాలామంది ఇల్లాళ్ళు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. (ఈ విషయంలో వదినకానీ ఏమైనా డేటా కలెక్ట్ చేసిందా అన్పించింది నాకు వదిన అంత ఖచ్చితంగా చెప్తుంటే..) అప్పటిదాకా పుట్టింట్లో ఇంటికి మహలక్ష్మిగా చూస్తుంటే, అమ్మానాన్నల దగ్గర గారాలుపోతూ, అన్నదమ్ములతో అలకలు పోతూ, అక్కచెల్లెళ్ళతో ఆడుతూ పాడుతూ, హాయిగా, ఆనందంగా, నిష్పూచీగా, చక్కని పూవులా, కమ్మని తావిలా, ఆనందాల హరివిల్లులా (ఓర్నాయనో అనిపించింది నాకైతే) పెరిగిన అమ్మాయి పెళ్ళయి మరో ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్ని రకాల సవాళ్ళను ఎదుర్కోవాలో తెల్సా రాధా..” అంటూ యాంకర్ మీదకి దెబ్బలాడుతున్నట్టు వెళ్ళింది వదిన. పాపం ఆ రాధ జడుసుకుని కాస్త వెనక్కి తగ్గి. “హి హి, అవును కదా!” అంది.. “అవును కదా ఏంటి.. అవునంతే.. అలా అన్నిరకాల సవాళ్లని ఎదుర్కుంటున్న ఆ బేలను అత్తారింట్లో అమానుషంగా, దుర్మార్గంగా, దుష్టబుధ్ధితో, అతి క్రూరంగా వంట రాదంటారా?” (వామ్మో.. వంట రాదనడం ఇంత ఘోరమైన నేరమా!)

పాపం ఆ యాంకర్ కళ్ళు తిరిగి పడిపోయిందనుకుంటాను, ఫోకస్ అంతా వదిన మీదే పెట్టారు కెమెరావాళ్ళు. కెమెరాలోకి చూస్తూ వదిన అంది.. “అమ్మా, హేమా, నువ్వు బాధపడకమ్మా,, నీకు నేనున్నాను. దిక్కులన్నీ ఏకమైనా, సూర్యచంద్రులు గతులు తప్పినా, భూమి కుంగినా, సముద్రం పొంగినా (చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు అప్పచెప్పేస్తున్నట్టుంది..) నిన్ను నేను కాపాడుకుంటాను. హేమా, వింటున్నావా?” వదిన గొంతు హెచ్చింది.

“ఆ.. ఆ.. వింటున్నానండీ.. ” నూతిలోంచి వచ్చినట్టు వినిపించింది పాపం ఆ హేమ మాట.

యాంకర్ మంచినీళ్ళు తాగొచ్చిందనుకుంటాను వదిన మాట్లాడుతుంటే మళ్ళీ కనిపించింది.

వదిన వెంటనే ”చూసేవా రాధా, ఆ హేమ గొంతు ఎలా నీరసంగా వినిపిస్తోందో.. ఈ పురుషాధిక్య సమాజంలో మనం చీమల్లా, నల్లుల్లా, పురుగుల్లా నలిగిపోతున్నాం, మాడి మసైపోతున్నాం..” ఆవేశంతో ఊగిపోతోంది వదిన. నాకు ఒక్కసారి అన్నయ్య గుర్తొచ్చేడు. వదినా, అన్నయ్యలలో ఎవరు నలిగిపోతున్నారా అని ఆలోచించుకుంటుంటే మళ్ళీ వదిన గొంతు ఖంగుమంది.

“మాట్లాడవేం రాధా. దీనిని మనం ఇలా చూస్తూ ఊర్కోడమేనా! ఈ మగవారి ఆధిపత్యాన్ని ఇలా భరిస్తూ ఉండాల్సిందేనా!” రాధ బెదిరిపోయినట్టుంది. “దీనికి హేమగారు ఏమంటారో..” అంటూ ఫోకస్ హేమ వైపు తిప్పేసి తను తెలివిగా తప్పుకుంది. ఇంక వదిన విజృంభించేసింది.

“చూడు హేమా, ఇంక నువ్వు వేరే అనడానికేం లేదు. నేను చెప్పినట్టు చెయ్యంతే. ఈ మగవాళ్ళంతా ఇంతే.. మనం చేసే పని కనిపించదు. చక్కగా వండి, ఇల్లంతా శుభ్రంగా ఉంచితే ఏమీ మెచ్చుకోరు సరికదా, వాళ్ల మొహం కూడా విచ్చుకోదు.. ఆ.. ఇది మామూలు విషయమేలే.. అనుకుంటారు. అదే మనం పని చెయ్యకపోతే అప్పుడు తెలుస్తుంది వీళ్లకి మన గురించి. అందుకే నువ్వీ రోజునుంచి వంట చెయ్యకు, ఇల్లు తుడవకు, బట్టలు ఉతక్కు, ఎక్కడి వస్తువులక్కడే వదిలెయ్యి.” వదిన చెపుతున్న మాటలకి హేమ సంగతి ఏమైందోకానీ వింటున్న నేనూ, నాతోపాటు పంకజం పిన్నీ కూడా హడిలిపోయేం. “వంట వండకపోతే ఇంకేమైనా ఉందా, ఇంట్లో మగాడు ఇంతెత్తున లేవడూ” అంది పంకజం పిన్ని. మగాడి సంగతి అలా ఉంచినా మరి ఆడాళ్ళు మటుకు ఏం తింటారూ..

పాపం, ఈ మాటలకి హేమకి స్పృహ తప్పిందో ఏమో కానీ ఎక్కడా చప్పుడు లేదు. కాస్త తేరుకున్న రాధే అడిగింది. “అదేంటి వదినా, పనిని ఇంకా బాగా ఎలా చేసుకోవాలో చెప్తావనుకుంటుంటే మీరిలా అసలు పనే చెయ్యొద్దంటారూ!” అంది.

“మరి! అలా అనక ఇంకేమంటానూ! రోజూ ముప్పొద్దులా అగ్గగ్గలాడుతూ మగవాడికేం కావాలో అలా చేస్తూ, చెయ్యకపోతే అరుస్తాడేమోనని భయపడుతూ మనం అంటే ఇల్లాళ్లం ఎన్నాళ్లని భరిస్తాం? మన విలువ వాళ్ళు తెలుసుకోలేనప్పుడు మనమే తెలియచెప్పాలంతే. హేమా, వింటున్నావా!” వదిన కేకకి ఒక్కసరిగా ఉలిక్కిపడిందో ఏమో పాపం ఆ హేమ “వింటున్నానండీ.. అలాగేనండీ..” అంది. వదిన విచ్చుకున్న మొహంతో రాధ వైపు చూసి, “చూసేవా రాధా, ఇలా చెప్పేవాళ్ళు లేక ఈ రెండేళ్ళు హేమ ఎంత బాధపడిందో” అంటుంటే షో టైమ్ అయిపోయి, యాంకరూ, వదినా కూడా నమస్కారాలతో శెలవు తీసుకున్నారు.

నాకు అదేం షోయో అప్పుడైతే అర్ధం కాలేదు కానీ సాయంత్రానికి పూర్తిగా అర్ధమైంది. ఎవరో చానల్‌కి ఫోన్ చేసి మగవాళ్లని వదిన దుష్టులు, దుర్మార్గులు అందనీ, అలా అన్నందుకు వదిన క్షమార్పణ చెప్పాలనీ గొడవ పడ్దారుట. అసలే ఎక్కడ గొడవవుతుందా, దాన్ని ఎలా పీకి పాకం పడదామా అని చూస్తున్న చానల్ వాళ్ళు అలా గొడవపడ్డవారినీ, వదిననీ, ఇంకా కొందరు మహిళామణులనీ తీసుకొచ్చి ఆ రాత్రే దీనిమీద డిస్కషన్ పెట్టేరు. అక్కడ ఒకరినొకరు ఇంకా బాగా మాటలనుకున్నారు. అది చూసి ఇంకో చానల్ దీని మీద చర్చాకార్యక్రమం పెట్టింది. అక్కడ ఈ గొడవలు ఇంకాస్త పెద్దవయ్యేయి. మహిళామణులందరూ మగవారి పెత్తనం మీద విరుచుకు పడ్దారు. భార్యాబాధితుల సంఘంవారు ఆడవారిపై ఆరోపణలు చేసేరు.

ఒకరి మాట ఇంకోరికి వినపడకుండా ఎవరికి వారు గట్టిగా అరిచేస్తున్నారు. నువ్విలా అంటే నువ్వలా అనుకుంటూ అసలు ఆ గొడవకే సంబంధంలేని విషయాల్లోకి వెళ్ళిపోయి ఒకరినొకరు చెప్పరాని మాటలనుకుంటున్నారు. మోడరేటర్ నవ్వుతూ వీళ్ళ దెబ్బలాటని ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఆ షో ఏంటీ అని అందరికీ ఆతృత పెరిగిపోయింది.

ప్రతి చానల్లోనూ ఇదే చర్చ. ఎక్కడివాళ్ళో వచ్చేసి ఒకరి మీదొకరు అరిచేసుకుంటున్నారు.

ఇవన్నీ ఈయనిలా అన్నాడూ, ఆమె అలా అందీ అంటూ కొంతమంది పార్టులు పార్టులుగా యూట్యూబ్‌లోకి ఎక్కించేరు. దాంతో ఈ షో పేరు బాగా పాప్యులర్ అయిపోయింది.

మర్నాడు కూడా ప్రతి చానల్లోనూ దీని మీద చర్చలే.. అందరూ నెట్‌లో దానిని చూసేస్తున్నారు. ఒక్కసారిగా మా వదిన చేసే వంటల షో కి టిఆర్పీ రేటింగ్ బ్రహ్మాండంగా పెరిగిపోయింది.

ఆ రాత్రి వదిన నాకు ఫోన్ చేసి అంది. “చూసేవా స్వర్ణా మీ వదిన గొప్పతనం. అసలు ముందు చానల్‌కి ఫోన్ చేయించి మావాళ్ల చేత ఆ గొడవ మొదలెట్టించింది నేనే. ఆ గొడవలూ, చర్చలవల్ల ఇప్పుడు చూడు టీఆర్పీ రేటింగ్ ఎంత పెరిగిపోయిందో. ఇంకొన్నాళ్ళు నా షో కి ఏమీ ఢోకా లేదు..ఛాలెంజ్ గెలిచేను చూసుకో” అంది గర్వంగా.

అమ్మ వదినా, నువ్వు సామాన్యురాలివికాదు సుమా అనుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here